14, సెప్టెంబర్ 2017, గురువారం

అర్జున్ రెడ్డి

  
ఇది సినిమా రివ్యూ కాదు. ఒక అభిప్రాయం మాత్రమే.
1970  నుంచి 1975 వరకు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేరోజుల్లో నండూరి రామమోహన రావు గారు నాచేత వారం వారం సినిమా రివ్యూలు రాయించేవాళ్ళు. తెలుగు సినిమాలతో పాటు అప్పుడు విజయవాడలో అడపాతడపా విడుదల అయ్యే హిందీ సినిమాలు చూసి సమీక్షలు రాస్తుండేవాడిని. పాకీజా సినిమా వాటిల్లో ఒకటి.
ఇక ఇన్నేళ్ళలో రివ్యూలు రాయడమే కాదు, అసలు సినిమాలు చూడడమే తగ్గిపోయింది. ఒకప్పుడు పిల్లలకి చూపించడానికి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు తీసుకువెడితే వెడుతున్నాం.
అలాగే మొన్న ఒక సినిమాకి వెళ్ళాము. ‘ఒక’ అని ఎందుకు అన్నాను అంటే హాల్లోకి వెళ్లి కూర్చునే దాకా అది 'అర్జున్ రెడ్డి' సినిమా అని తెలవదు.
చాలా రోజులుగా ఈ సినిమా గురించి మంచీ చెడూ చాలా విస్తారంగా చదువుతూ వస్తున్నాను కనుక పోనీలే ఒకమంచి పని జరిగింది, అదేదో నేనే ఒక  అంచనాకు రావచ్చని సర్దుకున్నాను. చూసిన వాళ్ళు అందరూ ‘మూడు కిస్సులు, ఆరు బీర్లు’ అని ఒక్క ముక్కలో తేల్చి ఎగతాళిగా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను కానీ అదేదో మొదటి సీనులోనే కనిపించింది. వెనకటి రోజుల్లో కొన్ని సన్నివేశాలతో పాత్రల  స్వరూప స్వభావాలు ప్రేక్షకులకు తెలిసిపోయేలా  స్క్రీన్  ప్లే రాసేవాళ్ళు. దాన్నే  ‘కేరక్టర్’ ఎస్టాబ్లిష్ చేయడం అని అంటుండేవాళ్ళు. అలా ఈ సినిమా మొదట్లోనే హీరో కేరక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేసి ‘యితడు మారడు, ఇతగాడు  ఇంతే!’ అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో బలంగా నాటారు. దాంతో పుష్టి బ్రాండ్ కలిగిన ‘హీరో కం విలన్’ గానే చివరివరకు అనిపించాడు, కనిపించాడు. అయితే చిత్ర దర్శకుడిలో నాకో చిత్రమైన గుణం కనిపించింది. అతడికి చూసేవారి అభిప్రాయాలతో నిమిత్తం వున్నట్టు లేదు. తను చెప్పదలచుకున్నది చెప్పడం, చూపించడం తప్పిస్తే ఎక్కడా దారి తప్పలేదు. ‘నేను ఇంతే సుమా’ అనే హీరో పాత్ర మాదిరిగానే, దర్శకుడు కూడా అంతే. ఒక్క అంగుళం ఇటూ అటూ సర్దుబాటు తత్వం లేదు. ఈ  చిత్రం అంచనాలకు మించి తారా స్థాయిలో విజయం మూటకట్టుకుంది కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఆయన గురించి ఎన్ని వ్యాఖ్యలు వినవచ్చేవో.
హీరో తన ప్రేమను మరీ అంత క్రూరంగా ప్రదర్శించాలా అనిపిస్తుంది ఒక్కోసారి. ‘ ప్రేమించిన యువతికి వేరే వాళ్ళతో పెళ్లయినా సరే, గర్భవతి అయినా సరే ఆ ఆమ్మాయినే పెళ్లి చేసుకుని తీరతాను’ అనే మొండి పట్టుదల హీరో ప్రేమలోని స్వచ్చతకు ప్రశ్నార్ధకంగా తయారయింది. దానికి తోడు వీర తాగుడు. యెంత గొప్ప డాక్టరు అయితేనేం, యెంత గొప్ప ప్లేయర్ అయితేనేం  మానవసంబంధాలకు కనీస విలువ ఇవ్వనప్పుడు.   స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం చూస్తుంటే  మరీ అతిగా గారాబం చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఇతర పాత్రలు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేదానితో దర్శకుడు సంబంధం పెట్టుకోలేదు. ‘ఈ హీరో పాత్ర ఇంతే, ఇలాగే వుండాలి’ అనుకున్నాడు, అలాగే తీశాడు. ఆయన కన్విక్షన్ చాలా గొప్పది.
సినిమా చాలాసార్లు ముగింపుకు వచ్చినట్టే ఫీల్ కలిగిస్తూ మళ్ళీ మొదలయి ముందుకు సాగింది. అసలు ఇంట్లోవాళ్ళు తన ప్రేమను కాదనే బాపతు అయితే అతడు తన ప్రేమను పండించుకోవడానికి  అంత దూరం వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ అతడి  ప్రేమ విషయంలోనే కాదు, చదువులో కూడా తన మాటే నెగ్గించుకున్నా అతడి తరపువాళ్ళు ఎన్నడూ  అభ్యంతర పెట్టిన దాఖలా లేదు. అలాంటప్పుడు తన పెద్ద  వాళ్ళనే వెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి  సంబంధం ఖాయం చేసుకు రమ్మంటే సరిపోయేది,  ప్రేమించిన యువతి  ఇంటికి నేరుగా  వెళ్లి, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కళ్ళముందే ప్రేయసిని ముద్దాడుతూ, అదో ఘన కార్యంలా  వాళ్ళతో గిల్లీ కజ్జా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రేక్షకుల్లో కొందరికి అనిపించి ఉండొచ్చు. కానీ దర్శకుడు అలా ఆలోచించలేదు. ఆయన రూటే సపరేటు అన్నట్టుగా సినిమా తీసుకుంటూ పోయాడు. మంచి టాక్ మొదట్లోనే రావడం వల్ల ప్రేక్షకులు కూడా చూసుకుంటూ పోయారు. అదీ ఒక రకంగా మంచిదయింది. ఈ సినిమా ఇన్ని రోజుల తర్వాత చూసే అవకాశం నాకు కలిగింది.
హీరో ఓరియంటెడ్ సినిమా కావడం వల్ల ఆ పాత్ర వేసిన విజయ్ సాయికి మంచి ప్రశంసలు దక్కాయి. నిజంగా బాగా చేసాడు కూడా. ‘అమ్మో ప్రేమంటే ఇలా కూడా ఉంటుందా,  ఇటువంటి ప్రేమను భరించడం   కష్టం బాబూ’ అని సినిమా చూస్తున్న  టీనేజర్లు అనుకుని వుంటారు.
అయితే, తీసిన విధానం, ఫోటోగ్రఫీ సూపర్బ్ గా వున్నాయి. చిన్న వాళ్ళతో తీసిన చిన్న  చిత్రం అనుకున్నాకాని, బాగానే ఖర్చు చేసినట్టు అనిపించింది.
నటన విషయంలో మార్కులు వేయాల్సివస్తే ఆ వరస ఇలా వుంటుంది.

