8, డిసెంబర్ 2016, గురువారం

ఆలోచనాలోచనం


కాస్తో కూస్తో చదువుకున్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, చిరు ఉద్యోగం నుంచి పెద్ద కొలువులు చేస్తున్నవారు, నిరుద్యోగులు,  బ్యాంకర్లు, లాయర్లు, లెక్చరర్లు, జర్నలిష్టులు, పండితులు, గృహిణులు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అపారమైన జీవితానుభవం కలిగిన వయోవృద్ధులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు దర్పణం ఈ ఫేస్  బుక్. ఒకరకంగా మనం జీవిస్తున్న ప్రపంచానికి ఒక మీనియేచర్. బయట వుండే అభిమానదురభిమానాలు, ప్రేమలు, ఆప్యాయతలు, స్నేహాలు ఇక్కడ కూడా తొంగిచూడడం వింతేమీ కాదు. అయితే అవి హద్దులు దాటినప్పుడే ఇబ్బంది.
చిన్నప్పుడు సినిమా పోస్టర్లకు దండలు వేసేవాళ్ళు. ప్రత్యర్ధులు వాటి  మీద పేడ కొట్టేవారు. అభిమానం, దురభిమానం పెడదారి పడితేనే  ఇటువంటి విపరీత పోకడలకు దారి తీస్తాయి. వేములపాటి మాధవి గారు ఈ విషయంలో వెలిబుచ్చిన ఆవేదన దీనికి ప్రేరణ.
మనలో ఎవరికీ మోడీతో పరిచయం లేదు. రాహుల్ ఎవరో తెలియదు. చంద్రబాబు, చంద్ర శేఖర రావులతో ముఖ పరిచయం కూడా లేదు. జగన్ మోహన రెడ్డితో గట్టు తగాదాలు లేవు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీలకి నాయకులు. రాజకీయంగా అనేక మాటలు అనుకుంటారు. సిద్దాంతాలు, సూత్రాలకు సంబంధించి ఏదైనా మాట్లాడుకున్నా, వ్యాఖ్యానించినా తప్పుపట్టడానికి లేదు. వ్యక్తిగతమైన నిందలు, ఆరోపణలు అనవసరమైన మానసిక గ్లాని కలిగిస్తాయి.
అలాఅని మడిగట్టుకుని కూర్చోమని చెప్పడం లేదు. చేసే విమర్శలు హుందాగా వుండాలి. చేసే  వ్యాఖ్యలు ఏం చెప్పారురా అనేట్టు వుండాలి. మరోసారి, మరోసారి చదివించేట్టుగా వుండాలి. ఎంతోకొంత జ్ఞానాన్ని సముపార్జించుకునేలా వుండాలి.
పరవాలేదు, ఈరోజు నా స్నేహితుల నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను, ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, మరపున పడ్డ ఒక గొప్ప సంగతి గుర్తు చేసుకున్నాను, రాస్తున్న దానిలో, చెబుతున్నదానిలో ఎక్కడ తప్పు దొర్లిందో స్నేహితుల నుంచి తెలుసుకుని సరిదిద్దుకోగలిగాను అనే విధంగా  మనసుకు హాయినిచ్చే భావనతో ఒకరోజు గడపగలగడం నిజంగా ఎంతటి అదృష్టం.

ఈ అవకాశం అందించిన జుకర్ బర్గ్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలా! ఎందుకయ్యా ఈ బ్రహ్మ రాక్షసిని మాకు కట్టబెట్టావు అని నిందవేయాలా!            

కామెంట్‌లు లేవు: