30, నవంబర్ 2016, బుధవారం

భయమా! గౌరవమా!


పూర్వం సినిమాహాళ్ళలో విధిగా జాతీయ గీతం వేసేవాళ్ళు. జనం అందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడేవారు. ఆ తరువాత అ పద్దతికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు సుప్రీం ఆదేశం అంటున్నారు. చూడాలి.
వెనుక మాస్కోలో వున్నప్పుడు ఒక జోక్ చెప్పుకునేవారు (పెరిస్త్రోయికా కాలంలో)
సోవియట్ యూనియన్ లో స్టాలిన్ హవా నడిచేరోజుల్లో ప్రతి సినిమా హాల్లో ఆటకు ముందు స్టాలిన్ బొమ్మ వేసేవాళ్ళు. వెంటనే జనం అందరూ లేచి సాల్యూట్ చేసేవాళ్ళు.
ఒకరోజు స్టాలిన్ సినిమాకి వెడితే యధాప్రకారం జనం నిలబడి సాల్యూట్ చేశారు. అది తనే కనుక స్టాలిన్ నిలబడలేదు. గర్వంగా పక్కవాడితో అన్నాడు.
“స్టాలిన్ అంటే అంత గౌరవమా!” అని.
చీకట్లో గుర్తుపట్టలేదు కాబోలు జవాబు ఇలా వచ్చింది.

“గౌరవమా పాడా! భయం. నిలబడకపోతే సైబీరియా మంచు ఎడారుల్లో ఒదులుతాడు ఆ  పాపిష్టోడు.”     

మంచికోసం అయితే మార్పు మంచిదే!


స్వాతంత్రం  వచ్చిన  పదేళ్లకు 1957 లో దేశంలో డెసిమల్ పద్దతిలో కొత్త నాణేలను ప్రవేశ పెట్టారు. మా చిన్న తనంలో తళతళ మెరిసే నయా పైసాలు వచ్చాయి. జనాలకు కొత్త నాణేలు  అలవాటు అయ్యేవరకూ అప్పటివరకు చెలామణీ లో వున్న అర్ధరూపాయలు, పావలాలు, బేడలు, అణాలు,అర్ధణాలు, కాణీలు, చిల్లు కాణీలను కూడా చెలామణీ లోనే ఉంచారు. కాలక్రమంలో అవి కనుమరుగయిపోయాయి. అలాగే తూకాలకు వాడే  వీసెలు, తులాల  స్థానంలో కిలోగ్రాములు, శేర్లు, గిద్దెల స్థానంలో లీటర్లు రంగప్రవేశం చేసాయి. దూరాలకు వాడే మైలురాళ్ళ కొలమానాన్ని కిలోమీటర్లు ఆక్రమించాయి. అప్పటికి దేశంలో నూటికి తొంభయి శాతం జనాభా అంగుష్ఠ మాత్రులు. అంటే నిశానీదారులు. వేలి ముద్ర తప్ప సంతకం చేయడం కూడా రాని నిరక్షరాస్యులు. అయినా మార్పును సంతోషంగా ఆహ్వానించారు. ఎలాటి ఇబ్బందీ లేకుండా అలవాటు పడ్డారు.
స్వతంత్ర భారతంలో వచ్చిన మరో గొప్ప మార్పు ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడడం. వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. మొదట్లో పోటీలో వున్న ప్రతి పార్టీకీ (అభ్యర్ధికీ) ఒక్కో గుర్తు కేటాయించేవారు. కాంగ్రెస్ పార్టీకి  కాడి జోడెడ్లు, కమ్యూనిష్టులకు కంకీ కొడవలి, సుత్తీ కొడవలి ఇలా. ప్రతి గుర్తుకూ విడివిడిగా బ్యాలెట్ బాక్సులు ఉండేవి. ఖాళీ కిరోసిన్ డబ్బాలకు కాగితం అంటించి దానిపై పార్టీ గుర్తు అతికించే వారు. తరువాత ప్రతి డబ్బాను తెరిచి ఓట్లు లెక్కబెట్టి ఫలితం ప్రకటించేవాళ్ళు. దరిమిలా బ్యాలెట్ పత్రాలు వచ్చాయి. అభ్యర్దులందరి పేర్లు ఒకే బ్యాలెట్ పై వుండేవి. తరువాత పేర్లు కూడా తీసేసి కేవలం గుర్తులు మాత్రమే ఉంచేవాళ్ళు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటువేసిన తరువాత దాన్ని బ్యాలెట్ పెట్టెలో వేసేవాళ్ళు. ఆ తరువాత ఎలక్ట్రానిక్  ఓటింగ్ మిషన్లు వచ్చాయి. ఓటర్లలో అధిక శాతం నిరక్షరాస్యులు అయినప్పటికీ కాలం తెస్తున్న మార్పులకు బాగా అలవాటుపడ్డారు. కొత్త విషయాలను సులువుగా గ్రహించడానికి చదువు అక్కరలేదని నిరక్షర భారతం పలుపర్యాయాలు నిరూపించి చూపింది.
ఇంతేనా అంటే ఇంకా వుంది.
పూర్వం టూరింగు టాకీసుల్లోనే కాకుండా, మంచి సినిమా థియేటర్లలో కూడా జనాలు చుట్టలు, బీడీలు, సిగరెట్లు తాగేవాళ్లు. పొగతాగరాదు అని స్లయిడ్లు వేసేవాళ్ళు కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. తరువాత ఎయిర్ కండిషన్  ధియేటర్లు వచ్చాక సినిమా హాల్లో పొగతాగ కూడదు అనే సంగతిని సామాన్య జనం ఒకరిని చూసి మరొకరు నేర్చుకున్నారు. జరిమానాలు, శిక్షల బెదిరింపుల వల్లకాదు. అంటే ఏమిటి? మార్పును ఆహ్వానించే తత్వం జనంలోనే  వుంది. వాళ్ళు మార్పుకు ఏనాడు వ్యతిరేకులు కాదు.
ఇప్పుడు డబ్బు మార్పిడికి సెల్ ఫోన్లు వాడమంటున్నారు. తప్పకుండా వాడుతారు. అయితే ఇంతకు  ముందు చెప్పిన వాటికీ దీనికీ ఓ స్థూలమైన తేడా వుంది. అవి జనం చేతులో వున్నాయి. ఇదలా కాదు. ఇంటర్నెట్ అవసరం. అదీ ఎలాంటి అవాంతరాలు లేకుండా.
నెట్ ఉపయోగించడానికి జనం సిద్ధంగానే వున్నారు. అయితే నెట్ అందరికీ అందుబాటులో ఉందా అనేదే అసలు ప్రశ్న.     

ఏలికలు సమాధానం చెప్పాలి.

29, నవంబర్ 2016, మంగళవారం

నాకు పరిష్కారం దొరికింది. కానీ......


ఇరవై ఒక్క రోజుల అనుభవం నన్ను కాస్తో కూస్తో ‘నెట్’ అక్షరాస్యుడిని చేసింది. పిల్లల సాయంతో మొత్తానికి నా బ్యాంకు ఖాతాను నా మొబైల్ ఫోనుతో అనుసంధానం చేయగలిగాను. ఊబెర్ అనాలో ఒబెర్ అనాలో ఏదైతేనేం ఒక కారు బుక్ చేసి దిగాల్సిన చోట దర్జాగా దిగిపోయాను. జేబులో చేయి పెట్టేపని లేకుండానే ట్రాన్సాక్షన్ చిటికెలో జరిగిపోయింది. దిగుతూ డ్రైవర్ మొహంలోకి చూసాను. దిగాలుగా వున్నాడు. కదిలిస్తే కధ చెప్పాడు.
“పెద్ద నోట్ల రద్దుకు పూర్వం అందరూ టాక్సీ ఫేర్ చెల్లించి దిగి పోయేవాళ్ళు. ఇప్పుడందరూ ఇలా పే చేసేసి  వెళ్ళిపోతున్నారు. వెనక డీసెల్ కొట్టించుకోవడానికి పాసింజర్లు ఇచ్చే పైకం డబ్బులు ఉండేవి. ఇప్పుడా డబ్బులు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. డ్రా చేసుకోవాలంటే ఓ పూట పనిపోతోంది. పెట్రోలు బంకుల్లో మాకు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. చేసారేమో తెలవదు. ‘చేతుల్లో ఎప్పుడూ  స్మార్ట్ ఫోన్లు వుంటాయి, ఈ మాత్రం తెలవదా’ అంటే తెలవదు సారూ”  

ఏం చెప్పను? నాదీ అదే పరిస్తితి.

28, నవంబర్ 2016, సోమవారం

ఫస్ట్ కామెంట్


పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, కొద్దిసేపటి క్రితం ముగిసిన  విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు గమనిస్తే, ఆర్ధిక గణాంకాలను ఆశువుగా పేర్కొన్న తీరును పరిశీలిస్తే  ఆయన ఈ అంశంపై చాలా కసరత్తు చేసినట్టు,  సంపూర్ణ అవగాహనతో వున్నట్టు మొదటి అభిప్రాయం కలుగుతుంది.
ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అధికారికంగా ఓ పక్క ప్రకటిస్తూనే మరో పక్క వినయపూరితమైన హెచ్చరిక చేశారు.
“నూటికి నూరు శాతం అవినీతి రహిత, వందకు వంద శాతం నల్ల ధనం రహిత భారతం లక్ష్యంగా ఈ పధకం అమలు జరగాలి. అప్పుడే ఇది సఫల ప్రయోగం అనిపించుకుంటుంది. లేదా విఫల ప్రయోగం అనే అపప్రధను మోయాల్సి వుంటుంది. అలా జరగడం జాతికి మేలు చేయదు” అని స్పష్టంగా చెప్పారు.

ఈ నిర్ణయం అమలు పర్యవేక్షణకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నేతృత్వం అప్పగించడం పై అడిగిన ప్రశ్నకు ‘మంచిదేగా’ అంటూ ఇచ్చిన కేసీఆర్ సమాధానం హుందాగా వుంది.   

జంధ్యాల దటీజ్ జే.వి.డి.ఎస్. శాస్త్రి


మితృడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు, కీర్తిశేషులు జంధ్యాల అపురూపమైన ఫోటో (ఆయన అసలు పేరు జే.వి.డి.ఎస్. శాస్త్రి, జంధ్యాల అనేది ఇంటి పేరు)



Photo Courtesy: Shri Kusuma Mohanrao Kilaru

అర్ధం చేసుకోరూ......


ఏకాంబరం, లంబోదరం మాట్లాడుకుంటున్నారు. వీళ్లిద్దరిదీ రైలు పట్టాల సంభాషణ. సమాంతరంగా పోతుంటాయి కానీ ఎన్నటికీ కలవ్వు.
ఏకాంబరం: డాక్టరు రోగికి ఆపరేషన్ చేస్తున్నాడు. నొప్పి తెలియకుండా మత్తు మందు ఇచ్చాడు. రోగి స్పృహలోకి రావడానికి కొంత నిర్దిష్ట వ్యవధి వుంటుంది. అతడికి మెలకువ వచ్చేవరకు రోగి బంధువులు గాభరా పడుతుంటారు కానీ, విషయం తెలిసిన వైద్యుడు ఏమాత్రం కంగారు పడడు. అంతా అర్ధం చేసుకోవడంలో వుంది.

లంబోదరం: నిజమే. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేశాడు. డోసు సరిగా కుదరాలి. లేకపోతే, ఆపరేషన్ సక్సెస్ అయినా రోగి ఆమత్తునుంచి తేరుకోకుండానే కన్ను మూస్తాడు. అలా జరుగుతుందనే ఈ కంగారు. అర్ధం చేసుకోమనే నేను చెప్పేది.

27, నవంబర్ 2016, ఆదివారం

పబ్లిక్ పల్స్

“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? జనం ఏమనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబే కావాలనుకుంటున్నారా? జగన్ రావాలనుకుంటున్నారా? చంద్ర బాబు పధకం పారుతోందా?” అనే పలు ప్రశ్నలకు తాము జరిపిన సర్వేలో వెల్లడయిన సమాధానాలను  రేపటి నుంచి అందించబోతున్నట్టు ఒక పత్రిక నేడు ప్రకటించింది.
‘ఆ పత్రిక  పాలసీ  తెలిసినదే కాబట్టి జవాబులు ఎలా వుండబోతున్నాయో తెలుసుకోవడానికి రేపటివరకు ఆగక్కరలేద’ని వాట్స్ ఆప్ లో ఒక అభిప్రాయం చక్కర్లు కొడుతోంది. మరో పత్రిక ఇదే రకమైన సర్వే చేస్తే పబ్లిక్  పల్స్ మరో రకంగా వుంటుందని ముక్తాయింపు ఇచ్చారు కూడా!

సర్వేల మీద జనం నమ్మకం తగ్గిపోతోందా! పత్రికల మీద విశ్వాసం సడలిపోతోందా!!  
ఇది తెలుసుకోవడానికి ఇంకో సర్వే అవసరమవుతుందేమో!
సర్వే జనా సుఖినోభవంతు  

26, నవంబర్ 2016, శనివారం

నాణేనికి అటూ ఇటూ

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 27-11-2016, SUNDAY) 

పూర్వం పల్లెటూళ్ళలో దుకాణాల ముందు “నగదు నేడు, అరువు రేపు” అనే బోర్డులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా తలెత్తిన కరెన్సీ కటకటల కారణంగా దాన్ని కొద్దిగా మార్చి, “అరువు నేడు, నగదు రేపు” అని బోర్డులు పెట్టాల్సి వస్తుందేమోననే ఓ చమత్కారం సాంఘిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కాస్త ఉత్ప్రేక్షాలంకారం పాలు ఎక్కువై వ్యాఖ్యలో ఘాటు పెరిగినట్టు అనిపించినా ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు.       
నూట పాతిక కోట్ల జనాభాలో అత్యధికులు పేదవారు అవడం మూలాన దేశంలో  డబ్బు అవసరం కలిగిన వారి సంఖ్య ఎక్కువగా వుండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అవసరం వేరు, కటకటపడడం వేరు అని  గత రెండువారాల పైచిలుకు అనుభవం తెలుపుతోంది. బ్యాంకుల్లో దాచుకున్న తమ డబ్బును తీసుకోవడానికి గంటల గంటల పాటు క్యూలల్లో నిలబడి యాభయ్ మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు  ప్రస్తుత పరిస్తితిలోని తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కదా, అవి అలానే వ్యవహరిస్తాయి, అది సహజం కూడా.
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఈ విషయంపై  విరామం లేకుండా జరుగుతున్నచర్చోపచర్చల్లో ఒక విషయం మాత్రం తెలిసొచ్చింది, అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదని.
ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి ప్రధాని మోడీ ప్రసంగం తయారు చేసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ( అసలా నిర్ణయం ప్రధాని కాకుండా రిజర్వ్ బ్యాంక్  అధికార ప్రతినిధిచేత   ప్రకటించి వుంటే మరింత బాగుండేది, అలా చేస్తే  దీనికి రాజకీయ రంగు అంటివుండేది కాదన్నది ఒక వాదన. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్  కూడా నోట్ల రద్దు ప్రకటన బాధ్యతను అధికారులకే ఒదిలి వేసిన విషయాన్ని ఈ  ‘వాదకులు’ గుర్తు చేస్తున్నారు)
సరే! ప్రకటన ప్రధానమంత్రి మోడీ స్వయంగా చేశారు. అందులో కొంపలు మునిగేది ఏమీ వుండదు.  కాకపొతే దాన్ని ఆయన తన తరహాలో కాకుండా ఒక  అధికారిక ప్రకటన మాదిరిగా రాసుకొచ్చి చదివి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వుంది. అలానే ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం మాదిరిగా కాకుండా  క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించి వుండాల్సింది. నల్ల కుబేరులపై యుద్ధ ప్రకటనకు మరో అవకాశం వినియోగించుకుని వుండాల్సింది. తన ప్రసంగంలో ప్రధాని  మోడీ “ఉగ్రవాదుల చేతుల్లో భారత కరెన్సీ” అనే  మరో విషయాన్ని కూడా  ప్రస్తావించారు. అందువల్ల దేశ భద్రతకు యేర్పడ బోతున్న ముప్పు, వీటి  కారణంగా ఈ హఠాత్ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పిన  ప్రధాని ఆ అంశానికే  ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వుంటే, యావత్  దేశ ప్రజల దృష్టి అటు మళ్ళివుండేది. (నల్ల కుబేరులపై యుద్ధం అంటూ ఓ పక్క చెబుతూ ఆ నోటితోనే  రెండువేల కొత్త నోటు తెస్తున్నట్టు  చెప్పేసరికి అసలు  విషయం జావకారి పోయింది, లేనిపోని అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టయింది.)
ప్రధాని తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించి, గత పన్నెండు రోజులుగా తీసుకుంటున్న అనేకానేక ఉపశమన చర్యలు గురించి ఆ రోజే ప్రస్తావించి వుంటే సామాన్య ప్రజల మనస్సుల్లో ఇంత గందరగోళం ఏర్పడి వుండేది కాదు. ప్రకటన దరిమిలా  మీడియాలో వస్తున్న  వార్తల ఆధారంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త  నిర్ణయాలు ప్రకటిస్తూ, సవరిస్తూ పోవడం గమనించిన వారికి ప్రభుత్వం  చేసిన తప్పులు (పొరబాట్లు అనాలేమో) దిద్దుకుంటూ పోతోందన్న అభిప్రాయం కలిగింది. సరయిన విధంగా ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయిందన్న ఆరోపణలకు ఆస్కారం వుండేది కాదు.  నిర్ణయాన్ని సమర్ధించిన వారే  అమల్లో లోపాల గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరమూ వచ్చేది కాదు. చర్చలు ఇంత సుదీర్ఘంగా జరిగేవీ కావు, ఇంత రచ్చ జరిగేదీ కాదు.
సరే! జరగాల్సింది  జరిగిపోయింది. నిర్ణయం  వెనక్కి తీసుకునే వీలులేదు. తడబడ్డ కాలునే  కూడదీసుకోవాలి. పైపంచ గాలికి యెగిరి ముళ్ళకంచెపై పడినప్పుడు అది చిరిగిపోకుండా జాగ్రత్తగా బయటకి తీయాలి. దీనికి చాలా సంయమనం కావాలి. మనసు నిగ్రహంగా వుంచుకోవాలి. రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కునే క్రమంలో, ఆవేశకావేశాలతో తీసుకునే నిర్ణయాలు, వ్యాఖ్యలు  మరింత గందరగోళానికి దారితీస్తాయి. ఇది మోడీ అభిమానులకీ, దురభిమానులకీ, వ్యతిరేకులకీ కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంలో నిజంగా ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం కానీ, ఎవరినీ భయపెట్టాల్సిన అగత్యం కానీ వుండదు.
ఇప్పుడు బంతి పూర్తిగా  సర్కారు దగ్గరే వుంది. అది స్పష్టంగా కానవస్తోంది.
పొతే, మోడీ ప్రభుత్వ నిర్ణయం గురించి అనుకూలంగా, ప్రతికూలంగా ప్రతిరోజూ అనేక వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏ నిర్ణయం కూడా నూటికి నూరుపాళ్ళు సరయినదని చెప్పే వీలులేదు. అలాగే ప్రతి నిర్ణయాన్నీ తప్పులతడకగా కొట్టేయడం కూడా  సబబు కాదు. ఈ రెండు వాదనలు అర్ధసత్యాలే. అది వివరించడానికే ఈ ప్రయత్నం. ముందు అనుకూలుర వాదన విందాం.
 “పెద్ద నోట్ల రద్దువల్ల మొట్టమొదట కనబడే ఫలితాలు నిరాశనే కలిగిస్తాయి. అయితే అది తాత్కాలికం. పరిణామాల క్రమం వేరుగా వుంటుంది.
“బ్యాంకుల్లో కరెన్సీ నిల్వలు తగ్గిపోతాయి. నగదు చేతిలో ఆడకపోవడం వల్ల వస్తువుల కొనుగోళ్ళు మందగిస్తాయి. రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం మీద తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి.
“సక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఖర్చుకు సందేహిస్తారు.  ఇక అక్రమ మార్గాల్లో డబ్బు పోగేసుకున్నవారి సంగతి చెప్పక్కర లేదు. అలాంటి  కరెన్సీని ఏదో విధంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. విఫలం అయితే  ఆ డబ్బు చిత్తు కాగితాలకిందే లెక్క.  వాస్తవానికి  ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు  ప్రజల దగ్గర వున్న ప్రతి నోటు  ప్రభుత్వానికి భారమే.  ఇప్పుడు లెక్కకు రాని, లెక్క చెప్పలేని  అలాంటి నోట్ల భారం ప్రభుత్వానికి గణనీయంగా తగ్గిపోతుంది. ప్రభుత్వ ఖాతాలో మొదట పడే  లాభం ఇదే. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన కొత్త వెసులుబాటును ఉపయోగించుకుని  తమ దగ్గర వున్న లెక్క చెప్పని సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మళ్ళీ ఆ మొత్తంలో అధిక భాగం పన్ను రూపంలో ప్రభుత్వ ఖజనాకే చేరుతుంది.
“ఇలా సమకూడిన డబ్బుతో  ఒక ఏడాది ద్రవ్య లోటు పూర్తిగా తీరిపోగలదని ఓ అంచనా. మొదటి ఆరుమాసాలకాలంలో జీడీపీ  పెరుగుదల రేటు క్షీణించి నప్పటికీ ఆ తరువాత రెండేళ్ళు  బాగా పుంజుకుంటుందని కొందరు ఆర్ధిక వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగలదని, రియల్ ఎస్టేట్ రేట్లు భూమార్గం పట్టగలవని ఆశావాదుల ఊహాగానం. పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఏడెనిమిది లక్షల కోట్ల విలువైన కొత్త చట్టబద్ధమైన కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడం మూలాన దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కాగలదని వారు చెబుతున్నారు. ముందు దెబ్బతిన్న రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాల వ్యాపారం  ఆ  తరువాత అరుమాసాల కాలంలో మళ్ళీ  స్థిరత్వం పొందగలవని, ఆందోళనకు ఆస్కారం లేదనీ వారు భరోసా ఇస్తున్నారు. నల్ల డబ్బు చెలామణీ బాగా తగ్గిపోవడం వల్ల బంగారం కొనుగోళ్ళపై  ప్రభావం వుండే అవకాశం ఉండవచ్చు. అయినా కానీ నల్ల ధనాన్ని దాచుకోవడానికి బంగారం అనేది మంచి ప్రత్యామ్న్నాయం కాబట్టి బంగారం వ్యాపారానికి ముప్పు ఏమీ వుండకపోవచ్చని మరో అంచనా. నగదు మార్పిళ్లు తక్కువ కావడం వల్ల కార్పొరేట్ సంస్థలు లాభపడతాయి. కొత్తగా ప్రవేశపెట్టిన రెండువేల కరెన్సీ నోటు కారణంగా  మళ్ళీ నల్ల ధనం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందా లేదా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. అయితే, పెద్ద నోట్ల చెలామణీ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం నల్ల కుబేరుల మనస్సులో కలిగించిన అలజడి మరికొంత కాలం అలాగే వుండిపోతుందనీ, తిరిగి నల్ల ధనం కూడబెట్టుకునే ధైర్యం చేయకపోవచ్చనీ   ఆ ప్రశ్నకు జవాబు చెబుతున్నారు.”
సరే! ఇదంతా నాణేనికి ఒక వైపు.
రెండో వైపు వాదన దీనికి పూర్తిగా విరుద్ధం. వాళ్ళు చెప్పేదేమిటో చూద్దాం.
“పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల పెద్ద ప్రయోజనం లేకపోగా నష్టం ఎక్కువ. ప్రధానమంత్రి మోడీకి ఈ విషయంలో సరయిన సలహా ఇచ్చినట్టు లేరు. రాబోయే పరిణామాలను ముందుగా ఊహించి తగిన జాగ్రత్తలు చెప్పినట్టు లేదు.
“నిర్ణయం సమర్ధకులు చెబుతున్నట్టు నల్ల ధనం అంటే కేవలం కరెన్సీ నోట్లు కాదు. నిజం చెప్పాలంటే అన్ని కరెన్సీ నోట్లు బ్లాక్ మనీ కాదు. ప్రతి నోటు తెల్లధనం కిందికే వస్తుంది. కరెన్సీ నోటు ఎవరి దగ్గర వున్నదీ అన్నదాన్ని బట్టి దాని రంగు మారుతుంది. ఉదాహరణకు ఒక కరెన్సీ నోటు పన్నులు కట్టని వ్యక్తి వద్దకు చేరితే అది నల్ల ధనం అవుతుంది. తిరిగి అదేనోటు పన్ను చెల్లించే వ్యక్తిదగ్గరకు చేరితే అదే డబ్బు తెల్ల ధనంగా మారుతుంది. ఈ విధాన లోపాన్ని గుర్తించి సరిచేయకుండా మొత్తం కరెన్సీని రద్దు చేయడం సరికాదు.
“నల్లధనం సంపన్నుల దగ్గర వుందని నమ్ముతున్న ప్రభుత్వం ఎక్కువ నగదు మార్పిళ్ళతో జీవితం గడిపేవాళ్ళు అతి పేదవారనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. వారిలో 90% మంది కరెన్సీ చెల్లింపుల ద్వారానే జీవన యానం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్య వల్ల వారివద్ద డబ్బు లేకుండా పోయింది. సమాజంలో నగదు చెలామణీ తగ్గిపోవడంతో దాని ప్రభావం వర్తక వాణిజ్యాలపై పడుతోంది. అవి పూర్తిగా మందగించాయి.
“కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు పది,పదిహేనువేల కోట్ల రూపాయల వరకు వుండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి దండగ ఖర్చే.
“రానున్న కొద్ది మాసాల్లో బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా స్తంభిస్తాయి. నోట్ల మార్పిడి, డిపాజిట్ల స్వీకరణ, వచ్చిన జనాలను అదుపు చేయడం, సముదాయించడం వీటితోనే సరిపోతుంది. ఫలితం ఆర్ధిక వ్యవస్థపై నేరుగా పడుతుంది. మార్కెట్లో నగదు నిల్వలు తగ్గిపోతాయి. వ్యాపార లావాదేవీలు తగ్గి పన్నుల రూపంలో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
“ప్రజలవద్ద నగదు లేకపోవడంతో ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది. ధరలు తగ్గినా కొనుగోలు చేయడానికి జనం దగ్గర డబ్బులు వుండవు. కనీసం కూరగాయలు కొనగల స్థోమత కూడా ఉండకపోవచ్చు.
“నోట్ల రద్దు అనేది చాలా ప్రమాదకరమైనది. అత్యంత తప్పనిసరి పరిస్తితుల్లో మాత్రమే ప్రయోగించాల్సిన ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆషామాషీగా ఉపయోగిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి.”
ఈ రెండు వాదనలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ. అసలు సంగతి ఈ  రెంటి నడుమా వుంది. వాదప్రతివాదాలు చేసేవారికి ఈ విషయం తెలియకపోలేదు. కానీ అభిమాన దురభిమానాలు అలానే వాదించేలా చేస్తాయి. వీటికి  రాజకీయం కూడా తోడయితే ఇక చెప్పేదేమీ వుంటుంది?  
నిర్ణయం మంచిదే, అమలే ఇబ్బందిగా మారిందని కదా మన్మోహన్ సింగ్ నుంచి మామూలు మనిషి వరకు మనసులో అనుకునే మాట.  నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించలేదు, సరయిన కసరత్తు చేయలేదని కదా అందరం అంటున్నది. మనలో చాలామందిమి ఈ  నల్ల ధనంతో సంబంధం లేనివాళ్ళమే. అయినా కొన్ని ఇబ్బందులు తప్పవు. మరి ఒకటో తారీఖు వచ్చేస్తోంది. మనమన్నా కాస్త ముందు చూపుతో మనకు ఎలాటి ఇబ్బందులు ఎడురవుతాయో కాస్త ఊహించుకుందామా! ఇబ్బందులు పూర్తిగా తొలగక పోయినా కాసింత మానసిక ఉపశమనం అన్నా లభిస్తుందేమో చూద్దాం.
మా ఆవిడను అడిగితే మొదటి వారంలో ఎదురుకాగల కొన్ని సమస్యలు చెప్పింది. పనివాళ్ళ జీతం,  పాలవాడి బాకీ, పేపరువాడి బిల్లు. ఇలా అన్నమాట. బ్యాంకులో డబ్బు వున్నా బయటకి వచ్చే వీలులేదు. చేతిలో డబ్బులు రేపోమాపో అయిపోయే బాపతు. వాళ్లకి బ్యాంకు ఖాతాలు లేవంటున్నారు. మరి ఏమిటి పరిష్కారం.
ఒకటే పరిష్కారం. రాజకీయాలు తగ్గించి ఒక పద్దతిగా  చర్చించుకోవడం. అందరం ఒక పడవలోని ప్రయాణీకులమే కాబట్టి నిజాయితీగా మాట్లాడుకోవడం. రెచ్చగొట్టే చర్చల వల్ల ప్రయోజనం శూన్యం. (26-11-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595    


24, నవంబర్ 2016, గురువారం

అమ్మో! ఒకటో తారీఖు


నిర్ణయం మంచిదే, అమలే ఇబ్బందిగా మారిందని కదా మన్మోహన్ సింగ్ నుంచి మామూలు మనిషి వరకు మనసులో అనుకునే మాట.  నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించలేదు, సరయిన కసరత్తు చేయలేదని కదా అందరం అంటున్నది. మనలో చాలామందిమి ఈ  నల్ల ధనంతో సంబంధం లేనివాళ్ళమే. అయినా కొన్ని ఇబ్బందులు తప్పవు. మరి ఒకటో తారీఖు వచ్చేస్తోంది. మనమన్నా కాస్త ముందు చూపుతో మనకు ఎలాటి ఇబ్బందులు ఎడురవుతాయో కాస్త ఊహించుకుందామా! ఇబ్బందులు పూర్తిగా తొలగక పోయినా కాసింత మానసిక ఉపశమనం అన్నా లభిస్తుందేమో చూద్దాం.
మా ఆవిడను అడిగితే మొదటి వారంలో ఎదురుకాగల కొన్ని సమస్యలు చెప్పింది. పనివాళ్ళ జీతం,  పాలవాడి బాకీ, పేపరువాడి బిల్లు. ఇలా అన్నమాట. బ్యాంకులో డబ్బు వున్నా బయటకి వచ్చే వీలులేదు. చేతిలో డబ్బులు రేపోమాపో అయిపోయే బాపతు. వాళ్లకి బ్యాంకు ఖాతాలు లేవంటున్నారు. మరి ఏమిటి పరిష్కారం.

ఒకరికొకరం ఇబ్బందులు చెప్పుకుంటే పోయేదేమీ లేదు. నామోషీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడందరం ఒక పడవలోని ప్రయాణీకులమే. రవంత రాజకీయాలు తగ్గిస్తే అసలు సంగతులు మాట్లాడుకోవచ్చు.        

నడిచే నాటకరంగం కేవీ రమణ IAS

తెలిసిన వ్యక్తిలో తెలియని అంశాలు


My article on Savitri Sai book on KV Ramana (IAS) published in AKSHARA of Andhra Bhoomi, Telugu Daily today.Courtesy Shri Mvr Sastry

తెలంగాణా ప్రభుత్వ సలహాదారు, స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే,వీ.రమణ  జీవన యానంపై  శ్రీమతి సావిత్రీ సాయి రాసిన పరిశోధక గ్రంధం గురించిన నా సమీక్షను   ఆంధ్ర భూమి దినపత్రిక 'అక్షర' లో ఈరోజు ప్రచురించారు. పత్రిక సంపాదకులు శ్రీ ఏం.వీ.ఆర్. శాస్త్రికి కృతజ్ఞతలు. 

సావిత్రీ సాయి చాలా సాహసం చేశారనిపిస్తుంది. డాక్టరేట్ చేయడానికి ఎన్నుకున్న ఇతివృత్తం అలాంటిది మరి. జగమెరిగిన మనిషి కేవీ రమణాచారి సాంస్కృతికోద్యమ దృక్పధం అనేది రచయిత్రి అనండి, పరిశోధకురాలుఅనండి సావిత్రీ సాయి ఎంపిక చేసుకున్న అంశం.
“తీసివేసే థీసిస్ లు, ఎత్తిపోతల పధకాలు వంటి తెలుగు పరిశోధనల పరంపరలో యోగ్యుడయిన ఒక కళా వతంసుని కృషిని అంశంగా స్వీకరించి పరిశోధన చేసిన సావిత్రీ సాయిని అభినందిస్తున్నాను” అని ఈ పరిశోధనకు పరీక్షకునిగా వ్యవహరించిన డాక్టర్  కందిమళ్ళ సాంబశివరావు పేర్కొనడం సావిత్రి గారికి డాక్టరేట్ ని మించిన కితాబు.
కేవీ రమణ (రమణాచారి అనే తన పేరులో వున్న ‘చారి’ అనే రెండక్షరాలను ఆయనే స్వయంగా తొలగించుకున్నారు) జీవితం ఒక తెరిచిన పుస్తకం. పుస్తకం అట్ట వెనుక రచయిత్రే స్వయంగా ఈ విషయం పేర్కొన్నారు.  అందరికీ తెలిసిన వ్యక్తిలో అందరికీ తెలియని అంశాలను కూడా పరిశోధించి రాయడం అంటే మాటలు కాదు. ఆ దిశగా చేసిన కృషి, ఆ క్రమంలో చూపిన పట్టుదల  ఆవిడకు డాక్టరేట్ పట్టాను అందించింది. సావిత్రీ సాయి శ్రమ  ఫలించడం వల్ల ఒక ఉపకారం కూడా జరిగింది. కేవీ రమణ జీవన చిత్రంలోని సాంస్కృతిక కోణం  సమగ్ర రూపంలో ఆవిష్కృతమైంది. తెలుగు పాఠకులకు, ప్రత్యేకించి సాంస్కృతిక ప్రియులకు  పుస్తక రూపంలో ఒక అమూల్యమైన కానుక లభించింది.  ఇందుకు డాక్టర్ సావిత్రీ సాయి బహుధా అభినందనీయులు.
ఈ పుస్తకాన్ని సమీక్షించడం అంటే ఒక రకంగా కేవీ రమణ జీవితాన్ని ఆమూలాగ్రం స్పర్శించడమే.  అందుకే కాబోలు ఆయన కొండంత వ్యక్తిత్వాన్ని  ఆవిడ కొద్ది మాటల్లో గుదిగుచ్చి ఇలా చెప్పారు.
“దేశానికి ఒక అబ్దుల్  కలాం....ఒక  అన్నా హజారే....
“తెలుగువారికి ఒక రమణాచారి”
అల్పాక్షరాల్లో అనల్పార్ధాలను పొదగడం అంటే ఇదే!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి రచయిత్రి కృషి గురించి ‘రమణీయం’గా ఒక మాట చెప్పారు.
“పరిశోధకురాలు విషయాన్ని  సంగ్రహించి, ఔచిత్యాన్ని గ్రహించి, ఎంతగానో  శ్రమించి ఈ సిద్దాంత గ్రంధాన్ని రచించారన్న శివారెడ్డి గారి మాటల్లో ఎంతో సత్యం వుంది.    
రమణది అందరికీ తెలిసిన వ్యవహారం కనుక తెలిసిన విషయాలను తేలిగ్గా సేకరించి దానికి పరిశోధనా పత్రం అనే రూపాన్ని ఇవ్వడం చాలా సులభమని ఎవరయినా అనుకుంటే పొరబాటు పడినట్టే. రమణ పూర్తి వ్యక్తిత్వాన్ని ఆపోసన పట్టడానికి సావిత్రీ సాయి ఎంతో శ్రమించారు. ఎక్కడెక్కడో స్తిరపడిన రమణ  బాల్య స్నేహితులను, కళాశాల సహాధ్యాయులను, సహోద్యోగులను, సహచరులను, బంధు  మిత్రులను, పరిచయస్తులను స్వయంగా కలుసుకుని మాట్లాడి విషయ సేకరణ చేసారు. ఆయన పాల్గొన్న అనేకానేక సాంస్కృతిక సభలు, సమావేశాలకు హాజరై రమణ ప్రసంగ రీతులను శ్రద్దగా గమనించారు.  రమణ గురించి సర్వం తెలుసు అనుకునే వారు కూడా నివ్వెర పోయే అనేక అంశాలను సావిత్రీ సాయి తన ఈ గ్రంధంలో పొందు పరిచారు. చక్కగా చదువుకుని, డాక్టరయి సమాజానికి సేవ చేయాలనే తండ్రి ఆశయానికి అనుగుణంగా బుద్దిమంతుడయిన రాముడి మాదిరిగా మసలుకుంటున్న రమణ,  ప్రత్యేక తెలంగాణా నినాదం పట్ల ఆకర్షితుడై, పదిహేడేళ్ళ ప్రాయంలోనే ఆనాటి విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొని, అరెస్టయి. జైలుకు వెళ్లి చిప్ప కూడు తిన్నవిషయం ఇందులో వెలుగు చూసింది. బాల్యంలో కాళ్ళకు  చెప్పులు కూడా లేకుండా మండుటెండలో తండ్రి వెంట బడికి పరుగులు తీసిన రమణ తదనంతర కాలంలో ఉన్నత చదువులు చదివి, ఉన్నతోద్యోగాలలో రాణించడం వెనుక దాగివున్న శ్రమదమాదులు ఈ రచనలో అడుగడుగునా కానవస్తాయి.
రమణకు  స్వతహాగా నాటకాలంటే అనురక్తి. బాల్యంలోనే అంకురించిన ఈ అభిరుచి ఆయనతోనే పెరిగిపెద్దదయింది. విద్యార్ధిగా వున్నప్పుడు, అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు, తదుపరి ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా రమణలోని నటనాసక్తి బయటపడుతూనేవుండేది. రేడియో నాటకాలంటే చెవి కోసుకునే రమణకు ఎలాగైనా సరే రేడియోలో నాటకం వేయాలనే కోరిక బలంగా వుండేది. సైఫాబాదు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేటప్పుడు మధ్యాన్న భోజన విరామసమయంలో కాలినడకన దగ్గరలో వున్న రేడియో స్టేషనువైపు వెళ్లి చూస్తూ,  లోపలకు ఎలా వెళ్ళడం అనుకుంటూ వుండేవారు. ఆయనలోని ఈ ఆకాంక్షకు అక్కడి గేటు దగ్గరి ఘూర్ఖా అడ్డుపడే వాడు. మొత్తం మీద అతడు లేని సమయం చూసుకుని లోపలకు ప్రవేశించి,  వేలూరి సహజానందను కలుసుకుని రేడియో నాటకాల్లో నటించాలనే తన అభిమతాన్ని వ్యక్తపరిచారు. వారి సలహా పాటించి, ఆడిషన్ లోఅర్హత సంపాదించి రేడియో నాటకాల్లో నటించగలగడం  తన జీవితంలో ఒక మరపురాని అధ్యాయం అని రమణే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు.
అభిప్రాయ బేధం వచ్చి విడిపోయిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ప్రసిద్ధ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణలను తిరిగి కలపడంలో  రమణ ప్రదర్శించిన కుశలత పాఠకులను ఆకట్టుకునే మరో అంశం. ఇద్దరూ తమతమ రంగాలలో ఉద్దండులే. మాట పట్టింపుగల మానధనులే. మరి ఎలా సయోధ్య కుదర్చడం! ముఖ్యమంత్రి కార్యాలయంలోని టెలిఫోన్ ఆపరేటర్  సాయంతో ఎవరు ఎవరికి ముందు ఫోను చేశారో వారిరువురికీ  తెలియకుండా వారిద్దరినీ సంభాషణలో కలిపిన వైనం రమణ చతురతకు నిదర్శనం. మంగళంపల్లి పేరు వింటేనే మండిపడుతున్న రామారావు నోటితోనే “కులీ కుతుబ్ షా గారూ! (హైదరాబాదు పాత నగరం అభివృద్ధికి ఏర్పరచిన కులీ కుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థ పరిపాలనాధికారిగా రమణ చాలా కాలం పనిచేయడం వల్ల ఆయనకు లభించిన మారుపేరిది) మంగళంపల్లివారికి ప్రభుత్వం తరపున అఖండ సత్కారం చేయాలి, డేటు ఖరారు చేయండి” అనిపించారంటే రమణలోని చాతుర్యం, చాకచక్యం అర్ధం అవుతుంది.
ఎప్పుడూ దరహాస వదనంతో కానవచ్చే రమణకు చిన్ననాటి నుంచే హరికధలు అంటే అనురక్తి. పదహారేళ్ళ వయస్సులో సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాలలో ఆయన చేసిన సీతాకల్యాణం హరికధా కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం మెడలో పూలదండతో, అంగవస్త్రంతో, పట్టుదోవతితో, నుదుట తిలక ధారణతో మెరిసిపోతూ వచ్చిన రమణని చూసి ఆశ్చర్య పడడం ఇంట్లో వాళ్ళ వంతయింది.
అలాగే, దేవస్థానం అనే సినిమాలో కూడా రమణ నటించారు. జనార్ధన మహర్షి రూపొందించిన ఈ సినిమాలో విశ్వనాద్, ఎస్పీ బాలసుబ్రమణ్యం సరసన నటించడం ఆయనకు మరో మరపురాని అనుభూతి.                 
 ఇటువంటి ఆసక్తికర అంశాలను అన్నింటినీ సేకరించి ఒక క్రమపద్దతిలో, అధ్యాయాల వారీగా విభజించి ఈ పుస్తకంలో పొందుపరచడానికి  సావిత్రీ సాయి పడిన శ్రమ కూడా తక్కువేమీ కాదనిపిస్తుంది ఇది చదివిన తరువాత.
పరిశోధక పుస్తకం అయినా చదివించే పుస్తకం రాసిన రచయిత్రి అభినందనీయులు.

22, నవంబర్ 2016, మంగళవారం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కొన్ని జ్ఞాపకాలు - ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

  
మంగళంపల్లి వారు మంచి స్నేహశీలి. బెజవాడతో వారికి  మంచి అనుబంధం. ఈ రెంటినీ తెలియచెప్పడానికే ఈ చిరు ప్రయత్నం.

(PHOTO COURTESY RVV KRISHNARAO)


మూడుపదుల వయస్సు దాటేవరకూ బాలమురళీ కృష్ణ  బెజవాడ సత్యనారాయణపురంలోని తన సొంత ఇంట్లోనే వుండేవారు. వారి తండ్రి పట్టాభి రామయ్య గారు కట్టించిన ఇల్లది. మద్రాసులో స్థిరపడి, సంగీతంలో  ఖండాంతర ఖ్యాతి పొందిన తరువాత కూడా  ఆయన బెజవాడలోని తన ఇంటిని అట్టే పెట్టుకోవడం ఆ వూరు మీద ఆయనకున్న మమకారాన్ని తెలియచేస్తుంది. ఒకసారి విజయవాడ పురపాలక సంఘం వాళ్ళు మంగళంపల్లివారికి పౌర సన్మానం చేసారు. ఆయన  ఇల్లు వున్న  వీధికి ‘మంగళంపల్లి వీధి’ అని పేరు పెడుతూ సంఘం చేసిన తీర్మానాన్ని ఆ సభలో చదివి వినిపించారు.
మంగళంపల్లి వారు చాలాయేళ్ళు బెజవాడ రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేసారు. అలాగే బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా మంగళంపల్లివారే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆయన మద్రాసుకు మకాం మార్చారు.
ఒకసారి బెజవాడ వచ్చి కచేరీ  చేశారు.  ఆయన అరవ కీర్తనలు పాడడం ఒకాయనకు నచ్చలేదు. ఆ సంగతి మంగళంపల్లివారి చెవిన పడింది.  ఇక ఆ రోజు  పూనకం పట్టినట్టు వర్ణం నుంచి  మంగళం వరకు (కచేరీ మొదలు అయిన దగ్గరి నుంచి చివరి వరకు) తమిళ కీర్తనలే పాడి కచేరీ ముగించారు. తమిళులకి సంగీతం పట్ల యెనలేని గౌరవం వుందని, తనకు ఇన్ని పేరుప్రఖ్యాతులు రావడంలో తమిళ అభిమానుల పాత్ర వుందని చెబుతుండేవారు. అసలు సిసలు  సంగీతం కావేరీ ఒడ్డునే ఉందనే వారు.
వారి గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. బెజవాడ గాంధీ నగరంలో  నవయుగ ఫిలిమ్స్, అద్దంకి శ్రీరామమూర్తి ఇంటి దగ్గరలో పంతులుగారి నివాసం. బాలమురళీకృష్ణ అక్కడ వుండే సంగీతం నేర్చుకున్నారు. వారికి  వయోలిన్ అంటే ఆసక్తి. వయోలిన్ విద్యాంసులు  ద్వారం వెంకట స్వామి నాయుడి బాణీ అంటే చెవికోసుకునేవారు. ఆయన్ని అనుకరిస్తూ వయోలిన్ వాయిస్తూ  ఒకసారి గురువుగారి కంట పడ్డారు.
‘వయోలిన్ ‘సంగతి’ సరే! ముందు నీ ‘సంగతి’ చూసుకో అని గురువు గారు మెత్తగా మందలించారు. (సంగతి అనేది సంగీత పరిభాషలో ఒక పదం). ఆనాటి నుంచి మంగళంపల్లి వారు అనుకరణకు పూర్తిగా స్వస్తి పలికారు.
1985 ప్రాంతంలో  కాబోలు, బెజవాడలో డి.ఎల్.నారాయణగారి అమ్మాయి వివాహానికి మంగళంపల్లి వారు మద్రాసు నుంచి వచ్చారు. ఇద్దరికీ మంచి స్నేహం. ఆ స్నేహాన్ని పురస్కరించుకునే ఆ పెళ్ళిలో మంగళంపల్లి వారు కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ కు వెళ్ళారు. కోరమండల్  ఎక్స్ ప్రెస్ రైలు  ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను  టీసీ మంగళంపల్లివారిని చూడగానే గుర్తుపట్టి సెకండ్ ఏసీ బోగీలో ఒక బెర్తు మీద కూర్చోబెట్టి,  ‘ఇప్పుడే వస్తాను, కూర్చోండి, వచ్చి  మీకు బెర్తు ఇస్తాను’ అని చెప్పి వెళ్లి పోయాడు. ఈ లోగా ఒక బెంగాలీ బాబు  ప్లాటు ఫారం మీద ఇడ్లీలు పార్సెల్ కట్టించుకుని, ఇడ్లీల మీద పోసిన జారుడు చట్నీ కారిపోతుండగా ఆ బోగీలోకి వచ్చాడు. వచ్చి బాలమురళితో  అది తన బర్తని, అక్కడినుంచి లేవమని అన్నాడు. తానొక సంగీతకారుడిననీ, పేరు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అనీ పరిచయం చేసుకోబోయారు. అయినా ఆ బెంగాలీబాబు పట్టించుకోలేదు. సరికదా! “అయితే ఏమిటట” (వాట్ ఇఫ్) అనేసాడు. మంగళంపల్లివారు చిన్నబుచ్చుకుని టీసీ వచ్చేవరకు ఆగకుండా బండి దిగి, మళ్ళీ హోటల్ కు వచ్చేసారు. తనవెంట వున్న మిత్రుడితో ఇలా అన్నారు. ‘చూడు కృష్ణారావు. మనల్ని కావాలని కోరుకునేవాళ్ళు ఎంతోమంది వున్నారని అనుకుంటాం. మన వెర్రి కాని అది పూర్తిగా  నిజం కాదు. మన అసలు స్థాయి  ఏమిటన్నది ఆ బెంగాలీ వాడు మనకు చెప్పాడు’
ఆయన మాటల్లో బాధ లేదు. ఒక సత్యం బోధపడిన భావన కనిపించింది.

21, నవంబర్ 2016, సోమవారం

అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదు


ఈ పన్నెండు రోజుల చర్చల్లో ఒక విషయం మాత్రం తెలిసొచ్చింది, అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదని.
ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి ప్రధాని మోడీ ప్రసంగం తయారు చేసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ( అసలా నిర్ణయం ప్రధాని కాకుండా రిజర్వ్ బ్యాంక్  అధికార ప్రతినిధిచేత   ప్రకటించి వుంటే బాగుండేది, దీనికి రాజకీయ రంగు అంటివుండేది కాదన్నది ఒక వాదన. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్  కూడా నోట్ల రద్దు ప్రకటన బాధ్యతను అధికారులకే ఒదిలి వేసిన విషయాన్ని ఈ  ‘వాదకులు’ గుర్తు చేస్తున్నారు)
సరే! ప్రకటన ప్రధానమంత్రి స్వయంగా చేశారు. అందులో కొంపలు మునిగేది ఏమీ వుండదు.  కాకపొతే దాన్ని ఆయన తన తరహాలో కాకుండా ఒక  అధికారిక ప్రకటన మాదిరిగా రాసుకొచ్చి చదివి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వుంది. అలానే ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం మాదిరిగా కాకుండా  క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించి వుండాల్సింది. నల్ల కుబేరులపై యుద్ధ ప్రకటనకు మరో అవకాశం వినియోగించుకుని వుండాల్సింది. తన ప్రసంగంలో ప్రధాని  మోడీ మరో విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదుల చేతుల్లో భారత కరెన్సీ, అందువల్ల దేశ భద్రతకు యేర్పడ బోతున్న ముప్పు, వీటి  కారణంగా ఈ హఠాత్ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పిన  ప్రధాని ఆ అంశానికే  ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వుంటే దేశ ప్రజల దృష్టి అటు మళ్ళివుండేది. (నల్ల కుబేరులపై యుద్ధం అంటూ ఓ పక్క చెబుతూ ఆ నోటితోనే  రెండువేల కొత్త నోటు తెస్తున్నట్టు  చెప్పేసరికి అసలు  విషయం జావకారి పోయింది, లేనిపోని అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టయింది.)
ప్రధాని తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించి, గత పన్నెండు రోజులుగా తీసుకుంటున్న ఉపశమన చర్యలు గురించి ఆ రోజే ప్రస్తావించి వుంటే సామాన్య ప్రజల మనస్సుల్లో ఇంత గందరగోళం ఏర్పడి వుండేది కాదు. ప్రకటన దరిమిలా  మీడియాలో వస్తున్న  వార్తలను బట్టి ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటిస్తూ, మార్చుకుంటూ పోవడం గమనించిన వారికి ప్రభుత్వం  చేసిన తప్పులు (పొరబాట్లు అనాలేమో) దిద్దుకుంటూ పోతోందన్న అభిప్రాయం కలిగింది. సరయిన విధంగా ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయిందన్న ఆరోపణలకు ఆస్కారం వుండేది కాదు.  నిర్ణయాన్ని సమర్ధించిన వారే  అమల్లో లోపాల గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. చర్చలు ఇంత సుదీర్ఘంగా జరిగేవీ కావు, ఇంత రచ్చ జరిగేదీ కాదు.
సరే! జరగాల్సింది  జరిగిపోయింది. నిర్ణయం  వెనక్కి తీసుకునే వీలులేదు. తడబడ్డ కాలునే  కూడదీసుకోవాలి. పైపంచ గాలికి యెగిరి ముళ్ళకంచెపై పడినప్పుడు అది చిరిగిపోకుండా జాగ్రత్తగా బయటకి తీయాలి. దీనికి చాలా సంయమనం కావాలి. మనసు నిగ్రహంగా వుంచుకోవాలి. రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కునే క్రమంలో, ఆవేశకావేశాలతో తీసుకునే నిర్ణయాలు, వ్యాఖ్యలు  మరింత గందరగోళానికి దారితీస్తాయి. ఇది మోడీ అభిమానులకీ, దురభిమానులకీ, వ్యతిరేకులకీ కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంలో నిజంగా ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం కానీ, ఎవరినీ భయపెట్టాల్సిన అగత్యం కానీ వుండదు.

ఇప్పుడు బంతి పూర్తిగా  సర్కారుకోర్టులోనే  వుంది. అది స్పష్టంగా కానవస్తోంది.            

19, నవంబర్ 2016, శనివారం

దేశానికి పట్టిన ‘నల్ల’ తుప్పు వదిలేనా!

(PUBLISHED IN 'SURYA' ON 20-11-2016, SUNDAY)
ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా  ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ  వుంటుంది.
పెద్ద నోట్లను చెలామణీ లోనుంచి తప్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చల సరళి ఇందుకు చక్కని ఉదాహరణ. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలోనూ మోడీ నిర్ణయానికి అనుకూలంగా, ప్రతికూలంగా వెల్లువెత్తుతున్న వ్యాఖ్యానాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మోడీ పట్ల అవ్యాజానురాగాలతో కూడిన స్వామి భక్తిని ప్రదర్సిస్తుంటే, వ్యతిరేకులు పూర్తిగా మోడీ పట్ల తమకున్న నిరసన భావాన్ని వ్యక్తం చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా విషయాన్ని అవలోకన చేసేవారికి ఉభయ పక్షాల వాదనలు ఒకరకంగా సరయినవే అనిపిస్తున్నాయి, అదే సమయంలో వాటిల్లో డొల్లతనమూ కానవస్తోంది.
నల్ల ధనం రాకాసి విషపు కోరలనుంచి దేశాన్ని విముక్తం చేయడానికి మోడీ తీసుకున్న  నిర్ణయం మంచిదే. ఈ విషయంలో మమత బెనర్జీ వంటి కొద్దిమందికి మినహా అందరిదీ ఏకాభిప్రాయమే. అనేకుల అసహనం, ఆవేశం ఈ నిర్ణయం అమలు చేసిన తీరుపట్లనే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా ప్రభుత్వం తీసుకుంటున్న అనేకానేక దిద్దుబాటు చర్యలే  ఇందుకు సాక్ష్యం. ఈ చర్యలు మరో విషయాన్నీ అన్యాపదేశంగా తెలియచేస్తున్నాయి. అదేమిటంటే, అత్యంత ప్రభావిత నిర్ణయం తీసుకునే ముందు తగిన ముందు జాగ్రత్త చర్యలు గురించి ప్రభుత్వం ఆలోచన చేయలేదని. ఎవరు విభేదించినా, విమర్శించినా ఈ ఒక్క విషయంలోనే. దురదృష్టం ఏమిటంటే ఈ కోవకు చెందిన సద్విమర్శకులను కూడా జాతి వ్యతిరేకుల గాటనకట్టేసే ప్రయత్నం మరింత దురదృష్టకరం. ఇక నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు కూడా లక్ష్మణ రేఖను దాటుతున్నాయి. మోడీని వ్యక్తిగతంగా చిన్నబుచ్చే రీతిలో ఇవి సాగుతుండడం మరో దురదృష్టకర పరిణామం. ఈ రెండు విభిన్న వాదనల్లో అయితే  భజనలు, లేకపోతె  ఖండనలు మినహా తార్కిక దృష్టి  పూర్తిగా లోపిస్తోంది. విచక్షణ పక్కకు తప్పుకుని అభిమానదురభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తూ గతంలో  శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.
“ఈ ఏడాది (2016) సెప్టెంబరు నుంచి వచ్చే సంవత్సరం (2017) జనవరి వరకు దేశానికి సంక్షుభిత సమయం. ప్రజలు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అగత్యం వుంది” హైదరాబాదులో కార్తీక మాసం కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా స్వామి మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. “అంశం ఏదైనా సరే, రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడ్డం మంచిద”ని ఆయన మరోమారు హితవు పలికారు.
కొద్ది రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా  చెబుతున్నారు. మంచిదే! సంయమనం ఎప్పుడూ మంచిదే. ఎవ్వరూ కాదనరు.

అంతా సద్దుమణుగుతుంది సరే! ఈలోపల అసలు సిసలు నల్ల కుబేరులు తమ వద్ద మూలుగుతున్న నల్ల డబ్బు సర్డుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతె, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ అనే తంతుగా తయారవుతుంది.

ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పాలకపక్షం అంటోంది. అవి రాజకీయం చేయకుండా సూక్తి ముక్తావళి సభలు నిర్వహిస్తూ పొద్దు పుచ్చుతాయని అనుకోవడం అమాయకత్వం. బీజేపీ ఆ స్థానంలో వుంటే,  వేరే విధంగా వ్యవహరిస్తుందని చెప్పలేము. రాజకీయం మూల స్వభావమే అది.
ప్రధానమంత్రి  మోడీ తీసుకున్న ఈ  నిర్ణయం అల్లాటప్పాది  కాదు. మొత్తం జాతిని ప్రభావితం చేసే గొప్ప సాహసోపేత నిర్ణయం.
ఇన్నేళ్ళ స్వతంత్ర  భారతం రుజాగ్రస్తం అయిపొయింది. నల్లధనం అనే మాయ  రోగం జాతి ఒళ్ళంతా పాకింది. ఈ స్తితిలో వున్న దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద నోట్ల రద్దువంటి శస్త్రచికిత్సలు అవసరమే. సందేహం లేదు. అయితే అందుకు జాతి సంసిద్ధంగా ఉందా!
రోగికి తక్షణం శస్త్రచికిత్స అవసరం అని వైద్యుడు నిర్ణయించాడు. దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడాలని అనుకున్నాడు. రోగి బంధువులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్  లోకి తీసుకు వెళ్ళే ముందు బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. అవి అదుపులో వుంటే తప్ప లేదా  ఎంతో అవసరం అనుకుంటే తప్ప వైద్యుడు రోగి శరీరంపై కత్తి పెట్టడు.
అలాంటి  ‘ముందు’ జాగ్రత్తలు తీసుకోకుండా జాతి మొత్తానికి సంబంధించిన పెద్ద నోట్ల రద్దు వంటి కీలక విషయంలో ముందు వెనుకలు చూసుకోకుండా ఇలా  అడుగు ముందుకు వేయడం సబబేనా! ఇప్పుడు జరుగుతున్నది గమనిస్తుంటే జరిగింది సరయినదేనా అన్న అనుమానం కలిగితే దాన్ని సందేహించాలా!
ఈ నిర్ణయం అమల్లో ఏవైనా అవతవకలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటే   ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని కూర్చోవు. అయితే నల్ల ధనం గురించిన వ్యవహారం కాబట్టి, నోరుజారితే అసలుకే మోసం వస్తుందని, జాతి జనుల దృష్టిలో పలచబడి పోతామనే సంకోచంతో మనసులో ఎలా వున్నా కొన్ని ప్రతిపక్షాలు అంతగా విరుచుకు పడడం లేదు. అంచేత అవన్నీ ఈ నిర్ణయానికి ప్రతికూలతను  బాహాటంగా ప్రకటించడం లేదు. ప్రతిపక్షాలంటే రాజకీయం చేస్తున్నాయని సరి పెట్టుకున్నా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల మాటేమిటి? వాటిని అయినా పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం వుంటుంది కదా!
రాజకీయ ‘శంక’ర్రావుల సంగతి పక్కన బెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.
ఉపసంహరణకు అవకాశం లేని బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోయింది.అది  గురితప్పకుండా చూసుకుంటూ,    సమస్యతో నేరుగా సంబంధం లేని వాళ్లపై దాని పరిణామాలు  పడకుండా చూడడం పాలకుల బాధ్యత.
దేశ ఆర్ధికవ్యవస్థను సమూలంగా మార్చే సదుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం, అమలుకు సంబంధించిన కొన్ని అవకతవకల కారణంగా నగుబాటు అయ్యే పరిస్తితి దాపురించడం నిజంగా విషాదం. నిర్ణయాన్ని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.   
‘ఇంటాబయటా క్యూలే’ అన్నాడొక వ్యాఖ్యానకారుడు.
‘ఇంట్లో కూచుని టీవీ పెడితే  క్యూ లైను దృశ్యాలు. కాలు బయట పెడితే, ఏ.టి.ఎం.లు, బ్యాంకుల దగ్గరా క్యూలైన్లు’ అనేది ఆయన కవి హృదయం. ‘యావత్ దేశం క్యూ లైన్లలోనేవుంద’న్నాడు మరో ఉత్ప్రేక్షాలంకారుడు. కాకపోతే కాసింత అతిశయోక్తి వుందనిపించడం సహజం.
కూసింత ఆలస్యంగా తీసుకున్న ఉపశమన చర్యల పుణ్యమాఅని కాసిన్ని కరెన్సీ నోట్లు జనం జేబుల్లోకి చేరడంతో బోసిపోయిన జాతి మళ్ళీ లక్ష్మీ కళ సంతరించుకుంటోంది.
‘చూసింది ఇంతే!చూడాల్సింది ఎంతో వుంది’అని భయపెడుతున్నారు నిరాశావాదులు. రానున్న కొద్ది రోజుల్లో వందేళ్ళు వెనక్కి పోతామన్నది హెచ్చరికతో కూడిన వారి వాదం. 
‘బాగుపడుతుంది, సర్దుకుంటుంది’ అంటున్నారు ఆశావాదులు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని భావయుక్తంగా భరోసా ఇస్తున్నారు. ‘యెంత?  యాభయ్ రోజులేగా! చూస్తుండగానే గడిచిపోతాయి. వేచి చూస్తే పోలా!’ అనేది వారి ఉచిత సలహా.
ఈ సలహాలు నచ్చినా నచ్చకపోయినా చేసేది ఏమీ లేదు సామాన్యులకు. వారు పుట్టడమే పుట్టెడు కష్టాలతో పుట్టారు. వాటి మధ్యే పెరిగారు. క్యూలు కొత్తకాదు, కష్టాలు కొత్తకాదు. కాకపోతే తమ కష్టార్జితం తమ ఖాతాలో వేసుకోవడానికి, తమ వద్ద వున్న కరెన్సీ నోట్లు చెల్లుతాయి అని ధీమాగా జేబులో వుంచుకోవడానికి  ఇన్నిన్ని  ఇబ్బందులు పడాలా అనేదే వారి ఆక్రోశం. అదొక్కటే ఏలినవారు ఆలోచించుకోవాల్సిన విషయం.  
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిపడుతున్న లెక్కలు చూపని డబ్బు లక్షల కోట్లల్లో వున్నట్టు ప్రభుత్వ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. నిస్సందేహంగా నిజమే అయివుండవచ్చు. బ్యాంకుల సిబ్బంది పాట్లు ఎలా వున్నా బ్యాంకు క్యాష్ చెస్టులు మాత్రం వరద గోదారిలా పొంగి పొర్లుతున్నాయి.  బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడానికి పెరుగుతున్న  క్యూలే దీనికి రుజువు.  
ఉపశృతి:
బాధలు, ఇబ్బందులు అనేవి నిజానికి సాపేక్షం (రెలెటివ్).
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే  తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని  జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఎదురయ్యే అవస్థలను అన్నింటినీ  స్కూటరువాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా మాత్రమే గుర్తున్నాయి.
ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మనం అనుకునే ఇబ్బందులు వేరు, మన  పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్న ఇబ్బందే కదా! ఆ మాత్రం దేశం కోసం సర్డుకుపోలేరా అని  చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు. 
తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే  రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!   (19-11-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

18, నవంబర్ 2016, శుక్రవారం

యాభయ్ రోజుల పరీక్షా కాలం


‘ఇంటాబయటా క్యూలే’ అన్నాడొక వ్యాఖ్యానకారుడు.
‘ఇంట్లో కూచుని టీవీ పెడితే  క్యూ లైను దృశ్యాలు. కాలు బయట పెడితే, ఏ.టి.ఎం.లు, బ్యాంకుల దగ్గరా క్యూలైన్లు’ అనేది ఆయన కవి హృదయం. యావత్ దేశం క్యూ లైన్లలోనే వుందిపొమ్మన్నాడు మరో ఉత్ప్రేక్షాలంకారుడు. కాకపోతే కాసింత అతిశయోక్తి వుందనిపించడం సహజం.
కూసింత ఆలస్యంగా తీసుకున్న ఉపశమన చర్యల పుణ్యమా అని కాసిన్ని కరెన్సీ నోట్లు జనం జేబుల్లోకి చేరడంతో బోసిపోయిన నగరం మళ్ళీ లక్ష్మీ కళ సంతరించుకుంటోంది.
‘చూసింది ఇంతే!చూడాల్సింది ఎంతో వుంది’అని భయపెడుతున్నారు నిరాశావాదులు. రానున్న కొద్ది రోజుల్లో వందేళ్ళు వెనక్కి పోతామన్నది హెచ్చరికతో కూడిన వారి వాదం.  
‘బాగుపడుతుంది, సర్దుకుంటుంది’ అంటున్నారు ఆశావాదులు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని భావయుక్తంగా భరోసా ఇస్తున్నారు. ‘యెంత?  యాభయ్ రోజులేగా! వేచి చూస్తే పోలా!’ అనేది వారి ఉచిత సలహా.
నచ్చినా నచ్చకపోయినా చేసేది ఏమీ లేదు సామాన్యులకు. వారు పుట్టడమే పుట్టెడు కష్టాలతో పుట్టారు. వాటి మధ్యే పెరిగారు. క్యూలు కొత్తకాదు, కష్టాలు కొత్తకాదు. కాకపోతే తమ కష్టార్జితం తమ ఖాతాలో వేసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడాలా అనేదే వారి ఆక్రోశం.       

17, నవంబర్ 2016, గురువారం

అప్పు అనగానేమి!

ఒకడు తుమ్మితే పక్కన వున్నవాడికి కూడా తుమ్ము వస్తుంది అంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా, చదివినా ‘అప్పు’ మాటే కాబట్టి నా పాత అప్పుకధ ఒకటి పాత బాకీలా గుర్తుకొస్తోంది.


అసందర్భంగా అనిపించినా ఆ సందర్భం ప్రస్తావించదలిచాను. 1970 ప్రాంతంలో నేను విజయవాడలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పని చేసే రోజుల్లో జర్నలిష్టుగా సంఘంలో నా జీవితం ఒక మెట్టు పైన వుండేది. జీతభత్యాల రీత్యా చూసుకున్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువన వుండేది. జీతానికీ, జీవితానికీ పొంతనలేని ఆ రోజుల్లో ఒకరోజు, ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి జరూరుగా కావాల్సి వచ్చింది. ఇల్లంతా గాలించినా పాతిక పైసలు కూడా లేవు. పిల్లవాడికి పోతపాలు. పాలసీసా పగిలిపోయింది. నేనూ మా ఆవిడా దిగులు మొహాలు వేసుకుని కూర్చుని వుంటే రామారావు అని కొత్తగా పరిచయం అయిన వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడాసమయంలో అలా రావడం మా ఇద్దరికీ బాగనిపించలేదు. పరిస్తితి గమనించాడేమో వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఇట్టే తిరిగి వచ్చాడు. అతడి చేతిలో పాలసీసా. మా ప్రాణాలు లేచి వచ్చాయి. కొద్దిరోజులుగా నానుంచి ఓ సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. అతనో పెయింటర్. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే తపన. బ్యాంకులో పూచీకత్తు ఇచ్చేవాళ్ళు కావాలంటున్నారు. అతడు చేసిన సాయానికి ప్రతిగా బ్యాంకుకు వెళ్లి హామీ సంతకం చేసి పదివేలు అప్పు ఇప్పించాను. వెంటనే, హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగం రావడం, ఆ తరువాత మాస్కో రేడియోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళడం ఈ హడావిడిలో నేను బెజవాడ బ్యాంకు అప్పు సంగతి మరచిపోయాను. ఈలోగా అప్పుతీసుకున్న వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవక రోడ్డున పడడం, బ్యాంకు వాళ్ళు హామీదారునయిన నా చిరునామా పట్టుకుని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా లక్ష రూపాయలకు కోర్టు ఇచ్చిన డిక్రీ చేతిలో పెట్టడం సినిమాలోలా జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగిని కదా, అప్పు వసూలుకు నేను వారికి కనిపించి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం అల్లా ఇప్పుడు అలా జరగడం లేదేమిటని!

మన దేశానికి పట్టిన ‘నల్ల’ తుప్పు వదిలేనా!

ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా  ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ  వుంటుంది.

పెద్ద నోట్లను చెలామణీ లోనుంచి తప్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చల సరళి ఇందుకు చక్కని ఉదాహరణ.

 ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తూ గతంలో  పరిపూర్ణానంద స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

“ఈ ఏడాది (2016) సెప్టెంబరు నుంచి వచ్చే సంవత్సరం (2017) జనవరి వరకు దేశానికి సంక్షుభిత సమయం. ప్రజలు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అగత్యం వుంది” హైదరాబాదులో కార్తీక మాసం కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా స్వామి మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. “అంశం ఏదైనా సరే, రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడ్డం మంచిద”ని ఆయన మరోమారు హితవు పలికారు.

కొద్ది రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా  చెబుతున్నారు. మంచిదే! సంయమనం ఎప్పుడూ మంచిదే. ఎవ్వరూ కాదనరు.

అంతా సద్దుమణుగుతుంది సరే! ఈలోపల అసలు సిసలు నల్ల కుబేరులు తమ వద్ద మూలుగుతున్న నల్ల డబ్బు సర్డుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతె, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ అనే తంతు అవుతుంది.     

 

16, నవంబర్ 2016, బుధవారం

రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చు కదా!


బాధలు, ఇబ్బందులు రెలెటివ్ అని తీర్మానించాడు ఒకాయన.
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే  తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని  జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా గుర్తున్నాయి.
ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మేం  అనుకునే ఇబ్బందులు వేరు, మా పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు.  
తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే  రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!

రాజకీయ చెణుకులు



రాజకీయాల్లో వుండేవాళ్ళల్లో కూడా హాస్యపు పాలు ఎక్కువే. అయితే ఇటీవలి కాలంలో అది తక్కువైపోతూ అసహనపు పాలు ఎక్కువవుతోంది. కొన్ని పాత ముచ్చట్లు గుర్తు చేసుకుందాం.
నెహ్రూ మంత్రి వర్గంలో కృష్ణ మీనన్ రక్షణ మంత్రి. పాకీస్తాన్ కి అమెరికా ఆయుధ సాయంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. ఆ ఆయుధాలను భారత దేశానికి వ్యతిరేకంగా వాడడం జరగదు అనే వాదాన్ని ఖండిస్తూ అయన ఇలా అన్నారు.
“ఆకులూఅలం తిని పొట్టనింపుకునే శాకాహార పులిని నేనింతవరకూ చూడలేదు”
సభలో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి చర్చ నడుస్తోంది.
ఒక ప్రతిపక్ష  సభ్యుడు ఇలా అన్నారు.                               
“మన దేశంలో తయారయ్యే మోటారు కారులో శబ్దం చేయని భాగం ఏదైనా ఉన్నదంటే అది కారు హారన్ మాత్రమే”
బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలకు మహాత్మాగాంధీ ఇంగ్లండ్ బయలుదేరుతున్నారు. ఒకరన్నారు.
“అక్కడ బ్రిటిష్ ప్రభువును ఇలానే చాలీచాలని ధోతీ పై కండువాతో   కలుసుకుంటారా!”
“ఏమిటి ఇబ్బంది, నాకు లేకపోయినా బ్రిటిష్ ప్రభువువద్ద  ఇద్దరికి  సరిపడా దుస్తులు వుండే వుంటాయి కదా!” గాంధి జవాబు.
1949 లో ప్రధాని నెహ్రూ మొదటిసారి అమెరికా పర్యటన చేసి స్వదేశానికి తిరిగివచ్చారు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలపై ముఖ్యంగా నాగరీకం పేరుతొ సమాజంలో సాగుతున్న పద్దతులు ఆయనకు నచ్చలేదు. ఆ భావాలను  మొత్తం ఆయన ఒక్క ముక్కలో ఇలా చెప్పారు.
“ఏమైనా సరే! ఎవ్వరూ కూడా ‘మొట్టమొదటిసారి’  మాత్రం అమెరికా వెళ్ళకూడదు”
సరోజినీనాయుడు మహాత్మా గాంధీ గురించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
“ఈ గాంధీగారి  నిరాడంబరత్వం  ఏమో కానీ ఆయన్ని ఇలా సాదాసీదాగా వుంచడానికి మనం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయన గారు ఈ సంగతి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!”
సర్దార్ పటేల్ ని కూడా ఆమె వదిలి పెట్టలేదు.
“ ఈ ఉక్కు మనిషికి అగ్రికల్చర్ తప్ప అసలు కల్చర్ అంటే ఎంతమాత్రం తెలియదు”
ప్రతిపక్ష సభ్యుడు పిలూ మోడీ మంచి హాస్య చతురత కలవాడు. భారీ కాయానికి తగ్గట్టే హాస్యం కూడా అదే మోతాదులో వుండేది. ఆ రోజుల్లో ప్రధాని ఇందిరాగాంధీ,  ఏ  సమస్య  వచ్చినా, మొండిగా  దాన్ని అమెరికా గూఢచారిసంస్థ సీఐఏ తో ముడిపెట్టి మాట్లాడుతూ వుండేవారు. అది విని వినీ చిర్రెత్తుకొచ్చిన పిలూ మోడీ “నేను సీఐఏ ఏజంటును’ అని రాసి వున్న బ్యాడ్జీని ఇందిరాగాంధీకి కనిపించేలా తన చొక్కాకు తగిలించుకుని సభకు వచ్చారు.
అప్పుడు రాజీవ్ గాంధి ప్రధాని. తెలుగుదేశం సభ్యుడు పర్వతనేని ఉపేంద్ర  ప్రతిపక్ష నాయకుడు. రాజీవ్ గాంధి ఏదో విదేశ పర్యటన ముగించుకుని వచ్చి సభలో అడుగు పెట్టారు. పదేపదే విదేశీ యాత్రలు చేసే ప్రధానిగా అప్పటికే ఆయనపై ప్రతిపక్షాలు ఓ ముద్ర వేసాయి. ప్రధాని రావడం చూసి ఉపేంద్ర తన స్థానంలో నిలబడి అన్నారు. “ చాలా అరుదుగా ఢిల్లీని సందర్శిస్తున్న భారత ప్రధానికి స్వాగతం పలుకుతున్నాం”
1950 ప్రాంతాల్లో పీ. గోవింద మీనన్ ట్రావెన్ కూర్, కొచిన్ రాష్ట్రానికి (తరువాత కేరళ రాష్ట్రంగా పేరు మారింది) ముఖ్యమంత్రి. టీ.వీ.థామస్ ప్రతిపక్ష నాయకుడు.
తను కూర్చున్న స్థానాన్ని చూపిస్తూ ముఖ్యమంత్రి అన్నారు. “నా ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ప్రతిపక్ష నాయకుడు చాలా ఆత్రుత పడుతున్నారు. అది ఆయనకు ఈ జన్మలో సాధ్యం అయ్యేపని కాదని నేను చెప్పదలచుకున్నాను.  ఈ కుర్చీ ఎక్కాలంటే ఆయన మళ్ళీ మనిషి జన్మ కాదు,  నల్లి జన్మ ఎత్తాలి.”
బ్రిటిష్ ప్రధానిగా రామ్సే మెక్ డోనాల్డ్ కి మెతక మనిషి అనే పేరు. ప్రతిపక్షంలో వున్న విన్ స్టన్ చర్చిల్ ఆయన్ని గురించి ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు.
ఈ మెక్ డోనాల్డ్  ఎలాటి వాడంటే  గొర్రె తోలు కప్పుకున్న మరో గొర్రె”