30, జూన్ 2017, శుక్రవారం

కుటుంబ ఆదాయం ఏడాదికి ఒక రూపాయి – గిరిజాపతి ఎర్రంశెట్టి


“మాది భీమవరం పట్టణం. అప్పటికే మాది బాగా కలిగిన కుటుంబం.  తదనంతర కాలంలో మా కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బతింది. నేను భీమవరం ఎస్. సి. హెచ్ బి. ఆర్. ఎమ్ హైస్కూలులో ఆరోతరగతి చదువుతున్నాను. ఆ దశలో మా మాతా మహులు మా కుటుంబాన్ని నరసాపురం మండలంలోని మల్లవరం గ్రామానికి తీసుకు పోయారు. అది 1968 సంవత్సరం. నన్ను ప్రక్కనే ఉన్న మత్స్యపురి గ్రామములోని జిల్లా పరిషత్తు హైస్కూల్ లో చేర్చారు. తక్కువ ఆదాయం ఉన్న వారికి ఫీజులో రాయితీ ఉండేది. అందుకు తహశీల్దారు సర్టిఫికేట్ కావాలి. అది కావాలంటే మున్సబు లేదా కరణం ముందు సర్టిఫై చేస్తే ఆతర్వాత తహశీల్దారు సంతకం పెట్టేవారు. మల్లవరం మున్సబు ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చేవారు కాదు. ఆయనదంతా రాయల్ వ్యవహారం. ఆబాద్యతను కరణంగారికి అప్పగించారు. ఆ కరణం గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గ్రామములో మకాం ఎక్కువగా ఉండేవారు కాదు. కుటుంబం గ్రామములో ఉండేది కరణం గారు మాత్రం నరసాపురం టౌన్ లో ఉండేవారు. గ్రామ నౌకర్లు కూడా ఎక్కువగా ఆయన వెంటే ఉండేవారు. కరణంగారికి జీతముతో పని లేదు. ఆస్ధి పరుడు. టౌన్ లో ఉంటూ దర్జా అనుభవించే వారు. ఆయన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. తిరగ్గా తిరగ్గా దొరికే వారు. సరే! నేను అంత చిన్న వయసులోనే ఇన్కం సర్టిఫికేట్ కోసం వెళ్ళాను. లక్కీగా నేను వెళ్ళే టప్పటికి నరసాపురంలో రూములో ఉన్నారు. ఇన్కం సర్టిఫికేట్ కావాలన్నాను. ఎవర్రా నువ్వు? అన్నారాయన. నేను మాతామహుని పేరు (ఆరేటి చల్లయ్య) చెప్పి, ‘ఆయన  మనవడిని’ అన్నాను. ‘ఎం కు కావాలిరా? అన్నారు. మాకు ఆదాయం ఏమి లేదని రాయమన్నాను. ‘ఓయ్! ఆదాయం వద్దంటే కుదరదు. ఎంతో కొంత రాస్తాను’ అన్నారు. అని సంవత్సరం ఆదాయం ఒక్క రూపాయి అని రాశారు. ఆయనది గొలుసు కట్టు రాత. ఆపైన అక్షరాలను విరగొట్టి రాసేవారు.ఫలితంగా ఆయన రాత ఎవరికీ అర్ధం అయ్యేది కాదు. సరే ఆ రాసిన కాగితం తీసుకొని నేను తాలూకా కార్యాలయానికి వెళ్ళాను. దఫేదారుకి ఇచ్చాను. ఆయన తహశీల్దారు వద్దకు సంతకం కోసం తీసుకు వెళ్ళినాడు. కాసేపటికి దఫేదారు వచ్చి లోపలికి రమ్మని అన్నాడు. తహశీల్దారు వద్ద నిలబెట్టినాడు. ‘ఏమయ్యా! మీ కుటుంబ ఆదాయం ఏడాదికి ఒక్క రూపాయా? అని అడిగారు. మాకు ఆదాయం లేదు అన్నాను. ‘వెళ్ళి మీ కర్ణాన్ని తీసుకొని రా’ అని ఆకాగితం నా చేతికి ఇచ్చారు. ఊసూరంటూ మరల కరణం గారి వద్దకు వెళ్లాను. ‘ఏరా మళ్లీ వచ్చావు ఏమిటి’ అన్నారు. తహశీల్దారు సంతకం పెట్టలేదు, మిమ్మల్ని తీసుకొని రమ్మని అన్నారు. సంవత్సరం ఆదాయం రూపాయి ఏమిటి? అని అడిగారు’ అని చెప్పినాను. దానితో మాకరణం గారు ‘వాడు సంతకం పెట్టడా? సరే నడు’ అని వడివడిగా బయటకు వచ్చారు. ఆయనకు నరసాపురంలో రిక్షా వాడు ఎపుడూ కూడానే ఉండేవాడు. కరణం గారు బయటకు రాగానే రిక్షావాడు ఆయన దగ్గరకు రిక్షాతో సహా వచ్చాడు. కరణం రిక్షా ఎక్కారు. తర్వాత ‘ఒరే రిక్షా ఎక్కరా’ అని కరణం గారు నాతొ అన్నారు. ఎక్కాను. ‘తాలూకాఫీసుకు పోనీయరా? అన్నారు రిక్షా వాడిని. అక్కడ దిగిన తర్వాత నా చేతిలో ఉన్న కాగితం తీసుకొని తహశీల్దారు వద్దకు వెళ్ళినారు. లోపల ఏం జరిగినది తెలీదు. కాసేపటికి బయటకు వచ్చి కాగితం నాచేతిలో పెట్టారు. ‘వెళ్లిపో’ అన్నారు. అందులో తహశీల్దారు సంతకం ఉంది. నేను ఎదిగే కొద్ది తెలిసినది కరణం గారి పవరేమిటో! కరణం గారి ఇంటి పేరు కాళ్ళకూరి వారు. ఆయన పేరు చిట్టి రాజు. చింతామణి నాటకం రాసిన కాళ్ళకూరి నారాయణరావు గారు వీరు జ్ఙాతులు. నారాయణరావు గారిది ప్రక్క గ్రామము మత్స్యపురి.జమీందారులు”

( ఇంతకి ఈ కధ ఎందుకు గుర్తు వచ్చినదంటే తహశీల్దారు సంతకం ఖరీదు 5 రూపాయిలని భండారు శ్రీ నివాసరావుగారు ఒక అనుభవం రాశారు. దానిపై ఇది గుర్తొచ్చింది.భండారు వారికి కృతజ్ఞతలతో - గిరిజాపతి ఎర్రంశెట్టి)

20, జూన్ 2017, మంగళవారం

బాబోయ్ ఈ జీవితం!

‘నాకు PAN కార్డు ఉంది నేను ఓటు వెయ్యొచ్చా?’
“కుదరదండి వోటర్ కార్డు కావాలి’

‘నాకు వోటర్ కార్డు ఉంది దాని మీద రేషన్ దుకాణం లో సరుకులు కొనచ్చా?’
‘కుదరదండి రేషన్ కార్డు కావాలి’

‘రేషన్ కార్డు ఉంది గ్యాస్ దొరుకుతుందా?’
‘కుదరదండి, ఆధార్ కార్డు కావాలి’

‘ఆధార్ కార్డు ఉంది బ్యాంకు ఖాతా తెరవచ్చా?’
‘కుదరదండి PAN కార్డు కావాలి’

‘అయ్యా, నాకు PAN కార్డు కావాలి’
‘మీ వద్ద ఆదార్ కార్డు ఉందా?
‘అయ్యా, నాకు ఆధార్ కార్డు కావాలి’
‘మీ వద్ద రేషన్ కార్డు ఉందా?
‘అయ్యా, నాకు రేషన్ కార్డు కావాలి’
‘మీ వద్ద వోటర్ కార్డు ఉందా?
‘అయ్యా, నాకు వోటర్ కార్డు కావాలి’
‘మీరు ఈ కాలనీలో నివాసం ఉంటున్నట్టు MRO సర్టిఫికేట్ ఉందా?
‘అయ్యా, నాకు MRO సర్టిఫికేట్ కావాలి’
‘మీ బర్త్ సర్టిఫికేట్ ఉందా?
‘అయ్యా, నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి’
‘మీరు పుట్టినట్లు సాక్ష్యం కావాలి’
‘?!?!?!?!?!’


14, జూన్ 2017, బుధవారం

పక్షి కన్ను అధికారం


గురువు ద్రోణాచార్యుడు కురుపాండవ సోదరులకు విలు విద్యలో పోటీ పెడతాడు. ఒక వృక్షం కొమ్మల మధ్య పక్షి బొమ్మను పెట్టి దాని కన్నుకు గురిపెట్టి  బాణం కొట్టమని ఆదేశిస్తూ, ఒకొక్కరిని విడివిడిగా  ఆ చెట్టుపై ఏం కనబడుతున్నదో చెప్పమంటాడు.
“చెట్టు, కొమ్మలు, ఒక కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను.”
“కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను”
“పక్షి”
ఆఖరుకు అర్జునుడి వంతు.
“అర్జునా! ఏం కనబడుతోంది?” ద్రోణుడి ప్రశ్న.
“పక్షి కన్ను”
“ఇంకా ఏమీ కనబడడం లేదా”
“లేదు. పక్షి కన్ను మాత్రమే”
అదీ గురి చూసి కొట్టడం అంటే.  విలుకాడికి  లక్ష్యసిద్ధి వుండాలనేది ఈ భారత కధ పరమార్ధం.
ఆ కధనే ఇప్పటి రాజకీయాలకు వర్తింపచేస్తే వచ్చే సమాధానం.
పక్షి కన్ను కాదు, అధికారం.
అది గురిచూసి కొట్టగలిగిన వాళ్ళే నేటి రాజకీయ నాయకులు.
కాకపొతే, ఇప్పుడు వారందరూ అర్జునులే! అందరి గురీ అధికారం అనే పక్షి కన్ను మీదే!
వారికి ఏ పార్టీ పేరు పెట్టినా అతికినట్టు  సరిపోతుంది.


12, జూన్ 2017, సోమవారం

దాసరి హృదయం 'ఉదయం'

(ప్రస్తుతం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న నా పాత్రికేయ మిత్రుడు 
మాడభూషి శ్రీధర్ ఒకప్పుడు 'ఉదయం' దినపత్రికలో పనిచేసారు. దాసరిని స్మరించుకుంటూ, అలనాటి ఉదయపు రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఇలా) 


"ఉదయం దిన పత్రిక చైర్మన్ దాసరి నారాయణరావు గారి ఇంట్లో రాత్రి 12 తరువాత కీలకమైన సమావేశానికి రావాలని పిలుపు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి పై న్యాయకమిషన్ నివేదిక ప్రతిని మేం ముందే సంపాదించాం. నివేదికలో ఉన్న లోపాలను చీల్చి చెండాడుతూ కొన్ని వ్యాసాలు రాసి సిద్ధంగా ఉంచాం, వాటి ప్రచురణపై సంపాదకుడు నిర్ణయం తీసుకోవలసి ఉంది.
ఈ విధంగా కమిషన్ నివేదిక పై విమర్శావ్యాసాలు ప్రచురించడం చట్ట వ్యతిరేకమా అని అడిగారు. నేను అవునన్నాను. కమిషన్ ఆఫ్ ఇంక్వయిరీ చట్టం 1952 కింద కమిషన్ పనిని కించపరుస్తూ రాస్తే నేరం. అదీగాక అసెంబ్లీలో సమర్పించకముందే బయటపెడితే ప్రివిలేజెస్ భంగపరిచారనే ఆరోపణను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రభుత్వం తలచుకుంటే అరెస్టు కూడా చేయవచ్చు అని వివరించాను. మరేం చేద్దామంటారు అన్నారాయన. ఖచ్చితంగా నివేదికను ఉదయంలో ఉతికి ఎండేయాల్సిందే. మీరు దానికి ముందో ఘాటుమాట రాస్తే బాగుంటుంది. లేదా మా పేర్లతో ప్రచురిస్తే మేం పరిణామాలు ఎదుర్కొనడానికి కూడా సిద్దం అన్నాను. అంటే చైర్మన్ గారిని అరెస్టుచేయించాలని నీకుందన్నమాట అని మా ఎండీగారు అన్నారు. నేను దాసరి గారిని చూసాను. ఆయన ఏమంటావన్నట్టు చూసారు. మిమ్మల్ని అరెస్టు చేయాలని ఎన్టీ ఆర్ క్యాబినెట్ నిర్ణయిస్తుందంటారా అని నేనడిగాను. చూద్దాం ఏం చేస్తారో అని నవ్వుతూ దాసరి ఆ విమర్శావ్యాసాలను ప్రచురించడమే కాకుండా తన సంతకంతో ముందుమాట కూడా రాసి, అరెస్టు చేస్తే చేస్కోండి అన్నట్టు సవాలు విసిరారు. మరో ఎడిటర్ ప్రొప్రయిటర్ అయితే ఇంత ధైర్యసాహసాలు చూపేవారా? శ్రీ వేంకటేశుని పాదపద్మాల సాక్షిగా అనే శీర్షికతో ఆయన మొదటి పేజీ లేఖతో మా వ్యాస పరంపర సంచలనం రేపింది. ప్రభుత్వం వారు పెట్టిన క్రిమినల్ పరువు నష్టం దావాను ఆ తరువాత మేం పదకొండు సంవత్సరాలు ఎదుర్కోవలసి వచ్చింది.
టిటిడిపై మేం రాసిన పరిశోధనాత్మక వార్తారచన పర్యవసానంగా దాదాపు రెండుమూడు సంవత్సరాల పాటు ఉదయంలో రాయవలసిన తీవ్ర సంఘటనలు జరిగాయి. కాంట్రాక్టుల కుంభకోణం తదితర అక్రమాల ఫైళ్లు మాకు చూపాలని కమిషన్ ముందు మేం పిటిషన్ పెట్టాం. టిటిడి అధికారులు ‘ఇవి మా ఫైళ్లు మీరెవరు అడగడానికి’ అని వాదించారు. ‘తిరుమల హుండీలో ఒక్క రూపాయి వేసిన వాడికి కూడా తన డబ్బు ఏ విధంగా ఖర్చు చేసారో తెలుసుకునే హక్కుందని’ మేం వాదించాం. కమిషన్ మా వాదనను అంగీకరించి టిటిడిని ఆదేశిస్తే వారు ఫైళ్లు టేబుల్ పైన పరిచారు. ఆ ఫైళ్లు చూసే పని నామీదే పడింది. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఏకధాటిగా ఫైళ్లను పరిశీలించి దాదాపు 250 ఫైళ్లులో ముఖ్యమైన పత్రాల జాబితా తయారు చేసాను. మరునాడు వాటి ప్రతులు కావాలని పిటిషన్ పెట్టాను. దానికి కూడా వారినుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కాని కమిషన్ నాకు ఆ ప్రతులన్నీ ఇప్పించింది. అవినీతి అక్రమాలపైన విస్తారమైన సాక్ష్యాలు దొరికాయి. అప్పట్లో ప్రభుత్వం కార్యాలయంలో ఫైళ్లు చూపాలని డిమాండ్ చేసే హక్కు లేదు. 2005 సమాచార హక్కుచట్టం కింద ఇప్పుడు ఈ హక్కులున్నాయి. 20 ఏళ్ల కిందట లేని ఈ హక్కును ఉదయం అమలు చేయగలిగింది. ఉదయం టిటిడిలో అవినీతిగురించి లేవనెత్తిన కుంభకోణాన్నింటికి సాక్ష్యాలు చూపింది. అవి జరగలేదనడానికి వీల్లేదు. అయినా పై అధికారులను తప్పించడానికి కమిషన్ చాలా అన్యాయంగా తప్పుడు నిర్ధారణలుచేసిన వివరాలు మేం బయట పెట్టాం.
కాని విచారణ మధ్యలో జడ్జిగారు మాపై దాడి జరిగే ప్రమాదం ఉందని మమ్మల్ని హెచ్చరించారు. తిరుపతిలోనే మామీద దాడిచేయడానికి కుట్ర పన్నారని కమిషన్ అధ్యక్షులు న్యాయమూర్తి పెన్మత్స రామచంద్ర రాజుగారు మా లాయర్ కు మాకు మాత్రమే రహస్యంగా చెప్పారు. వెంటనే విమానంలో హైదరాబాద్ తరలిపోయాం. జడ్జిగారి వల్లే మేం బతికి పోయాం. ఆ తరువాత జడ్జిగారు నిజాలన్నీ తెలిసి కూడా టిటిడి అవినీతి పెద్దల్ని ఎందుకు రక్షించారో మనం ఊహించుకోవచ్చు.
ఎబికె సంచలన శీర్షికలు
మొదట్లో సంపాదకులకు ఇతర ముఖ్యులకు మాత్రమే దాసరితో కలిసే అవకాశం ఉండేది. రెండు రంగాల్లోనూ ప్రముఖుడు కావడం వల్ల సమయం దొరికేది కాదు. ఆయన్నుఎప్పుడు కలుద్దామా అని హైదరాబాద్ లో ఒక మామూలు విలేకరిగా నేను అనుకుంటూ ఉండే వాడిని. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో సాగే అవినీతిని ఎండకడుతూ 9 పరిశోధన వార్తా వ్యాసాలు రాసామో అప్పుడు ఆయనే మమ్మల్ని(నన్నూ సాయబాబాను) పిలిచాడు. నిజానికి అంత సంచలనమైన వార్తా వ్యాసాల విషయం దాసరికి ప్రచురించిన తరువాతనే తెలిసింది. కాని ఎబికె ఆధ్వర్యంలో స్వతంత్రంగా ఆ తొమ్మిదిరోజుల సంచలన రచన సాగిపోయింది. ఈ
వార్తావ్యాసాలకు ఎబికె శీర్షికలు సంచలనం రేపాయి.
సినీ నటి సిఫార్సు ఖాతరు చేయని దాసరి
తిరుమల పైన కాటేజిల్లో కొన్నింటిని చెరబట్టి భక్తులకు నివాసం కొరత కృత్రిమంగా సృష్టించారని మేము రాస్తే దేవస్థానం వారిని ఖాళీ చేయించక తప్పలేదు. ఆ విధంగా చెరబట్టిన ఒక సినీ నటి తనను మినహాయించాలని కోరితే, ఉదయం పత్రికవారు వెంటబడుతున్నారని మేమేమీ చేయలేమని, అధికారులు చెప్పారట. అప్పుడు మాకు తెలిసిన సినీ దర్శకరత్నమే అని ఆ నటి తనను వదిలేయాలని దాసరి గారిని కోరారట. లేదమ్మా నేనేమీ చేయలేను అని వినయంగా చెప్పి, ఆ విషయం మాతో ఆనందంగా పంచుకున్నారాయన.
మీరయ్యా అసలు హీరోలు
తిరుపతి వార్తలు రాసి తలనీలాలు సమర్పించి గుండుతో దాసరిని చూడడానికి వెళ్తే ‘ఓహో మీరేనా రాసింది’ అంటూ నవ్వుతూ చూసి ‘మీరయ్యా అసలు హీరోలు’ అని మమ్మల్ని ప్రోత్సహించిన సారథి ఆయన. కొత్తగా సినీరంగంలో ప్రవేశిస్తున్న నాగార్జున, వెంకటేశ్ లకు సినీ పునాదులు వేసింది దాసరి. మా వార్తా సమావేశాలు అప్పుడప్పడు షూటింగ్ స్థలాల్లో జరిగేవి. అక్కడికి చేరడానికి ముందే ‘శ్రీధర్ వస్తున్నాడు ఒక కుర్చీ వేయండి’ అని ఆదేశించేవారు. షూటింగ్ సమయంలో దర్శకుడికి తప్ప మరెవరికీ కుర్చీ ఉండదట, దర్శకుడు కావాలంటే తప్ప. దర్శకుడు నిర్మాతకో లేక మరో అత్యంత ప్రముఖుడికో మరొ కుర్చీవేయనిస్తాడట. నేను వెళ్లి అక్కడ కూర్చుంటే వీడా అత్యంత ప్రముఖుడు అన్నట్టు నన్ను ఆశ్చర్యంగా చూసేవారు. ఆయన షూటింగ్ ఆపి మాతో మాట్లాడేవారు. ఆ హీరోలకు నన్ను అసలు హీరోగా పరిచయం చేసేవారు. 1994లొ నేను న్యాయశాస్త్ర బోధనారంగంలోకి మళ్లి, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో చేరిన తరువాత, అంటే దాదాపు పదేళ్ల తరువాత ఓసారి ఒక సమావేశంలో హీరో సుమన్ తదితర ప్రముఖులకు నన్ను మళ్లీ అసలు హీరో అని పరిచయం చేయడం నా కుటుంబసభ్యుల మరిచిపోలేరు.
సింగరేణి ఎల్ ఐ సి కుంభకోణం
సింగరేణి కూలన్నకు భీమా పోటు అనే పేరుతో సింగరేణి కార్మికులను ఎల్ ఐ సి ఏజెంట్లు, ఆఫీసర్లు కలిసి కుట్రలు చేసి దోచుకున్న అక్రమాలను బయటపెట్టినపుడు ఎల్ ఐ సి వారు తమ వ్యాపార ప్రకటనలు ఆపుతామని బెదిరించి మా వార్తావ్యాసాల ప్రచురణను నిలిపివేయించారు. దాసరికి ఈ విషయం తరువాత తెలిసింది. నెలరోజుల్లో ఎల్ ఐ సి ఒక అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ఉదయం పక్షాన నిలదీస్తే అధికారులు కుంభకోణం జరిగిందని ఒప్పుకోకతప్పలేదు. ‘ఉదయం ప్రశ్నలకు బిత్తర పోయిన ఎల్ ఐ సి’ అని వారి లోగుట్టు బయటపెట్టే వార్తను మొదటి పేజీలో వేసి జరిగిన నష్టాన్ని సరి చేసారాయన. ‘అన్నగారి ఆరుకోట్లలో ఆ నూర్గురు లేరట’ అనే శీర్షికన ఒక నూరుగురు ప్రజలు ఉన్నా లేరనే కుట్రనుబయటపెట్టిన పరిశోధనకు ప్రథాన పతాక స్థాయి ఇచ్చారు.
నాకే కాదు రాష్ట్రం మొత్తం మీద విలేకరుల సైన్యానికి, సంపాదక వర్గానికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం స్వేచ్ఛ, పరిశోధించి ప్రచురించే వెసులుబాటు మరవలేనివి. కొన్ని నెలలు జీతాలు లేకపోయినా కార్మికులు ఆపని పత్రిక ఉదయం. దాసరికి ఆర్థిక కష్టాలున్నాయని ప్రతికార్మికుడు సానుభూతి చెందడం అపురూపమైన సంఘటన.
శక్తిత్వం
దాసరి నారాయణరావు చిత్రానికి పూలదండ చుట్టి, కింద దీపాలు అమర్చిన ఒక ఫోటో వాట్సప్ మాధ్యమంలో హటాత్తుగా కనిపిస్తే ఆయన ఇక లేరని అర్థమై వివరాలు తెలుసుకోవాలనిపించనంత విషాదంలోకి మనసు వెళ్లిపోయింది. కులసంకుల సమాజంలో, కళామాధ్యమవ్యాపారవ్యూహా ధురంధరులైన వర్గంచేతిలోకి దాదాపు పూర్తిగా వెళ్ళిపోయిన సినీ పరిశ్రమ (పరిశ్రమో కాదో తెలియదు)లో తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటూ కూడా ఒక చోటు సంపాదించుకోగలిగిన డైనమిక్ డైనమేట్ దాసరి. సుప్రసిధ్ధ తండ్రుల సుపుత్రుడు కాడాయన. చెప్పులు లేకుండా నడిచి, సైకిల్ మీద రిక్షాల్లో తిరిగిన సామాన్యుడు, పేదవాడు, కాని కొత్తదేదో చెప్పాలన్న ఉత్సాహం ఉరిమే ఊహలు ఆయన సంపద. కొందరికాయన ఊహలు, భావాలూ ప్రయోగాలూ నచ్చవు. కుటుంబాల గుప్పిట్టో ఉన్న సినీ గుత్త వ్యాపార వాతావరణంలో కులమతాలకు అతీతంగా కొత్త సినీ కుటుంబాన్నిసృష్టించిన శక్తిత్వం దాసరిది. డబ్బురాకపోక సినిమారంగంలో జూదం వంటిదని వేరే చెప్పవనసరం లేదు. ఆ నేపథ్యంనుంచి దాసరి పత్రికారంగంలో ఉదయించారు.
ఉదయం వెలుగుల వెనుక సూర్యులు
ఆంధ్రపత్రికలు, ప్రభల ప్రభలు తగ్గుతున్నరోజుల్లో వెలిగిపోతున్న ఈనాడు కు పోటీగా ఆనాడు ఉదయించిన ఉదయానికి వెనుక సూర్యుడు దాసరి. దాన్ని ఏడు గుర్రాలతో నడిపిన వాడు ఎబికె అయితే అందులో కీలకమైన సంపాదక మణులు కె రామచంద్రమూర్తి, పతంజలి, పొత్తూరి వెంకటేశ్వరరావు, గజ్జల మల్లారెడ్డి: పరిశోధనలు చేసి గుట్టు బయట పెట్టే విలేకరుల సైనిక బృందంలో నన్నూ ఒకడిగా దాసరి గుర్తించారు. విలేకరికి సంపాదకుడికి ఉదయంలో లభించిన స్వేచ్ఛ ఎన్నడూఏ పత్రికలోనూ ఎవరికీ ఉండకపోవచ్చు. 1984లో చేరి 1994లో అస్తమించేదాకా ఆ ఉదయ కిరణాలలో ఒకడినై వెలిగే అవకాశం కలిగింది. నిజానికి దాసరి అమ్మేసిన రోజునే ఉదయం అస్తమయం మొదలైంది. తేజస్సు తగ్గిపోయి ఆ తరువాత ఆ(గి)రిపోయింది. మళ్లీ వెలిగించాలని దాసరి తపించారు. ఆరోగ్యం సహకరించలేదని వేదనపడ్డారు. ఆ దీపానికి నూనె వత్తీ అన్ని అయిన దారి అనే అసలు దీపం నిన్న ఆరిపోయింది. గద్యం పద్యం ద్వారా విజ్ఞానాన్ని పంచే పత్రిక అజ్ఞానం మత్తులో ఉంచే మద్యం వ్యాపారుల చేతికి మారినప్పుడే బాధ కలిగింది. వారు మంచివారే అయినా, పత్రికా రంగంలో సమస్యల తీవ్రత వల్ల, అనుభవం తగినంత లేకపోవడం వల్ల, అనుభవజ్ఞుల సహకారం అందక, ఉదయం ఆగిపోవడం తెలుగు పత్రికారంగంలో ఒక విషాదఘట్టానికి ఆరంభం. ఆవిషాదానికి కొనసాగింపు ముగింపు దాసరి నిష్క్రమణ. ఆర్థిక ఒడుదొడుకులు లేకుండి ఉంటే స్వేచ్ఛాభిప్రాయప్రకటనా సౌలభ్యం ఉదయం రూపంలో బతికి ఉండేది."
-మాడభూషి శ్రీధర్⁠⁠⁠⁠

11, జూన్ 2017, ఆదివారం

కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ


(చంద్రబాబు మూడేళ్ళ పాలనపై ఈరోజు (08-06-2017) ఆంధ్రజ్యోతి దినపత్రిక (ఏపీ ఎడిషన్) లో నా వ్యాసం)
కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టుగా వుంది
నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మూడేళ్ళ పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సాంఘిక మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి మూడేళ్ళ క్రితం  ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.ఉమ్మడి రాష్ట్రంలో  చేజారిన అధికారాన్ని నూతన రాష్ట్రంలో  తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం  గత మూడేళ్ళుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  సమస్యల అమావాస్యల్లో కూరుకుపోయిన చంద్రుడిగానే వుండిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక చిక్కుముడి ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకముడి విప్పేలోగా మరోటి సిద్ధం. నిజానికి,  ఏ సమర్ధత కారణంగా ఆంధ్ర ప్రాంతపు ప్రజలు ఆయనకు పట్టం కట్టారో ఆ సమర్ధత ప్రస్తుత సమస్యల పరిష్కారానికి పనికి రావడం లేదు. అయినా ఆయన అదృష్ట వంతుడైన రాజకీయ నాయకుడు.  'ఇన్ని ప్రతికూలతల నడుమ ఎవరు మాత్రం ఇంతకంటే ఎక్కువేమి చేయగలరు? కాళ్ళూ చేతులూ బంధించి పరిగెట్టమంటే సాధ్యమా?'  అనే  సానుభూతి మాత్రం జనం నుంచి, ముఖ్యంగా నెటిజన్ల నుంచి  లభిస్తోంది. నిన్ననో మొన్ననో సాంఘిక మాధ్యమాల్లో చంద్రబాబు గురించి ఒక వ్యాఖ్య చదివాను. “ నేను ఎప్పటినుంచో అయన అభిమానిని. అయినా కానీ, మూడో తడవ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనకు నేను మంచి మార్కులు వేయలేను. కానీ ఈ వయస్సులో కూడా  చంద్రబాబుకు ఉన్న పట్టుదల, శ్రమ పడే తత్వం నాకు బాగా నచ్చాయ”న్నది ఆవ్యాఖ్య సారాంశం.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా,  'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి కానీ, రాష్ట్రాన్ని తాను  కోరుకున్న విధంగా అభివృద్ధి చేయడానికి కానీ,  అవసరమైనవి ఏవీ  ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ముందు అందుకే చెప్పింది, కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ మైదానంలో దింపిన చందంగా ఆయన పరిస్తితి వుందని.
అన్ని అవరోధాలను అధిగమించి, 'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరు ఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం'.
స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి ఒక రాజకీయ నాయకుడికి తాను  కోరుకున్న విధంగా రాజధాని నగర నిర్మాణం చేసుకోగల వెసులుబాటు లభించింది. చరిత్రాత్మకమైన ఈ క్రతువును జయప్రదంగా నిర్వర్తించగలిగితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది.
అయితే, ఈ క్రమంలో అన్నీ అవరోధాలే. ఏదీ అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. మూడేళ్ళుగా జరిగింది ఒక్కటే. ప్రజలనుంచి ముప్పయివేల ఎకరాలకు పైగా రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూమిని సమీకరించడం. తాత్కాలిక ప్రాతిపదిక మీద అసెంబ్లీ, సచివాలయాలకోసం శాశ్వత భవనాలను నిర్మించడం. ఇవి మినహా మిగిలిన ఆలోచనలన్నీ కాగితాల వరకే పరిమితం అయ్యాయి. నూతన రాజధాని విషయంలో  కేంద్రం నుంచి ఆశించిన సాయం దొరకడం లేదని పాలకపక్షం వాళ్ళే ప్రతి రోజూ టీవీ చర్చల్లో చెబుతున్నారు. అది నిజం  కాదు,  దోసిళ్ళ కొద్దీ మేము చేస్తున్న సాయం వారి కళ్ళకు కనబడడం లేదాఅని మిత్ర పక్షం బీజేపీ వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ‘ఇంతవరకు ఇచ్చినదింత, ఖర్చు పెట్టినదెంత’ అని లెక్కలు అడిగేవరకూ పోతున్నాయి మిత్ర పక్షాలవాదోపవాదాలు. మొన్నీమధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంద్ర ప్రాంతంలో జరిపిన పర్యటనలో ఈ ధోరణి హద్దులు దాటి మరీ ప్రస్పుటంగా వెల్లడయింది.

రాజధానికి తోడు ప్రత్యేక హోదా అంశం. ఇది రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు అయింది. అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ చేజేతులా ఒదులుకోదు. ఆ పరిస్తితుల్లో టీడీపీ వున్నా అలానే ఆలోచిస్తుంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు  సీమాంధ్రలో నడుస్తోంది.
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్ర సాయం కోరడానికి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్టు టీడీపీ వర్గాలే పలు సందర్భాలలో పేర్కొంటూ వుంటాయి. మూడేళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవిని  చేపట్టినప్పటి నుండి ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలను అనేక పర్యాయాలు చుట్టబెడుతూ వస్తున్నారు. విదేశీ పర్యటనలు సరేసరి. అరవయ్యవ పడిలో పడిన తరువాత కూడా అలుపెరుగని మనిషిలా అలా  తిరుగుతూనే వుండడం చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజు ఒక వూళ్ళో వుంటే రేపు మరోచోట. ఒక రాజధాని అంటూ లేకపోవడం వల్లనే ఈ తిరుగుళ్ళని దవడలు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు.  అయితే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబుది  ఇదే తీరు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా సంబంధిత అధికారులు చేరుకునేలోగానే ఆయన అక్కడ వాలిపోయేవారు.
నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనుఅనే ఈ తరహా ప్రవృత్తి జనంలో ఒకే ఒక్కడురామన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా అనేది సిబ్బంది వాదన.
పదేళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబుకు తాను చేసిన పొరబాటు ఏమిటో  అర్ధం అయినట్టుంది. 2014 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు, తాను మారానని, మారిన మనిషిని అని.
కానీ అధికార పగ్గాలు మళ్ళీ చేతికి అందగానే తిరిగి పూర్వపు అలవాట్లే! ప్రభుత్వ సిబ్బందికి వెనుకటి అగచాట్లే. ఆయన నిద్ర పోవడం లేదు, సిబ్బందిని నిద్ర పోనివ్వడం లేదు.
రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నాఏ లెక్కన చూసినా ఇప్పటి రాజకీయ నేతల్లో  ఆయనే సీనియర్. ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రాజకీయ అనుభవం సరేసరి. ఇంత  అనుభవం వుండి కూడాయావత్ ప్రజానీకానికి  సంబంధించిన  కొన్ని అంశాలపైముఖ్యంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం  వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపైకేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించిఆలోచించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే   ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు. అదే ఆయన్ని మళ్ళీ రాజకోవిదుడి పాత్ర నుంచి రాజకీయ వేత్తగా మార్చిందేమో కూడా తెలవదు.
మారిన రాజకీయ పరిస్తితులు ఆయన్ని అలా మార్చి వుంటాయి. చేజారినది అనుకున్న అధికారం గత ఎన్నికల్లో చేతికి వచ్చింది. చేజార్చుకున్న జగన్ పార్టీకి, చేజిక్కించుకున్న టీడీపీకి నడుమ ఓట్ల శాతం అతి తక్కువ అని తెలియని మనిషేమీ కాదు చంద్రబాబు.
ఈ కారణమే బహుశా ఆయనలోని రాజకీయ నాయకుడ్ని మేలుకొలిపి వుంటుంది. రాజకీయాల్లో ఉచితానుచితాలు చూడరు. అదే జరుగుతోంది.
రాజకీయ అనివార్యతలు రాజకీయ నాయకులకు తప్పనిసరి తలనొప్పులు. నిజమే. కానీ, అవి తలకు చుట్టుకోకుండా  చూసుకోవాలి.
మూడేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన పనులకన్నా చేయాల్సినవే ఎక్కువ కనబడుతున్నాయి. చేసినవి కూడా అరకొరే అనే విమర్శలు వినబడుతున్నాయి. ఆయనలోని సమర్ధుడికి సవాలు విసురుతున్నాయి. ఆ సమర్ధతను చూసి పట్టం కట్టిన వారిలో అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రభుత్వానికి ప్రజలు కొమ్ము కాస్తున్నట్టు కనబడడానికి వేరే కారణాలు వున్నాయి. విభజన  జరిగిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజానీకంలో కొంత అసహనం, ఆవేదన ఉన్నమాట వాస్తవం. ఒకరకంగా చెప్పాలంటే విభజనకు పూర్వం, 1956 లో ఆంద్ర, నిజాం సంస్థానాలను విలీనం చేస్తూ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దాదిగా మెజారిటీ తెలంగాణా ప్రజల్లో ఈ విధమైన  అసహన భావజాలమే బలపడుతూ వచ్చింది. ఆ ప్రాంతీయ భావమే టీ. ఆర్.యస్. పార్టీకి, దాని నాయకుడు కేసీఆర్ కు వరప్రసాదంగా మారింది. భావోద్రేకంతో కూడిన ఆ అంశం ముందు మిగిలిన అంశాలన్నీ వెలతెలా పోయాయి.అలాగే  ప్రస్తుతం సీమాంధ్రలో కూడా దాదాపు అదే పరిస్తితి. తమ ఈ స్తితికి వేరెవరో కారణం అనే భావనలో వున్నారు. ప్రజల నాడిని ఒడిపోసిపట్టుకోగల నైపుణ్యం చంద్రబాబు సొంతం. ‘ఏం చేసినా ఏం చేయకున్నా ఈ ఒక్క భావోద్రేకం చల్లారకుండా చూసుకుంటే చాలు’ అనే నిర్ధారణకు వచ్చినట్టుంది. అందుకే పదేపదే అవసరం వున్నా లేకపోయినా విభజన  ప్రస్తావన తీసుకువస్తున్నారు. మొన్నటికి మొన్న నవ నిర్మాణ దీక్ష ప్రసంగంలో కూడా  విభజన జరిగిన జూన్ రెండో తేదీని ‘చీకటి దినం’గా చంద్రబాబు అభివర్ణించడం గమనార్హం. అదే రోజు, మరో వైపు పండగ జరుపుకుంటున్న తెలంగాణా ప్రజలకు ఇలాంటి మాటలు సహజంగానే ఖేదాన్ని కలిగిస్తాయి. అదే జరిగింది కూడా. ఆ వైపునుంచి టీ ఆర్ ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో పాటు ఎదురు దాడికి కూడా  దిగారు.
ఏది ఏమైనా పాలకులు ఒక విషయాన్ని  గుర్తు పెట్టుకోవాలి. ప్రాంతీయ వైమనస్యాలు  రాజకీయంగా ఉపయోగపడవచ్చు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికం. పైగా ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల ప్రజల నడుమ మరిన్ని అంతరాలను, అనుమానాలను  పెంచే ప్రమాదం కూడా వుంటుంది. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతున్న రోజుల్లో హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రుల అనుభవించిన మానసిక వేదన తెలిసిన వారికి ఈ పెడ ధోరణుల పర్యవసానాలు కూడా తెలిసే వుండాలి.     