బామ్మ పాత్ర వేసిన కాంచన, అస్తమానం హీరోని అంటిపెట్టుకుని వుండే స్నేహితుడు, అతడి నాన్న, హీరో తండ్రి ఆ తరవాతనే  ఎవరయినా. 

పెడదారిన యువత


పెడదారి పడుతున్న యువత అనే అంశంపై ‘టీనేజ్ టెర్రర్’ అనే పేరుతొ రాజ్ న్యూస్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను పాఠకుల దృష్టికి తీసుకురావలని అనిపించింది.

(రాజ్ న్యూస్ వారికి కృతజ్ఞతలు)

ఎదిగే వయసులోనే సమిధలవుతున్నారు.. నిద్ర లేచినప్పటి నుంచి ఊహల్లో ఊరేగుతూ ఊసుల్లోనే బతుకుతున్నారు.. చదువు .. కెరీర్ పక్కనపెట్టి.. లవ్, అట్రాక్షన్ మోజులో లైఫ్‌ని స్మాష్ చేసుకుంటున్నారు.. ప్రైవసీ పేరుతో తప్పటడుగులేస్తున్నారు.. వేక్‌అప్ టైం నుంచి గుడ్‌నైట్ వరకూ .. నెట్‌ఇంట్లోనే కుర్రకారు నాట్యం చేస్తున్నారు.. విద్యార్ధులను చాటింగ్ వ్యసనం తినేస్తోంది.  మద్యం, డ్రగ్స్ లాగే మెదడు ఈ వ్యసనానికి అలవాటు పడటం .. పెను ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. ఆఖరికి నవమాసాలు మోసి , కనీ, పెంచిన తల్లిదండ్రులకు .. గర్భశోకం మిగుల్చుతోంది.
లైఫ్‌ని ఎంజాయ్ చేసినంత వరకే అయితే పరవాలేదు.. అది వక్రమార్గం పడితేనే కష్టం. వయసుకు మించి స్నేహాలు.. చదువుకు మించి పనులు.. పబ్‌ల చుట్టూ తిరుగుతూ .. నేటి యువత కాలేజీ జీవితాన్ని కరిగించేస్తున్నారు. స్నేహం పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆడ, మగ మాట్లాడుకోవడం తప్పు కాదు.. ఈ పవిత్ర స్నేహాన్ని అపవిత్రం చేసే దిశగా వారి నడక నడత ఉంటే మాత్రం వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం అత్యవసరం. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు చిన్న వారే. కానీ వయసుకు తగినట్లుగా పిల్లల ప్రవర్తన తీరును అంచనా వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈవిషయంలో తల్లిదండ్రులు తప్పటడుగు వేస్తున్నారు. 
తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ ఉంటుంది. పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది. స్నేహితుల మధ్య ప్రేమ, దేశంపై ప్రేమ.... ఇలా ప్రేమలు ఎన్నో రకాలు. వీటన్నింటి కంటే విభిన్నమైనది లవర్స్‌ మధ్య ప్రేమ. ఇది మాత్రం సగటున రెండేళ్ళు ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాల్యంలో తల్లిదండ్రులు పెద్దలతో కలిసి మెలిసి ఉండే తీరు .. పిల్లల్లో ఆడ, మగకు సంబంధించిన భావనలు కలిగిస్తుందట.  పెరిగేటప్పుడు చుట్టుపక్కల వాళ్లతో, అదే వయసు వారితో వ్యవహరించే తీరు .. తన భవిష్యత్తు భాగస్వామి ఎలా ఉండాలనే అంశానికి జీవంపోసి.. దాన్నొక నిర్ణయంగా తీర్చిదిద్దుతుంది. 
టెరషెంకో అనే మనస్తత్వవేత్త టీనేజర్స్‌ నాలుగు దశలను అధిగమించాల్సి ఉంటుందని చెబుతాడు. మొదటిది గ్యాంగ్‌ స్టేజ్‌. ఈదశలో ఆడపిల్లలు, ఆడపిల్లలతోనూ, మగపిల్లలు మగపిల్లలతోనూ .. జట్లుగా ఏర్పడ తారు. జట్లు జట్లుగా తిరుగుతారు. తరువాతది ఫ్రెండ్‌షిప్‌ స్టేజ్‌. ఈ దశలో జట్టు కట్టి తిరగడం మానేసి కేవలం ఒకరితో మాత్రమే స్నేహంగా ఉంటారు. మిగిలిన అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఈదశలో అబ్బాయి , అమ్మాయికి స్నేహం ఒకరితో మాత్రమే ఉంటుంది. తమ కష్టసుఖాలు చెప్పుకోవడం, ఆదర్శలక్షణాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ స్నేహం సేమ్‌ జెండర్స్‌ మధ్య మాత్రమే ఉంటుంది. 

మూడవది అట్రాక్షన్ స్టేజ్‌. ఈ దశలో ఆపోజిట్‌ సెక్స్‌ వైపు మనసు లాగుతూ ఉంటుంది. మోహపూరితంగా ప్రవర్తిస్తారు. అంటే ఆడపిల్లలు మగపిల్లలతోనూ, మగపిల్లలు ఆడపిల్లలతోనూ స్నేహం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఇక లాస్ట్‌ది.. లవ్‌ స్టేజ్‌. తనకు నచ్చిన ఎవరో ఒక ఆపోజిట్‌ సెక్స్‌ను ఎన్నుకుంటారు. వాళ్లతో ప్రేమలో పడడం ఈదశ ప్రత్యేకత. అయితే ఇందులో మళ్లీ రెండు దశ లుంటాయి. ప్రారంభదశలో ఆదర్శపూర్వకమైన రొమాంటిక్‌ ప్రేమ ఉంటుంది. ఆతర్వాత అసలు సిసలైన ప్రేమ ఉంటుంది. పైన చెప్పుకున్న దశలన్నీ కూడా పరిపక్వ వ్యక్తిత్వానికి అవసరమైన పురోగమన లక్ష్యాలు.
టీనేజర్స్‌లో ప్రేమ, ద్వేషం అనే రెండు రకాల ఉద్వేగాలు ఉంటాయి. అయితే ఈరెండు సెంటిమెంట్లూ ప్రేమిస్తున్న వ్యక్తివైపు కేంద్రీకరించబడ్డ రెండు విరుద్ధ భావోద్వేగాలు. ప్రేమలో ప్రేమిస్తున్న వ్యక్తికి దగ్గర కావాలన్న ఆకర్షణ, ఆ తాలూకు తపన ఉంటే, ద్వేషంలో దూరం కావాలన్న వికర్షణ .. పూర్వకమైన వాంఛ ఉంటుంది. ప్రేమ, ద్వేషం రెండూ టీనేజ్‌లో తీవ్రస్థాయిలో ఉంటాయి.   
ఈమధ్య ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టీసీఎస్‌.. టీనేజ్‌ ట్రెండ్స్‌పై జరిపిన సర్వేలో సగటున 47 శాతం మంది కుర్రాళ్లు స్మార్ట్‌గా కాలక్షేపం చేస్తున్నట్లు తేలింది. 30 శాతం మంది ఫేస్‌బుక్‌ ద్వారా దాదాపు 50 నుంచి 100 మందితో స్నేహం చేస్తున్నారు. 69 శాతం మంది గేమింగ్‌ యాప్‌లనే ఇష్టపడుతున్నారు. మరో 31 శాతం మంది వినోదం, సినిమాలు, వీడియో డౌన్‌లోడింగ్‌లతో సరదాగా గడిపేస్తున్నట్లు సర్వేలో తేలింది. హైదరాబాద్ నగరంలో 77 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 900 మంది టీనేజ్ విద్యార్థుల పై ఈ సర్వే నిర్వహించగా .. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
టీనేజర్స్‌ సోషల్‌మీడియా, గేమింగ్‌యాప్స్‌తో గంటలతరబడి గడపడం వల్ల.. ఏకాగ్రత కోల్పోయి చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. అపరిచితులతో స్నేహం కొన్నిసార్లు చెడు సహవాసాలకు, అలవాట్లకు దారితీస్తుంది. ఆన్‌లైన్‌ స్నేహాలు ఆఫ్‌లైన్‌ స్నేహాలుగా మారే అవకాశం ఉంటుంది. వీటి వినియోగం వ్యసనం కాకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఈరోజుల్లో సర్వసాధారణమే. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులతో స్నేహం చేయడం, వారితో వివిధ రకాల ఫోటోలను షేర్‌ చేసుకోవడం వంటి పరిణామాలు .. టీనేజ్ యువతపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు, సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు కుర్రకారు సోషల్‌మీడియా అకౌంట్లు హ్యాక్‌ అయి సైబర్‌క్రైమ్‌లు జరిగే ప్రమాదం పొంచి ఉందని స్పష్టంచేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు .. విద్యార్థుల నెట్‌ ట్రెండ్స్‌ను ఒక కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు.
పిల్లలు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడం కోసం 1,200 మంది టీనేజర్లు, తల్లిదండ్రులపై కామన్ సెన్స్ మీడియా కూడా ఓ సర్వే చేపట్టింది. సర్వేలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. 
56 శాతం మంది తల్లిదండ్రులు, 51 శాతం టీనేజీలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ డివైజ్‌ను చూస్తున్నట్టు ఒప్పుకున్నారు. 85 శాతం మంది తల్లిదండ్రులు మొబైల్ డివైజ్‌ల వల్ల తమ పిల్లలతో ఉన్న అనుబంధాలకు ఎలాంటి ముప్పు లేదంటుంటే.. 66 శాతం తల్లిదండ్రులు వారి టీనేజి పిల్లలు చాలా ఎక్కువ సమయాన్ని మొబైల్ డివైజ్ లపైనే గడుపుతున్నారని బాధపడ్డారు. 
66 శాతం మంది తల్లిదండ్రులు డిన్నర్ సమయంలో మొబైల్ డివైజ్‌‌లను అనుమతిచడం లేదని చెప్పగా.. 89 శాతం మంది టీనేజీ పిల్లలు కూడా ఇదే భావనను వ్యక్తంచేశారు. 59 శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలు మొబైల్ ఫోన్లకు, టాబ్లెట్స్‌కు ఎక్కువగా బానిసలవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేయగా.. 50 శాతం మంది టీనేజీ పిల్లలు మొబైల్ ఫోన్లపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టు చెప్పారు. 27 శాతం మంది తల్లిదండ్రులు వారే ఎక్కువగా మొబైల్ డివైజ్ లకు బానిసలైన్నట్టు ఒప్పుకున్నారు. ఇక 28 శాతం మంది టీనేజీ పిల్లలు వారి తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువగా వాడుతారని తెలిపారు.
పూర్తిగా తెలిసిన వాళ్ళకీ చెప్పొచ్చు.. అసలు తెలియని వాళ్ళకూ చెప్పొచ్చు.. కానీ కాస్త తెలిసి.. ఇంకాస్త తెలియని టీనేజర్స్‌కు మాత్రం ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తల్లిదండ్రులకు అసలు అర్ధం కావడం లేదు. దండించేంత చిన్నారులు కాదు.. వదిలేస్తే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే వయసూ కాదు.. మరి వాళ్ళ జీవన రేఖను సుఖంగా .. సంతోషంగా .. ఉన్నతంగా ఎలా మలచాలి.. ఏవిధంగా తల్లిదండ్రులు వారికి గైడెన్స్ ఇవ్వాలి. సాదారణంగా .. పెరుగుతున్న పిల్లలను చూసి తల్లి తండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు. పిల్లలు ఎదుర్కోనే చాలా ప్రభావాలు,  సమస్యలు ..  అనేక అంశాల గురించి వారికి జాగ్రత్తగా చెప్పాలి. అయితే ఎక్కడ నుండి మొదలు పెట్టాలి.. ఎలా మొదలుపెట్టాలి.. వారిని ఎలా దారిలో పెట్టాలో .. తెలియడం మాత్రం చాలా  ఇంపార్టెన్ట్..
ప్రేమ , ద్వేషము , ఆవేశము , ఆలోచన , పట్టుదల , నిర్లిప్తత , అనురాగము , అసూయ , సృజనాత్మకత , స్తబ్దత ... ఇలా ఎన్నో వైరుద్యాల కలబోత టీనేజ్ . చందమామతో ఆడుకోవాలని , అరుదైన సాహసము చేసి ప్రపంచాన్నంతా ఔరా అనిపించాలనే ఉత్సాహము ఒక ప్రక్క , చిమ్మ చీకట్లో తలదాచుకొని వెక్కివెక్కి ఏడవాలనే నైరాశ్యము మరో పక్క కనిపిస్తుంది. చదువులో ఇంటర్మీడియట్ ఎటు వంటిదో ... వయసులో ఈ టీనేజ్ అటువంటిది . ఏదైనా చేసేయగలమనుకుంటూ సాధ్యాసాధ్యాలను సరిగ్గా అంచనా వేసుకోలేక , తల్లిదండ్రుల నుండి పూర్తి స్వేచ్చ కోరుకుంటూ .... కాదంటే కార్చిచ్చు సృస్టిస్తూ ప్రవర్తిస్తుంటారు . ప్రపంచీకరణ నేపధ్యములో ఏర్పడిన పోటీవాతావరణము, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సౌకర్యాలు ... ఎంత మేలుచేస్తున్నాయో పిల్లలకు అంతే కీడు సృస్టిస్తున్నాయి. భవిష్యత్తుకు ఓ కీలక మజిలీగా నిలుస్తున్న ఈ " టీనేజ్ " లో కుటుంబమంతా అప్రమత్త్తముగా ఉంటే పిల్లలు ఉత్తమంగా ఎదిగేందుకు అవకాశము ఉంటుంది.
ఎన్నో ఇళ్లల్లో చూస్తూ ఉంటాం..  తల్లిదండ్రులు తమ పిల్లలను పద్దతి పేరుతో చాలా స్ట్రిక్ట్‌గా పెంచుతుంటారు. అలాంటి చోట తమ ఇష్టా ఇష్టాలను సైతం తల్లిదండ్రులతో పంచుకునే వీలే ఉండదు.ఆ విధమైన అట్మాస్ఫియర్‌లో పిల్లల ఎదుగుదల .. పెరుగుదల అనేది భయభక్తులతో ఉంటుంది. అందుకే మరీ ఎక్కువగా మీ టినేజర్‌ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడం ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
తల్లిదండ్రులు తమ పిల్లలతో చాలా వరకు ఓపెన్ గా ఉండటం ఎంతో అవసరం. వాళ్ల అవసరాలకు అనుగుణంగా.. సరైన సలహాలు ఇవ్వాలి. స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటివల్ల కలిగే హాని గురించి వివరించాలి. వాటివల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయో కేస్ స్టడీస్ చూపించాలి. మంచికీ చెడుకు ఓ సన్నని గీతే ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. అయితే ఏదైనా వారికి విసుగు కలిగించేలా చెప్పకూడాదు. తల్లిదండ్రులు క్లాస్ పీకుతున్నారేమో అనే భావన అసలు అనిపించకూడదు. ఎప్పుడూ సరదాగా.. మాట్లాడుతూనే .. మీరు చెప్పాల్సిన విషయాలను వారికి అర్ధం అయ్యేలా తెలియజేయాలి.
పిల్లల కొత్త స్నేహాల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని ప్రతీ కొత్త స్నేహం వాళ్ళకు చెడు చేస్తుందన్న భయాన్ని వాళ్ళ ముందు వ్యక్తం చేయకూడదు. కొత్త స్నేహాలు వంద శాతం మంచిది కాదని భావించకండి. కొత్తవాళ్లతో పరిచయం అలవాటు అవ్వాలి. అలా కాకుండా.. తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లో మీకే తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తనను బట్టి మీరు అంచనా వేసే శక్తి వస్తుంది. సో అప్పుడు మీకూ భయం ఉండదు.
ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు కలిసి చూడటం, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో.. వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు ఎంతో  సహాయపడతాయి.
NOTE: Courtesy Raj News  




9, సెప్టెంబర్ 2017, శనివారం

రాస్తూ పోతూ చదవడం మర్చిపోతున్నానా?


ఈమధ్య ఇలా అనిపిస్తోంది. డాక్టర్ భరత్ పుణ్యమా అని ఈమధ్య ఒక పుస్తకం చదివాను. అది చదివిన తరువాత ఇక రాయడానికి పూర్తిగా స్వస్తి చెప్పి ఇలాటి పుస్తకాలే చదువుతూ వుండాలని గట్టిగ అనిపిస్తోంది. ఆ గొప్ప  పుస్తకం పేరు “సిల్క్  రూటులో సాహస యాత్ర”.  దాన్ని రాసిన గొప్ప రచయిత పేరు పరవస్తు లోకేశ్వర్. మొదటి ప్రచురణ 2013 లో. నాలుగేళ్ళకు చదవగలిగినందుకు ఒక రకంగా సంతోషంగా వుంది.  నాలుగేళ్ళుగా చదవనందుకు మరో రకంగా సిగ్గుగా వుంది.
రాసిన లోకేశ్వర్ గారికి, చదివించిన డాక్టర్ భరత్ గారికీ (ఈ ఇద్దరూ నాకంటే వయస్సులో చిన్నవాళ్ళు, అయినా గారు అని గౌరవించుకోవాలని అనిపిస్తోంది) ధన్యవాదాలు. ఈపాటికే అనేక సమీక్షలు వచ్చి వుంటాయి. అయినా వీలు చూసుకుని నా అభిప్రాయం రాస్తాను.
(గాంధి ప్రచురణలు మొబైల్: 9392698814, వెల: 250 రూపాయలు)


2, సెప్టెంబర్ 2017, శనివారం

ప్రజలు రాజహంసలు - భండారు శ్రీనివాసరావు


“విన్నంతలో కన్నంతలో వైఎస్సార్” అనే నా వ్యాసం ఈరోజు సాక్షి పత్రిక ప్రచురించింది. దాంతో ఉదయం నుంచి నా మొబైల్ మోగుతూనే వుంది. ఎంతమంది నాతొ మాట్లాడారో లెక్కలేదు. రాజశేఖరరెడ్డి గారి ‘రాజకీయం’ గురించీ, ఆయన పాలనలో జరిగిన కొన్ని వివాదాంశాలు గురించి మెజారిటీ జర్నలిష్టులకు మించిన విభిన్న అభిప్రాయాలు నాకూ లేవు. కాకపొతే ఒక ముఖ్యమంత్రిగా ఆయనలో అభివ్యక్తి చెందిన ఒక మానవీయ కోణం ఇంతమందిని ఇన్నేళ్ళ తరువాతకూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో వుందని మాత్రం  నేననుకోలేదు. అందుకే ఇంత ఆశ్చర్యం.
పొతే ఇవన్నీ నన్ను పొగుడుతూనో లేదా నేను రాసింది బాగున్నదనో చెప్పడానికి జరిగిన ప్రయత్నాలు కావు. వై.ఎస్. గురించి విభిన్న వర్గాల ప్రజలు  ఇప్పటికీ కృతజ్ఞతాపూర్వకమైన కొన్ని అనుభవాలను పదిలంగా గుండెల్లో   అణచిపెట్టుకుని వున్నారు. ఆ అనుభూతులను వ్యక్తీకరించుకోవడానికి బహుశా నా రచన వారికి   ఉపయోగపడి ఉండవచ్చు.
భద్రాచలంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వీరబాబు. గణేష్ నిమజ్జనం డ్యూటీ కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. సెప్టెంబరు రెండు ఆయన పుట్టిన రోజు. వై.ఎస్. చనిపోయిన రోజు నుంచి ఆయన తన పుట్టిన రోజు జరుపుకోవడం మానేశాడు. ఆయనకే కాదు వాళ్ళ ఇంట్లో అందరికీ వై.ఎస్.ఆరే దేవుడు.
‘వై.ఎస్. వల్ల మీకు జరిగిన మేలు ఏమిటి’ అన్నది నా ప్రశ్న.
“నిజం చెప్పాలంటే నాకు సొంతానికి జరిగింది ఏమీ లేదు. అప్పటికి నేనింకా ఉద్యోగ ప్రయత్నాల్లో  వున్నాను. మా సొంతూరు ఖమ్మంజిల్లా ముదిగొండ మండలంలోని గోకినేపల్లి. మా నాన్నకు కొంత పొలం వుంది. దానికోసం సహకార బ్యాంకు నుంచి ఐదువేల రూపాయలు పంట రుణం తీసుకున్నారు. సకాలంలోనే ఆ అప్పు తీర్చేశారు కూడా. తరువాత వై.ఎస్. రుణ మాఫీ ప్రకటించారు. రుణం తీర్చిన వారికి కూడా ఈ పధకం వర్తింప చేయడంతో మా  కుటుంబానికి  అనుకోకుండా ఐదువేలు లభించింది. దానితో, మా  నాన్నగారు, ఆయనతో పాటు ఇంటిల్లిపాదీ వై.ఎస్. కు వీరాభిమానులు  అయిపోయారు. ఆ అయిదువేలతో ఇంటిముందు చిన్న రేకుల పందిరి వేసుకున్నాము. వాటికి  వై.ఎస్.ఆర్. రేకులు అని పేరుపెట్టుకుని పిలుచుకుంటున్నాము.” చెప్పాడు వీరబాబు ఉద్వేగంగా.
“ఒక్క అయిడువేలకే ఇంతగా ఇదయిపోవాలా” నా నుంచి మరో ప్రశ్న. ఆయన వద్ద జవాబు సిద్ధంగా వుంది.
“లేదు. కాకపొతే అప్పటినుంచి ఆయన్ని నిశితంగా గమనించడం మొదలయింది. 108. 104, ఆరోగ్య శ్రీ, పక్కా ఇళ్ళు,  చదువులకు కట్టిన ఫీజులు వెనక్కి ఇవ్వడం ఇలా  మా వూళ్ళో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా సాయం అందింది. చిత్రం!   వేటికీ ఆయన తన పేరు పెట్టుకోలేదు. అవన్నీ చూసిన తర్వాత, పర్వాలేదు, ఈయన పాలనలో బాగుపడతాం అనే భరోసా వచ్చింది”
ఇక నేను ఏమీ అడగలేదు. తరువాత కూడా చాల విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నీ విన్నాను.
ఒక్క వీరబాబే కాదు, అనేకమంది  అనేక ప్రదేశాలు, ప్రాంతాల నుంచి ఫోన్లు చేశారు. వరస ఫోన్లు కావడంతో కొన్ని పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం అయింది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. వాటిని వ్యక్తీకరించడానికి నా వ్యాసం ఒక ప్రాతిపదిక అయింది. అంతే!       
ఈ విధంగా రోజు గడిచింది. అప్పుడు అనిపించింది.
మామూలు ప్రజలు మనం అనుకునేంత మామూలోళ్ళు కాదు. మంచిని, మంచిగా స్వీకరిస్తారు. చెడు చెడుగా గుర్తిస్తారు. ఆ విద్య వారికే సొంతం.
తోకటపా: అలా అని అందరూ  మెచ్చుకోళ్ళతో నన్ను  ముంచేయలేదు. ఈ వ్యాసాన్ని నా బ్లాగులో పోస్ట్ చేస్తే ‘అజ్ఞాత’ పేరుతొ ఒక చదువరి  ఇలా కామెంటు పెట్టాడు.
“ఏదో అనుకున్నా కానీ, మీరు రేడియో విలేకరి స్థాయి దాటి ఇంకా ఎదగలేదు”
రేడియోలో అందరూ ‘భజన చేసే విధం’ తెలిసిన వాళ్ళే పనిచేస్తారని ఆ ‘ముసుగు మనిషి’ భావం కావచ్చు.
పరవాలేదు. రాసినది నాది అని చెప్పుకునే ధైర్యం వుంది కాబట్టి నేను నా పేరు దాచుకోలేదు. ఈ విషయంలో అయినా  నేను ఆ ‘అజ్ఞాత’ కంటే ఎదిగిన మనిషిననే అని అనుకుంటున్నాను.   
 

కన్నంతలో విన్నంతలో వై.ఎస్.ఆర్. – భండారు శ్రీనివాసరావు


(Published in SAKSHI telugu daily today, 02-09-17,on the occasion of death anniversary of Dr.Y.S.Rajasekhara Reddy) 
సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలి నాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో వుండిపోయారు. అలాగే  వైద్య విద్య పూర్తిచేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో ఆయన ఆ  పనిచేసిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని  (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ళ పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్. చనిపోయిన ఇన్నేళ్ళ తరువాత కూడా  ఆయన వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే వున్నారు. వీళ్లేమీ బడాబడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప గొప్ప  రాజకీయ నాయకులు అంతకంటేకాదు. వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు.
ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను -  కన్నవి, విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
ప్రింటింగు ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దీగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని గోనెసంచుల్లో కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ వుంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్ అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు.  వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి గుండె జారిపోయింది. కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని , ఈ విషయాన్ని జర్నలిష్టు సంఘం నాయకుడు అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. రోగి గురించి పూర్తిగా తెలిసివున్న అమర్ వెంటనే వైఎస్ ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన అర్జీని  అయన చేతికి ఇచ్చారు. తక్షణ సాయం అందించమని వై.ఎస్. తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎం కు తెలిసింది. సహాయ నిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్ధిక సాయం అందించి రావాలని కోరారు.
వై ఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్తితి ఏర్పడింది. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇదేవిధమైన పరిస్తితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టుకున్నా వెంటనే ముందు వెనుకలు చూడకుండా డబ్బు మంజూరు చేసేవాళ్ళు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన సభ్యుడు, వారికి సంబంధించిన వారికి  వైద్యం చేయించేందుకు ఆర్ధిక సాయం కోరుతూ ఒక అర్జీ ముఖ్యమంత్రి వై.ఎస్. చేతికి ఇచ్చారు. అదంతా చదివి వై ఎస్ ఆయనతో ఇలా అన్నారు.” నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు  ఏమాత్రం సరిపోవు.రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’
ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు “చూశారా, సి ఎం అంటే ఇలా వుండాలి, మా పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసే వాళ్ళు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించి  అడగాల్సి వచ్చేది” 
వై ఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని   క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు వస్తూనే వీరిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎమ్ కాసేపటి తరువాత వచ్చి బయట కూర్చుని వున్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా  విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి  ఆడపడుచు వంటి వారు,  మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ ఒకటికి రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి తన వద్ద కూర్చోబెట్టుకున్నారు.  ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎందరి పెళ్ళిళ్ళు అయ్యాయి’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. ఇన్నేళ్ళ తరువాత కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ  సంగతి గుర్తుచేసుకుంటూ వుంటారు.
పొతే, ఇది వై.ఎస్. వ్యవహార శైలితో ముడిపడివున్న మరో విషయం. అయితే ఇది చెప్పింది, కాదు రాసింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా, తన   జీవితానుభావాలతో కూర్చిన ‘మోహన మకరందం’ అనే పుస్తకంలో ఈ సంగతులు ప్రస్తావించారు.
“అప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత.
2003 లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ అప్పటి ఎలక్షన్ కమీషనర్ లింగ్డో దానికి ఒప్పుకోలేదు. ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియ పూర్తయిన తరువాతనే ఎన్నికలుజరగాలని  ఆయన నిర్ణయించారు. దాంతో కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే వ్యవహరించాల్సివుంటుంది. రాజకీయ పరమైన నిర్ణయాలు లేకుండా అధికారులే ప్రభుత్వాన్ని నడపాలి. ఆ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  మోహన్ కందా పై  పరిపాలనా భారం పడింది. అన్నాళ్ళు ఈ భారం మోయడం కష్టం అని భావించిన కందా, లింగ్డోతో తనకున్న వ్యక్తిగతస్నేహాన్ని పురస్కరించుకుని, ఆ చనువుతో ‘కాస్త ముందుగా ఎన్నికలు పెట్టవచ్చు కదా’ అని కోరారు. కానీ లింగ్డో మహాశయులు ఒక పట్టాన కొరుకుడు పడే రకం కాదు, ‘పేకాట పేకాటే, బావగారు బావగారే’ అనే తరహాలో ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యేవరకు ఎన్నికల ప్రసక్తి తీసుకురావద్దని తెగేసి చెప్పేశారు.
“ఈలోగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తన శైలిలో  ప్రభుత్వం పని తీరుపై రోజువారీ నివేదికలు మీడియాలో ఇస్తుండేవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అలా ప్రజల డబ్బు ఖర్చు చేసే హక్కు లేదంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ యాగీ మొదలు పెట్టింది. చీఫ్ సెక్రెటరీగా మోహన్ కందా బాబుకు సాయం చేస్తున్నాడు అని వాళ్ళు అనుమానించడం మొదలెట్టారు. అంతలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు నగారా మోగించింది. లోకసభ రద్దయింది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జమిలిగా జరపాలని చంద్రబాబు కేబినేట్ తీర్మానించింది. కేబినేట్ నిర్ణయానికి అనుగుణంగా ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కేంద్రానికి లేఖ రాయడం జరిగి పోయింది. ఈ ఆలోచన సహజంగానే ప్రతిపక్షానికి రుచించలేదు. రెండు ఎన్నికలు కలిపి  నిర్వహించాలని కోరుతూ  సీ. ఎస్. కేంద్రానికి ఉత్తరం రాయడాన్ని వై.ఎస్. తప్పు పడుతూ పత్రికా ప్రకటన చేసారు. ‘ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు, ఐ.ఏ.ఎస్. అధికారికి ఏం సంబంధం’ అనేది అయన వాదన.   
“ఎన్నికలు జరిగాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రధాన కార్య దర్సులు, పోలీసు డైరెక్టర్ జనరల్ వంటి కీలక పోస్టుల్లో వున్నవాళ్ళు మారడం కూడా రివాజుగా మారింది. కందా వెళ్లి, వై.ఎస్. ని కలిసి ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించమని కోరారు. ప్రతిపక్ష నేతగా కందా చేసిన పనులు ఆయనకు నచ్చని మాట నిజమే. అయితే ఒక విషయం అర్ధం చేసుకున్నారు. ఒక అధికారిగా ఆయన తన బాధ్యత నిర్వర్తించారు తప్పితే రాజకీయ పరమైన దురుద్దేశాలు ఆయనకు లేవన్న విషయాన్ని కూడా వై.ఎస్. గ్రహించారు. కనకనే ఆయనతో అన్నారు. ” సీ.ఎస్. పదవిలో కొనసాగాలని మిమ్మల్ని కోరాలని నేను నిర్ణయించుకున్నాను.”
“వైఎస్ ఇంకో మాట కూడా అన్నారు మోహన్ కందాతో ఇంగ్లీష్ లో.
‘నాతో వ్యవహారం చాలా సులువని మీరు త్వరలోనే గ్రహిస్తారు’ అన్నది దాని భావం.
“చంద్రబాబు ప్రభుత్వంలో, వై.ఎస్. సర్కారులో కూడా సి.ఎస్. బాధ్యతలు నిర్వహించిన మోహన్ కందా పదవీ విరమణ అనంతరం రాసుకున్న ఆ   పుస్తకంలో  ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలి గురించి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేసారు.
“ ఏదైనా ఆయన దృష్టికి తేకపోతే, ’ఇది నాకు ఎందుకు చెప్పలేదు’ అనేవారు బాబు.
“అదే వై యస్సార్ అయితే, ‘ఇది నాకెందుకు చెబుతున్నారు’ అని అడిగేవారు”    
వై.ఎస్. గురించిన ఇలాటి విశేషాలు ఎన్నో వున్నాయని ఆయన్ని ఎరిగినవారు చెబుతుంటారు. (29-08-2017)

Below Photo: Author with Dr.Y.S.Rajasekhara Reddy, when he was the Chief Minister of combined state of Andhra Pradesh.



రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595