9, జులై 2017, ఆదివారం

బదరీ కేదార్ యాత్ర (1996)– ఐదో భాగం - కొమరగిరి అన్నపూర్ణ


ఋషీకేశ్ నుంచి హిమాలయాలు ప్రారంభం. అక్కడి నుండే ఘాట్ రోడ్డుపై ప్రయాణం మొదలు. కొంత దూరం పోయిన తరువాత చల్లటి మంచి నీళ్ళు దొరుకుతాయని ఒక చోట బస్సు ఆపారు. అందరం వెళ్లి వాటర్ బాటిల్స్ లో తెచ్చుకున్నాము. ఎండ తీక్షణంగానే వున్నా గాలి చల్లగానే వీస్తోంది. కనుక హాయిగానే వుంది. ఒక వైపు అగాధమైన లోయ. మరో వైపు ఆకాశాన్ని అంటే పర్వతాలు. బస్సులో చాలామంది తెలుగు వాళ్ళు వున్నారు. ఒకామె ‘తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి’ అంటుంటే ఆమె భర్త కాబోలు, మా వైపు చూపించి ‘ మామ్మగార్లు చూడు ఇంత వయస్సులో కూడా ఎలా హుషారుగా తిరుగుతున్నారో’ అని భార్యని మందలిస్తున్నాడు.
గైడు మాకు హిమాలయాలను చూపిస్తూ హిమాలయాల్లో పెద్దవీ, చిన్నవీ కలిపి మొత్తం లక్షా పదిహేనువందల పర్వతాలు వున్నాయని చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. కాళిదాసు హిమాలయాలను మానదండం (రూళ్ళ కర్ర) గా వర్ణించాడు.
కొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ బస్సు ఆపారు. ‘ఇక్కడే భాగీరధి (గంగ), అలకనంద నదుల సంగమం వుంది వెళ్లి చూడండి అన్నాడు గైడు. అందరూ దిగి వెళ్లి నెత్తిన నీళ్ళు చల్లుకు వచ్చారు.  నేను, సావిత్రి కొంతదూరం వెళ్లి నడవలేక వెనక్కి వచ్చి బస్సులో కూర్చున్నాము. రంగడు సీసాలో నీళ్ళు తెచ్చిస్తే చల్లుకున్నాము.దాన్ని దేవా ప్రయాగ అంటారుట.
బస్సులో నుంచే సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసాము. ఎంతో మనోహరంగా వుంది. మనకు దగ్గరలోనే సూర్యుడు
 అస్తమిస్తున్న అనుభూతి కలిగింది. ఘాట్ రోడ్డు ప్రయాణం భయంకరంగానే అనిపిస్తుంది, వెళ్లినంతసేపు. ఎట్లాగో భగవంతుని దయ వల్ల క్షేమంగా శ్రీనగర్ చేరాము.
కాశ్మీరు రాజధాని శ్రీనగర్, ఈ శ్రీనగర్ ఒకటి కాదు. ఇది వేరు. ఇక్కడ అందర్నీ ఒక సత్రంలో బస చేయించారు.
మా పదకొండు మందికీ విడిగా రెండు గదులు ఇచ్చారు. గదికి అయిదువందలు అద్దె. అందరం మొహాలు కడుక్కున్నాం. స్వర్ణ మర్నాటికి అందరికీ కావాల్సిన బట్టలు అవీ తీసి మడతలు పెట్టి సర్దిఉంచింది.  రాత్రంతా బస్సులో సరిగా నిద్ర పట్టలేదు. మళ్ళీ తెల్లవారు ఝామున్నే ప్రయాణం. డోలీలు, గుర్రాలు ఎక్కడం ఎల్లా అనేదాని మీదే చర్చ. గుర్రానికి అయిదువందలు, డోలీకయితే పదిహేనువందలుట. శారదక్కయ్య, సావిత్రి  గుర్రం ఎక్కడానికి భయపడుతున్నారు. రంగారావు గారు నవ్వుతూ ‘ మీరు గుర్రాలు ఎక్కి ఏమైనా అయితే మీ కొడుకులకు నేనేం సంధానం చెబుతాను,డబ్బు పొతే పోయింది డోలీలే ఎక్కిస్తాను’ అని అన్నాడు.

ఫలహారం చేసి, మజ్జిగ తాగి ఆ రాత్రి పడుకున్నాము. హాయిగా నిద్ర పోయాము. ఈ విధంగా నాలుగో రోజు ప్రయాణం ముగిసింది. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: