25, జూన్ 2016, శనివారం

అమ్మా నాన్నా ఒక అమ్మాయి


 డియర్ నాన్నా!
ఒక్క క్షణం తండ్రికి చేతులు వొణికాయి. మనసు కీడు శంకించింది. భార్యను పిలుద్దామనుకున్నాడు. లిప్తపాటు  ఆలోచించి ఆలోచన మానుకున్నాడు. మనసు కుదుట పరచుకుని కుమార్తె రాసిన ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు.
డియర్  నాన్నా! ఇలా నిన్ను పిలిచే అదృష్టానికి నా అంతట నేనే దూరం జరుగుతున్నాను. అల్లారుముద్దుగా, ఏలోటూ తెలియకుండా నన్ను పెంచారు. దానికి ప్రతిఫలంగా నేనిస్తున్న కానుకే ఇది.
కారణం  తెలియదు కానీ, రామూని నేను మరచిపోలేకపోతున్నాను. అందుకే అతడితో వెళ్లి పోతున్నాను. నాన్నా! ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నానన్న  కోపంతో   ఉత్తరాన్ని చించేయకండి. దయచేసి చివరదాకా చదవండి నాన్న. దగ్గరగా లేకపోయినా  మీ కంటిలోని తడిని నేను దూరంనుంచే   చూడగలుగుతున్నాను. క్షణంలో భూమి బద్దలయితే బాగుండని అనుకుంటూ  మనసులో మీరు  పడుతున్న  ఆవేదనను అర్ధం చేసుకోగలుగుతున్నాను. ఒక్క విషయాన్ని  మీరూ పెద్దమనసుతో అర్ధం చేసుకోండి నాన్నా. ఇంతవరకు నా జీవితంలో అపరిమితమయిన ప్రేమను పంచి ఇచ్చింది మీరూ అమ్మా మీరిద్దరేఅలాగే నాకో నమ్మకం,  మీకంటే, అమ్మకంటే నన్ను ఇంతగా ప్రేమించేవాళ్ళు లోకంలో మరెవరూ  వుండరని. కానీ రామూ పరిచయంతో నమ్మకం కాస్తా ఆవిరై పోయింది.
రామూ లాంటి వ్యక్తులు మీకు నచ్చరని తెలుసుఅలాగే, అతడికున్న  అలవాట్లను మీరు కలలో కూడా భరించలేరని, క్షమించలేరని  కూడా నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసే సాహసం చేయలేకపోయాను. కానీ,  మీరు తెలుసుకోవాల్సింది కూడా వుంది  నాన్నా. రామూ అంటే నాకు పిచ్చి ప్రేమ. ప్రేమ ముందు అతడి అలవాట్లు, అతడి మొరటుతనం ఏదీ  నాకు ఆనడం లేదు. అతడిమీద ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయాయి. అతడి చెడ్డ అలవాట్లన్నీ ఇప్పుడు  నాకు  మంచిగా కనబడుతున్నాయి. అతడి సమక్షంలో  నేను వేరే వ్యక్తిని అన్న భావన కూడా రాదు. అతడికేది ఇష్టమయితే దాన్నే నా ఇష్టంగా మలుచుకోవడం నాకిష్టం. ఇష్టంతోనే  అతడికిష్టమని  నేనూ సిగరెట్లు తాగుతున్నాను. అతడి కోసమే మందు, భంగు అలవాటు  చేసుకున్నాను. రామూ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నా నాకు మరో  విధంగా అనిపించడం లేదు. అంటే అతడిపై నేను ఎంతగా ప్రేమను పెంచుకున్నానో, దాని తీవ్రత ఎంతగా  వుందో దయచేసి అర్ధం చేసుకోండి నాన్నా.
నిజమే! కాదనను. వయస్సులో  మా ఇద్దరి మధ్యా ఎంతో వ్యత్యాసం. కొద్ది అటూ ఇటూగా మీ వయసు అతడిది. అయితేనేంఅతడి  మీద నాకున్న ప్రేమ  కూడా అంతే  పెద్దది. అంతే గొప్పది. అది అర్ధం చేసుకోండి నాన్నా. అన్నీ అర్ధం అయిపోతాయి.
అల్లరి చిల్లరగా తిరుగుతాడనే రామూ వాళ్ల అమ్మా నాన్నా అతడిని వొదిలేశారట. ఇంటి నుంచి తరిమేశారట. స్తితిలో నా తోడు కూడా అతడికి దూరం అయితే ఏమయిపోతాడో అని నా బెంగ. ఇంకో విషయం కూడా మధ్యనే తెలిసింది. దానితో అతడి పట్ల నా జాలి మరింత పెరిగిపోయింది. రామూకు ఎయిడ్స్ అని డాక్టర్లు చెప్పారట. ఇన్ని  రోగాలకు మందులు కనుకున్న శాస్త్ర వేత్తలు ఏదో ఒకనాడు ఎయిడ్స్ కు చికిత్స కనుక్కోలేకపోతారా నేను బాగుచేయించలేకపోతానా చెప్పండి.
బాధ పడకండి డాడ్! ఇప్పుడు నా వయసెంతని. నిండా పదిహేనేళ్ళు కూడా నిండనే లేదు. కాకపోతే నా బాగోగులు నేనే  చూసుకోగల మనస్తయిర్యాన్ని మీ పెంపకంలో అలవర్చుకున్నాను. అదే పదివేలు. ఏదో ఒక రోజు మీ మనుమడిని తీసుకుని రామూని వెంటబెట్టుకుని మిమ్మల్నీ అమ్మనీ చూడడానికి వస్తాను. అంతదాకా సెలవ్ మీ ముద్దుల కూతురు
పీ ఎస్: -  డాడ్పైన రాసినదంతా శుద్ద అబద్ధం. నేను పక్కింట్లో   సుధక్కతో కూర్చుని  చెస్ ఆడుతున్నాను. రామూ లేడూ  సోమూ లేడూ  అంతా ఉత్తిదే. నా స్కూలు ప్రోగ్రెస్ కార్డు కంటే దారుణమయిన విషయాలు లోకంలో ఇంకా చాలా  వుంటాయని చెప్పడానికే ఇదంతా రాశాను. కార్డు పక్కనే సొరుగులో వుంది. చూసీ చూడనట్టుగా చూసి సంతకం పెట్టండి. పెట్టి ఫోను చేయండి. ఇంటికి వస్తాను. (15-07-2011)


3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

దేవుడా!
అసలిలాంటి ఆలోచన మీకెలా వచ్చిందండి? too extreme - ఏదో ఒకటి కాకుండా విలువైనవి మాత్రమే రాయండి సార్. మీ రచనల రాశి పెరుగుతూ, వాసి తగ్గుతూ వస్తోంది. గమనించండి. అన్యధా భావించకండి. సదుద్దేశ్యమే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : భావించను.బెంగ పడకండి.

అజ్ఞాత చెప్పారు...

Liked it. Please post as you wish.