6, ఫిబ్రవరి 2016, శనివారం

బాధ్యత పెంచిన ఘన విజయం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY on 07-02-2016, SUNDAY)

సూటిగా...సుతిమెత్తగా......

ముందుగా ఊహించిన గెలుపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఊహించని విజయం అమితానందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినాయకత్వం, నాయకగణం, పార్టీ శ్రేణులు ఈ  రెండురకాల ఆనందాలను మనసారా  అనుభవిస్తున్నాయి. ఆ తమకంలో మునిగితేలుతున్నాయి.
ఎందుకంటే ఇంతటి స్థాయిలో మహత్తర విజయం తమని వరిస్తుందని వారూ ఊహించలేదు. ‘గెలుస్తాం, జీహెచ్ ఎం సీ పీఠంపై, ఎవరి సాయం లేకుండా  సొంత బలంతో  గులాబీ జెండా ఎగురవేస్తామ’ని అనుకున్నారే కాని, ప్రత్యర్ధి పార్టీల గుండెల్లో గుబులు పుట్టేలా  విజయం సాధించగలమని అనుకుని వుండకపోవచ్చు. ‘వంద స్థానాలకు తక్కువయితే రాజీనామాల’ వంటి సవాళ్లు, పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికే అని అనుకున్న వాళ్ళూ వున్నారు. టీఆర్ఎస్ విజయాన్ని ముందస్తుగా బయటపెట్టిన వివిధ చానళ్ళ సర్వేలు కూడా ఈ స్థాయిలో  అపూర్వ విజయాన్ని పసికట్టలేకపోయాయి. ప్రధాన పక్షాలు గెలిచిన స్థానాలన్నీ కూడినా, అది సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందని  ఊహించని చారిత్రాత్మక విజయం టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. ఒక రాజకీయ పార్టీకి ఇంతకంటే  కావాల్సింది ఏముంటుంది? ఇంతకంటే సంబురపడగల సందర్భం వేరే ఏముంటుంది? 
‘ఈ విజయం తమపై బాధ్యతను మరింత పెంచింద’ని టీఆర్ఎస్  అధినేత కే. చంద్రశేఖరరావు ఫలితాల అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పారు. అంతే కాదు, ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను, ఎన్నికల సందర్భంగా వారిలో కల్పించిన ఆశలను సంపూర్ణంగా నెరవేర్చే వరకు  తమ బాధ్యత పూర్తయినట్టు కాదనీ,  గెలిచివచ్చిన తమ  పార్టీ  కార్పొరేటర్లు అనుక్షణం దీన్ని గమనంలో ఉంచుకోవాలని ఉద్బోధించారు.  చక్కటి మాట చెప్పారు. దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత కూడా  వారి భుజస్కంధాలపైనే వుంది. ఈ విషయంలో ఏమాత్రం ఏమరుపాటు తగదు.
మొత్తం నూటయాభయ్ సీట్లలో శతకానికి ఒక్కటి తక్కువగా అక్షరాలా  తొంభయ్ తొమ్మిది  టీఆర్ ఎస్  కైవసం చేసుకుంది. కార్పోరేషన్ మేయర్ పదవిని సొంతంగా చేజిక్కించుకోవడానికి అవసరమైన సీట్లకంటే మించి అదనంగా 23  స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఆ పార్టీ ఆధిక్యత ప్రదర్శించిన సీట్లు,  ఒక సందర్భంలో నూరు దాటిపోయినప్పుడు ప్రతిపక్షాలన్నీ చేష్టలు ఉడిగిపోయాయి. ‘ఓటింగు శాతం 45 దగ్గరే ఆగింది, లేకుంటేనా.....’ అంటూ ఒక టీఆర్ఎస్  అభిమాని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు కూడా.
ఉపఎన్నిక జరిగిన పురానా పూల్ స్థానం ఫలితం వచ్చిన తరువాత ప్రకటించిన తుది ఫలితాల్లో టీఆర్ఎస్ కు 99, ఎంఐఎం కు 44,  బీజేపీకి నాలుగు, కాంగ్రెస్ కు రెండు, టీడీపీకి ఒక్కటి దక్కాయి. ముందస్తు సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలకు ఏమైనా దగ్గరగా ఉన్నయా అంటే అది ఒక్క ఎంఐఎం విషయంలోనే కాస్త అటూఇటుగా నిజమయ్యాయని  చెప్పొచ్చు. సర్వేలే కాదు, పోటీ పడ్డ ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ  అంచనాల్లో ఈ పాత బస్తీ పార్టీకి నలభయ్ సీట్లు ఒదిలేసే తమ లెక్కలు వేసుకున్నాయి.
ఇక ఓటమి విషయానికి వస్తే,  క్రితం సారి 2009 లో  ఎన్నికలతో పోల్చి చూస్తె, కాంగ్రెస్ పార్టీది  దారుణ పరాజయం, టీడీపీది అతిదారుణం. కిందటి సారి బల్దియా ఎన్నికల్లో 52 స్థానాలు దక్కించుకున్న  కాంగ్రెస్ ఈసారి  రెండు సీట్లకే పరిమితం అయింది.  అలాగే, గతంలో 45 స్థానాలు గెలుపొందిన టీడీపీ ఈ తడవ ఒక్కటంటే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ బలం  అయిదు నుంచి నాలుగుకు  పడిపోయింది. ఎంఐఎం ఒక సీటు అదనంగా సంపాదించుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.  
పరాజితులు గురించి మాట్లాడుకోవడం సబబు కాదు. వారి పరాజయానికి కారణాలు విశ్లేషించడం కూడా ఫలితాలు వచ్చిన వెంటనే ప్రస్తావించడం విజ్ఞత అనిపించుకోదు. ఇప్పుడు ఏమి మాట్లాడినా వారికి రుచించే పరిస్తితులు ఎట్లాగు వుండవు. అంచేత,  పరాజయ కారణాల అన్వేషణ వారికి వొదలడమే బాగుంటుంది. పైకి బింకంగా ఏం చెప్పినా, ప్రతి రాజకీయ పార్టీ అంతర్గతంగా  మంచి చెడుల విశ్లేషణ తనకుతానుగా  చేసుకుంటూనే వుంటుంది. కాకపొతే వారికొక హిత వాక్యం. ‘ఓటమి అనేది చెరుపుకోలేని పుట్టుమచ్చ కాదు,  వంటికి తగిలిన దెబ్బ తాలూకు మచ్చ వంటిది. ప్రయత్నం ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు. పారేసుకున్న చోటునే వెతుక్కుంటే వస్తువు దొరికే అవకాశం ఎక్కువ. ఒకచోట పారేసుకుని మరోచోట దేవులాడితే ప్రయోజనం వుండదు. గెలిచిన  పార్టీ గెలుపుకోసం ఏం చేసింది, ఎన్ని అడ్డదార్లు తొక్కింది అనే చర్చలు ఆత్మసంతృప్తికి మాత్రమె పనికివస్తాయి. అయితే యెంత కాదనుకున్నా ఈనాటి ప్రచార యుగంలో రాజకీయ పార్టీలు ఇలాటి సుద్దులు వింటూ మడి కట్టుకుని కూర్చోవడం కూడా సాధ్యం కాదు.



పొతే, అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ పట్ల ప్రజలు చూపించిన నమ్మకానికి కొంత పునాది వుంది. ఆ పునాది వేసింది ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు. ఆ పునాదిని గట్టిపరిచి ఫలితాలు వచ్చేలా చేసింది ఆయన ప్రదర్శించిన వ్యూహ చతురత. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతను,  విద్యాధిక ఓటర్లు వున్న నేపధ్యంలో విద్యాధికుడు అయిన కేటీఆర్ కు ఒప్పగించడంతో కేసీఆర్ ఎన్నికల వ్యూహానికి తెర తీసారు. ఏ భాషలో అయినా అనర్ఘలంగా ప్రసంగించే నేర్పు కలిగిన  కేటీఆర్  కి, అది  ప్రచారపర్వంలో బాగా ఉపయోగపడింది.   
టీఆర్ఎస్ విజయానికి బంగారు బాట వేసింది తెలంగాణా వాదం.  రాష్ట్ర విభజన జరిగి దాదాపు రెండేళ్ళు దగ్గరపడుతున్నాయి. అయినా ఇక్కడి ప్రజల్లో ఆ వాదం ఇంకా పచ్చిగానే కాదు,  బలంగా కూడా వుంది. దీనికి కారణం కూడా  వుంది.
1956 లో ఆంద్ర ప్రదేశ్ అవతరణ నాటి నుండి వేళ్ళూనుకున్న ప్రత్యెక తెలంగాణా ఉద్యమం  1969 నాటికి మరింత బలపడింది. తెలంగాణా ప్రజాసమితిని విశ్వసించిన ఈ ప్రాంతపు ప్రజలు దరిమిలా 1971 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, దేశ వ్యాప్తంగా నాడు వెల్లువలా ఉబికిన ఇందిరా కాంగ్రెస్ హవాను కూడా కాదని ఆ ప్రాంతీయ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. తెలంగాణా  ప్రాంతంలోని మొత్తం 14  లోకసభ స్థానాల్లో ఆ పార్టీ పదింటిని గెలుచుకుంది.  అయితే అప్పటి నాయకుల్లో కొందరు అధికారం కోసం పాకులాడిన ఫలితంగా, తాము దారుణంగా మోసపోయామన్న భావన  నాటి ఉద్యమకారుల్లో ఉండిపోయింది. తదనంతర కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ టీఆర్ఎస్, ప్రజల్లో వున్న ఈ అభిప్రాయాన్ని చెరిపివేయడానికి, తన విశ్వసనీయతను నిరూపించుకోవడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఏళ్ళ పాటు సాగిన ఉద్యమం కట్టు తప్పకుండా,  ధ్యేయానికి దూరం జరగకుండా పార్టీ నాయకత్వం పడ్డ శ్రమదమాదులను తెలంగాణా ప్రజానీకం గుర్తించింది.  అందుకే  తెలంగాణా వాదాన్ని గెలిపించి, చిరకాల కోరికను నిజం చేసిన టీఆర్ఎస్ ను ఇప్పుడు ఎన్నికల్లో  అదే వాదం ఘనంగా గెలిపించింది.  
విజయానికి అనేక కారణాలు వుంటాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘన విజయానికి దారి వేసిన అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ ప్రదర్శించిన రాజకీయ  చాణక్యం. అసలు ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు నుంచే ఆయన ఒక పక్కా ప్రణాళికతో సిద్ధం అయినట్టు కానవస్తోంది. ప్రతి విషయంలో అయన అత్యంత శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఈ ఫలితం సాధ్యం అయింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి  వ్యక్తి, మునిసిపల్ ఎన్నికల్లో ఇంతటి శ్రద్ధ చూపించడం అంటే ఆయనకు విజయం పట్ల సందేహాలు వున్నాయని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోకుండా ఫలితం పట్లనే ఆసక్తి కనబరచినట్టు తోస్తోంది. అదే విజయానికి మెట్లు వేసింది.
ఆయన ముందు చూపుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు.  2009 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన తన పార్టీని ఎన్నికల ముగ్గులోకి దింపలేదు. ఆ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించారు. మునిసిపల్ ఫలితాల్లో తభావతు వస్తే దాని ప్రభావం అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై పడే అవకాశం  వుంటుంది. రాష్ట్ర సాధనకు ఆ ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. తెలంగాణా ఏర్పడడానికి పూర్వం హైదరాబాదు ఓటర్ల విషయంలో ఆయనకు ఖచ్చితమైన అవగాహన ఉండడం కూడా కారణం కావచ్చు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో కూడా ఒక వర్గం ఓటర్లలో కొన్ని సందేహాలు గూడుకట్టుకునే వున్నాయి. గత ఇరవై నెలల్లో వాటిని తొలగించడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేసారు. ఇవి కూడా పలు విమర్శలకు, ఆరోపణలకు దారితీసాయి. అయితే ఎప్పట్లానే, ఆయన వాటిని పట్టించుకోకుండా తన మార్గంలోనే ముందుకు పోయారు. ఆయన నమ్మకమే చివరికి నిజం అయింది.
రాష్ట్ర విభజన అనంతరం ప్రజల మనస్సుల్లో ఎలాంటి మార్పు వస్తుందన్నది బీజేపీ నగర నాయకుడు సుధేష్ రాంభొట్ల ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. మద్రాసు (చెన్నై) రాష్ట్రం నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం  ఏర్పాటు అయినప్పుడు నాటి చెన్నపట్నంలో స్థిరపడ్డ అనేకమంది తెలుగువాళ్ళు మద్రాసులోనే వుండిపోయారు. కాలక్రమంలో తమిళ జీవన స్రవంతిలో కలిసిపోయారు. అలాగే, హైదరాబాదులో ఉండిపోయిన బయటి ప్రాంతాలవాళ్ళు కూడా హైదరాబాదునే తమ మాతృభూమిగా భావించాల్సి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు వారిలో వుండే భావనలే ఎల్లకాలం ఉంటాయని అనుకోకూడదు. స్థానికులు, స్థానికేతరులు ఒకే  నగరవాసులుగా ఉంటూ ఆచారవ్యవహారాల్లో ఒకటిగా  కలగలిసి పోయినప్పుడు,  స్థానికత అన్నది సమస్యగా మారదు. ఒక వివాదంగా తయారవదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఆ పరిణతి ప్రదర్శించారని తృప్తి పడాలి.
ఈసారి హైదరాబాదు ఎన్నికల్లో కొట్టవచ్చినట్టు కానవచ్చిన  అంశం ఒకటుంది. సాధారణంగా ఇటువంటి ఎన్నికల్లో స్థానిక సమస్యలు,  స్థానిక నాయకులు కీలకం అనే భావన వుంది. అయితే చిత్రంగా ఈ ఎన్నికల్లో పార్టీలు, పార్టీల అధినాయకులు, పార్టీల గుర్తులు, వీటి  ప్రాతిపదికగానే ఓట్లు పడ్డట్టు అనిపిస్తోంది.
ఉపశృతి: ఎన్నికల్లో గెలుపు సూత్రాలలో ‘పోల్ మేనేజ్ మెంట్’ కూడా ప్రధానమైనది. పోలింగు రోజు మధ్యాన్నం రెండు గంటల  ప్రాంతంలో  నా ఫోను మోగింది. ‘శ్రీనివాసరావు గారు, నేను టీఆర్ఎస్  ఎమ్మెల్సీ సుధాకరరెడ్డిని  మాట్లాడుతున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంతవరకు వచ్చి ఓటు చేయలేదు’ అంటూ గుర్తు చేశారు. క్లబ్బులకు జరిగే  ఎన్నికల్లో ఇలాటివి సాధారణం. ‘ఇంకా ఎవ్వరు ఓటు చేయలేదు’ అని కనుక్కుని ఫోన్లు చేస్తుంటారు.   ఎన్నికల్ని ఎన్నికలుగా తీసుకుని సీరియస్ గా పనిచేయడం, విజయం  దిశగా కృషి చేయడం కూడా అవసరం అని దీన్నిబట్టి బోధపడుతోంది.  (06-02-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595        
                                         

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Twinkle twinkle little star. KTR is super star. Lokesh and babu better realise that they have no locus standi in hyderabad. Mini pakistan old city-- no change in their mindset. The MIM goons have to be cut to size by TRS.