5, మార్చి 2016, శనివారం

ఎన్నికల నామ సంవత్సరం


సూటిగా......సుతిమెత్తగా.......

రెండేళ్ళ క్రితం దేశ ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ,  చారిత్రాత్మక విజయంతో కొత్త చరిత్ర సృష్టించిన నరేంద్ర  మోడీ ఘన చరిత్రకు, రెన్నెళ్ళ పాటు సుదీర్ఘంగా జరగబోతున్న  అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్షగా మారబోతున్నాయి.
అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికల షెడ్యూల్  ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ మరుసటి నెల మూడో వారంకల్లా  ముగుస్తుంది. మే 19 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో ఆయా పార్టీల భవితవ్యం బయట పడుతుంది.మొత్తం అయిదు రాష్ట్రాల్లోనూ కలిపి పదిహేడు కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వుంది.
పోటీ చేసే అభ్యర్ధులలో ఒక్కరూ సరయినవారు కారు అనే నిర్ధారణకు వచ్చిన ఓటర్లకోసం గతంలోనే కల్పించిన ‘నోటా’ వెసులుబాటును ఈసారి మరింత మెరుగుపరిచారు. మిగిలిన అభ్యర్ధులతో పాటు ‘నోటా’కు కూడా విడిగా ఒక ప్రత్యేక గుర్తును  కేటాయిస్తున్నారు. ‘క్రాస్’ రూపంలో వుండే ఈ గుర్తుపై ఓటు ముద్ర వేయడం ద్వారా బరిలో వున్న అభ్యర్ధులు ఎవ్వరూ తమకు ఆమోదం కాదన్న అభిప్రాయ వ్యక్తీకరణకు ఈ  విధానం ఉపయోగపడుతుంది.  అలాగే, ఓటు వేసిన వెంటనే తాను కోరుకున్న అభ్యర్ధికే ఓటు పడిందా లేదా అనే అనుమానం ఓటర్లో తలెత్తకుండా చూసేందుకు ఈసారి ఎన్నికల్లో అందుకు తగిన ప్రత్యేక యంత్రాలను ఈవీఎం లకు అనుసంధానం చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి కొన్ని ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో మాత్రమే ఈ యంత్రాలు ఉపయోగిస్తారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈ సారి, తొలిసారిగా ఈవీఎం లలోని బ్యాలట్ పేపర్లపై అభ్యర్ధి పేరుతొ పాటు అతడి ఫోటోను కూడా ముద్రించబోతున్నారు. ఒకే పేరు కలిగిన అభ్యర్ధులు పలువురు పోటీలో వున్నప్పుడు ఓటర్లలో అయోమయం ఏర్పడకుండా ఈ ఏర్పాటు.
ఈ మినీ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాల్లో కొత్తగా  ప్రజాప్రతినిధులు ఆయా రాష్ట్రాల శాసన సభల్లో ప్రవేశిస్తారు. అంటే పరోక్షంగా ఈ ఎన్నికల ఫలితాలు, రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాల్ని ప్రభావితం చేసే అవకాశం వుంది. కాబట్టి పెద్దల సభలో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం రాజకీయ అవసరంగా మారిన మోడీ సర్కారుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే అని చెప్పవచ్చు. అయిదేళ్ళ క్రితం ఏర్పడ్డ ఈ అయిదు రాష్ట్రాలలోని పాలక పక్షాలకు కూడా ఈ ఎన్నికలు పెద్ద పరీక్షే. ఎందుకంటె, అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల స్వరూపస్వభావాల్లో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
జాతీయ రాజకీయ చిత్రపఠంలోకి  నరేంద్ర మోడీ కాలు మోపిన తరువాత దేశ రాజకీయాలు ఆయన చుట్టూ పరిభ్రమించే పరిస్తితి ఏర్పడింది. దేశ విదేశాల్లో ఆయన ప్రతిష్ట ఆకాశాన్ని అంటుతోంది అని ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు సయితం ఆందోళన చెందేవిధంగా  పరిణామాలు సంభవించిన మాట కూడా యదార్ధం. అయితే ఆ వెలుగు జిలుగులు  శాస్వితం కాదని, అవి మసకబారే అవకాశం వుందని, దరిమిలా  ఢిల్లీ, బీహారు శాసన సభలకు జరిగిన ఎన్నికలు నిరూపించాయి. అయినా  కానీ, భారతీయ జనతాపార్టీకి మోడీకి మించిన నాయకత్వ  ప్రత్యామ్నాయం కలికం వేసినా కానరాని సంగతి కూడా కాదనలేని వాస్తవం.
కాకపోతే, మోడీ నాయకత్వంలోని బీజేపికి మింగుడు పడని కొన్ని అంశాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ప్రాబల్యం కంటే ప్రాంతీయ పార్టీలకు ప్రజల్లో ఆదరణ ఎక్కువ. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండూ కూడా ఈ రాష్ట్రాల్లో సొంత బలం మీద గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగితే అదో అద్భుతమే అవుతుంది.
పశ్చిమ బెంగాల్ లో రాజ్యమేలుతున్న త్రుణామూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజయావకాశాలు అయిదేళ్ళ క్రితం మాదిరిగా అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయా అంటే అవునని చెప్పడం కష్టమే. ముప్పయినాలుగేళ్ళ వామపక్ష పరిపాలనకు స్వస్తి వాక్యం పలికించి ఒక రికార్డు సొంతం చేసుకున్న ఈ బెంగాల్ దీదీ, మళ్ళీ అదే విజయాన్ని అదే స్థాయిలో నమోదు చేసుకోవడం అసాధ్యం అయినప్పటికీ, మళ్ళీ అధికారపగ్గాలు చేజిక్కించుకోవడం ఆమెకు అంత కష్టమేమీ కాకపోవచ్చు. బహుశా ఈ ధైర్యం పుష్కలంగా వుండబట్టే కావచ్చు, ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మమతా బెనర్జీ మొత్తం అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించి, ఎన్నికల సమరంలో తన ముందస్తు సంసిద్ధతను చాటిచెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన  ఈ బెంగాల్ ఆడ పులి, ఈసారి సొంతంగానే పోటీకి దిగడం గమనిస్తే పూర్తి ఆత్మ విశ్వాసంతో వున్నట్టు కానవస్తోంది. ఇప్పుడు చేసేది ఏమీ లేక జాతీయ పార్టీ కాంగ్రెస్, ఒకనాటి తన కమ్యూనిష్టు మిత్రులతో పాత చెలిమిని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తోంది. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్ధులు. ఈసారి ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్న రాజకీయ మిత్రులు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మరోమారు నిరూపితమవుతోంది. పొతే, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి, పశ్చిమ బెంగాల్ లో  విజయం పట్ల వారికే నమ్మకం లేదు. గత  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 289 స్థానాలకు పోటీ చేసి దాదాపు అన్నింటిలో ధరావత్తులు పోగొట్టుకున్న చరిత్ర కళ్ళ ఎదుట కనబడుతోంది. అయితే, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ నమోదు చేసుకున్న విజయాలు అంధకారంలో ఆశాదీపాలు. ఆ రాష్ట్రంలో బీజేపీ కాస్త కాలు కూడదీసుకున్నా ఆ ఘనత కేవలం మోడీ ఖాతాలోనే పడుతుంది.
మరో ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడు. జాతీయ పార్టీల  ప్రాభవాన్ని పూర్తిగా నిలువరించిన ప్రాంతీయ పార్టీల కంచుకోట. అయితే ఈ పార్టీ, కాకపోతే ఆ పార్టీ అనే రీతిలో గత చాలాకాలంగా రెండే రెండు ప్రాంతీయ పార్టీలు, డీఎంకే, అన్నా డీఎంకే ఆ రాష్ట్రంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకుంటున్నాయి. పార్టీలు అనేకంటే ఈ పోరు, జయలలిత, కరుణానిధి అనే  ఇద్దరు వ్యక్తుల నడుమ అంటే సముచితంగా వుంటుంది. పేరుకు ఎన్ని పార్టీలు పోటీ చేసినా చివరికి అసలు పోరు వీరిద్దరి నడుమనే అనేది కరడుగట్టిన నిజం.
రాజకీయాల్లో ప్రజాదరణ అనేది ఎంతటి కీలకమో తెలుసుకోవాలంటే పుదుచ్చేరి వైపు చూడాలి. ముప్పయి అసెంబ్లీ సీట్లు మాత్రమే వున్న ఆ చిన్ని రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను కాదని కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన పేరు ఎన్. రంగస్వామి. ఆయన పార్టీ అధికారానికి దగ్గర అయినా ప్రజలకు మాత్రమే దగ్గరగా వుండాలనేది రంగస్వామి సిద్ధాంతం.  పార్టీ కంటే వ్యక్తులు గొప్పకాదు అనేది  కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. పొసగని పరిస్తితుల్లో అయన గత అసెంబ్లీ  ఎన్నికలకు ముందే కాంగ్రెస్  పార్టీకి గుడ్  బై చెప్పేసి సొంత పార్టీ పెట్టేసుకున్నారు. అయినా విజయలక్ష్మి ఆయన్నే వరించింది. సగం సీట్లను రంగస్వామి పెట్టిన కొత్త పార్టీ గెలుచుకోవడంతో పుదుచ్చేరికి ఆయనే ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయనకున్న ప్రజాదరణ ఈ అయిదేళ్ళలో చెక్కు చెదిరిన దాఖలా లేదు. మరి చూడాలి ఈసారి ఓటర్లు ఎలాటి తీర్పు ఇస్తారో.
ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో, అసోం, కేరళలో   ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ  అధికారంలో వుంది. వరసగా రెండో మారు అధికార పక్షాన్ని గెలిపించే ఆనవాయితీ  కేరళలో లేదు. విపక్ష వామపక్ష కూటమికే అవకాశాలు మెండుగా వుంటాయని ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ఎంతో ముందు నుంచే రాజకీయ  పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్లు వేసేది వాళ్ళు కాదు కనుక చివరికి ఫలితాలు ఎలా వుంటాయన్నది నిజానికి పరిశీలకుల చేతుల్లో వుండదు. కాకపోతే, పాలించిన రోజుల్లో కావాల్సినంత ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడంలో కాంగ్రెస్ వారిది అందె వేసిన చేయి కనుక చూడాలి కేరళలో హస్తవాసి ఎలా వుంటుందో.
ఇక అసోం విషయం ప్రత్యేకం. అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ వరసగా మూడు విజయాలు కొంగున మూటగట్టుకుని హ్యాట్రిక్ కొట్టేసి మంచి జోరు మీద వున్నారు. అయితే ఆ విజయ పరంపరకు అడ్డుకట్టవేయడం లక్ష్యంగా భారతీయ జనతా  పార్టీ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. ఏదైనా చేయగలిగితే బీజేపీకి  కాసింత అవకాశం వున్న రాష్ట్రం ఇదే.                                   

శ్రీ మన్మధ నామ సంవత్సరం ముగియడానికి నాలుగు రోజులముందు మొదలై, శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మొదట్లో ముగిసే ఈ ఎన్నికల క్రతువులో ఎవరికి యాగఫలం సిద్ధిస్తుందో, ఎవరు బలి పశువులు అవుతారో అన్నది మే పందొమ్మిదో తేదీకి కాని తెలియదు.  (05-03-2016)
రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595                 



1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Kichdi elections will be held in six phases. Tamil Nadu Kerala smart guys only one day polls. Other states wasteful to spread in 5 phases. foolish fellows.