12, ఆగస్టు 2017, శనివారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(11)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన 

మా తాతగారు పర్వతాలయ్య గారికి చిన్నతనంలోనే పెండ్లయింది. పెండ్లిలో కూడా మా బామ్మ ఆయనపై పడుకుని నిద్రపోయిందట. పొలిమేర మీద ఊళ్ళు కావడం వల్ల బాగా రాకపోకలు ఉండేవి. ఇద్దరూ కలసి ఆడుకునేవారట. మా బామ్మగారు సమర్త కాకపూర్వమే గర్భం ధరించిందట. మా నాన్నగారు పోయినప్పుడు చెల్లమ్మమ్మ ఎంతో దుఃఖపడింది. ఆ ఏడుపులోనే,  ఇదిగో ఈకధ,  ఆమె నోట మొదటిసారి బయటకు వచ్చింది. అలా పిల్లలు పుట్టడం దోషం అని, పుట్టగానే,  రోజుల బిడ్డగా వున్న మా నాన్నగారిని ఎరుకల బూశామ (బూశమ్మ)కు దానం ఇచ్చారట. ఆమె పిల్లవాడిని తన గుడిసెకు తీసుకుపోయింది. తరువాత ఆ పసివాడిని గంపలో పెట్టుకుని పండ్లోయమ్మ పండ్లుఅంటూ భూశమ్మ వూళ్ళో  తిరుగుతుంటే, చెల్లమ్మగారు వెళ్లి,  ‘మాకు ఓ పండు కావాలి అమ్ముతావాఅని అడిగి,  సోలెడు సజ్జలు భూశామకు ఇచ్చి పిల్లవాడిని కొనుక్కుని ఇంటికి తీసుకు వచ్చిందట. అలా, ఆ దోష పరిహారం జరిగిందన్నమాట. మా నాన్నగారు తన 53వ ఏటనే చనిపోయారు. మా తాతగారు, ముత్తాత గారు సుమారుగా అదే వయస్సులో పోయారు. మొదటి పర్వతాలయ్య గారిని కూడా ఆ వయస్సులోనే  హత్య చేసారు. అప్పయ్య గారి సంగతి తెలియదు. బహుశా షష్టిపూర్తి చేసుకున్నారేమో. అలా జరిగివుంటే, ఆయన తరువాత, నా వూహ ప్రకారం, మొదటి వరుస సంతానంలో షష్టిపూర్తి చేసుకున్నది నేనేనేమో(అంటే, మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు). నందిగామలో జనన మరణ రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తేదీలు పట్టుకుంటే కాని ఈ విషయం గట్టిగా చెప్పలేము.

పర్వతాలయ్యగారికి పెద్ద మీసాలు ఉండేవి. వెనుక జుట్టు ముడి వుండేది. సింహలలాటం మురుగులు ధరించేవారు. మిత భాషి. అయినా చమత్కారంగా మాట్లాడేవారు. సౌమ్యుడు, సాత్వికుడు. కానీ ఒక్కోసారి తీవ్రంగా కోపం వచ్చేది. ఏదీ మనసులో ఉంచుకునే తత్వం  కాదు. ఆయన చివర దశలో కాళ్ళు చచ్చుపడ్డాయి. దాదాపు పది పన్నెండేళ్ళు మంచం మీద కూర్చునే కరణీకం చేసారు. ఆయనకు ఎనిమిదవ ఏట పెళ్లయింది. అప్పుడు మా బామ్మ రుక్మిణమ్మ గారికి నాలుగేళ్ళు.
ఆమె తండ్రి కాకరవాయి (కాకరాయి) వాస్తవ్యులు, కందిబండ చిదంబరం గారు. తల్లి చెల్లమ్మ గారు. చిదంబరంగారు చనిపోయేనాటికి మా బామ్మ ఒక్కతే  కూతురు. చెల్లమ్మగారికి అప్పటికి ఇంకా పదహారేళ్ళు కూడా నిండలేదు. భర్త పోయిన తరువాత  కొన్నాళ్ళకు చెల్లమ్మ గారు కాకరవాయి లోని తమ వాటా ఇల్లూ, పొలాలు అమ్మేసుకుని పదివేల రూపాయలు తెచ్చి మా నాన్నగారికి ఇచ్చిందట. బహుశా 1929, 1930 ప్రాంతాల్లో అయివుండవచ్చు.  ఆ సొమ్ముతోనే మా నాన్నగారు ప్రస్తుతం వున్న మా ఇల్లు కట్టారని అంటారు. చెల్లమ్మగారు అప్పటినుండి మా ఇంట్లోనే వుండేది. ఆమె భాగవతం నిత్య పారాయణ చేసేది. భారతం, భాస్కర రామాయణం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం కూడా చదువుతూ వుండేది. అయితే ఆమెకు రాయడం బొత్తిగా రాదు. చదువుకున్నవారికే వోటు హక్కు అని ఆరోజుల్లో ఒక రూలు వచ్చిందట. మా నాయనమ్మమ్మ చెల్లమ్మగారికి కాని, మా నాయనమ్మ రుక్మిణమ్మ గారికి కాని, మా అమ్మగారు వెంకట్రావమ్మ గారికి కాని చదవటం చక్కగా వచ్చు కాని రాయడం రాదు. అందుకని వాళ్ళందరికీ తమ పేర్లు (సంతకం) రాయడం వరకు నేర్పించారట.

మా చిన్నతనంలో చిట్టేల కోటయ్య పంతులు గారు తన దగ్గర చదువుకునే పిల్లల్ని,  ఇంటి దగ్గర కూడా చదివినట్టు వాళ్ళ పెద్దవాళ్ళచేత పలకపై రాయించుకుని రమ్మనేవారు. మేం చెల్లమ్మగారికి చదివినాడుఅనే పదం రాయడం నేర్పాము. ఆమె పలక మీద అదే రాసి ఇచ్చేది. సామాన్యంగా ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ పుస్తకం పట్టుకునే అలవాటు  లేదు. అది చూసి చెల్లమ్మగారు ఇవ్వాళ  మీరు చదవలేదుఅని రాస్తానని మమ్మల్ని బెదిరించేది. కాని అల్లా రాయడం ఆమెకు రాదని మాకు తెలుసు. చాలా మెత్తని మనిషి కనుక చదివినారుఅనే రాసిచ్చేది. ఆమె  దాదాపు  95సంవత్సరాలు జీవించింది. చక్కిలాలను నమలగలిగే దంత పటిమ వుండేది. మనిషి బాగా వంగిపోయినా ఎప్పుడు నవిసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆఖరి రోజున కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మనుమరాళ్ళు ప్రేమ,భారతి సాయంతో దొడ్లో చింతచెట్టు వరకు చేతి కర్ర పొడుచుకుంటూ  నడిచి వెళ్లి వచ్చింది. పండ్లు తోముకుంటూ పక్కకు వాలిపోయి   అనాయాసంగా మరణించింది. ఆమె మరో రెండు రోజులకు పోతుందనగా నాకు (భండారు పర్వతాలరావు) లా కాలేజీ తెరవడం వల్ల హైదరాబాదు ప్రయాణం అయ్యాను. ఆమెకు దండం పెట్టడానికి వెడితే రెండు రోజులు తాళు (ఆగు)అంది. నేను ప్రయాణం మానేసాను. సరిగ్గా రెండో రోజునే  ఆమె మరణించింది. అంతకు ముందు రాత్రి కూడా రోజు మాదిరిగానే గజేంద్ర మోక్షం లోని పద్యాలు పొద్దు పోయిందాకా చదివి పండుకుంది. 

(భండారు పర్వతాలరావు)

(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: