13, జూన్ 2015, శనివారం

ప్రమాదం అంచుల్లో ప్రజాస్వామ్యం

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 14-06-2015, SUNDAY)
ప్రజాస్వామ్య ప్రాతిపదికగా ఏర్పాటు చేసుకున్న భారత రాజ్యాంగం ప్రకారం సింపిల్ మెజారిటీతో ప్రజలెన్నుకున్న పార్టీలు అధికారంలోకి వస్తాయి. సాధారణంగా ఏ  ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం ఓటర్లు పోలింగులో పాల్గొనరు. సగటున ముప్పయి శాతం మంది ఈ విధంగా ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లిప్తంగా వుండిపోయిన సందర్భాలు అనేకం వున్నాయి. అంటే అర్ధం వారెవ్వరికీ ఎన్నికల్లో పోటీపడుతున్న పార్టీల పట్ల, వాటి విధానాల పట్ల  మక్కువ లేదనుకోవాలి. ఇంకా మిగిలిన డెబ్బయి శాతం వోటర్లు వేసే ఓట్లనే ఆయా పార్టీలు పంచుకుంటాయి. వీటిల్లో తమ సమీప ప్రత్యర్ధి కన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకున్న వారే విజేతలుగా ప్రకటించబడతారు. ఒక్కోసారి, పోటీపడ్డ పార్టీల నడుమ ఓట్లు భారీగా చీలిపోవడం కద్దు. ఇలాటి సందర్భాలలో  విజేతలుగా నిలిచినవారికి పడ్డ ఓట్లు, పోలింగులో పాల్గొనకుండా నిరాసక్తత ప్రదర్శించిన ముప్పయి శాతం కంటే కూడా తక్కువ కావచ్చు. కానీ రాజ్యాంగంలో పొందుపరచుకున్న నియమ నిబంధనల ప్రకారం వారే అధికార పీఠం అధిస్టిస్తారు. మరో విషయం ఏమిటంటే విజేతలుగా నిలిచిన వారికి పడిన ఓట్లు కూడా గుంపగుత్తగా  ఆయా పార్టీల వీరాభిమానులు వేసినవి కావు. తటస్తులయిన వాళ్లు, ఎవరికో ఒకరికి వేయాలి కనుక వేసి చేతులు దులుపుకునే వాళ్లు కూడా వుంటారు. యెలా అయితేనేం, ఒక్క ఓటు అధికంగా తెచ్చుకున్నా వాళ్ళే విజేతలు. రాజ్యాంగం ప్రకారం మొత్తం ఆ నియోజక వర్గానికి వాళ్ళే ప్రజాప్రతినిధులు. ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో చాలామంది వ్యతిరేకించినా కూడా అయిదేళ్ళ కాలానికి వాళ్ళే చట్టసభల్లో  ప్రాతినిధ్యం వహిస్తారు.


ఈ నేపధ్యంలో చూసినప్పుడు ఇటు తెలంగాణాలో కేసీఆర్, అటు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు ప్రజలు ఎన్నిక చేసిన ప్రభుత్వాలకు నేతృత్వం వహిస్తున్నారు. అంచేత యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తాము ప్రతినిధులమని చెప్పుకోవడంలో అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రకాల గౌరవాలకు వాళ్లు అర్హులు. వాళ్లని అదే స్థాయిలో గౌరవించి తీరాలి. అది ప్రజాస్వామ్య స్పూర్తి కూడా. అయితే ఇక్కడ ఒక విషయం గమనంలో వుంచుకోవాలి.  యావత్ రాష్ట్రానికి పనికివచ్చే పనుల విషయంలో, లేదా సమస్యల పరిష్కారం విషయంలో తమ విధానాలకు మొత్తం ప్రజానీకం మద్దతు వుందని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రజాస్వామ్య విరుద్ధమైన లేదా పజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా చేసే పనులకు, తమ తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పనికి వచ్చే పనుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఈ సందర్భాలలో  ప్రజలను అడ్డం పెట్టుకోవడం క్షంతవ్యం కాదు. అదే జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే.
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా వున్న హైదరాబాదులో పరిస్తితులను వివరిస్తూ, తమ వాదనకు అనుకూలమైన అంశాలను జోడిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సవివరమైన లేఖను ఇచ్చినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల కారణంగా రాజ్యాంగమే ప్రమాదంలో పడిపోయిందని అర్ధం వచ్చేలా కధనాలు వెలువడ్డాయి. ఉమ్మడి రాజధానిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన పని తాను సక్రమంగా చేసుకుపోవడానికి వీలులేకుండా తెలంగాణా ప్రభుత్వం తన యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో స్థానం కల్పించారని ఆయన కేసీఆర్ పై మరో ఆరోపణ కూడా చేశారు. ఉమ్మడి రాజధానిలో  తమ ప్రభుత్వం సజావుగా పాలన సాగించడానికి వీలుగా  రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ ఎనిమిది ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవాల్సివుందని కూడా ఆయన కోరారు. తమ మంత్రులు, అధికారుల ఫోన్లను నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేస్తున్నారనీ, దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలని చంద్రబాబు ప్రధానిని అభ్యర్ధించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ప్రధానికి ఈ విధమైన విజ్ఞప్తి చేసారంటే దాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలకు ఉపక్రమించడం కేంద్రం ధర్మం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ మేరకు మాత్రమే పరిమితం అయివుంటే ఏమాత్రం ఆక్షేపించాల్సిన అవసరం వుండదు. తనకున్న  భయాందోళనలను ప్రజలకు కూడా ఆపాదించారు. ఆవిధంగా ఒక చక్కని సమస్యను లేవనెత్తి కూడా దానికి రాజకీయం రంగు పులమడం వల్ల మొత్తం అంశం నీరుకారిపోయే అవకాశం ఏర్పడింది. దీనికి తోడు కొన్ని సమర్ధించుకోలేని చర్యలు కూడా తెలుగు దేశం పార్టీ అధినేత వాదనను బలహీనపరచిన మాట కూడా వాస్తవం. ఆ కారణం వల్లె, మొత్తం ప్రజల దృష్టిని కొన్ని అనైతిక సంఘటనలనుంచి మళ్లించేందుకే చంద్రబాబు ఏడాది కాలంగా పట్టించుకోని సెక్షన్ ఎనిమిది అంశాన్ని తెరపైకి తెస్తున్నారని టీఆర్ ఎస్ నాయకులు ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో, ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతంగా పరిణమించిన కొన్ని అనైతిక చర్యలు, కేసులు,  న్యాయస్థానాల  విచారణకు, తీర్పులకు నోచుకోకుండానే రెండు పార్టీల  రాజకీయ వికృత క్రీడలకు మైదానంగా మారిపోతున్నాయి. పార్టీల నడుమ వ్యవహారం ప్రభుత్వాల మధ్య వివాదంగా మారిపోయి, ప్రస్తుతం రాజకీయ నాయకుల పుణ్యమా అని ప్రజలనడుమ లేనిపోని అనుమానాలు రేకెత్తడానికి కారణం అవుతున్నాయి. ఇదొక విషాదం. ఇరు ప్రాంతాలలోని ప్రజలు దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి వుంది. లేని పక్షంలో రెండు రాష్ట్రాలకు  ఈ  పరిణామాలు పెనువిషాదాన్నే  మిగిలిస్తాయి.   
ఈ వివాదాలు సరిపోవన్నట్టు  సరికొత్తగా కృష్ణా నదీ జలాల వివాదం తోడయింది. ఉభయ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నదీ జలాల్లో వాటాలు, లెక్కలు తేల్చాలని ఒకళ్ళు, తెల్చేదేమీ లేదని మరొకళ్ళు మాటల తూటాలు విసురుకుంటున్నారు. బజారు నల్లాల దగ్గర  అనునిత్యం జనాలకు కానవచ్చే పోట్లాటలను పోలే  దృశ్యాలను టీవీ ఛానళ్ళలో ఉచితంగా చూపిస్తున్నారు. తాడు తెగకుండా తెగలాగడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.  
దశాబ్దంన్నర  క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఒక  జోస్యం చెప్పారు. 

ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో, ముడి చమురు  వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు. అనేది అప్పట్లో అయన చెప్పిన మాట. ఆయన జోస్యం కొంత నిజం అవుతోంది. అదే భయం.
కృష్ణా జలాలపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మంత్రుల నడుమ రాజుకుంటున్న వివాదం చినికి చినికి గాలివానగా కాదు ఏకంగా సునామీగా   మారుతున్న నేపధ్యం ఇందుకు ఉదాహరణ.
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. ఒక ప్రాంతం అంటూ లేదు. తాము పారుతూ తమ పక్కన వుండే నేలను, ఆ నేలలో వుండే  పంట పొలాలను పచ్చగా చేయడం తప్ప వాటికి ఏ స్వార్ధం తెలియదు. వచ్చిన చిక్కల్లా నీటితో రాజకీయాలు చేసే వారితోనే. వాటిని  తమ స్వార్ధానికి వాడుకోవాలని చూసే రాజకీయులతోనే. (13-06-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   

కామెంట్‌లు లేవు: