25, జూన్ 2016, శనివారం

ఎమర్జెన్సీ విశేషాలు


ఎమర్జెన్సీతో పాటే పత్రికలపై సెన్సార్ షిప్  విధించారు.
ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చే వార్తలు, ఫోటోలను ముందుగా సెన్సార్ అధికారికి  చూపించి,  ఆయన అనుమతి లభించిన తరువాతనే వాటిని ప్రచురించాల్సిన పరిస్తితులు ఉండేవి.
ఢిల్లీ  స్టేట్స్ మన్  పత్రికలో  ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. అయన పేరు రఘురాయ్ . ఎమర్జెన్సీ విధించిన తరువాత నగరంలో పరిస్తితులను కళ్ళకు కట్టినట్టు చూపే ఒక ఫోటో తీసాడు.
ఒకతను సైకిల్ పై ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని దాన్ని తోసుకుంటూ  వెడుతుంటాడు. వెనకనే  అతడి భార్య నడిచి వస్తుంటుంది.
ఆ ఫోటోకి కింద పెట్టిన క్యాప్షన్ ఇలా వుంటుంది.
“చాందినీచౌక్ ప్రాంతంలో  జనజీవనం చాలా సాధారణంగా వుంది”
సెన్సార్ అధికారికి అందులో అభ్యంతర  పెట్టాల్సింది ఏమీ కనిపించలేదు. దాన్ని ఓకే చేసాడు. ఫోటోగ్రాఫర్ తెలివి అతడ్ని పప్పులో కాలేసేలా చేసింది.  ఆ ఫోటో చూస్తే జనజీవనం సాధారణంగా సాగిపోతున్న భావన కలిగే మాట నిజం. కానీ అదే వీధిలో గుంపులు గుంపులుగా గస్తీ తిరుగుతున్న పోలీసులు కూడా ఆ ఫోటోలో లీలగా కనిపిస్తారు. ఆ అధికారి ఆ విషయం  గమనించలేదు.  అంచేత మరునాడు పత్రికలో ఆ ఫోటో అచ్చయింది.
సెన్సార్ అధికారులు తరువాత నాలుక కరుచుకున్నారు. ఆ ఫోటో ప్రచురణకు అనుమతి ఇచ్చిన అధికారిని బదిలీ చేసారు.



3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

>ఆ ఫోటో ప్రచురణకు అనుమతి ఇచ్చిన అధికారిని బదిలీ చేసారు.
మరి అద్భుతమైన ఫోటోగ్రాఫర్ తెలివీ‌ నౌపుణ్యమూ‌ కలిగి , సెన్సార్ అధికారులను నాలుక కరుచుకునేలా బోల్తా కొట్టించిన ఢిల్లీ స్టేట్స్ మన్ పత్రిక రఘురాయ్ గారిని ఏమి చేసారు?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - అన్నీ తెలిస్తే ఇక కధ ఏముంది? తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇవన్నీ రాయిస్తోంది. ఎవరన్నా చెప్పకపోతారాఅని.

Surya Mahavrata చెప్పారు...

ఎనభైల్లో నేను పత్రికలు చదవడం మొదలుపెట్టిన్నాటికి ఇండియా టుడే నా అభిమాన పత్రిక. అందులో రఘురాయ్ ఫోటోలు అన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండేవి. సమకాలీన సాధారణ భారతాన్ని కెమెరాలోంచి చూపించేందుకు అందెవేసుకున్న చేతుల్లో అతనివి రెండు. నాకిప్పటికీ గుర్తున్నవి హరిప్రసాద్ చౌరాసియాగారి గురించిన ప్రత్యేక వ్యాసంలో వారు ఒక పెద్ద బన్సురీని చేత్తో పట్టుకుని నిద్రిస్తున్నది, కోట్లకు పడగలెత్తి కూడా ఇంకా విశ్వేశ్వరాలయ ప్రవేశానికి అనుమతిలేని వారణాశి కాటికాపరి దోం రాజా జీవనవిధానపు ఫోటోలు కొన్ని. రఘురాయ్ ఫోటో పుస్తకాలు కూడా వచ్చేయి.