5, మే 2015, మంగళవారం

కావాల్సింది పట్టుదల- పంతాలు కాదు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 07-05-2015, THURSDAY)

మొన్నీమధ్య కారులో  వెడుతున్నప్పుడు  హైదరాబాదులో నిర్మాణంలో వున్న మెట్రో ని గమనిస్తూ డెబ్బయ్యవ పడిలో పడ్డ ఒక పెద్దమనిషి, తన జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకున్నారు.
"అత్యంత పొడవైన  పీవీ నరసింహారావు హైవే నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినప్పుడల్లా ఈ హైవే నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు దానిమీద ప్రయాణం చేద్దామా అనే కోరిక దారిపొడుగునా  నాలో సుళ్ళు తిరుగుతూ వుండేది. చూస్తుండగానే అది పూర్తికావడం, ఆ మార్గంలో అనేక వందల సార్లు ప్రయాణించడం జరిగిపోయింది.
"అల్లాగే ఔటర్ రింగ్ రోడ్డు. అదీ అంతే. ఇంత  పెద్ద ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎప్పుడు చూస్తానో అనుకునేవాడిని. ఆ కోరికా తీరిపోయింది. ఇక ఈ మెట్రో. రేపో మాపో ప్రారంభం అని వార్తలు వింటున్నాను.


(చాలా ఏళ్ళ కిందట హుస్సేన్ సాగర్ మొత్తం ఇలా  గుర్రపు డెక్కతో నిండి వుండేది) 

"గతంలో హుసేన్ సాగర్ తటాకం గుర్రపు డెక్క మొక్కలతో మొత్తం పచ్చగా పాచిపట్టినట్టు అసహ్యంగా కానవచ్చెది. అధికారులు ఎన్ని సార్లు ఎన్ని తాత్కాలిక ప్రయత్నాలు చేసినా, గుర్రపు డెక్క మాత్రం ఖండించిన రావణాసురుడి శిరస్సుల మాదిరి తిరిగి మొలుచుకు వచ్చేది. దరిమిలా ఆ కార్యక్రమాన్ని ఒక యుద్ధప్రాతిపదికపై తలకెత్తుకున్న తరువాత ఆ  గుర్రపు డెక్క పీడ హుస్సేన్ సాగర్ కి శాస్వితంగా తొలగిపోయింది. ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, హుసేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మార్చి దానికి పూర్వ వైభవం తీసుకురావాలనే బృహత్తర ప్రయత్నం మొదలు పెట్టారు. అది సాకారం అయి అది కూడా చూడగలిగితే ఎంతో అదృష్టం అనుకుంటాను.
"పొతే,  'అమరావతి' (ఆంద్ర ప్రదేశ్ కొత్త రాజధాని) ని  కూడా కళ్ళారా చూడాలనే కోరిక నాలో నానాటికీ  పెరుగుతోంది'
నిజానికి ఇదేమంత తీరని కోరికేమీ కాదని  నాకప్పుడు  అనిపించింది. ఎందుకంటె ఈ రోజుల్లో నిర్మాణ రంగంలో వచ్చిన పురోగతి అలాటిది.  ప్రభుత్వాలకు, పాలకులకు  పట్టుదల, చిత్తశుద్ధి ఉండాలే కాని సాధ్యం కానిది ఏదీ లేదు. చైనాలో కేవలం పదిహేను రోజుల్లో ముప్పై అంతస్తుల భవనం నిర్మించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, గతంలో మాదిరిగా ప్రతి పైసాకు వెతికి చూసుకోవాల్సిన పరిస్తితులు ప్రభుత్వాలకు ఈనాడు లేవు. అన్నీ 'బీవోటీ' (బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్)  అనే కొత్త పారిభాషిక పదం   చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సక్రమంగా ప్రణాళిక తయారు చేసి, పారదర్శకంగా టెండర్లు పిలిచి పనులు ఒప్పచెప్పడమే తరువాయి మిగిలిన పనులన్నీ  వాళ్ళే చూసుకుంటారు. యెంత పెద్ద ప్రాజెక్టు అయినా సరే కాంట్రాక్టుకు తీసుకున్న కంపెనీలే మొత్తం భారాన్ని  తమ నెత్తికి ఎత్తుకుంటాయి. ఇప్పుడు మన కళ్ళెదుట కానవస్తున్న మెట్రో రైలు మార్గం, ఔటర్ రింగు రోడ్డు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దేవుడు మేలు చేస్తే రేపో మాపో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో సాకారం కాబోతున్న అనేకానేక ప్రాజెక్టులు, ఇవన్నీ ప్రత్యక్ష తార్కాణాలు.  కాకపొతే లాభం లేని పనులు చేయడానికి  ఏ వ్యాపారీ ముందుకు రాడు అన్న నిజం తెలిసికూడా ప్రభుత్వాలు ఈ మార్గాన్నే ఎంచుకోవడానికి కారణం  తమపై ఎలాటి ఆర్ధిక  భారం లేకపోవడమే. ఇంతంత గొప్ప నిర్మాణాలను ఇంత  తక్కువ వ్యవధిలో ప్రభుత్వాలు ఇంత చక్కగా ఎలా చేయగలుగుతున్నాయి  అని ఎవరయినా అమాయకంగా అనుకుంటే,  ఆ   'ఖ్యాతి' కూడా అప్పనంగా వాటి  ఖాతాలోనే పడిపోతోంది.  కాకపొతే ఆ నిర్మాణ వ్యయాన్ని వడ్డీతో సహా వినియోగదారులనుంచి 'టోల్ టాక్సు' పేరుతొ అనేక సంవత్సరాలపాటు ఆ కంపెనీలు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటాయి. గుడారంలో కాళ్ళు చాపుకోవడానికని చెప్పి మొత్తం ఆక్రమించిన ఎడారి ఒంటె కధ గుర్తుకువస్తే చేయగలిగింది లేదు.   అదే వేరే కధ. ఆ వ్యధతో ఏ ప్రభుత్వాలకీ నిమిత్తం వుండదు.
ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వచ్చే నెలలో శంకుస్థాపన జరగబోతోందని సమాచారం. ఇప్పటికే ఆలస్యం అయిందని అనుకుంటున్న ఈ కార్యక్రమానికి శుభారంగం జరగబోవడం ఆహ్వానించతగిన పరిణామం. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త రాజధాని నిర్మాణం జరపాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తలపోస్తున్నారు. ఆయన ఆలోచనలన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా క్షేత్ర స్థాయిలో ఒక స్వరూపానికి వస్తే ప్రపంచపటంలో కొత్త రాష్ట్రానికి సరికొత్త స్థానం దొరకడం ఖాయం. అయితే ఆలోచనలు ఆకాశం,లో ఆచరణ అఘాధంలో అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలను తిప్పికొట్టాలంటే కేవలం మంత్రులు అప్పుడప్పుడూ ఇస్తున్న హామీ  ప్రకటనలు ఎంతమాత్రం సరిపోవు. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి. అవీ త్వరత్వరగా.
ఈ సందర్భంలో కొన్ని రాజధానుల నిర్మాణం గురించి చరిత్ర చెప్పే వాస్తవాలను వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
మన దేశం ఎల్లలు దాటి కొత్త దేశాల్లో కొత్తగా కాలుమోపేవారు ముందు కళ్ళార్పకుండా చూసేది అక్కడి భవన నిర్మాణ కౌశలాన్ని. మన  దేశానికి యాత్రీకులుగా వచ్చే విదేశీయులు సయితం అత్యంత  ఆసక్తిగా గమనించేది కూడా, చూడాలని తాపత్రయ పడేది  ఎప్పుడో పూర్వకాలంలో  రాజులు, నవాబుల హయాములో  నిర్మించిన తాజ్ మహల్ వంటి నిర్మాణాలనే  అనే నిజాన్ని గమనంలో వుంచుకోవాలి. ఇవన్నీ ఒక్క రోజులో నిర్మించినవి కావు. ఏళ్ళతరబడి కష్టపడి, చెమటోడ్చి  నిర్మిస్తేనే వాటికి ఒక ఆకారం వచ్చింది.
ఉదాహరణకు దేశ రాజధాని కొత్త ఢిల్లీ నగరం తీసుకుంటే అక్కడి నిర్మాణాలు, రహదారులు, ఉద్యానవనాలు ప్రపంచంలో ఏ నగరానికీ తీసిపోనంత ఘనంగా వుంటాయి. ఇది చాలామందికి తెలిసిన విషయమే.
కాసేపు  చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తె -
1911 డిసెంబరు 12 న  ఢిల్లీ దర్బార్ జరిగింది. కొత్త ఢిల్లీ నగర నిర్మాణానికి బ్రిటిష్ చక్రవర్తి అయిదో జార్జి శంకుస్థాపన చేసారు. అప్పటివరకు కలకత్తాలో వున్న దేశ రాజధానిని ఢిల్లీకి తరలిస్తున్నట్టు ఆయన ప్రకటన చేసారు. బ్రిటిష్ నిర్మాణ శిల్పులు సర్ ఎడ్విన్ లుటేన్స్, సర్ హర్బర్ట్ బెకర్ కొత్త రాజధాని నమూనా తయారు చేసారు. నగర నిర్మాణ కాంట్రాక్ట్ ను సర్ శోభాసింగ్ కు ఒప్పచెప్పారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం వంటి కారణాలవల్ల నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దాదాపు ఇరవై ఏళ్ళు సాగిన రాజధాని నిర్మాణం ఎట్టకేలకు  1931లో పూర్తయింది. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేసారు. రాష్ట్రపతి భవన్ (వైస్రాయ్ నివాస భవనం)  వంటి కళ్ళు చెదిరే కట్టడాలు, అద్భుతమైన రహదారులు, సుందర ఉద్యానవనాలతో కూడిన కొత్త రాజధాని కళ్ళెదుట నిలిచింది. ప్రపంచపటంలో తనకంటూ ఒక సుస్థిర స్థానం దక్కించుకుంది.       
1926 లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నిర్మాణం ఒకే ఒక్క ప్లాటుఫారంతో మొదలయింది. కనాట్ ప్లేస్ పేరుతొ అధునాతన షాపింగ్ ప్లాజా నిర్మాణాన్ని నాలుగేళ్ల కాలవ్యవధిలో పూర్తిచేశారు.
ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి'  నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ముందు పేర్కొన్న పెద్దమనిషి ఎదురుచూస్తున్నట్టే,  కొత్త రాష్ట్రంలో కోట్లాది ప్రజలు కూడా  ఎదురు చూస్తున్నారు. వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్టుగా ఈ ప్రయత్నానికి ఆదిలోనే ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు. కొన్ని వచ్చి పడ్డవి. కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
రాజధాని కూడా లేకుండా ఆవిర్భవించిన నూతన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అతి త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఎంతయినా వుంది. దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఇది రాజకీయ అవసరం. అంతకు మించి ప్రజల అవసరం.  నిర్మాణ ప్రాంతంలో వందలాదిమంది రైతులు వేలాది ఎకరాల పంట భూములను స్వచ్చందంగా ప్రభుత్వానికి ఒప్పగించారని సర్కారు గణాంకాలు తెలుపుతున్నాయి. అయినా అక్కడ అక్కడక్కడా సమీకరణకు సంబంధించి తలనొప్పులు తప్పడం లేదు. ఒక పెద్ద ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఇలాటివన్నీ అతి సహజం. ఒంటిపైన వస్త్రం ముళ్ళ కంచెకు తగిలినప్పుడు ఒడుపుగా ముళ్ళను తప్పించే ఓర్పు కావాలి. ప్రతి పక్షాలు అనవసర యాగీ చేస్తున్నాయని ప్రత్యారోపణలు చేస్తూ పోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు. సరికదా అనుభవశాలి చెప్పాల్సిన మాటలు కాదని సామాన్య ప్రజలు కూడా సందేహించే ప్రమాదం పొంచి వుంటుంది.
ఈ సందర్భంలో పాలకులకు కావాలిసింది గట్టి పట్టుదల. అంతే  కాని అనవసరమైన 'పట్టుదలలు, పంతాలు' కాదు.
(05-05-2015)

రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

కామెంట్‌లు లేవు: