7, జులై 2016, గురువారం

సీఎం అప్పాయింటుమెంటు అంటే అంత చులకనా! – వై ఎస్ తో ఓ జ్ఞాపకం




“ఏవిటండీ మీరు మరీను. సీఎం గారి అప్పాయింటుకోసం అందరూ క్యూలో వుంటారు. మీరేమో ఇచ్చింది క్యాన్సిల్ చేయమంటారు. ఇదేమీ బాగా లేదండీ శ్రీనివాసరావు గారూ” 
భాస్కర శర్మ గారికి కోపం వచ్చిన సందర్భాలు బహు తక్కువ. వాటిల్లో ఎక్కువ భాగం నావల్లనే తటస్థపడ్డాయి. (ఈ మధ్యనే శర్మ కైలాసమానస సరోవర యాత్ర చేసి వచ్చారు)
భాస్కర శర్మ ఉద్యోగమే బిజీ బిజీ ఉద్యోగం. ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అప్పాయింటుమెంట్లు ఖరారు చేసే బాధ్యత ఆయనది. మామూలుగా అయితే ఫోను రిసీవ్ చేసుకునే వ్యవధానం కూడా  వుండదు.   మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐ.ఏ.ఎస్.లు, ఐ.పీ.ఎస్. లు ఇలా ఎంతో మంది నుంచి ఒత్తిళ్ళు వుండే ఉద్యోగమాయే. అలాంటి ఉద్యోగం అయినా అది చేస్తున్నది భాస్కర శర్మ కాబట్టి ఆయన తీరే వేరు. ఎవరు ఫోను చేసినా మర్యాద, నమ్రత. సీఎం పేషీలో పనిచేసేవాళ్ళు యెంత మర్యాదస్తులయితే అంత మంచి పేరు నేరుగా సీఎం ఖాతాలో పడిపోతుంది.
నేను అనేకసార్లు శర్మ గారిని ఇబ్బంది పెట్టి ఎవరెవరికోసమో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అప్పాయింటు ఫోనులోనే అడగడం, తీసుకోవడం, మళ్ళీ ఫోనులోనే  క్యాన్సిల్ చేయడం ఇలా అనేక సార్లు జరిగింది. యెంత సహన శీలుడికయినా కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. అప్పుడాయన అన్న మాట అదన్నమాట.
గతంలో రేడియో ఉద్యోగంలో వున్నప్పుడు ఈ అప్పాయింటుమెంట్ల గొడవే వుండేది కాదు. నేరుగా వెళ్లి కలవడమే.  అంచేత వాటి విలువ ఏమిటో శర్మ చెప్పిన దాకా నాకూ తెలవదు.
రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే అప్పాయింటుమెంటు లేకుండానే ఆయన్ని అయన  కారులోనే సరాసరి  రేడియో రికార్ధింగుకు తీసుకువెళ్ళాను. ( ఇందుకు సంబంధించిన ఫోటో మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ వద్ద వుంది) ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందుగా అయన  సందేశం రికార్డు చేయాల్సింది రేడియో వాళ్ళే అనేది నా వాదన. 


వై ఎస్ కూడా అంతే. అప్పాయింటుమెంటు తీసుకున్న సంగతీ, క్యాన్సిల్ చేసిన సంగతీ తెలిసి కూడా తరువాత కలిసి నప్పుడు ఏమీ తెలియనట్టే పలకరించేవారు. నోరారా నవ్వుతూ, ఒక చేతిని తెరిచి వుంచి మరో చేతి వేళ్ళను ముడిచి పెట్టి  తెరిచిన అరచేతిపై  కొట్టుకుంటూ ‘ఏవిటి విశేషాలు’ అంటూ పలకరించేవారు.
ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడానికి ముందు అసెంబ్లీలో కలిశాను. మరుసటి రోజు ఆయన లేరు. లేరన్న సంగతి కూడా ఆ మరునాటికి కానీ తెలియని పరిస్తితి. మనిషిని ఆనవాలు పట్టలేని విధంగా మృత్యువు ఆయన్ని వెంటబెట్టుకు వెళ్ళింది. అంచేతే, అంతకు ముందు రోజు చూసిన ఆయన నగుమోమే మనస్సులో ముద్రపడిపోయింది.

రేపు వైఎస్ జయంతి. ఆయన్ని స్మరించుకుంటూ ఈ నాలుగు ముక్కలు.               

కామెంట్‌లు లేవు: