20, నవంబర్ 2014, గురువారం

మౌంట్ అబూ - పదేళ్ళ కిందటి జ్ఞాపకాలు




2003 లో ఒక రోజు.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మ కుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూకి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్. ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము. నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్ పై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మ కుమారీల ప్రధాన కార్య స్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పౌరాణిక సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మ కుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమంది జర్నలిష్టులు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల హైదరాబాదు నుంచి వచ్చిన బృందం లో వున్నాము. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.


శుక్రవారం
‘అంబర చుంబిత’ అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్ లో పైకి వెడితే వచ్చే గురు శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించని స్తితి. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది. కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలు పెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరుచెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడి కంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది. ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ‘ఆంధ్రా సీఎం’ అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూ లో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి. గురు శిఖరానికి వెళ్ళే దారిలో పడి పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే వాళ్ళూ మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది.అక్కడ మాకు హైదరాబాదు
నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు. కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేశాడట. ఇది విన్న తరవాత పని పట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మ కుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి డాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి.మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
‘కర్మ బంధాలలో చిక్కుపోయిన ఆత్మ – తన తండ్రి అయిన పరమాత్మను గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు’ దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి- ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో – ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడి యలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే – నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మ కుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేశ మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాదునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
(రెండువేల మూడులో సతీ సమేతంగా చేసిన మౌంట్ అబూ యాత్ర గురించి మనసు పొరల్లో మరగునపడిన జ్ఞాపకాల ఆధారంగా - భండారు శ్రీనివాసరావు)
Be firm when authority is required, but be gentle and sweet when administering authority- Brahmakumaries

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


>>నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?

ధ్యానం 'లో' ఏమీ లేదు! 'ఏమీ' లేదు లో ధ్యానం ఉంది !!

జిలేబి