20, జనవరి 2017, శుక్రవారం

శ్వేతసౌధం నుంచి ‘నల్ల సూరీడు’ నిష్క్రమణ

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 22-01-2017, SUNDAY)

యావత్ ప్రపంచానికి అధికార కేంద్రంగా చెప్పుకునే అమెరికాలో భారత కాలమానం ప్రకారం జనవరి ఇరవయ్యవ తేదీ, శుక్రవారం రాత్రి పదిన్నర గంటలకు అధికార మార్పిడి జరిగింది. సంచలనాలకు మారు పేరుగా మారిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి మిసెస్ హిల్లరీ క్లింటన్ పై అనూహ్య విజయం సాధించిన దరిమిలా ఆ దేశంలో ఒబామా నేతృత్వంలో సాగుతున్న ఎనిమిదేళ్ళ పాలనకు తెర పడింది. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నవంబరులో ముగిసి ఫలితాలు వెల్లడి అయినప్పటికీ, కొత్త అధ్యక్షుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు స్వీకరించడం మాత్రం జనవరిలోనే జరగాల్సివుంటుంది. ఆ ప్రకారమే  ప్రజలు ఎంపిక చేసుకున్న కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20వ తేదీన శ్వేతసౌధంలో అడుగు పెట్టారు. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయి, అదే  భవనంలో నివాసం వుంటున్న ప్రెసిడెంట్  బరాక్  ఒబామా ఒక సాధారణ పౌరుడిగా వైట్ హౌస్ నుంచి బయటకు అడుగు పెట్టారు.
రెండు పర్యాయాలు, అంటే  మొత్తం ఎనిమిది సంవత్సరాలు అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవిలో వుంటూ, ఆ దేశపు రాజ్యాంగం ప్రకారం పదవినుంచి తప్పుకుంటూ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన సాంప్రదాయ  వీడ్కోలు ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారం పొందింది.  ఈ సందర్భంగా ఒబామా,  తన పదవీ కాలంలో సాధించిన విజయాలను, చేయాలని గట్టిగా అనుకుని కూడా చేయలేని కొన్ని  పనులను ఏకరవు పెట్టారు. ఉద్వేగం ఆపుకోలేక  ఒక దశలో కంట తడిపెట్టారు కూడా.  

      
వర్ణ వివక్ష మూలాలు కలిగిన  అత్యంత సంపన్న దేశానికి ఒబామా  ఎనిమిదేళ్ళు తిరుగులేని అధినేతగా వున్నారు. కంటి చూపుతో ప్రపంచ దేశాలను శాసించగల అపరిమిత అధికారాలను అనుభవించారు. జన్మతః ఆఫ్రికన్ అమెరికన్  అయిన ఒబామా అమెరికా  దేశాధ్యక్షుడు కాగలిగారంటే అది అమెరికన్ల  ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతుంది. అయితే, ఒబామా తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికన్ సమాజంలో ఈనాటికీ అవశేషాలుగా మిగిలివున్న జాత్యహంకార ధోరణులను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
సాధారణంగా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన వారు ఆ పదవిని వీడిపోయే సమయానికి ఏదో ఒక విధమైన ఆరోపణల మరకలు అంటించుకోవడం పరిపాటిగా మారిన అమెరికాలో ఈ నల్ల సూరీడు మాత్రం  ఎటువంటి మచ్చా లేకుండా పదవీ విరమణ చేయడం ఆయన వ్యక్తిత్వ శోభని తెలియచెప్పుతుంది. అమెరికా అధ్యక్షులగురించి గతంలో  అనేక రకాల ఆరోపణలు, అధికార దుర్వినియోగం, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కధనాలు, ఊహాగానాలు  వెలువడిన ఘన చరిత్ర కలిగిన ఆ దేశంలో ఒబామా మాత్రం పులుకడిగిన ముత్యంలా పదవికి గుడ్ బై చెప్పడం విశేషం. ఒబామా కానీ, ఆయన భార్యాపిల్లలు కానీ నలుగురి నోళ్ళలో నానే విధంగా వైట్ హౌస్ లో ఏనాడూ ప్రవర్తించలేదు. మాటా మన్ననా వారి వ్యక్తిత్వ శోభని మరింత పెంచాయి. 
అభిజాత్య అమెరికన్ సమాజంలో అధికారం కూడా తోడయితే ఆ వ్యక్తుల ప్రవర్తన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఈ సాధారణ అభిప్రాయానికి భిన్నంగా ఆయన అసాధారణ రీతిలో తన నడవడికను ప్రదర్శించి అమెరికా అధ్యక్షులు ఇలాగా కూడా వుంటారు అని నిరూపించారు. ఎనిమిదేళ్ళ పదవీ కాలంలో ఇలాటి సందర్భాలు, సన్నివేశాలు కొల్లలుగా కనిపిస్తాయి.
మచ్చుకి కొన్ని.
నిజమా! నిజంగా నిజమని నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగానే  జరిగింది. ప్రెసిడెంట్ ఒబామా స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం  బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే-
ఒకసారి న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా వాషింగ్టన్ నుంచి బయలుదేరి ఆ నగరం వెళ్ళారు. అక్కడ గడిపిన రోజుల్లో  ఓ రోజు వీలుచేసుకుని హోటల్లో భోజనం చేయడానికి  భార్యను వెంటబెట్టుకుని వెళ్ళారు. అమెరికా ప్రెసిడెంటు ఏమిటి? హోటల్లో భోజనం ఏమిటి? అనే సన్నాయి నొక్కుళ్ళు మనదేశంలోనే.
సరే! హోటల్లో దంపతులిద్దరూ  మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్  కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ క్రెడిట్  కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు.   పక్కన భార్య వుండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. అయితే ఈ వ్యవహారం వెంటనే బయటకు పొక్కలేదు. తరువాత ఎప్పుడో  ఒక  మీటింగులో మాట్లాడుతూ ఒబామా మహాశయులే మాటవరసకు అన్నట్టు ఈ మాట బయటపెట్టారు. క్రెడిట్ కార్డ్లు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం  మీడియాలో గుప్పుమంది.
బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా  అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది – 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు ఆ దేశం గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ వోటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. శ్వేత జాతీయులకు వర్ణ వివక్ష ఎక్కువ అనే అపప్రదని సమూలంగా తొలగించుకుంటూ అమెరికా దేశీయులు బరాక్ హుస్సేన్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఎంతగానో పులకించిపోయింది. వొంటి రంగు మూలంగా పాశ్చాత్య దేశాలలో అదేమాదిరి వివక్షను ఎంతోకొంత ఎదుర్కొంటున్న భారతీయులు సయితం ఒబామా విజయాన్ని తమ గెలుపుగా భావించి పండగ చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి  ముందూ, ఆ తరువాతా నేను క్రైస్తవుడినేఅని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత టర్కీలో జరిపిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

అలాగే మరొక  స్వానుభవం.
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఒబామా  ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం.
ఉపశృతి:
అమెరికా నలభయ్ అయిదవ అధ్యక్షుడిగా పదవిని స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్, ఎనిమిదేళ్ళ తరువాత శ్వేతసౌధం వీడిన బరాక్ ఒబామా, వీరిద్దరికీ తమ భార్యల గురించి వింతయిన అభిప్రాయాలు వున్నాయి.  ఇటువంటి సరదా వ్యాఖ్యలు సరదాగా చేస్తారు కాబట్టి వాటిని సరదగా తీసుకుంటే ఏ ఇబ్బందీ వుండదు. 
రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్
మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”- బరాక్ ఒబామా



కామెంట్‌లు లేవు: