1, మార్చి 2016, మంగళవారం

కాడి పట్టిన మోడీ బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు


సూటిగా.......సుతిమెత్తగా .......

మళ్ళీ ఎన్నేళ్ళ తరవాతనో సర్కారు వారి చల్లని చూపు రైతాంగంపైకి మళ్ళింది. 2016 – 17 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్  జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు చేసారు. పల్లె పట్టులే దేశానికి పట్టుగొమ్మలు, రైతులే జాతికి వెన్నెముకలు అంటూ అనుక్షణం సూక్తులు వల్లించే రాజకీయుల అసలు నైజానికి భిన్నంగా ‘ఇండియా నుంచి భారత్ కు’ అనే కొత్త నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు పోతోందన్న అభిప్రాయం కలిగించేలా కొత్త బడ్జెట్లో అనేక అంశాలు జొప్పించారు. నవ నాడులు పనిచేస్తున్నప్పుడే   మనిషిఆరోగ్యంగా వుంటాడు కాబట్టి తొమ్మిది కీలక అంశాల పునాదులపై ఆర్ధిక వ్యవస్థకు  పరిపుష్టం కలిగించాలనే లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన జరిగిందని జైట్లీ చెప్పారు. తమ హయాంలోనే రైతు భారతం రాబోతోందని, ఆ లక్ష్య సాధన క్రమంలోనే ఈ బడ్జెట్ రూపు దిద్దుకున్నదని చెప్పకనే  చెప్పుకొచ్చారు. అన్నం పెట్టే అన్నదాతల చేతులకు  ఆసరా కల్పించడమే తమ ధ్యేయమని అన్నారు. ఇంకా  ఇలానే ఎన్నో మంచి మాటలు తమ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.


అంతా విన్న తరువాత ‘బాగుంది....’ అని అనిపించిన మాట నిజం. అలానే, ’బాగుంది......కానీ...’ అనే సాగతీత పదం తగిలించాల్సిన అవసరం వున్న మాటా  అంతే నిజం.
నేను ఈ పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన తరువాత ఇది నలభయ్ ఆరో బడ్జెట్. ప్రతియేటా,  ప్రతిసారీ వినపడే వ్యాఖ్యలు వినీ వినీ చెవులు చిల్లులు పడిపోయాయి, ‘అద్భుతమైన బడ్జెట్ అని కొందరు, అంకెల గారడీ బడ్జెట్ అని మరికొందరూ.....’
ఈ ‘కొందరు’  పాలక పక్షం వాళ్ళయితే, ఆ ‘మరికొందరు’ ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు అయివుంటారు. అయిదేళ్లకో, పదేళ్లకో పాత్రలు మారుబడినప్పుడు, అచ్చు గుద్దినట్టు వీరి నోట ఆ మాట, వారి నోట ఈ మాట. దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్ర ఇది.          
బడ్జెట్  ఇల్లానే  వుండాలి అని కోరుకున్నవాళ్లకు వాళ్ళు  కోరుకున్నట్టుగా లేదీ బడ్జెట్. ఎందుకంటే వారు కోరుకున్నది వేరే కనుక. వీళ్ళు  ప్రతిపక్షం బాపతు అనుకోవాలి.
బడ్జెట్ అంటే ఇలా వుండాలి సుమా అనుకునేవాళ్ళకు వాళ్ళు అనుకున్నట్టుగానే వుందీ బడ్జెట్. ఎందుకంటే వారు కోరుకున్నది ఈ తీరులోనే కాబట్టి. వీళ్ళు సర్కారు పార్టీ వాళ్ళు. అనుమానం అక్కర లేదు.
ప్రతియేటా, ప్రతిసారీ ప్రతిపక్షంవాళ్ళు ఇలా పెదవి విరుస్తూనే వస్తున్నారు.  ఆ ప్రతిసారీ పాలక పక్షంవాళ్ళు  అలా  ఆకాశానికి ఎత్తేస్తున్నే వున్నారు. అందుకే అన్నది ఇది  ఏటా చూస్తున్న తంతే అని. అందుకే ఈ రెండు కళ్ళని ఒదిలిపెట్టి మరో కంటితో చూసేందుకే ఈ ప్రయత్నం.
మోడీ అనగానే జనసామాన్యానికి సమర్దుడయిన నాయకుడు స్పురణకు వచ్చినట్టుగానే, భారతీయ జనత పార్టీ అనగానే అది సంపన్న వర్గాల కొమ్ముకాసే పార్టీ అనే అపప్రధ సాధారణ జనంలో వున్నమాటా నిజమే. ఈ బడ్జెట్ లో పల్లె పట్టుల పట్ల శ్రద్ధ చూపించడం ద్వారా, కోటి దాటిన ఆదాయం వున్న వర్గాలకు పన్ను సర్  చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచడం ద్వారా   ఆ అపకీర్తిని కొంతవరకయినా రూపుమాపుకోవాలనే ప్రయత్నం చేసినట్టుంది. అన్నదాతకు ఆదాయ భద్రత కల్పించాలనే ఆలోచన ఈ క్రమంలో పుట్టిందే కావచ్చు. తొమ్మిది లక్షల కోట్ల వ్యవసాయ  రుణాలు, ఎరువుల రాయితీలో నగదు బదిలీ విధానం, రానున్న ఆరేళ్ళ కల్లా గ్రామీణుల ఆదాయం రెట్టింపు చేయడం -  ఇలా పలు రకాలుగా సాగాయి ఆ ఆలోచనలు. అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటూ బతుకు బండి లాక్కొస్తున్న వ్యవసాయదారులకు నిజానికి యెంత చేసినా అది తక్కువే. అయితే గత బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేసిన మోడీ సర్కారు, ఈ ఏడాది తన చల్లని చూపును ఇలా పల్లె ప్రజల దిక్కుగా మళ్ళించడానికి కారణం మరి కొద్ది కాలంలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అని చెవులు కొరుక్కునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎన్నికలో మరోటో, కారణం ఏదయినా కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి ఎవరు,  ఎలాటి మేలు చేసినా అందులో తప్పులు ఎంచాల్సిన పని లేదు. యావత్ జాతి కృతజ్ఞతలు తెలపాల్సిన రంగం ఏదయినా ఉన్నదంటే అది ఇదొక్కటే. ఆలశ్యం అయినా ఈ దిశగా మొదటి అడుగు పడడం అవశ్యం, అభిలషణీయం. సందేహం లేదు.
అలాగే ప్రజారోగ్యానికి ప్రత్యేకించి పేదవారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రదర్శించిన ఆసక్తి,, గణనీయంగా ఆ రంగానికి పెంచిన కేటాయింపులు ఎన్నదగినవిగా వున్నాయి.
ఆరోగ్యవంతమయిన సమాజం, విద్యాగంధం కలిగిన సమాజం అత్యంత సహజంగా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం బాగా వున్నమనిషి తన సంగతి  తాను చూసుకోగలుగుతాడు. చదువుకున్న మనిషి తనకున్న తెలివితేటలతో  సమాజానికి  మేలు చేయగలుగుతాడు. ఈ రెండు రంగాలను కనిపెట్టి చూసుకోగలిగితే సంక్షేమ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, పధకాలు చాలావరకు తగ్గిపోతాయి కూడా.
ముందే చెప్పినట్టు ఏ బడ్జెట్ కయినా  తెగడ్తల  బాణాలు తప్పవు, పొగడ్తల హారాలు తప్పవు. మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రతి ప్రతిపాదనా వెనుకా కార్పొరేట్ల ప్రచ్చన్న హస్తం వుందనేది పెదవి విరుపుల్లో వినబడిన ఒక ఆరోపణ. ప్రైవేటీకరణ దిశగా గమనాన్ని వేగవంతం చేసే ఒక అపసవ్య ఆలోచన,  ఈ ఆరోపణలు చేసేవారికి కనబడి వుండడంలో ఆశ్చర్యం లేదు. పార్లమెంటులో ఆర్ధిక మంత్రి  బడ్జెట్ ప్రసంగం సాగుతున్నప్పుడు కుదుపులకు గురయిన షేర్ మార్కెట్, బడ్జెట్ పూర్తి వివరాలు వెల్లడి అయిన మర్నాటికల్లా 2009 తరువాత అంటే ఏడేళ్ళ శని ఒదిలిన చందంగా సెన్సెక్స్ అమాంతం అక్షరాలా 777 పాయింట్లు లాభపడ్డ పరిణామం ఈ ఆరోపణకు మరో నిదర్శనమని అలా చెవులు కొరుక్కుంటున్న వారి ఉవాచ.     
సాధారణంగా టీవీల్లో ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం జరిగేటప్పుడు వీక్షకులు క్రమంగా తప్పుకుంటూ వుంటారు.  వంట  గ్యాస్, గృహోపకరణాలు వగయిరాల ధరలు పెరిగాయా లేదా తెలుసుకోవాలనే  ఆసక్తి కొందరిదయితే, పెట్రో ధరలు గురించిన బెంగ  మరి కొందరిది.  ఇప్పుడు ఈ రకమైన ఆసక్తి  క్రమేపీ  క్షీణిస్తోంది.  ఎందుకంటే  బడ్జెట్ తో ప్రమేయం లేకుండానే, ఏడాది పొడుగునా వీటి రేట్ల హెచ్చింపులు, తగ్గింపులు ఒక క్రమంలో జరిగిపోతున్నాయి. అందుకు అలవాటు పడ్డ జనాలకు ఒకప్పుడు బడ్జెట్ అంటే వున్న ఆసక్తి తగ్గిపోతోందనే చెప్పాలి.
కాకపొతే, ఈసారి ఈ ఆసక్తి తెలుగు రాష్ట్రాల రూపంలో బయటకు వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు అవసరం అయ్యే నిధులు, పధకాలు ఈ బడ్జెట్లో ఏవయినా వున్నాయా లేవా అన్నదే ఇరు రాష్ట్రాల్లో ఆసక్తిని రగిలించింది. కోరుకున్నదేదీ కనబడకపోవడంతో జనాలు ఖంగు తిన్న మాట వాస్తవం. ఈ రెండు రాష్ట్రాలు కొత్తవే అయినప్పటికీ, దేశంలో వున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో ఇవీ సమానమేనన్నది మోడీ సర్కారు అధికార పీఠం ఎక్కిన తదాదిగా  స్పష్టం చేస్తూనే వస్తోంది. అంచేత  కేంద్రాన్ని తప్పు ఎంచడానికి వీల్లేని పరిస్తితి.  ఈ నేపధ్యంలో పాలక పక్షానికి చెందిన కొందరు నేతలు ఈ రెండింటికీ ఎంతో  కొంత ప్రత్యేక సాయం కేంద్రం నుంచి అంది తీరుతుందనే సంకేతాలు ఇస్తూవచ్చారు. అయితే,  అందుకు సంబంధించిన నిర్దిష్ట  ప్రతిపాదనలు బడ్జెట్  లో కానరాకపోవడంతో ఇరు రాష్ట్రాల  ప్రజలు సమాధానపడలేని ఒక విచిత్ర పరిస్తితి ఏర్పడింది. కేంద్రం  ఈ విషయాల్లో మరింత స్పష్టత ఇచ్చి వుంటే ఇప్పుడీ అయోమయ పరిస్తితి ఏర్పడి వుండేది కాదన్నది అధికుల అభిప్రాయంగా కానవస్తోంది. 
బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంట్  ఆమోదం లభించేలోగా, రెండు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్ధిక మంత్రి ఏవయినా వరాలు ప్రకటించే అవకాశం వుంది కాబట్టి ఓ పక్క నిరసన తెలుపుతూనే వేచి వుండే ధోరణి ప్రదర్శించాలని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టున్నారు. అయితే, విభజన హామీలను కేంద్రం  తనకు తానుగా నెరవేరిస్తే అందులో  వున్న తృప్తి  వేరు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు, మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోగా మరో  రెండు బడ్జెట్లు సమర్పించే వీలుంది.  చిట్ట చివరిది  ఎన్నికలు గడపలో వుండగా ప్రవేశపెట్టేది. అప్పుడు ఏమి అనుకున్నా, అనుకున్న విధంగా చేయడానికి బొత్తిగా అవకాశం వుండదు.  ‘మోడీ మార్కు’ ప్రస్పుటంగా కనబడేలా చేయాలంటే ఒక్క బడ్జెట్ వరకే అది పరిమితం. మరి ఈ విషయంలో కేంద్రం తాత్సారం చేస్తే ఆ నష్టం బీజేపీ పార్టీదే కాదు, జాతికి కూడా మేలు జరగదు.
మార్కు కనబడేలా, మార్పు కనబడేలా వుండే పధకం ఒకటి పూర్వం ఎన్డీయే హయాములోనే అమలయింది.  వాజ్ పాయ్ ప్రధానిగా వున్నకాలంలో ‘స్వర్ణ చతుర్భుజి’ పధకాన్ని రూపొందించి అమలు చేసారు.  ఆ పధకం విశిష్టతను గుర్తించిన తదనంతర ప్రభుత్వాలు కూడా ఆ పధకం  అమలును కొనసాగించిన ఫలితంగా దేశం గర్వించదగిన చక్కటి రహదారులు జాతి సొంతం అయ్యాయి. అల్లాగే, కాంగ్రెస్ హయాములో అమలు చేసిన గ్రామీణ ఉపాధి హామీ పధకం. ప్రతి ప్రభుత్వం, అది ఏ పార్టీకి చెందినదయినా, నలుగురికి ఉపయోగపడే సంకల్పంతో,  నాలుగు కాలాలపాటు జనాలు గుర్తు పెట్టుకునే విధంగా ఏదో ఒక పధకాన్ని తయారు చేసి అమలు చేస్తే రాజకీయంగా వాటికి మేలు జరగడమే  కాదు, పలురకాలుగా ప్రజలకు అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన ఈ బడ్జెట్ లో అటువంటిది ఏదీ కనబడలేదు. కాస్తో కూస్తో ఇటువంటి లక్ష్యానికి దగ్గరగా వున్నది ఆరోగ్య బీమా పధకం. విధి విధానాలు తెలియవస్తే కాని  దీన్ని గురించి విశ్లేషించడం కష్టం.
ప్రజలనుంచి పన్నులు వసూలు చేయకుండా ఏ ప్రభుత్వం నడవదు. అయితే వాటిని వసూలు చేసే తీరును బట్టి పాలకుల మంచిచెడ్డలు నిర్ధారణ అవుతాయి. అక్బర్ కాలంలో పన్నులు వున్నాయి. ఔరంగజేబు హయాములో కూడా పన్నులు వసూలు చేసారు. కానీ తీరులో వున్న తేడాయే వారి పాలనా సామర్ధ్యానికి గీటురాయి అయింది. ఇప్పుడూ  పన్నులు వున్నాయి. వాటికి అదనంగా సెస్సులు వచ్చి పడ్డాయి. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం వసూలు చేసే ఈ సెస్సు మొత్తాలు దారితప్పకుండా చూడగలిగితే ఎవరికీ అభ్యంతరం వుండదు. అలా జరుగుతోందా అంటే అవును అని జవాబు చెప్పడం ఏలిన వారికి  కూడా కష్టమే. కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో  చెబుతాడు,  ‘పూవు నుంచి తేనెను సంగ్రహించే భ్రమరం యెంత సుతారంగా అ పని చేస్తుందో,  రాజు అనేవాడు  అంత సున్నితంగా, బాధ తెలియకుండా  ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలని.  కౌటిల్యుని కాలం నాటి మాటలు ఈ నాటి పాలకులకు రుచించడం కష్టమే మరి. వీరి రాజకీయ అనివార్యతలు వేరు కదా!                
ఉపశ్రుతి : జీవితంలో  ఎలాటి తప్పులు చేయకుండా వుండాలంటే, ‘అమ్మ  వెనకనుంచి చూస్తోంది’ అనుకోమనేవారు మా పెద్దన్నయ్య,  కీర్తిశేషులు భండారు పర్వతాలరావు. ‘అమ్మ గమనిస్తోంది’ అన్న ఎరుక కలిగిన వాడు, చూస్తూ చూస్తూ ఏ  తప్పు చేయలేడన్నది ఆయన అభిప్రాయం. ఆర్ధిక మంత్రులు కూడా ఇలాంటి ఒక సూత్రం పాటిస్తే బాగుంటుందేమో. అదేమిటంటే, పన్నులు పెంచాలి అనుకున్నారనుకోండి. దాన్ని సామాన్యుడి కోణం నుంచి పరిశీలించాలి.  పన్ను పెంచడం వల్ల  అతి సామాన్యుడిపై పడే భారం యెంత అనే లెక్కలు తేలిన తరువాతనే ఆ నిర్ణయం తీసుకోవాలి.  అలా బడ్జెట్లో ప్రతి ప్రతిపాదనను  సామాన్య మానవుడి అవసరాలను  దృష్టిలో పెట్టుకుని తయారు చేయగలిగితే ఇక ఆ బడ్జెట్  కు తిరుగుంటుందని అనుకోలేము. కానీ ఇంతటి  తీరుబడి ఏలిన వారికి ఉంటుందా! ఇదో యక్ష ప్రశ్న.  (02-03-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

It seems to be a good budget for farmers. It is the worst budget for employees. BJP fellows demand and promise moon for employees when in opposition. when in power they are antagonistic towards salaried class.

Andhra pradesh has been totally deceived by BJP. They are brutal towards AP.

నీహారిక చెప్పారు...

http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-60-of-EPF-deposits-to-be-taxed-on-withdrawal-after-April-1/articleshow/51195991.cms
ఎంప్లాయీస్ కి బాగా వా(కో)త పెట్టారు. ఎవరైనా ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రా చేయాలనుకుంటే ఏదైనా అనారోగ్య సమస్యలున్నా లేదా పిల్లల చదువు కానీ పెళ్ళి కి కానీ విత్ డ్రా చేస్తారు. దాని మీద కూడా టాక్స్ అంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.