22, జూన్ 2015, సోమవారం

అంతయు మన మేలునకే


'అమ్మగారు ఈ రోజు ఇల్లూడ్చి వెళ్లిపోతా, నేనూ మా ఆయనా మార్నింగ్ షోకెడదామనుకున్నాం'
'ఓస్! అదెంత భాగ్యం, భాగ్యం! ఈ మాత్రానికే ఇంత ఇదయిపోయి అడగాలా ఏమిటి. ఇంట్లో  పనిదేముంది ? ఒక్క రోజు నడుం వంచి అంట్లు తోమితే నేనేమయినా అరిగి పోతానా, కరిగిపోతానా చెప్పు.  అలాగే వెళ్ళు. భాగ్యం.  అన్నట్టు ఓ  యాభయ్ ఇస్తా.  దగ్గరుంచు, సినిమా హాల్లో పనికొస్తాయి'
కంప్యూటర్ దగ్గర కూర్చుని పనిచేసుకుంటున్నాడు, ఏకాంబరం. దేవుడు చెవులకు  బిరడాలు పెట్టలేదు కదా! అందుకే, పనిమనిషి భాగ్యం, అతడి భార్య నీలాంబరి  నడుమ జరిగిన సంభాషణ పొల్లు పోకుండా అతగాడి చెవిన పడింది. 'ఇదేమిటి మా ఆవిడేనా అలా మాట్లాడింది' అంటూ ఓరకంట తేరిపారచూశాడు. యాభయ్ నోటు పనిమనిషి చేతిలో పెడుతూ కన్పించింది నీలాంబరి.  సందేహం లేదు కనిపించింది  ఆవిడే. విన్నది  ఆవిడ మాటలే.
అలా రోజంతా నీలాంబరిలో  ఆ మార్పు ఏమాత్రం మార్పులేకుండా  గంట గంటకూ వరదగోదారిలా పెరుగుతూ పోతోందే కాని ఏమాత్రం తగ్గేసూచనలు కానరావడం లేదు. పిల్లలు ఛానల్ మార్చి క్రికెట్ చూడాలని అంటే మామూలుగా అయితే సీరియల్ వస్తోంది  మార్చడానికి వీల్లేదంటే వీల్లేదని పట్టుబట్టే  శ్రీమతి నీలాంబరి ఆరోజు మాత్రం 'వెధవ సీరియల్ రోజూ వుండేదే,  ఒకరోజు చూడకపోతే కొంపలేమీ మునిగిపోవన్న'ట్టు  నీతులు చెబుతుంటే విని, పోతున్న ఏకాంబరం మతి మరికాస్త చక్కా పోయింది.
పనిమనిషితో, వాచ్ మన్ తో, పూలవాడితో, పాలవాడితో  నీలాంబరి  వ్యవహరించే తీరు, మాట్లాడే పధ్ధతి పూర్తిగా మారిపోవడంతో వూరువాడకు అదో టాపిక్ పాయింటు అయివుంటుంది. టీవీల్లో స్క్రోలింగు వచ్చినా ఆశ్చర్యం లేదు. అందులో సందేహం లేదు. ఇంతగా ఇంత  మారిపోయిన మనిషిని కారణం అడుగుతే ఇంతెత్తున లేస్తుందేమో అన్న భయం పూర్తిగా తొలగిపోయాక, ఈ మార్పు శాశ్విత తాత్కాలికమనో, తాత్కాలిక శాశ్వితమనో నిర్ధారించుకున్నాక ఇక వుండబట్ట లేక అడిగేశాడు ఏకాంబరం, 'అసలీ ఆకస్మిక  మార్పుకి కారణం ఏమిట'ని.
ముందు మందహాసం. తరువాత ప్రశాంత వదనం. ఆ తదుపరి ఇల్లాలి  అనుగ్రహభాషణం ఇలా సాగిపోయాయి.
'ఎప్పుడూ ఆ ఫేసుబుక్కో మరో బుక్కో అంటూ ఆ కంప్యూటర్ ముందు మఠం వేసుకుని కూర్చోకండి మొర్రో అంటే నా మాట ఎప్పుడు  విన్నారు కనుక.  నేను చూడండి, సీరియల్ కోసం నిన్న టీవీ పెడితే ఒకటే యోగా గోల. ఎన్ని ఛానళ్లు మార్చి చూసినా యోగా మాత్రం మారలేదు. దాంతో దాని సంగతేమిటో చూద్దామని  ఇష్టం లేకపోయినా చూస్తూ పోయాను. బోలెడు మంది యోగా గొప్పతనం గురించి బోలెడు బోలెడు చెబుతూ పోయారు. యోగా చేస్తే కరెంటు పోయి మళ్ళీ వచ్చినట్టు మన శరీరంలో పాజిటివ్ తరంగాలు ప్రవహిస్తాయట. మంచి భావాలు, మంచి ఉద్దేశ్యాలు వాటంతట అవే కలుగుతాయట.'
'అది సరే! అవి యోగా చేసే వాళ్లకేమో. మరి నీ సంగతేమిటి? నువ్వెప్పుడు నేర్చుకున్నావు'
'నేర్చుకోవడమా నా బొందా! రోజంతా టీవీల్లో అదేపనిగా అవే చూపెడుతుంటే అవి చూసిన నా వొంట్లో  కూడా పాజిటివ్ ఎనర్జీ,  వానొచ్చినప్పుడు వూళ్ళో సైడు కాలవలో నీళ్ళ మాదిరిగా పొంగుతూ  ప్రవహిస్తోంది సుమా!'
'ఇదా! కధ! పోనీలే! అంతయు మనమంచికే అన్నారు' అనుకున్నాడు ఏకాంబరం దీర్ఘశ్వాస తీసుకుంటూ. 

   
(22-06-2015)
కార్టూనిస్ట్ అర్జున్ (గోతెలుగు డాట్ కామ్) కు కృతజ్ఞతలతో 

1 కామెంట్‌:

సుశ్రీ చెప్పారు...

.మరేదయినా సరదా ముగిపుని ఊహించాను .