10, జూన్ 2015, బుధవారం

హితవాక్యము


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-06-2015, THURSDAY)

'క్రమక్రమముగా కొలువుకూటము రణకూటమగుచున్నది, పదువురుండగనే నా మాటలాలకింపుడు' అంటాడు పాండవుల పనుపున దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో ధృతరాష్ట్రుడితో.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ రంగం  సమరాంగణంగా మారుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ఉవ్వెత్తుతున్నాయి. ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. మీడియాలో చర్చలు, ఎవరివాదాన్ని వారు బలంగా వినిపించే ధోరణితో పేట్రేగిపోతూ దారితప్పుతున్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వినిపించుకోరు. తమ మాటే వినాలని, తమ ప్రశ్నకే జవాబు చెప్పి తీరాలని, అ సమాధానం కూడా తమకు అనుకూలంగా వుండాలని పట్టుబట్టే పెడ ధోరణే  జడలు విప్పుకుంటోంది.  ఈ వేడిలో, వాడిలో  వివేచన వెనక్కు తప్పుకుంటోంది. తప్పు మీదంటే మీదని బురద చల్లుకునే క్రమంలో తప్పు చేయడం అసలు  తప్పేకాదన్న రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న అధినాయకులే యుద్ధరంగంలో దిగి సమర శంఖాలు పూరిస్తూ వుండడంతో కధ క్లైమాక్స్ కు చేరుతోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అనుచర గణాలు ఈ విషయంలో  నాయకులను మించి గొంతులు పెంచి నానా యాగీ చేస్తున్నాయి. మొన్న ఒక టీవీ ఛానల్ చర్చకు వచ్చిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిస్సిగ్గుగా చెప్పాడు, 'ఈ విషయంలో జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి'  అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే  నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది యెంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అవకాశం కోసం అర్ధం కానట్టు వుండిపోతున్నారు అనుకోవాలి.
ఏవిషయం వచ్చినా, ఏ  సమస్య వచ్చినా ముందు రాజకీయం అనే రక్కసి అందులో చేరి  పడగలు విప్పుతోంది. దాంతో ప్రతిదీ రాజకీయమయం అయిపోతోంది. ఎవడో ఒకడు ఒక నేరం చేస్తాడు. లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అతడు ఏదో ఒక పార్టీవాడు అయితే ఇక అంతే సంగతులు.  ఆ  పార్టీ అతడికి  కొమ్ము కాస్తుంది. వెంటనే ఎదుటి పక్షం  తన పల్లవి తాను అందుకుంటుంది. ఇలా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఆ మనిషి చేసిన నేరం కాస్తా  నేపధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలాటి విషయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి పార్టీ చేసే పని ఇదే. నేరం చేసిన వాడు పరాయి వాడు అయితే, 'చట్టం తన పని తను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ అతీతులు కారు'  అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు.  తమవాడే  అయితే 'చట్టం పాలకుల చేతిలో చుట్టం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పుచేసిన వాడిని పోలీసులు విచారిస్తే, అది సరికాదు, సీబీ  సీ ఐ డీ దర్యాప్తు కోసం గగ్గోలు పెడతారు. సీబీ సీ ఐ డీ విచారణ చేస్తుంటే, అది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, సీ బీ ఐ దర్యాప్తు అంటారు. సేబీఐ పరిస్తితీ ఇంతే, అది కేంద్రం చేతిలో ఆటబొమ్మ అంటారు. ఇలా వ్యవస్థలను భ్రష్టుపట్టించే అసంబద్ధ ఆరోపణలు చేస్తూ విచారణను నీరుకారుస్తారు. నేరారోపణలు ఎదుర్కున్న వ్యక్తులు కొన్నాళ్ళ తరువాత  హాయిగా జనం మధ్యే తిరుగుతుంటారు. ఇదీ కొన్నేళ్లుగా జరుగుతున్న కధ. ఇప్పుడు నడుస్తున్న కధ కూడా దానికి పొడిగింపే.        
ముందు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు కలగలసిపోయినట్టు ఈ నాడు నేరాలు, రాజకీయాలు జమిలిగా ముడి పడిపోయాయి. వీటిని విడదీసే జల్లెడలు లేవు. వున్నా రాజకీయ పార్టీలకి వాటి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా తమ వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లు నేరస్తులయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎదుటివాడయితే చేతిలో వున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టడం. మనవాడయితే వాటినుంచి బయటపడవేయడం. ఇదే నేటి రాజకీయ ధర్మం. 'ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంద'ని ఉవాచ. రాజకీయ పార్టీలు కూడా తాము నమ్మిన 'ఆ  ధర్మమే' తమను కాపాడుతుందని భావిస్తూ  తాము పెంచి పోషిస్తున్న  'అధర్మాన్నే' సదా కాపాడుతూ పోతుంటారు.
అందుకే, ఈనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై అధినాయకుల సవాళ్లతో కూడిన ప్రకటనలు విన్నప్పుడు , వాటిపై టీవీల్లో  చర్చిస్తున్నప్పుడు చాలా బాధ వేస్తోంది. ఆ బాధ ఇప్పుడు భయంగా పరిణమిస్తోంది. ఏ ఒకరిద్దరికో కాదు, ఉభయ ప్రాంతాల్లో ఈ విధంగా ఆవేదన చెందుతున్న వారి సంఖ్య గణనీయంగానే వుంది. ఉభయ పక్షాలు ఇది గమనంలో పెట్టుకుని వ్యవహరించాలి.

ఏడాది గడిచింది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నాయకుల సమర్ధతను గీటు రాయిగా తీసుకుని  ఆయా రాష్ట్రాల ప్రజలు  రెండింటికీ, ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికారం అప్పగించారు.  కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  మొదట్లో ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం అందరి గుండెల్లో నిండింది. అది ఏడాది గడవక ముందే ఇలా ఆవిరి అయిపోతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు  జనంలోకి చేరిపోయి వారు కూడా  రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు  మరింత బిగిసిపోకముందే ఉభయ ప్రాంతాల నాయకులు కళ్ళు తెరవాలి.  వ్యవహారాలు చేయిదాటిపోనివ్వకూడదు. నిజానికి ఇది బాధ్యతతో కూడిన కర్తవ్యం.  రెండు ప్రాంతాలలో వాతావరణం తేలిక పడే విధంగా వారి అడుగులు పడాలి. పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞప్తి ఇదే. (10-06-2015)


(చెడు వినకు, కనకు, మాట్లాడకు)
మహానుభావులు, కీర్తిశేషులు 'బాపు' గారికి కృతజ్ఞతలతో 

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

>>>>>పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం. నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞప్తి ఇదే. (10-06-2015)>>>>
ఇది సామాన్యుడి ఆవేదన

శ్యామలీయం చెప్పారు...

అయ్యా అజ్ఞాత వ్యాఖ్యాతగారూ,
రెండు రాష్ట్రాల మధ్యన రెండు రాజ్యాల మధ్యవలె పోరు నడవటం ఒక సామాన్యుడిగ మీ ఆవేదన అన్నారు. కొందరు మేథావులు ఇది ఇద్దరు వ్యక్తులమధ్య జరుగుతున్న పోరువలెనే చూడటానికి ఇష్టపడుతున్నారు. వారు ఒక వ్యక్తిని దొంగ అనీ మరొక వ్యక్తిని దొర అని తమకు తామే నిర్దేశనం చేసుకొని వ్యాఖ్యానిస్తున్నారు. నేటి రాజకీయరంగంలో అది ఎంతవరకూ పధ్ధతి అన్న వాదనను తలకెత్తుకో నవసరం లేదు. అంతఃకరణలో అందరికీ కొన్ని కొన్ని విషయాలమీద తగినంత అవగాహన ఉన్నా, మాటలవరకూ చేతలవరకూ అది రాకపోవటం సహజం కాబట్టి వాదించటానికి పెద్దగా ఏమీ లేదు కూడా. ఇతే ఈ కుస్తీగోదాలో ఉన్న వ్యక్తులు రెండు రాష్ట్రాలకు పరిపాలనాపాంగా శిరఃస్థానంలో ఉన్నారు కాబట్టి ఇది ప్రజాజీవితానికి సంబంధంలేని విషయంగా భావించటం మంచిది కాదని నా అభిప్రాయం. సహజంగా ఏ రాష్ట్రప్రజలవిషయం తీసుకున్నా వారు తమరాష్ట్రప్రతిష్టకు భంగకరమైన విషయం అని భావించే పరిస్థితి లేదని అనటం కష్టం. అందుచేత అనేకులు మీ వంటి సామాన్యులు నాయకుల సంయమనహీనత గురించి ఆవేదనపడటం అర్థం చేసుకోవచ్చును సులభంగానే. ఇటువంటివి కేవలం రాజకీయాలలోనుండి పుట్టిన గొడవలు కాబట్టి జనంలో లోతైన ముద్రలు వేయవనీ, ఇరురాష్ట్రాల ప్రజలలోనూ దురవగాహనలకు దారితీయవని ఆశించటం మంచిదే, కాని అది అత్యాశ అయ్యే అవకాశమే హెచ్చు. తప్పో ఒప్పో ఒక భూఖండాన్ని విభజించాం అన్నారు. కొంత వింతపనులూ చేసారు. ఇరుపక్షాలకూ ఏవేవో మాటలమూటలు ఇచ్చారు. కాని ప్రశాంతత చెడింది. ఎవరివల్ల అని అడగకండి. చాలా పెద్ద పట్టీయే బయటకు వస్తుంది. అది కాదు ముఖ్య. ప్రశాంతత చెడటం వలన జాతిపరువు చెడగొట్టుకొనే పరిస్థితిలోనికి రెండు ప్రాంతాలలోని నాయకత్వాలు దిగి పోరులో మునిగిపోయాయి. లాభం ఎవరైనా రాజకీయులకు ఉండవచ్చును. నష్తం మాత్రం స్థానిక స్థాయిలో తెలుగు జాతికి, విస్తృత స్థాయిలో భారతజాతికి. అవేదన పడటం కాదు - ఆ ఆవేదననుండి ఈ పాపకశ్మలాన్ని ప్రక్షళనం చేసే నైతికజాగగృతి ఒక వరదలాగా రావాలి. అప్పుడు కనీసం వచ్చే తరాలకు ఆవేదన తప్పుతుంది.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

మాస్టారూ, నేను మేధావిని కాను కానీ ప్రస్తుత "వివాదం" రెండు రాష్ట్రాల మధ్య కాదని నా ప్రగాఢ నమ్మకం. ఒకవేళ అలా అయి ఉంటె ఆంద్ర రాష్ట్రంలో షుమారు 48% వోట్లు తెచ్చుకున్న పార్టీలను రాష్ట్ర ద్రోహులుగా పరిగించాల్సి వస్తుంది. ఇది కేవలం వ్యక్తులు/పార్టీల మధ్య గొడవగానే చూడాలి.

ఒకరిని దొంగ మరొకరిని నిర్దోషి అని అంతిమంగా తేల్చేది న్యాయస్థానం, మనమెంత? అయితే కొద్దో గొప్పో ఆధారాలు ఉండి, నేరారోపణలు మోపబడి & ప్రాధమిక దర్యాప్తు జరుగుతున్న కేసులను కనీసాదారాలు కూడా లేకుండా గిట్టని వారు చేసే ఆక్షేపణలను ఒకేతాటి పై చూడడం సబబు కాదని మీలాంటి విజ్ఞులు అంగీకరిస్తారని ఆశిస్తాను.

పరస్పర నిందాపర్వంలో ప్రభుత్వ పెద్దలు మునిగి పోవడం ఇది మొదటి సారి కాదు, ఆఖరి సమయం ఎటుతిరిగీ కాబోదు. గతంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తనను గద్దె దించిన అల్లుణ్ణి తిట్టినా తిట్టు మళ్ళీ తిట్టకుండా వారాల తరబడి ఊరూరా ప్రచారం చేయలేదా?

తెలంగాణా అవతరణ తరువాత ఇంత వరకు వచ్చిన గొడవలు ఖచ్చితంగా రాష్ట్రాల మధ్యే. ఉ. ఎంసెట్ విషయంలో చట్టం ప్రకారం తమకే చెందాలని ఆంద్ర చేసిన వాదన న్యాయస్తానం కొట్టేసింది. ఈ గొడవకు కారణం ఆంద్ర న్యాయశాఖ అవగాహనా రాహిత్యమా, నాయకుల దుందుడుకా లేదా వ్యక్తిగత వైరాలా అనేది పక్కన పెడదాం. హక్కుల తాలూకా వివాదంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలుగా గుర్తిస్తే అర్ర్ధం చేసుకోగలం. తమ ప్రయోజనాలను గాలికి వదిలేసే ప్రభుత్వాలను ప్రజలు క్షమించరు (క్షమించకూడదు కూడాను) కనుక ఎవరికీ ఇబ్బంది లేదు.

ఆంధ్రకయినా మరే రాష్ట్రానికి అయినా ఇతర 28 రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకోవడం మంచిదే అయితే తమ ప్రయోజనం కంటే ముఖ్యం కాదు. ఉ. ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయి కాబట్టి పోలవరం ఆపేస్తారా ఆపరు కదా.

PS: భూకండ విభజన అన్నారు కాబట్టి విభజించింది భూమిని కాదు రాష్ట్రం అనబడే పరిపాలనా యంత్రాంగం మాత్రమె అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశాంతత చెడిందో లేదో కానీ ప్రజాభీష్టం నిలిచి గెలిచింది. ఘోరకలి వచ్చేస్తుంది అంటూ చేసిన ఊహాగానాలు (దేశం 500 ముక్కలు, మతపరమయిన అల్లర్లు, నక్సల్ పెట్రేగడం, ప్రాంతేతరుల మీద దాడులు ఒకటా రెండా) ఒక్కటీ నిజం కాలేదు అది వేరే సంగతి లెండి.

Unknown చెప్పారు...

శ్యామలీయం గారు,

ఒక్క క్షణం ఇలా ఊహించుకోండి. ACB వీడియోలో TRS ఎమ్మెల్యే డబ్బు సంచి పట్టుకుని TDP ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ ఎమ్మెల్యేకి భరోసా ఇస్తూ KCR మాట్లాడడం రికార్డయింది. దాన్ని మీడియా బయట పెట్టింది.

అప్పుడు మీరు KCRని తప్పు పడతారా? లేక ప్రశాంతత చెడటం వలన జాతిపరువు చెడగొట్టుకొనే పరిస్థితిలోనికి రెండు ప్రాంతాలలోని నాయకత్వాలు దిగి పోరులో మునిగిపోయాయి. లాభం ఎవరైనా రాజకీయులకు ఉండవచ్చును. నష్తం మాత్రం స్థానిక స్థాయిలో తెలుగు జాతికి, విస్తృత స్థాయిలో భారతజాతికి. అంటూ వేదాంతం చెప్తారా?

మీరు మనసులో ఆలోచించుకోండి చాలు. సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు.