5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

బెజవాడపై దాసుగారి స్పందన అమెరికా నుంచి - మరోభాగం


     
ఇక  బెజవాడలో రెస్టారెంట్ల విషయానికి వస్తే-

వూళ్ళో దాదాపు అన్నీ శాకాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.


మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి) 

కామెంట్‌లు లేవు: