30, ఏప్రిల్ 2016, శనివారం

BABU IN DRIVER SEAT




గమనిక: శ్రీ సిటీ  సెజ్ లో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారు డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఒక ఫోటోను మిత్రులు ఒకరు ఫేస్  బుక్ లో పోస్ట్ చేశారు.


ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు వీవీఐపీలు ఇలా లాంఛనంగా ఫోటోలు దిగడం కొత్తేమీ కాదు. కానీ  ఈ ఫోటోపై వచ్చిన కామెంట్లే కాస్త కొత్తగా, విచిత్రంగా వున్నాయి. అభిమాన, దురభిమానాలకు మచ్చుతునకలుగా  అనిపించాయి.  సరదాగా చదువుకోవడానికి కూడా బాగానే వున్నాయి. అందుకే రాసిన వాళ్ళ పేర్లు  తీసేసి వాళ్ళ కామెంట్లు మాత్రమే పెట్టడం జరిగింది. పొతే, పత్రికల్లో ఎడిటర్లు రాసినట్టు ‘ఈ కామెంట్లకీ నాకూ ఎట్టి సంబంధం లేదు’ అని గమనించ ప్రార్ధన.
ఇవిగో అవే ఇవి:

నేనూ ఎప్పుడూ చూడలేదు. బహుశా 'కారు' పడకపోవడం వల్లనేమో!

“He has to drive long way to take AP to safe zone. Of course we are happily sitting in back seat without any concerns”
“ I think it would be for photo”

“It could be”

he should have used seat belt as well..”

“ Why do you use seatbelt ?? Just asking. When you have the answer to my question .. You will automatically have answer to your question”

“Just oka 200mts 10 speed lo nadipithe seat belt pettukovalaa... ambati ramabau laa maattaaduthunnaav roi”

“ just to stand as good example anna.. anthe”

“ Migataavanni thega follow ayyaaru marim..4 ki lestharu yoga chetsharu....manam chesthama”
“ I doubt whether he has really driven or it was for a photo op.!! I used it to quench my affection towards him. Eekalu peekithe yelaa cheppu...? “

“At the maximum he must have rolled the car”

“Yes, he is in driver seat. We are all in that big vehicle. Naturally our future also in his hands, because steering is in his hands. If he perform well and drive efficiently, then we will reach our destination. Other wise we may met with accident and life may be ? Now, coming to my friend Vijaykumar doubt, is it, he is really driving ? This question must be answered by the person sitting in the driver seat only.”

“He is driving the State...that is for sure...!!”

“That is why I am concerned and worried about his driving.. Sir”

“ Ha ha.. Dont worry sir. It's only a photo op..!! We just took it forward...!!”


26, ఏప్రిల్ 2016, మంగళవారం

ఆసుపత్రిలో బోధివృక్షం



పండక్కి పుట్టింటికి వచ్చినట్టుగా రెండేళ్ళ కోమారు  ......
ముక్కుచెవులకు అన్నింటికీ ఏడువారాల నగలు పెట్టుకున్నట్టు వొళ్ళంతా ఏవిటేవిటో ఆక్సిజన్ మాస్కులూ,  ఈసీజీ వైర్లూ. నిశ్శబ్దాన్ని మరింత  భయంకరం చేస్తూ లైఫ్  సేవింగ్ యూనిట్ల చప్పుళ్ళూ. క్షణం పాటు కూడా రెండు కాళ్లు ఒక చోట పెట్టకుండా అటూ ఇటూ తిరుగుతుండే మనిషి నిస్తాణగా ఆస్పత్రి మంచం మీద.  చూడలేక, చూడకుండా వుండలేక అదో రకమైన అర్ధం కాని  అర్ధం లేని మానసిక స్తితి. లోకంలోని జబ్బు మనుషులందరూ ఒక్క చోట చేరినట్టు వున్న  ఐసీయూ నుంచి బయట పడి....
ఆ వెయిటింగు గదిలో కూర్చున్న అందరి వదనాల్లో ఏదో తెలియని ఆందోళన. ఆత్మీయుల ఆరోగ్యం గురించిన మాటలు వినీ వినపడకుండా. ఎవడయినా సూపర్ మాన్ దుడ్డుకర్ర పట్టుకుని ఈ లోకం నుంచి రోగాలను అన్నింటినీ తరిమి కొడితే.... రోగాలు, రోష్టులు తెలియని ఓ చిన్న పాపఅక్కడే  ఆడుకుంటోంది.  తెలియని అందరి దగ్గరి దగ్గరకు వచ్చి తెలిసిన ఆరిందాలా పలకరిస్తోంది.  ఆ పాపాయి నవ్వుతో ఇంకా ఐసీయూలో మా ఆవిడతోనే  వుండిపోయిన   నా మనసు  కొద్దిగా తేరుకుంటోంది.
ఎవరో నలుగురు వచ్చారు. ఇద్దరు మగా మరో ఇద్దరు ఆడవాళ్ళు. వేసుకున్న దుస్తుల్ని పట్టి చూస్తే అంతా   మగవాళ్ళు మాదిరిగా వున్నారు. గలగలా కాకపోయినా కాస్త పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ రాకతో కొద్దిగా ఎబ్బెట్టుగా మారినట్టయింది అక్కడి వాతావరణం.
ఒకమ్మాయి అడుగుతోంది ఇంగ్లీష్ లో, కాఫీ కావాలా, టీ కావాలా అని. వారేమన్నారో తెలియదు. వారిలో ఫేషన్ గా జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసుకున్న ఓ యువకుడు లేచాడు, కాఫీ కౌంటర్ వైపు కదిలాడు. అప్పుడు కనిపించింది అతడికో కాలు లేదు. ఆ స్థానంలో యంత్రం సాయంతో కదిలించగల స్టీల్ రాడ్. ఒక లిప్త పాటు మనసు అదోలా అయింది. కాలు లేకపోయినా అంత మామూలుగా ఎలా  వుండగలుగుతున్నాడు ? కాళ్ళూ చేతులూ వున్న ఓ మామూలు మనిషి లాగానే  తోటివారికి కాఫీ తేవడానికి ఎలా లేచాడు ? వెంట వచ్చిన వాళ్ళలో కూడా అతడో అవిటిమనిషి అన్న భావం ఏమాత్రం కానరాలేదు. కాలు లేకపోయినా కాఫీ  తెస్తాను అని లేస్తే అదో సాధారణ విషయం అయినట్టు కిమ్మనలేదు, ‘నువ్వేం తెస్తావు, కూర్చో’ అంటూ లేనిపోని సానుభూతి ఒలకపోయ్యలేదు.


మనిషితో పాటే అవస్థలు పుడతాయి. వాటిని చూసి బెదిరి పోవడం కంటే వాటితో సహజీవనం చెయ్యగలిగితే.....
అర్ధం చేసుకోవాలే కాని, ఆసుపత్రులు కూడా బోధి వృక్షాలే! (26-04-2016)

        

24, ఏప్రిల్ 2016, ఆదివారం

ఆకాశవాణి వెంకట్రామయ్య గారి గురించి నాలుగు ముక్కలు

ప్రియ మిత్రులు, రేడియోలో మూడుదశాబ్దాల సహచరులు, ప్రముఖ రచయిత డి. వెంకట్రామయ్య గారిని టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సన్మానించింది. ఈ సందర్భంగా, నాకు తెలిసిన వెంకట్రామయ్యగారి గురించి నాలుగు ముక్కలు చెప్పే అవకాశం కల్పించిన కౌన్సిల్ చైర్మన్ , మిత్రుడు షరీఫ్ కి ధన్యవాదాలు.
Srinivas Rao Sr Journalist - Television Producers Council Awards Function ►http://www.hybiz.tv/Srinivas-Rao-Sr-Journalist-TVPC-Awards-Function/203965 ► Watch...
YOUTUBE.COM

23, ఏప్రిల్ 2016, శనివారం

రాజకీయ చమత్కారం


సూటిగా.....సుతిమెత్తగా....... 

ఒక్కసారి ఓ నలభయ్ ఏళ్ళు వెనక్కి వెళ్లి వద్దాం.
1975 జూన్ 12.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని ఇందిరాగాంధీ నివాసంలో ఒక అధికారి చాలా అసహనంగా అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. తడవతడవకూ ఓసారి టెలిప్రింటర్ గదిలోకి వెడుతూ ఏదైనా ఫ్లాష్ న్యూస్ వస్తుందేమో అని చూస్తున్నాడు. షరా మామూలు వార్తలు మినహా  ఆయన ఎదురు చూస్తున్న వార్తలు ఏమీ ఆ గదిలోని పీటీఐ, యుఎన్ఐ ప్రింటర్ల మీద కనబడడం లేదు.
మరి కాసేపట్లోనే, అంటే ఉదయం పది గంటల రెండు నిమిషాలకు యుఎన్ఐ ప్రింటర్  “ఫ్లాష్ ఫ్లాష్”  అంటూ గంటలు మోగిస్తూ ఒక వార్త ఇచ్చింది. దాన్ని చూడగానే ఆ అధికారి నివ్వెర పోయాడు. ‘మిసెస్  గాంధీ అన్ సీటెడ్’ అంటూ అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును అతి క్లుప్తంగా ఆ వార్తా సంస్థ అందులో పేర్కొన్నది. హడావిడిగా  ఆ వార్త వున్న కాగితాన్ని ప్రింటర్ నుంచి చించి, దాదాపు పరిగెత్తుకుంటూ  ప్రధాని కూర్చుని వున్న గదిలోకి  వెళ్ళాడు. వెళ్లి ఆ కాగితాన్ని అక్కడే వున్న రాజీవ్ గాంధి  చేతిలో ఉంచాడు. దాన్ని పరికించి చూసిన రాజీవ్ తల్లితో చెప్పాడు. “వాళ్ళు  నిన్ను ప్రధాని పదవి నుంచి తొలగించారు” అని. ఆ మాటలు విన్న ఇందిరాగాంధీ  కొద్దిసేపు మిన్నకుండి పోయారు. ఆమె మోహంలో ఎలాంటి ఆందోళన కానరాలేదు.
ఈలోగా  టెలిప్రింటర్ మరింత బాధాకరమైన వార్తను మోసుకొచ్చింది. ఇందిరాగాంధీ  పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాదు, ఎన్నిక ద్వారా సమకూరే ఎటువంటి పదవికయినా  ఆమె ఆరేళ్ళపాటు అనర్హురాలని అలహాబాదు హైకోర్టు  మరో తీర్పు చెప్పింది. అప్పటివరకు ఉగ్గబట్టుకుని వున్నప్పటికీ,  ఈ వార్త తెలియగానే  ఆవిడ మౌనంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయారు.
దీనికి ముందు చాలా చాలా సంగతులు చరిత్రలో చేరాయి.
శ్రీమతి గాంధి చేతిలో సుమారు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయిన రాజ్  నారాయణ్, శ్రీమతి గాంధి ఎన్నిక అక్రమ పద్ధతుల్లో జరిగిందని  ఆరోపిస్తూ,  ఆ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ  కోర్టును ఆశ్రయించారు. శ్రీమతి ఇందిరాగాంధి తన ఎన్నికల  ప్రచారంకోసం యశ్ పాల్ కపూర్ అనే ప్రభుత్వ ఉద్యోగి సేవలు వాడుకుందనీ, అలాగే ప్రచార వేదికలు, మైకులు మొదలయినవి ఏర్పాటు చేసే విషయంలో  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సాయం తీసుకున్నారనీ రాజ్ నారాయణ్ వాదన.  ఈ రెండూ ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయమూర్తి జగ్ మోహన్ శ్రీమతి గాంధీకి ప్రతికూలంగా తీర్పు ప్రకటించారు.


‘ట్రాఫిక్ ఉల్లంఘన వంటి చిన్న తప్పిదానికి ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించినట్టుగా  ఈ తీర్పు వుందని ‘ఎమర్జెన్సీ’ పై రాసిన ‘జడ్జ్ మెంట్’ అనే గ్రంధంలో సుప్రసిద్ధ  పాత్రికేయులు కులదీప్ నాయర్  వ్యాఖ్యానించారు. జగ్ మోహన్ తీర్పు తనకు వ్యతిరేకంగా రాకుండా చూడడానికి ప్రధాని ఇందిర, ఆ న్యాయమూర్తిపై ఎన్నిరకాలుగా ఒత్తిళ్ళు తీసుకువచ్చిందీ,  న్యాయమూర్తి  వాటన్నిటినీ  ఎలా తట్టుకున్నదీ మొదలయిన సంగతులను చాలా ఆసక్తిదాయకంగా నాయర్ ఆ పుస్తకంలో  వివరించారు. శ్రీమతి గాంధీ  విధానాలతో పూర్తిగా వ్యతిరేకించే కులదీప్ నాయర్ వంటి  జర్నలిష్టు  కూడా, ఇందిరా గాంధి విషయంలో  న్యాయమూర్తి చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశారని అభిప్రాయపడడం ఇందులోని ప్రత్యేకత. 
హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయాలని ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు ప్రతిపక్షాలన్నీ  తీవ్రంగా వ్యతిరేకించాయి. నైతిక విలువలకు కట్టుబడి ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని పట్టుబట్టాయి. ఈ సంఘర్షణ ఏ స్థాయికి చేరిందంటే ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి ఇందిరాగాంధి జూన్  ఇరవై అయిదో తేదీ బాగా పొద్దుపోయిన తర్వాత  (ఇప్పటిలా ప్రసార సాధనాలు అప్పట్లో లేని కారణంగా  మారునాడు కానీ ప్రజలకు ఈ విషయం తెలియలేదు)  దేశంలో మొట్టమొదటిసారి ఆంతరంగిక ఆత్యయిక పరిస్తితి విధించారు.  దేశ వ్యాప్తంగా వందలాదిమంది ప్రతిపక్ష నాయకులను కారాగారాల్లోకి నెట్టారు. పత్రికలపై  ఆంక్షలు విధించారు. స్వతంత్ర భారత దేశం తొలిసారి స్వేచ్చను కోల్పోయిన  అనుభూతిని ఆ పరిణామాలు కలిగించాయి.
శ్రీమతి గాంధి  ఒక పక్క తనను ఎదిరించిన వారిని  రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తూ, మరో పక్క అలహాబాదు న్యాయస్థానం తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ న్యాయ పోరాటం కూడా సాగించారు.  దరిమిలా, అయిదు నెలలు తిరగకుండానే   సుప్రీం కోర్టులో శ్రీమతి  గాంధీకి ఉపశమనం లభించింది. కింది కోర్టు తీర్పును సుప్రీం కొట్టివేసింది. తద్వారా శ్రీమతి గాంధీ ప్రధానిగా  యధాప్రకారం కొనసాగడానికి  న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. అయినా ప్రతిపక్షాల ఆందోళన తగ్గలేదు.  విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. అనేక పార్టీలు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఒక్కటై, జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి, ‘జనతా   పార్టీ ‘ అనే ఒకే పేరుతొ, ఒకే ఎన్నికల గుర్తుతో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించేవారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరనే సత్యాన్ని  రుజువు చేయగలిగాయి. అదేసమయంలో,  బ్రహ్మాండమైన ప్రజల మద్దతు వుండికూడా,  తమలో తాము కలహించుకుని, భారత రాజకీయాల్లో ఒక చక్కటి  ప్రయోగం విఫలం కావడానికి ఆ రాజకీయ నాయకులే  స్వయంగా కారణం అయ్యారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు వున్న ప్రగాఢమైన కాంక్ష కారణంగా ఇందిరాగాంధీ పరాజయం పాలయింది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం అధికార వ్యామోహంతో, పరస్పర కుమ్ములాటలతో  తామున్న చెట్టు కొమ్మను తామే నరుక్కునే చందంగా వ్యవహరించే రాజకీయ కూటములను  కూడా ప్రజలు ఏవగించుకుంటారని జనతా ప్రభుత్వ పతనం  నిరూపించింది.
ఈ  సుదీర్ఘమైన  ‘పాతకాల స్మరణ’కు కారణం లేకపోలేదు.
అప్పటికీ ఇప్పటికీ నడుమ నలభయ్ ఏళ్ళు గడిచిపోయాయి. అప్పటి కధే  కొద్ది తేడాతో నేడు పునరావృత మైంది.  పాత్రలు కూడా  కొంచెం  అటూ ఇటుగా  తిరగబడ్డాయి.
ఆనాడు కాంగ్రెస్  పార్టీ నాయకురాలయిన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా  హైకోర్టు తీర్పు ఇస్తే ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆమె రాజీనామాకోసం పట్టుబట్టాయి. సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవడాన్ని తప్పుపట్టాయి.
ఈనాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కేంద్రంలో వున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, అప్రజాస్వామికంగా ఆ రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలన విధిస్తే  అక్కడి హైకోర్టు దాన్ని తప్పుబట్టి  రద్దు చేసింది. పైగా ఈ సందర్భంగా దేశం మొత్తానికి అనువర్తించే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఎండా వానా అని చూడకుండా పోలింగు కేంద్రాలకు వెళ్లి తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటే,  ఆ బలహీనుడు పెంచుకున్న నమ్మకాన్ని ఇలా హరిస్తారా అని ప్రశ్నించింది. ఇటువంటి చర్యలు సామాన్యులకు వ్యవస్థ పట్ల వుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.’ అని హెచ్చరించింది కూడా.
ఉత్తరాఖండ్  ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయిన కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్   హైకోర్టు  తీర్పు వెలువడగానే తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కొద్ది గంటల్లోనే పరిస్తితి మారిపోయింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ,  కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే  ప్రభుత్వం సుప్రీం తలుపు  తట్టింది. కొంచెం ఊరట కలిగించే తీర్పు కాలయాపన లేకుండా అత్యున్నత న్యాయస్థానం నుంచి రావడంతో మోడీ సర్కారుకు  ఒకింత ఉపశమనం లభించినట్లయింది. తాజా ముఖ్యమంత్రి రావత్ అత్యల్ప స్వల్ప సమయంలోనే మళ్ళీ మాజీగా మారారు.  
అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది, చర్చించు కావాల్సింది వేరే విషయం. అది రాజకీయ పార్టీల అవకాశవాదం.
నాలుగు దశాబ్దాల నాడు, ఆనాడు జనసంఘం రూపంలో వున్న బీజేపీకి   ఏదైతే తప్పనిపించిందో, అదే ఆ పార్టీకి ఈనాడు ఒప్పనిపిస్తోంది. అప్పుడు ప్రతిపక్షాలు యెంత ఒత్తిడి చేసినా రాజీనామా చేసేది లేదని భీష్మించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ చేస్తున్నది పూర్తి అనైతికంగా అనిపిస్తోంది.
రాజకీయంలో వున్న చమత్కారంగా దీన్ని అర్ధం చేసుకోవాలా?        

ఉపశ్రుతి:
భయాలు రకరకాలు. పిల్లి అంటే ఎలుకకు భయం. మనిషికి ప్రాణ భయం. రాజకీయ నాయకులు మానవాతీతులు కదా! అధికారంలో వున్న వారికి  ఒక్కటే భయం. ఎన్నికల్లో ఓడిపోతామేమో,  పదవి పోతుందేమో అన్న భయం.
ఆ భయమే వారిచేత అనేక కాని పనులు చేయిస్తుంటుంది. (23-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595


NOTE: COURTESY KULDIP NAYAR & IMAGE OWNER    

555555



ఆరు  అయిదులు. అక్షరాల్లో చెప్పాలంటే అయిదు లక్షల యాభయ్ ఐదువేల అయిదు వందల యాభయ్ అయిదు. 
నా బ్లాగు (http://bhandarusrinivasarao.blogspot.in/) ప్రారంభించిన తరువాత సందర్శించిన లేదా  ఒక పరి పరికించి చూసిన చదువరుల సంఖ్య.
ఈరోజుతో దీన్ని దాటిపోయింది.
మనసులో తట్టిన ప్రతి విషయాన్ని  బ్లాగులోకి  మళ్ళించుకుంటూ, మంచి చెడులను చదివేవారికే ఒదిలేస్తూ రాసుకుంటూ పోతున్నా  మంచి మనసుతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా  మనఃపూర్వక కృతజ్ఞతలు.


-      భండారు శ్రీనివాసరావు, (23 -04-2016)     

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

చంద్రహారం


మా  వూరికి  నాలుగు మైళ్ళ  దూరంలో వున్న వూళ్ళో ఒక  టూరింగు టాకీసు వుండేది. దాంట్లోకి చంద్రహారం సినిమా వచ్చినట్టు  ఆ ఉదయం మా వూళ్ళో దండోరా వేసారు. దండోరా అంటే ఒక ఎడ్లబండికి  రెండువైపులా సినిమా పోస్టర్లు తగిలించేవాళ్ళు. అందులో ఓ ముసలాయన కూర్చుని మైకులో సినిమా గురించి చెబుతుండేవాడు. బండిలోనుంచి కరపత్రాలు విసిరేస్తే అవి పట్టుకోవడానికి కుర్రవాళ్ళం నానా తంటాలు పడేవాళ్ళం. ఎన్టీఆర్  నటించిన అ సినిమా ఎల్లాగయినా చూడాలని మా అమ్మ వెంట పడ్డాం. నాన్న చనిపోవడంతో ఆమెకు మేమంటే ప్రాణం. కానీ ఆమెకు డబ్బు వ్యవహారాలు ఏమీ తెలవ్వు. అన్నీ  మా బామ్మే చూసుకునేది. కాళ్ళు ఒత్తిందో, నడుం నెప్పికి అమృతాంజనం రాసిందో ఏం చేసిందో కాని మడి బీరువాలో దాచిపెట్టిన చిల్లర డబ్బుల్లోనుంచి మూడు పావలాలు అడిగి తీసుకుని రెండు  మా మూడో అన్నయ్య చేతిలో పెట్టింది. ఇంకో పావలా నాకిచ్చి సినిమా మధ్యలో ఏదైనా కొనుక్కోమని చెప్పింది. మాతో పాటు మరో నలుగురు  సావాసగాళ్ళు రావడానికి తయారయ్యారు.  పొలాల గట్ల మీద నడుచుకుంటూ వెడుతుంటే అక్కడక్కడ ఎండ్రకాయల బొరియలు కనబడేవి. మేము ఊరు పొలిమేరలకు చేరగానే సినిమాహాలువాడు  వేసే పాట మైకులో  వినిపించింది. మొదటి ఆటకు సినిమా టిక్కెట్లు అమ్మడం మొదలు పెట్టడానికి ముందు ఊరంతా వినిపించేటట్టు పాటలు వేసేవాళ్ళు.



సరే!  నేల క్లాసు పావలా టిక్కెట్టు కొనుక్కుని హాల్లోకి వెళ్ళాము. జనం బాగానే వున్నారు. మధ్యలో చోటుచూసుకుని కూర్చున్నాము. పైన డేరాకున్న చిల్లుల్లో నుంచి ఆకాశం కనబడుతోంది. కొనుక్కున్న కట్టె మిఠాయి తింటూ వుండగానే సినిమా మొదలయింది. ఫిలిమ్స్ డివిజన్ వారి చిత్రంలో నెహ్రూ గారు కనబడగానే హాలు మొత్తం కేరింతలు. రామారావు సినిమా అని ఎగబడి వెళ్ళాము కానీ,  అసలు సినిమా మాకెవ్వరికీ అంత నచ్చలేదు.
తిరిగివచ్చేటప్పుడు చూడాలి, వెన్నెల వెలుతుర్లో కనిపించే ఎండ్ర కాయ బొరియలు ఎంతో భయపెట్టాయి. వచ్చేటప్పుడు ఒక తాడు తెచ్చుకున్నాము, ఆరుగురం ఆ తాడు పట్టుకుని వరసగా నడవడానికి. ఎవ్వరూ తప్పిపోకుండా ఆ ఏర్పాటు. చిన్నవాడినని నన్ను మధ్యలో నడవమన్నారు. సినిమా ఏమో కాని ఇంటికి చేరేవరకు లోపల  బితుకు బితుకుమంటూనే వుంది.
ఈరోజు ఏదో ఛానల్లో చంద్రహారం చిత్రం వస్తుంటే ఈ పాత సంగతులు గుర్తుకు వచ్చాయి.

(22-04-2016) 

NOTE: COURTESY IMAGE OWNER        

20, ఏప్రిల్ 2016, బుధవారం

మా అన్నయ్య చేసింది రైటే!



మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు  గారంటే నాకెంత గౌరవం వుందో అంతకు మించి రెట్టించిన  కోపం కూడా వుంది.  గౌరవం ఎందుకంటే ఆయన్ని  మించి  గౌరవించతగిన గొప్పవ్యక్తి  ఈ సమస్త భూప్రపంచంలో  నాకు మరొకరు ఎవ్వరూ లేరు. ఇక కోపం ఎందుకంటే, ఆయన బతికి వున్నప్పుడు ‘చెన్నా టు అన్నా’ అనే పుస్తకం రాస్తుంటానని ఎప్పుడూ చెబుతుండేవాడు. మొదటిసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పీఆర్వో ఆయనే. ఆ రోజుల్లో పీఆర్వో, అన్నా,  సీపీఆర్వో అన్నా,  ప్రెస్ సెక్రెటరీ అన్నా సమస్తం ఆయనే. తరువాత  అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఆ తదుపరి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన నందమూరి తారక రామారావు, ఇలా ఏకంగా వరుసగాఅయిదుగురు ముఖ్యమంత్రులకు పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనది. అందుకే ఆ పుస్తకం పేరు అలా పెట్టాడు.  కానీ రాయకుండానే దాటిపోయాడు.  అదీ నాకు కోపం.  ఆయన ధారణ శక్తి అపూర్వం. ఒక విషయం విన్నాడంటే ఎన్నేళ్ళు అయినా మరచిపోడు. తారీఖులతో సహా గుర్తు. ఇక విషయం వివరించడంలో,  మా అన్నయ్య అనికాదుకానీ  ఆయనకు ఆయనే సాటి.  ఇంగ్లీష్, తెలుగు భాషలు కొట్టిన పిండి. రాసినా, మాట్లాడినా అదో అద్భుతమైన శైలి. అన్నింటికీ  మించి వెలకట్టలేని నిబద్ధత. అలాటివాడు  అలాటి పుస్తకం రాశాడు అంటే గొప్పగా వుండి తీరుతుందనే నమ్మకం అందరిదీ. ఒక విషయం,  తమ్ముడిని  కాకపొయుంటే ఇంకా గొప్పగా పొగిడేవాడిని.


ఎందుకో ఏమిటో కారణం తెలవదు. గొప్ప ఆధ్యాత్మిక గ్రంధాలు ఎన్నో ఒంటి చేత్తో రాశాడు కానీ రాజకీయాల జోలికి వెళ్ళలేదు.  కాగితాల బొత్తి తొడమీద పెట్టుకుని వందల, వేల పేజీలు   రాస్తూపోయాడు. పైగా రాసినవన్నీ  రిఫరెన్సు కు పనికి వచ్చే గ్రంధాలు. కంప్యూటరు లేదు, ఇంటర్ నెట్ లేదు. టైప్ చేసేవాళ్ళు లేరు. ప్రూఫులు దిద్దేవాళ్ళు లేరు, ఎందుకంటే రాసిన విషయాలు అటువంటివి, పేర్కొన్న శ్లోకాలు అటువంటివి. తభావతు రాకూడదు, స్ఖాలిత్యాలు  వుండకూడదు. ఒంటిచేత్తో అన్నదందుకే.  నరసింహస్వామి తత్వం గురించి అవగాహన చేసుకుని రాయడానికి దేశంలో ఎక్కడెక్కడో వున్న నరసింహ క్షేత్రాలు  సందర్శించాడు. కోల్కతా, చెన్నై వంటి నగరాలలోని  గ్రంధాలయాల చుట్టూ తిరిగి రాసుకున్న నోట్స్ తో అద్భుత గ్రంధాలు వెలువరించాడు. ఏ ఒక్క పుస్తకాన్నీ అమ్ముకోలేదు. అటువంటి వాటిపట్ల మక్కువ వున్నవారికి ఉచితంగా కానుకగా ఇచ్చేవాడు. ఆ క్రమంలో ఒకరకమైన ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయాడు.  బహుశా మానసికంగా ఒక స్థాయికి చేరిన తరువాత ఆయనకు ఈ విషయాలు అన్నీ పనికిమాలినవిగా అనిపించాయేమో తెలవదు.
ఇప్పుడు ఇన్నాళ్ళకు అనిపిస్తోంది ఆయన చేసిన పని సబబేనని. ఏవుంది ఈ రాజకీయాల్లో. రాసింది ఒకళ్ళు మెచ్చుతారా, ఒకళ్ళు నచ్చుతారా! అందరూ గిరిగీసుకుని కూర్చున్నారు. ఒకరు మెచ్చింది మరొకరు నచ్చరు. తమ మనసులో వున్నదే రాయాలంటే ఇక రాయడం ఎందుకు? అసలు  ఇంత అసహనం ఎందుకు? ఈ స్థాయిలో రాజకీయ నాయకుల పట్ల సినీ హీరోల మాదిరిగా అభిమాన దురభిమాన ప్రదర్శనలు ఎందుకు? ఒక్క ముక్క కూడా వ్యతిరేకత ధ్వనించినా సహించలేని పరిస్తితి. చరిత్ర తెలియాలంటే జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళు వుండాలి. వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు వుండాలి. అప్పుడే చరిత్ర, చరిత్రగా రికార్డు  అవుతుంది. కానీ ఈ ముక్కలు ఎవరి చెవికీ ఎక్కడం లేదు.  

ఇవన్నీ చూస్తున్న తరువాత మళ్ళీ  మళ్ళీ అనిపిస్తోంది ఆయన రాజకీయం రాయకపోవడం రైటే అని.  (20-04-2016)      

19, ఏప్రిల్ 2016, మంగళవారం

ఎవరేమనుకున్నా సరే!



అవకాశాలు  రాని  సమర్దులకన్నా, అవకాశాలు వచ్చిన అసమర్ధులకు మంచి పేరు వచ్చే రోజులివి. ఈ రెండో రకానికి చెందిన నేను ఆ రకంగా మా సీనియర్ల కంటే  అదృష్టవంతుడిని. రిటైర్  అయిన తరువాత కూడా యేవో మనసులోని మాటలు వ్యాసాల రూపంలో రాసుకోగల బంగారు అవకాశం సాంఘిక మాధ్యమాల రూపంలో నాకు లభించింది.
వెనుకటి రోజుల్లో పత్రికలకు వ్యాసాలూ అవీ రాయడం  గగనంగా వుండేది. ముందు రాయాలి. రాసింది మళ్ళీ సాఫు చేసుకుని తిరగ రాయాలి. రాసింది ‘తిరుగు టపాకు తగినన్ని స్టాంపులు జతచేసి’ మరీ పోస్టులో పంపాలి. అది చేరిందో లేదో తెలవదు. చేరినా చేరిందనే కబురు తెలవదు. ఆశ ఒదులుకున్న తరువాత  ఎక్కడి నుంచో ఓ మిత్రుడు పోస్ట్ కార్డు రాసి పడేస్తాడు, ‘పలానా పత్రికలో మీ వ్యాసం చదివానని’.  ఆ రచన పడ్డ పత్రిక వెతికి పట్టుకోవడానికి  నానా ఇబ్బందులు పడాల్సివచ్చేది.
ఇప్పుడలా కాదు. అంతా  ఇన్  స్థంట్ కాఫీ  మాదిరి. ఇలా రాసి అలా పోస్ట్ చేయడం తరువాయి బాగుందనో, బాగాలేదనో కామెంట్లు కూడా తయారు. కొందరయితే శ్రద్ధగా చదివి తప్పొప్పులను ఎత్తి చూపెడతారు. సరిదిద్దుకునే సదవకాశం కూడా వుంటుంది. అందుకే నేను పత్రికలకోసం రాసినప్పుడు, వారికి  ఇష్టం వున్నా లేకపోయినా ఒక రోజు ముందే వాటిని ఫేస్  బుక్, బ్లాగు వంటి మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాను. యెంత జాగ్రత్తగా రాసినా కొన్ని స్ఖాలిత్యాలు దొర్లడం కద్దు. వాటిని ఎంచక్కా దిద్దుకోవచ్చు. అదీ  నా స్వార్ధం.
కాకపోతే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. పత్రికల్లో రాసినప్పుడు ఎవరికయినా నచ్చకపోయినా ఆ విషయం మనకు తెలిసేనాటికి చాలా రోజులు పడుతుంది. ఇక్కడ అలా కాదు, వెంటనే, మొట్టి కాయలు ఎలాంటి మొహమాటం లేకుండా వేసేస్తారు.
ఇన్నేళ్ళ వయస్సులో అవన్నీ పట్టించుకుంటే కష్టం. అందుకే ఎవరి ఇష్టం కోసమో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాసుకుంటూ పోతుంటాను.
పాత జోకు ఒకటి వుంది కదా!
దుకాణం బయట రాసి వుంటుంది.
“మీరు అరువు అడుగుతారు. నేను ఇస్తాను.  మీరు తిరిగి డబ్బు కట్టరు. చివరికి నేను బాధ పడతాను.
“మీరు అడుగుతారు. నేను ఇవ్వను. ఇవ్వలేదని  మీరు బాధపడతారు.
“నేను బాధ పడడం కంటే మీరు బాధ పడడమే మేలు కదా!”
అల్లాగే ఇక్కడ కూడా. మీకు నచ్చాలని నాకు నచ్చనివి నేను రాయను.

మీరు ఏమనుకున్నా సరే!   


(NOTE: COURTESY IMAGE OWNER)
       

చంద్రబాబు నాయుడు @ 66 నాట్ అవుట్

సూటిగా.....సుతిమెత్తగా...... భండారు శ్రీనివాసరావు
(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY)
(ఏప్రిల్ 20, చంద్రబాబు జన్మదినం)
“ముఖ్యమంత్రి చంద్రబాబుకు మానవాతీత శక్తులేవో వున్నట్టున్నాయి. ఆయన ఒక కార్యక్రమం తరువాత మరొక కార్యక్రమానికి ఊపిరాడనివేగంతో పరుగులు పెడతారు. ఆయన వేగాన్ని అందుకోలేక మిగతావారు ఆపసోపాలు పడాల్సిందే” - టైమ్స్ ఆఫ్ ఇండియా (22-08-2002)
ఆ పత్రిక ఇది రాసి ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళు గడిచాయి. కానీ పైకి పొగడ్త మాదిరిగా కనిపించే ఆ పత్రిక అభిప్రాయం తప్పని ఇప్పటికీ చెప్పలేని పరిస్తితి. అంతకంటే చాలా ఏళ్ళకు పూర్వం నుంచే ఒక విలేకరిగా ఆయన గురించి నాకున్న అభిప్రాయం కూడా అదే!
నాకు చంద్రబాబు నాయుడితో 1978 నుంచీ పరిచయం. ఆయన, మరో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలు అయి, శాసన సభలో అడుగుపెట్టారు. కాకపొతే చిన్న తేడా ఏమిటంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి ముందుగా డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో చేరారు. సుమారు రెండేళ్ళ తరువాత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ మార్పిడిలో భాగంగా ఏర్పాటయిన అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబుకు సయితం చోటు దొరికింది. తదుపరి భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గాల్లో కూడా చంద్రబాబు క్యాబినెట్ హోదాలో పనిచేసారు.
1982 ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతొ ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీ యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రనే తిరగరాసింది. అప్పటివరకు యువ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన చంద్రబాబునాయుడు, ఎన్నికల్లో ఓటమి ఎదురయిన కొంత కాలానికే తెలుగు దేశంలో చేరిపోవడం ఆయన రాజకీయ జీవితాన్నే గొప్ప మలుపు తిప్పింది. కాంగ్రెస్ లో కొనసాగివుంటే మంచి అవకాశాలకోసం ఎదురుచూస్తూ, ఆయన కూడా నలుగురిలో ఒకడిగా మిగిలివుండేవాడేమో.
టీడీపీ లో చేరిన తరువాత చాలా సంవత్సరాల పాటు చంద్రబాబు పార్టీ కార్యకలాపాలకే పరిమితం అయ్యారు. నేపధ్యంలో వుంటూనే ఒక నాయకుడిగా ఎదగడానికి అప్పటి ముఖ్యమంత్రి రామారావుతో ఆయనకు వున్న సాన్నిహిత్యం ఎంతగానో దోహదపడింది. ఈ అవకాశాన్ని ఆయన సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగారు.
పొతే టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే నాదెండ్ల భాస్కర రావు కారణంగా రామారావు పదవీచ్యుతులు అయిన దరిమిలా ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ కాలంలో చంద్రబాబు వ్యవహార దక్షత తొలిసారి వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి అల్లుడిగా కాకుండా లెక్కించదగిన వ్యక్తిత్వం ఆయనలో దాగున్న సంగతి బహిర్గతమైంది. పార్టీలో ఆయన స్థానం మరింత సుస్తిరమైంది. పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆయనదే హవా. లేనప్పుడు ఆయనదే హవా. దాంతో రాజకీయంగా చంద్రబాబు పట్టింది బంగారమైంది.
రెండోసారి రామారావుపై జరిగిన తిరుగుబాటుకు చంద్రబాబే నాయకుడు కావడం మరో వైచిత్రి. రాజకీయాలకున్న రంగూ,రుచీ, వాసన ఎలాంటిదో దానితో లోకానికి వెల్లడయింది.
అప్పటివరకు పార్టీలో, ప్రభుత్వంలో రెండో స్థానంలో వున్న చంద్రబాబు మొదటిసారి మొదటి స్థానం లోకి వచ్చి వ్యవహారాలను సరిదిద్దాల్సిన పరిస్తితి ఏర్పడింది. ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చే పాత్రనుంచి ముఖ్యమంత్రి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఆషామాషీ కాదు. పైగా దెబ్బతిన్న బెబ్బులిలా పక్కనే ఎన్టీఆర్.
ఇక్కడే చంద్రబాబులోని అసలయిన రాజకీయ నాయకుడు బయటకు వచ్చాడు. ఎంతమాత్రం అనుకూలంగా లేని పరిస్తితులను క్రమంగా తన చేతిలోకి తీసుకోవడం మొదలు పెట్టారు. ఆకాశమంత ఎత్తున వున్న ఎన్టీఆర్ వ్యక్తిత్వం ముందు తాను వెలతెలా పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తీరు చంద్రబాబు దక్షతకు అద్దం పట్టింది. తనలోని లోపాలను ముందుగా పసికట్టి వాటిని సరిదిద్దుకునే పనికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగునేల నాలుగు చెరగులా చంద్రబాబు పేరు తెలిసి వుండవచ్చుకానీ, గండిపేట పార్టీ ఆఫీసుకే పరిమితం అయిన ఆయన్ని జనం గుర్తుపట్టే పరిస్తితి లేదు. అందుకే ఆకాశవాణి, దూరదర్సన్ ల ద్వారా వారం వారం ప్రజలతో నేరుగా ముచ్చటించే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. వినూత్న పధకాలకు రూపకల్పన చేసేలా అధికారులను ప్రోత్సహించడం ప్రారంభించారు. చేసిన ప్రతి పనికీ పదింతలు ప్రచారం లభించేలా శ్రద్ధ తీసుకున్నారు. యోగా, వ్యక్తిత్వ వికాసం వంటి శిక్షణ తరగతుల్లో స్వయంగా పాల్గొని, ఏ అంశం పైన అయినా అనర్ఘలంగా ప్రసంగించే నిపుణత సాధించడానికి ఎంతో సాధన చేసారు. సమర్దులయిన, అత్యంత నమ్మకస్తులయిన అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి పేషీలో పెట్టుకుని పరిపాలన సాగించారు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా పత్రికల ద్వారా తెలుసుకుని అధికారులు వెళ్ళే లోగా అక్కడ ప్రత్యక్షం అయ్యేవారు. ఎక్కడో హైదరాబాదులో వుండే ముఖ్యమంత్రి, తమవాడిగా, తమలోని వాడిగా జనం మధ్య తిరుగాడడం అనేది వారికి అంతవరకూ అనుభవంలో లేని సరికొత్త అనుభూతి.
ప్రజల మనస్సుల్లో ప్రతిష్టితమై వున్న ఎన్టీ రామారావు స్మృతిని పార్టీ కార్యాలయానికి పరిమితం చేసి, పాలకుడిగా అయన ప్రజల్లోకి దూసుకుపోయిన వైనం ఆయనకు అపర చాణక్యుడు అనే కీర్తిని కట్టబెట్టింది.
సందర్భం కనుక ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి.
ఎన్టీఆర్, చంద్రబాబుల వ్యవహార శైలిపై ఓ సీనియర్ జర్నలిష్టు సహచరుడు ఉటంకించిన పోలిక ఇది.
“ఇద్దరూ తెలివైన వారే. ఒకరు ఏడాది మొత్తం కష్టపడి చదివి పాసవుతాడు. రెండో వాడు అలా కాదు, సినిమాలు చూస్తూ, షికార్లు చేస్తూ టీచర్లు చెప్పిన పాఠాలు ముక్కునపెట్టుకుని పరీక్షల్లో రాసి పాసయ్యే రకం.”
జర్నలిష్టు మిత్రుడి కవి హృదయం ఏమిటంటే, ఎన్టీఆర్ ఎన్నికలప్పుడు రంగంలోకి దిగి అహోరాత్రులు కష్టపడి విజయం సాధిస్తారు. చంద్రబాబు ఏడాది పొడుగునా శ్రమించి పరీక్షలు రాసి ఒడ్డున పడతారు.
ఎందుకంటే ఎన్టీఆర్ కి తన బలమేమిటో తెలుసు. చంద్రబాబుకు తన బలహీనత ఏమిటో తెలుసు.
1978 నుంచి యేదో కొద్ది కాలం మినహాయిస్తే చంద్రబాబు అధికారంలోనో, అధికార కేంద్రానికి అతిచేరువగానో లేదా ప్రతిపక్ష నేత హోదాలోనో ఇన్నేళ్ళుగా ఏదో ఒక అధికార పీఠంలో కొనసాగుతూ వస్తున్నారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం కలిగిన సమకాలీన రాజకీయ నాయకుడు రాష్ట్రంలో మరొకరెవ్వరూ లేరు కూడా. ఇదొక అరుదయిన రికార్డు. అలా అని రాజకీయ జీవితంలో అసలు గడ్డు రోజులు ఎదుర్కోలేదని కాదు. రామారావు గారి హయాములోనే తెలుగు దేశం పార్టీ ఒక సారి ఓటమి చవి చూసి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. చంద్రబాబు నేతృత్వంలో కూడా 2004 లో మరోసారి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలకి గెలుపు ఓటములు అతి సహజం. అయితే ఒక ప్రాంతీయ పార్టీ వరసగా రెండు మార్లు అధికారానికి దూరం అయితే తిరిగి కోలుకోవడం కష్టం. అలాంటి అరుదయిన విజయాన్ని కూడా చంద్రబాబు 2014 లో తన ఖాతాలో వేసుకోగలిగారు. ఒకరకంగా చెప్పాలంటే, చేజారినట్టు నమ్మకం కలిగిన తరువాత చేజిక్కిన అపూర్వ విజయం అది. అనేక ప్రతికూల పరిస్తితులు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో, రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపధ్యంలో కేవలం ఆయన సమర్ధత మీది నమ్మకంతోనే ప్రజలు, ఒక దశలో ఆశలు ఒదులుకున్న ఈ విజయాన్ని, అధికారాన్ని తిరిగి చంద్రబాబుకు అప్పగించారన్నది తిరుగులేని వాస్తవం. ప్రజల్లోని ఈ నమ్మకానికి తూట్లు పడ్డాయని చెప్పే పరిస్తితులు ఇప్పటికయితే లేవు కానీ ముందు ముందు తలెత్తకుండా చూసుకోవడం చాలా అవసరం.
చంద్రబాబు వ్యవహార శైలికి ఒక మచ్చు తునక.
ఆకాశవాణి, దూరదర్సన్ కేంద్రాలనుంచి వారం వారం ప్రతిసోమవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించే ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమానికి రేడియో విలేకరిగా నేనూ ప్రతిసారీ వెడుతుండేవాడిని. ఆ రోజుల్లో ప్రూడెన్షియల్ సహకార బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అందులో తమ కష్టార్జితాన్ని దాచుకున్న వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఒక సోమవారం నాడు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు జవాబు చెబుతున్నప్పుడు ఆ బ్యాంకు బాధితుడు ఒకరు లైన్లోకి వచ్చి తన ఆవేదనను కాస్త ఘాటయిన రీతిలోనే ముఖ్యమంత్రికి ఎరుకబరిచాడు. చంద్రబాబు ఆయన చెప్పినదంతా ఓపిగ్గా విని, మరునాడు వచ్చి తనను కలుసుకోవాల్సిందని సూచించారు. కార్యక్రమం అవగానే సీ.ఎం. కార్యాలయ ఉన్నతాధికారులు, సహకారశాఖ ఉన్నతాధికారులు, ప్రూడెన్షియల్ బ్యాంకుకు ప్రభుత్వం నియమించిన చైర్మన్ తో సమావేశమై పరిష్కార మార్గాలను గురించి చర్చించారు. మరుసటి రోజు ఉదయం ఆ బాధితుడు కూడా మరికొందరిని వెంటబెట్టుకుని సీఎం నివాసానికి చేరుకున్నాడు. అక్కడే పలుదఫాలుగా చర్చలు జరిగాయి. సమస్యల పరిష్కార మార్గాల అన్వేషణలో బాధితుల అభిప్రాయాలు కూడా చెల్లుబాటు అయ్యేందుకు వీలుగా, వారి ప్రతినిధులుగా ఇద్దరిని బ్యాంకు డైరెక్టర్లుగా తీసుకోవాలని అప్పటికక్కడే నిర్ణయం తీసుకున్నారు. సీఎం ని కలవడానికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా వెనుతిరిగారు.
జర్నలిష్టుగా చురుగ్గా పనిచేస్తున్న రోజుల్లో నాకు తెలిసిన చంద్రబాబు వ్యవహార శైలికీ ఇప్పటికీ పోలిక లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల రంగూ, రుచీ పూర్తిగా మారిపోయిన మాట కూడా వాస్తవమే. రాజకీయ అనివార్యతలు కొంతమంది సమర్ధులచేత కూడా, కూడని పనులు చేయిస్తుంటాయి. ఒడ్డున కూర్చుని చెప్పేవారి నీతులు వారికి పొసగక పోవచ్చు. పీత ఇబ్బందులు పీతవి. అలా అని అసాధారణ వ్యక్తిత్వం వున్న వాళ్ళు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆలోచనలు చేస్తుంటే. ఎలాటి స్వార్ధ ప్రయోజనాలు ఆశించకుండా వారిని అభిమానించేవారి మనసుకు కష్టంగానే వుంటుంది.
చంద్రబాబుకు నిజమైన అభిమానులు అనేకమంది వున్నారు. ప్రతిఫలం గురించి ఆలోచించకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు లేదా పార్టీ ప్రయోజనాల కోసం ఆయన్ని అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా సాంఘిక మాధ్యమాల్లో తారసిల్లుతుంటారు. అందులో ఒకడు సత్యసాయి.
కృష్ణా జిల్లాకు చెందిన సత్య సాయికి మొదటి నుంచి స్వగ్రామం అంటే మక్కువ ఎక్కువ. ఇక చంద్రబాబు అంటే అతడికున్న అభిమానాన్ని ఎంచడానికి కొలమానం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రూపకల్పన చేసిన స్మార్ట్ విలేజ్ పధకం విదేశీ వాలంటీర్లలో సత్యసాయి ఒకడు. వత్సవాయి మండలం ఎమ్మార్వో ప్రతి గురువారం ఉదయమే ఆ గ్రామానికి వెళ్లి సాయంత్రం దాకా వుండి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంటారు. ఎమ్మార్వో వద్ద ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్ వుంది. దాని సాయంతో ఇంగ్లండులో వుంటున్న సత్యసాయి ఎమ్మార్వోతో నెట్ కనెక్షన్ పెట్టుకుని అన్ని సంగతులు ఆరా తీస్తుంటాడు. ఆ అధికారి కూడా అతడు ఏది అడిగినా కాదనకుండా అన్ని సంగతులు చెబుతుంటాడు. దానికి కారణం వుంది. వూళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అతడు ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తుంటాడు. వూళ్ళో అతను చదువుకున్న స్కూల్లో మగపిల్లలకు, ఆడపిల్లలకు ప్రభుత్వం పూనుకుని వేర్వేరుగా మరుగుదొడ్లు కట్టించింది. లావెట్రీలు అయితే కట్టించారు కానీ వాటిని రోజువారీగా పరిశుభ్రం చేసేవాళ్ళు లేరు. పేరుకు ఒక మనిషిని పెట్టారు. కానీ అతడు మండలం మొత్తంలోని అన్ని గ్రామాలను చూసుకోవాలి. పైగా అతడికి ఇచ్చే భత్యం కూడా అతి స్వల్పం. దీనికి తోడు అయిదారు మాసాలకోసారి చెల్లింపులు. అంచేత అతడిని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్తితి. అలాగే గ్రామంలో ఇతర సంక్షేమ పధకాలు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఏపనీ సకాలంలో పూర్తవడం లేదని సత్యసాయికి అర్ధం అయింది. ముఖ్యమంత్రి మీద వున్న అభిమానంతో అతడే స్వయంగా పూనుకొని ఓ పరిష్కారాన్ని అధికారులకు వీడియో కాన్ఫరెన్సులో వివరించాడు. డబ్బుకోసం పనులు ఆపవద్దనీ, అవసరమైన మొత్తం ఎంతో తెలియచేస్తే తాను సర్దుబాటు చేస్తాననీ, నిధులు విడుదల అయినప్పుడు తనకు తిరిగి ఇచ్చే విషయం ఆలోచించుకోవచ్చనీ వారికి చెప్పాడు. నిజంగా ఇది ఎంతో మంచి ఆలోచన. నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇతర ఎన్నారై శ్రీమంతులు కూడా ఈ విధమైన డబ్బు సర్దుబాటు కార్యక్రమానికి పూనుకుంటే ఏ మంచి పధకం కూడా నిధుల కొరత పేరుతొ అరకొరగా మిగిలిపోదు.
ముఖ్యమంత్రి, అధికార సిబ్బంది చిత్తశుద్దితో పనిచేస్తున్నా కూడా ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగ మించవచ్చన్నది సత్యసాయి అనుభవం తెలియచేస్తోంది.
ఇదంతా ఎందుకంటే తెలియకుండా చంద్రబాబు పోగేసుకున్న అభిమాన సంపద గురించి చెప్పడానికి.
ఆయనకి చుట్టూ వున్న వందిమాగధుల్లో అవసరార్ధం ఉన్నవాళ్ళే ఎక్కువని చెప్పుకోవడం కద్దు. అవసరం తీరగానే, లేదా ఆయనతో అవసరం పడదనో నిశ్చయించుకున్న మరుక్షణమే వాళ్ళు అక్కడ నుంచి బిచాణా ఎత్తేస్తారు. పార్టీలో నమ్ముకున్నవారిని ఎందర్నో కాదని, రాజ్యసభ వంటి పదవులు ఆయన ఎందరికో కట్టబెట్టారు. వారిలో చాలామంది ఈనాడు చంద్రబాబు వెంటలేరన్నది బహిరంగ రహస్యం.
రాజకీయాలు గురించీ, అవి ఎలా వుండాలి అనే అంశం గురించీ ఒకప్పుడు చంద్రబాబు స్వయంగా చెప్పిన మాటలు గుర్తుచేసుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను.
2003 అక్టోబర్ ఒకటో తేదీన చంద్రబాబు జీవితంలో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బ్రహ్మోత్సవాల సమయంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెడుతున్నారు. ఘాట్ రోడ్డులో అలిపిరి దాటగానే నక్సలైట్లు పెట్టిన మందు పాతర పేలి ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు ( ఏ.పి. 9 పి. 3026) ఇరవై అడుగుల దూరానికి ఎగిసిపడి, ఓరాళ్ళ గుట్టకు కొట్టుకుని పల్టీ కొట్టింది. కారు తుక్కు తుక్కయి పోయింది. ముఖ్యమంత్రితో పాటు అదే కారులో వున్న మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే చదలవాడ కృష్ణ మూర్తి, మరో ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి ప్రభ్రుతులు ఏం జరుగుతున్నదో తెలియని షాక్ కి గురయ్యారు. గాయపడి రక్తసిక్తమైన దుస్తులతో వున్న వారినందరినీ భద్రతా సిబ్బంది అతికష్టం మీద బయటకు తీసి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారు దెబ్బతిన్న తీరు టీవీల్లో చూసిన వారెవ్వరూ కారులోని వారు బతికి బట్టకడతారని ఊహించి వుండరు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాబట్టి ప్రాణాపాయం తప్పింది. ఒకరకంగా వారికి పునర్జన్మ.
హైదరాబాదు చేరిన తరువాత పరామర్శల పరంపర. రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి చంద్రబాబుని పరామర్శించారు. ఇక ఇంటాబయటా మీడియా ఇంటర్వ్యూలకు కొదవలేదు. ఆరోజుల్లో తనని కలవడానికి వచ్చిన ఆత్మీయులతో చంద్రబాబు తన మనస్సులోని మాటలను పంచుకున్నారు. అది తెలియచేయడానికే ఇంతటి సుదీర్ఘ వివరణ.
ఆ నాటి బాబు మనసులోని భావాలను ప్రముఖ జర్నలిష్టు ఐ.వెంకటరావు, చంద్రబాబుపై తాను రాసిన ‘ఒక్కడు’ అనే గ్రంధంలో ఇలా పేర్కొన్నారు.
“ఇంతకాలంగా నేను రాజకీయ నాయకుడిగా వున్నాను. ఇంకెంత కాలం ముఖ్యమంత్రిగా వున్నా, ఏదో ఒక నాటికి మాజీ ముఖ్యమంత్రిని కాకతప్పదు. ఈ రోజు నాకు మరో అవకాశం వచ్చింది. ఇది నాకు రెండవ జన్మ వంటిది. అందుకే దానిని మంచికి ఉపయోగించాలని అనుకుంటున్నాను. మంచి వాళ్ళనే దగ్గరకు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నేళ్ళుగా రాజకీయ నాయకుడి(పొలిటీషియన్)గా వ్యవహరించాను. ఇక ముందు రాజనీతిజ్ఞుడి(స్టేట్స్ మన్ )గా మారాలనుకుంటున్నాను”
అలిపిరి సంఘటన తరువాత కొన్ని నెలలకే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి దూరం అయి దాదాపు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. రాష్ట్ర విభజన తదనంతరం ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
అప్పటికీ ఇప్పటికీ పరిస్తితులు ఎంతో మారిపోయాయి. ఆ రోజుల్లో పదవిలో కుదురుకోవడం తప్ప వేరే సమస్యలు లేవు.
ఇప్పుడలా కాదు. చుట్టూ సమస్యలు, మధ్యలో చంద్రబాబు.
సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలని ఆయన తరచూ చెబుతుంటారు. సమస్యల నడుమ వున్న చంద్రబాబుకు ఇప్పుడా అవకాశం ఆయన ఎదుటే వుంది.
సమర్ధత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకి మిగిలిన ఏకైక వనరు కూడా ఆ సమర్ధతే. మిగిలిన వనరులకు దారులు మూసుకు పోతున్నట్టు కానవస్తున్న ఈ తరుణంలో ఆయన తన సమర్ధతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకే ఎక్కువగా వుంది.
ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులను, పరిణామాలను పరిశీలించే వారికి నిరాశ కలుగుతోంది. నిజానికి కొత్త రాష్ట్రానికి ఇప్పుడు రాజకీయ నాయకుల అవసరం లేదు. రాజనీతిజ్ఞుల కొరత బాగా వుంది. కొరతగా వుండడం కాదు అసలిప్పుడు అలాంటివాళ్ళు ఎవళ్ళూ లేరు అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుందేమో!
66 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆనాటి ఆయన మాటను ఈవిధంగా ఓసారి గుర్తుచేస్తున్నాను.
ఉపశృతి: పునరుక్తి దోషం అయినా సందర్భం కాబట్టి మరో మారు గుర్తు చెయ్యక తప్పదు.
మా ఇంట్లో పనిచేస్తున్న వాచ్ మన్ కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చింది. వాళ్ళ ఓట్లు మాత్రం స్వగ్రామంలోనే వున్నాయి.
టీవీ తెరపై చంద్రబాబును చూడగానే మా పనిమనిషి కళావతి మోహంలో చెప్పలేని ఆనందం.
‘బాబుగారు దేవుడండీ. ఇవ్వాళే మా సర్పంచు గారు ఫోను చేసి చెప్పారు. మాకు పక్కా ఇళ్ళు శాంక్షన్ చేసారట’ అని మా ఆవిడతో చెబుతోంది.
పార్టీ మారి పదవి పుచ్చుకోబోతున్న రాజకీయ నాయకుడి మోహంలో కూడా ఇంతటి సంతోషం కానరాలేదు.
నిజానికి నిజమైన రాజకీయ పార్టీలకి నిజమైన బలం కళావతి వంటి సామాన్య ఓటర్లే. అటువంటి వారి అభిమానం ఉన్నంతకాలం జంప్ జిలానీలతో పనియేల?
సూటిగా అనుకున్నా....సుతిమెత్తగా అనుకున్నా.. చివరగా చెప్పే మాట ఇదొక్కటే! (19-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 

కింది చిత్రం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు స్కూటర్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకుని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాను. లోకసభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతూ కూడా వీలు చేసుకుని ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శించినప్పటి అపురూప జ్ఞాపక చిత్రం.


18, ఏప్రిల్ 2016, సోమవారం

పాత చంద్రబాబు కావాలి



(ఏప్రిల్ ఇరవై, బుధవారం  చంద్రబాబునాయుడు జన్మదినం)


ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో ప్రముఖ మీడియా సంస్థ సీఎమ్ఎస్, చంద్రబాబు రెండేళ్ళ  పాలనపై సర్వే చేసి తాజాగా ఆ ఫలితాలను విడుదల చేసింది. ఆ సంస్థకు వున్న విశ్వసనీయతను గమనంలో పెట్టుకుంటే, ఏప్రిల్ ఇరవయ్యో తేదీన అరవయ్యారవఏట అడుగిడుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇది ఘనమైన జన్మదిన కానుక. అంతే కాదు, సర్వేలో పాల్గొన్న ప్రజల్లో మూడింట రెండు వంతుల మంది చంద్రబాబుకు రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం లేదనడం మరో అద్భుతమైన ప్రశంస. పుట్టినరోజు నాడు అందాల్సిన చక్కని మెచ్చుకోళ్ళు ఆయనకి ఒకింత ముందుగానే దక్కాయి.       
అరవై ఆరేళ్ళు, అందులో ముప్పయి ఎనిమిదేళ్ళు ప్రజాజీవితం. మంత్రిగా రెండు దఫాలుగా రెండున్నర సంవత్సరాలు, మూడు సార్లు  ముఖ్యమంత్రిగా  ఇంచుమించుగా పదకొండేళ్ళు, ఇక ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు- వెరసి  1956 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవంలో ఆయనతో పోల్చతగ్గ సీనియర్ నాయకుడు మరొకడు లేడు.
నారా చంద్రబాబు నాయుడు అంటే ఇంటాబయటా పదుగురికి పరిచయం అయిన పేరు. ఎప్పుడో చాలా ఏళ్ళక్రితం బ్రహ్మకుమారీల ఆహ్వానం మేరకు రాజస్థాన్ లోని మౌంట్ అబూ వెళ్ళినప్పుడు అక్కడి ఓ  టాక్సీ  డ్రైవర్ నోట చంద్రబాబు పేరు వినపడ్డప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. భాష పూర్తిగా తెలవకపోయినా అతడి భావం బాగా అర్ధం అయింది. చంద్రబాబు వంటి వ్యక్తి తమ  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే ఎంతో బాగుంటుందని, రాష్ట్రం  బాగుపడుతుందని అతడి మాటల తాత్పర్యం. ఇల్లా వెలిగిపోతుండేది పరాయి రాష్ట్రాల్లో ఆయన ప్రభ. ఇతర రాష్ట్రాల్లో రైళ్ళలో ప్రయాణిస్తున్నప్పుడు తెలుగు వాళ్ళం అని తెలియగానే అక్కడి వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ‘బాబు కైసా హై?’ ఆయన్ని అంతగా తమలో కలుపుకునేవాళ్ళు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి వేరే చోట్ల ఇటువంటి ప్రజాదరణ దొరకడం అపూర్వం అనే చెప్పాలి.   విదేశాల్లో సంగతి చెప్పక్కర లేదు. ప్రవాసాంధ్రులకు మన దగ్గర ఓటు హక్కు కల్పిస్తే రాష్ట్రానికి ఆయనే శాస్వితంగా ముఖ్యమంత్రి అని చెప్పుకోగా నేను విన్నాను.
నాకాయన 1980 నుంచి పరిచయం. అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు. నేను రేడియో విలేకరిగా చేరి అప్పటికి  మూడేళ్ళు. ఇందిరాగాంధి  ప్రభంజనంలో గెలిచివచ్చిన ప్రజాప్రతినిధుల్లో చాలామంది చంద్రబాబు వంటి చిన్న వయస్కులే. ఒకరకంగా చెప్పాలంటే యువరక్తం రాజకీయ రంగప్రవేశం చేసింది. వై.ఎస్. రాజశేఖర రెడ్డి , చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మెలిగిన రోజులు ఒక విలేకరిగా నాకు తెలుసు.
కాంగ్రెస్ నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. కాంగ్రెస్ లో కొనసాగి వుంటే ఈ స్థాయికి చేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పట్టేదో ఊహాతీతం. ప్రజల మనిషిగా వున్న ఎన్టీఆర్ ని, ఆయనతో వున్న సాన్నిహిత్యంతో   రాజకీయంగా కూడా   ఒక బలవత్తరమైన శక్తిగా మలచడంలో చంద్రబాబు పాత్ర కీలకం. అదే సమయంలో పార్టీ మీద పట్టు పెంచుకోవడానికి కూడా చంద్రబాబు అ అవకాశాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. ఆయనలోని రాజకీయ కుశలత వెలుగులోకి రావడానికి తెలుగు దేశం పార్టీలో ఆయన నిర్వహించిన పాత్రలు తోడ్పడ్డాయి. ఎక్కడో గండిపేట కార్యాలయంలో ఏసీ సౌకర్యం కూడా లేని ఒక చిన్నగదిలో కూర్చుని పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించడం నాకు తెలుసు.  ఒక చిన్న డెస్క్ టాప్ కంప్యూటర్ లో పార్టీ సభ్యుల వివరాలను గ్రామాల వారీగా నిక్షిప్తం చేసేవారు. నిజానికి వీటితో నిమిత్తం లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోనో, లేదా కౌన్సిల్, రాజ్య సభ సభ్యత్వం వంటి వాటితోనో  సంతృప్తి పడదలచుకుంటే ఆయనకు చిటికెలో పని. కానీ ఆయన పార్టీ బలోపేతానికే అహరహం కృషి చేస్తూ పోయారు. ఈ అనుభవం భవిష్యత్తులో పార్టీలో తన స్థానాన్ని పదిలపరచు కోవడానికి బాగా ఉపకరించింది.  ప్రతి కార్యకర్తను పేరుతొ పలకరించి వాళ్ళ మంచీ చెడూ కనుక్కుంటూ వుండే ఆయన వ్యవహార శైలి చంద్రబాబుకు పెక్కుమందిని దగ్గర చేసింది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహార శైలికి ఒక మచ్చు తునక.
ఆకాశవాణి, దూరదర్సన్ కేంద్రాలనుంచి వారం వారం ప్రతిసోమవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించే ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమానికి రేడియో విలేకరిగా  నేనూ ప్రతిసారీ వెడుతుండేవాడిని. ఆ రోజుల్లో ప్రూడెన్షియల్ సహకార  బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అందులో తమ కష్టార్జితాన్ని దాచుకున్న వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఒక సోమవారం నాడు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు జవాబు చెబుతున్నప్పుడు ఆ బ్యాంకు బాధితుడు ఒకరు లైన్లోకి వచ్చి తన ఆవేదనను కాస్త ఘాటయిన రీతిలోనే ముఖ్యమంత్రికి ఎరుకబరిచాడు. చంద్రబాబు ఆయన చెప్పినదంతా ఓపిగ్గా విని, మరునాడు వచ్చి తనను కలుసుకోవాల్సిందని సూచించారు. కార్యక్రమం అవగానే సీ.ఎం. కార్యాలయ ఉన్నతాధికారులు, సహకారశాఖ ఉన్నతాధికారులు,  ప్రూడెన్షియల్ బ్యాంకుకు ప్రభుత్వం నియమించిన చైర్మన్ తో సమావేశమై పరిష్కార మార్గాలను గురించి చర్చించారు. మరుసటి రోజు ఉదయం  ఆ బాధితుడు కూడా మరికొందరిని వెంటబెట్టుకుని సీఎం నివాసానికి చేరుకున్నాడు. అక్కడే పలుదఫాలుగా చర్చలు జరిగాయి. సమస్యల  పరిష్కార మార్గాల అన్వేషణలో బాధితుల అభిప్రాయాలు కూడా చెల్లుబాటు అయ్యేందుకు వీలుగా, వారి ప్రతినిధులుగా ఇద్దరిని బ్యాంకు డైరెక్టర్లుగా తీసుకోవాలని అప్పటికక్కడే నిర్ణయం తీసుకున్నారు. సీఎం ని కలవడానికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా వెనుతిరిగారు.
జర్నలిష్టుగా చురుగ్గా పనిచేస్తున్న రోజుల్లో నాకు తెలిసిన చంద్రబాబు వ్యవహార శైలికీ ఇప్పటికీ పోలిక లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల రంగూ, రుచీ పూర్తిగా మారిపోయిన మాట కూడా వాస్తవమే. రాజకీయ అనివార్యతలు కొంతమంది సమర్ధులచేత కూడా,  కూడని పనులు చేయిస్తుంటాయి. ఒడ్డున కూర్చుని చెప్పేవారి  నీతులు వారికి పొసగక పోవచ్చు. పీత  ఇబ్బందులు పీతవి. అలా అని అసాధారణ వ్యక్తిత్వం వున్న వాళ్ళు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆలోచనలు చేస్తుంటే, అతి సాధారణ రాజకీయాలు నడుపుతుంటే  ఎలాటి స్వార్ధ ప్రయోజనాలు ఆశించకుండా వారిని  అభిమానించేవారి మనసుకు కష్టంగానే వుంటుంది.
చంద్రబాబుకు నిజమైన అభిమానులు అనేకమంది వున్నారు. ప్రతిఫలం గురించి ఆలోచించకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు లేదా పార్టీ  ప్రయోజనాల కోసం ఆయన్ని అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా సాంఘిక మాధ్యమాల్లో తారసిల్లుతుంటారు. వారిలో అనేకులు ఆయన ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా వున్నప్పటికీ, ఆయన నాయకత్వంలోనే  రాష్ట్ర ప్రయోజనాలు పదిలంగా ఉంటాయని నమ్ముతున్నారు. సీఎం ఎస్ సర్వే కూడా ఇదే చెబుతోంది.    
చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ, కొత్తగా ఏర్పడ్డ పదమూడు జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్  కు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇప్పటికీ  ఎంతో తేడా వుంది.  అప్పటికీ ఇప్పటికీ పరిస్తితులు  గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఆ రోజుల్లో పదవిలో కుదురుకోవడం అనేదే ప్రధాన సమస్య. 
ఇప్పుడలా కాదు. చుట్టూ సమస్యలు, మధ్యలో చంద్రబాబు.
సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలని ఆయన తరచూ చెబుతుంటారు.  సమస్యల నడుమ వున్న చంద్రబాబుకు ఇప్పుడా  అవకాశం ఆయన ఎదుటే వుంది.
సమర్ధత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకి మిగిలిన ఏకైక వనరు కూడా ఆ సమర్ధతే. మిగిలిన వనరులకు దారులు మూసుకు పోతున్నట్టు కానవస్తున్న ఈ తరుణంలో ఆయన తన సమర్ధతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకే ఎక్కువగా వుంది.
నవ్యాంధ్ర ప్రదేశ్ ఆయనపై పెక్కు ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కావు అని వాళ్ళు నమ్ముతున్నారు.  రెండేళ్ళ కాలం చాలా స్వల్పం అని వాళ్ళకీ తెలుసు. చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కుంటున్న పరిమితులు కూడా బాగా తెలుసు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమంటే ఎల్లా అని  వాళ్ళూ ఆయన పట్ల సానుభూతిగానే వున్నారు. అలా రెండేళ్ళు గడిచిపోయింది. ఇదే పరిస్తితి మరో మూడేళ్ళు ఉంటుందా అంటే అవునని చెప్పడం కష్టం.
ప్రజల ఆకాంక్షలను   నెరవేర్చడం ద్వారా తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సార్ధకం చేసుకునే సువర్ణావకాశం చంద్రబాబుకు దక్కిన అపూర్వ వరం.  ఈ అవకాశం కూడా ఆయన ఒక్కరికే వుంది. దాన్ని నిజం చేయగల సామర్ధ్యం కూడా ఆయన ఒక్కరికే వుందని ప్రజలు  నమ్ముతున్నట్టు సీఎంఎస్ సర్వే కూడా చెబుతోంది.
అందుకే కొత్త చంద్రబాబులో అలనాటి పాత చంద్రబాబును చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. 
పుట్టిన రోజులను ఘనంగా జరుపుకునే అలవాటు లేని చంద్రబాబునాయుడికి మనః పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. (18-04-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595