చంద్రబాబు అభిమానులకు ఆయన చేస్తున్నది సబబే అనిపిస్తుంది. అది సహజం కూడా.
కానీ గతంలో ఆయనలో ఒక  పరిణతి  చెందిన రాజకీయవేత్తను చూసిన వారికి మాత్రం అలా అనిపించడం లేదు.        
ఎంతో చేస్తున్నాం, ఇంకెంతో  చేస్తాం’ అనే దగ్గరే ఆగిపోతున్నారేమో అనిపిస్తోంది.  
మూడేళ్ళు గడిచిపోయాయి. ఇంకా రెండేళ్ళే సమయం వుంది.
దిద్దుకోవడానికయినా, సరిదిద్దుకోవడానికయినా  మిగిలింది కొద్ది  వ్యవధానం మాత్రమే!
ఆయనలోని ‘సమర్ధ రామదాసు’కు అసలు సిసలు పరీక్ష మొదలయింది.
Image may contain: 1 person, smiling

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595

8, జూన్ 2017, గురువారం

ఆకాశవాణిలో డి. వెంకట్రామయ్య అనుభవాలు

నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను అభిమానించే ఈ  కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో! 
వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం. 
రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్లో - తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో  ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.
నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోటపనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా, నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే, అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాధాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో, పరిచయస్తులనో, మొహమాటపడిపోయి  వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో, వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు. వార్తల విషయంలో ఎటువంటి మడులూ, దడులూ కట్టుకోకుండా, ఎటువంటీ దడుపూ లేకుండా నిర్భయంగా,  స్వేచ్చగా రేడియో వార్తలు ఇచ్చే నేను ఒక్క వెంకట్రామయ్య గారి విషయంలో కాస్త వెనుకా ముందూ చూడడానికి కారణం ఆయనలోని ఈ నిబద్దతే.  

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు,
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు,
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి,
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని, పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా  ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం'పేరుతోనో (కార్మికుల కార్యక్రమం లో రాంబాబు) రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని, (రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయిస్తున్న రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు.
కాకపోతే, రచన సాయి గారి పుణ్యమా అని ఆయన రాసిన రేడియో అనుభవాలను ఎమెస్కో వారు ఒక పుస్తకంగా వేశారు. సంతోషం.
చక్కటి విషయాలు, ఎవరికీ తెలియనివి అనేకం రాసారు. మరింత సంతోషం.
ఈ పుస్తకాన్ని ఏకబిగువున చదివినప్పుడు చాలా మంచి పుస్తకం అనిపించక తప్పదు. అయితే  అదే సమయంలో స్వోత్కర్ష కొంత మోతాదు మించింది అనే అభిప్రాయం కూడా కలగక తప్పదు. తనని తాను  ఎలివేట్ చేసుకునే క్రమంలో కొందరు రేడియో సహోద్యోగులను చిన్న చూపు చూసారా అని కూడా కొండొకచో అనిపించక మానదు.
నిర్మొహమాటంగా వుండడం తన సహజ లక్షణమని నమ్మే వెంకట్రామయ్య గారు నా ఈ విమర్శను సరయిన రీతిలో స్వీకరిస్తారనే నమ్మకం నాకు  వుంది.