27, నవంబర్ 2015, శుక్రవారం

కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన భారత రాజ్యాంగం

సూటిగా......సుతిమెత్తగా .....
(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 29-11-2015, SUNDAY)

మత విశ్వాసులకు భగవద్గీత, ఖురాను, బైబిల్ మాదిరిగా ప్రజాస్వామ్యంలో నమ్మకం వున్నవారికి రాజ్యాంగం కూడా ఒక  పవిత్ర గ్రంధం. అటువంటి రాజ్యాంగం గురించి భారత పార్లమెంటు ఉభయ సభల్లో గడచిన వారం రెండు రోజులపాటు చర్చ జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని మోడీ ప్రభుత్వం, ‘రాజ్యాంగం పట్ల నిబద్ధత’ అనే అంశంపై రెండు రోజులపాటు ఈ  చర్చ నిర్వహించింది. రాజ్యాంగ రచనలో  అంబేద్కర్ ప్రదర్శించిన దూరదృష్టిని మననం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని వివిధ అంశాలపై ఆసక్తికరమైన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు నోచుకున్నాయి. జాతి వ్యాప్తంగా ఈనాడు మీడియా చర్చలకు కేంద్ర బిందువుగా మారిన ‘అసహనం’ అంశం కూడా చట్ట సభల  ప్రసంగాల్లో చోటు చేసుకుంది. చర్చలు, సమాలోచనలే పార్లమెంటుకు అసలు సిసలైన ఆత్మ వంటిదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యల పర్యవసానమేమో తెలియదు కాని, రాజ్యాంగంపై లోక సభలో జరిగిన చర్చ ఘాటుగానే సాగింది.
చర్చ సాగినంత సేపూ సభలోనే కదలకుండా కూర్చుని సభ్యుల ప్రసంగాలను నోట్స్ రూపంలో రాసుకున్న ప్రధాని నరేంద్ర  మోడీ, రెండు రోజుల చర్చకు సవివరమైన సమాధానం ఇచ్చారు. (వివరాలు శనివారం పత్రికల్లో రావచ్చు)
సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి హిందీ సమానార్ధక పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచడంలో అనువాద సంబంధ మైన కించిత్ పొరబాటు జరిగిందనే అభిప్రాయం కలిగేట్టు, తొలి రోజునే  కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ సభ్యుల నుంచి నిరసనలకు దారితీసింది.
“దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అయిన పదం ఏదయినా వుందంటే అది ‘సెక్యులరిజం’. ఈ పదం ఇలా దుర్వినియోగానికి గురికాకుండా భరతవాక్యం పలకాలి. ఎందుకంటే, సమాజంలో ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడానికి ఈ పదం దోహదపడుతోంది” అన్నారు రాజ్ నాథ్.
సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి విస్తృతంగా వాడుతున్న అనువాద పదం ‘లౌకిక వాదం’ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ పీఠికలో చేర్చాలని భావించలేదు. 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిష్టు (సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలను రాజ్యాంగ పీఠికలో కొత్తగా చేర్చారని, రాజ్ నాథ్ గుర్తుచేశారు.
“సెక్యులరిజం’ అనే ఆంగ్ల పదానికి ‘ధర్మ నిరపేక్షత’(మతాతీత లౌకిక వాదం) అనే హిందీ అనువాదం సరికాదనీ, దాన్ని ‘పంత్ నిరపేక్ష’ (వర్గాతీత లౌకిక వాదం) అని వుంటే సబబుగా వుండేదని హోం మంత్రి వ్యాఖ్యానించారు.
“అంబేద్కర్ స్పూర్తితోనే మోడీ నాయకత్వంలోని  ఎండీయే ప్రభుత్వం ‘జన్ ధన్, స్వచ్చ భారత్, బేటీ పడావో’ వంటి పలు పధకాలకు రూపకల్పన చేసిందని చెప్పారు.
భారత రాజ్యాంగ రచనను ఒంటి చేత్తో నిర్వహించిన అంబేద్కర్ ప్రతిభను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు శ్లాఘించారు. కాలపరీక్షకు తట్టుకుని నిలబడేలా  రాజ్యంగ రూపకల్పన చేసిన అంబేద్కర్ దార్సనికతకు జాతి రుణపడివుంటుందన్నారు.
కేంద్ర హోంమంత్రి చేసిన ‘సెక్యులరిజం’ ప్రస్తావన పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఘాటుగానే స్పందించారు.
“రాజ్యాంగంపై విశ్వాసం లేనివాళ్ళు, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోనివాళ్ళు ఈ నాడు ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. ఇలాటివాళ్ళు  రాజ్యాంగానికి కట్టుబడి వుండడంపై చర్చ పెట్టడాన్ని మించిన హాస్యాస్పద అంశం వేరే ఏముంటుంది” అంటూ ఎద్దేవా చేసారు.
“రాజ్యాంగం యెంత మంచిదయినా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపొతే, అంతిమప్రభావం చెడుగానే వుంటుందని ఆనాడే అంబేద్కర్ అన్నారన్న సంగతిని గుర్తు చేస్తూ,  పాలక పక్షానికి ఓ  చురక అంటించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి వచ్చిన  అంబేద్కర్ లోని ప్రతిభను గుర్తించి రాజ్యంగ రచన వంటి గురుతర బాధ్యతను ఆయనకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీయే అని సోనియా ముక్తాయింపు ఇచ్చారు.
అంబేద్కర్ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన  ప్రత్యేక చర్చను, పాలక, ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తమ రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మళ్ళించుకునే రీతిలో, అంబేద్కర్ స్మృతిని వాడుకున్న తీరు నేటి స్వార్ధ రాజకీయాల తీరుతెన్నులకు అర్ధం పడుతోంది.
ఘర్షణాత్మక రాజకీయాలు ఒద్దని ఒకపక్క చెబుతూనే, సహనం నేటి  అవసరం అని ఇంకో పక్క  ఉద్ఘాటిస్తూనే, ఉభయ పక్షాలు తద్విరుద్ధంగా ప్రవర్తించడంలో తమ శక్త్యానుసారం పాటుపడ్డాయన్న వాస్తవం, చర్చల సరళిని గమనిస్తూ వచ్చిన వారికెవ్వరికయినా ఇట్టే బోధపడుతుంది.
అయితే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ కొంత మేలే చేసింది. రాజ్యాంగం గురించి జాతి వ్యాప్తంగా మీడియాలో విస్తృత చర్చలు జరిగాయి. భారత రాజ్యాంగం గురించి, దాని విశిష్టతను గురించి బొత్తిగా తెలియని నేటి యువతరానికి తెలియయచేప్పే అనేక ఆసక్తికర అంశాలు మరోమారు వెలుగు చూసాయి.
గత అరవై ఆరేళ్లుగా అమల్లో వున్నభారత రాజ్యాంగానికి ఘనమైన చరిత్రే వుంది.
స్వాతంత్ర పోరాటంలో భాగంగానే సొంత రాజ్యాంగం కావాలంటూ 1930 లోనే కాంగ్రెస్ గళమెత్తింది. కాంగ్రెస్ వాదన ఒప్పుకోవడానికి బ్రిటిష్ పాలకులకు పదహారేళ్ళు పట్టింది.  1946లోనే నాటి వైస్రాయ్ లార్డు వావెల్ ఈ డిమాండును అంగీకరించారు. రాజ్యాంగ రూపకల్పనకు ఉద్దేశించిన పరిషత్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి సభ్యుల సంఖ్య 389 కాగా, దేశ విభజనానంతరం  299 కి తగ్గింది. కొందరు  ఎన్నికయిన వారు కాగా మరికొందరు నామినేటెడ్  సభ్యులు. మరో విశేషం ఏమిటంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 24 మంది అమెరికన్లు. రాజ్యాంగ నిర్మాణ చర్చల్లో ఈ విదేశీయులు వారం రోజులు పాల్గొన్నారు.

రాజ్యాంగ రచన అక్షరాలా  రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిదిరోజుల పాటు సాగింది. ఇందులో 114 రోజులు ముసాయిదా రూపకల్పనకే సరిపోయాయి. చర్చ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించారు. సుదీర్ఘ పరిశీలన తరువాత 2,473 సవరణలను తిరస్కరించారు.
1946 డిసెంబరు లో మొదలయిన రాజ్యాంగ రచన  1949 డిసెంబరు వరకు కొనసాగింది. మరో విచిత్రం ఏమిటంటే ఈ క్రతువు కొనసాగుతున్న కాలంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్తితుల్లో వుంది. మతఘర్షణలు, వర్గ పోరాటాలతో అట్టుడికి పోతున్న రోజులవి. బహుశా ఈ నేపధ్యమే సమానత్వం, స్వేచ్చ, సౌభాతృత్వం, సమ న్యాయం వంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి తేవడానికి రాజ్యాంగ నిర్మాతలను ప్రేరేపించి ఉండవచ్చు.
వివిధ దేశాల రాజ్యాంగాలను సవిరంగా అధ్యనం చేసి, వాటిలోని మంచి లక్షణాలను భారత రాజ్యాంగంలో గుదిగుచ్చారు. ఫ్రాన్స్ నుంచి స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం, రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండు నుంచి ఆదేశిక సూత్రాలు, జపాన్ నుంచి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అమెరికా నుంచి ప్రాధమిక హక్కులు, కెనడా నుంచి సమాఖ్య స్పూర్తి, ఇలా పలు అంశాలకు మన రాజ్యాంగంలో చోటు దొరకడం వల్లనే అది కాల పరీక్షలను తట్టుకుని నిలబడి ప్రజాస్వామ్యం విలసిల్లడానికి తోడ్పడింది. 
యావత్ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దది. మొత్తం   25 భాగాలు. పన్నెండు షెడ్యూల్స్,  448 అధికరణలు, అయిదు అనుబంధాలు.
ఇంతటి విస్తృత రాజ్యాంగాన్ని సరిగ్గా అరవై ఆరేళ్ళ క్రితం నవంబరు 26 న మన రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుంచి స్వేచ్చా భారతం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించింది. ఇన్నేళ్ళ తరువాత తొలిసారి ఈ రోజును అంటే నవంబరు ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవాలనే సత్సంకల్పం పాలకులకు కలిగింది. రాజ్యాంగం గురించి భావి భారత పౌరులయిన విద్యార్ధులకు మరింత అవగాహన కలగడానికి వీలుగా సరళమైన భాషలో ప్రాధమిక దశ నుంచే పాఠ్య ప్రణాళికలలో చేర్చే సదుద్దేశం కూడా ఏలిన వారికి కలిగితే అంతకంటే కావాల్సింది లేదు. 
తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత  పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రంధాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది. (27-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image owner

తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత  పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రందాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది. (27-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image owner          

కామెంట్‌లు లేవు: