21, ఆగస్టు 2014, గురువారం

కోతి వీసా


అనగనగా ఒక వూరు. ఆ వూర్లో ఓ జంతు ప్రదర్శనశాల.

అసలే ఇది చిట్టిపొట్టి కధ. ఈ కధలో పదేపదే వచ్చే ఈ పదాన్ని అలా సాగదీసి రాయడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ల భాషలో పొట్టిగా జూ అనుకుందాము.

ఆ జూ లోని ఓ బోనులో జూలు బాగా పెంచుకున్న ఓ సింహం వుంది. రోజుకు కనీసం ఓ కిలో మాంసం కూడా తన మొహాన విదల్చడం లేదని ఆ జూ అధికారులపై దానికి తగని కోపం. జూలు విదిల్చి, కాలు దువ్వాలని వుంది కానీ  ఏం లాభం.  తానున్నది అడవి కాదాయే. పైగా ఆ జూ అధికారులు అడవి జంతువులకన్నా క్రూరులు.  వాళ్లకు తిక్క తిరిగిందంటే దొంగలెక్కలు రాసి ఆ మాత్రం మాంసం కూడా పెట్టకుండా తన డొక్క మాడ్చగల సమర్ధులన్న సంగతి ఆ మృగ రాజుకు తెలుసు. అందుకే అనువుగాని చోట అధికులమనరాదు అన్న నీతి వాక్యం ప్రకారం మిన్నకుండి పోయింది.

కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలవదు. దాని గోడు విన్న తధాస్తు దేవతలు కరుణించారేమో తెలియదు. ఏదయితేనేమి, దుబాయిలో వున్న ఓ జూ అధికారి   రోజు ఈ జూ చూడడానికి వచ్చి, తగిన ఆహారం లేక చిక్కిపోయిన ఈ సింహాన్ని చూశాడు. చక్కనమ్మ చిక్కినా అందంఅనుకున్నాడేమో దాన్ని తన దుబాయ్ జూ కు తీసికెళ్ళాడు.

ఎమిరేట్స్ విమానం ఎక్కిన దగ్గరనుంచి సింహానికి ఆకాశంలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. ఆ దేశంలో జూలన్నీ సెంట్రల్ ఏసీ అని ఎవరో చెప్పగా విన్న సంగతి గుర్తు వచ్చి దాని వొళ్ళు పులకరించి పోయింది. ఎంచక్కా చల్లటి బోనులో కూర్చుని దుబాయ్ జూ అధికారులు రోజూ ఆహారంగా పెట్టే ఒకటి రెండు మేకలను కడుపారా తింటూ కడుపులో మాంసం  కదలకుండా కాలక్షేపం చేసే సన్నివేశాలను వూహించుకుంటూ ఆ సింహం దుబాయ్ జూ చేరుకుంది.

అది కలలు కన్నట్టే దానిని ఒక ప్రత్యేక బోనులో వుంచారు. నీటుగా దుస్తులు ధరించిన జూ పనివాడు ఒకడు పొద్దున్నే వచ్చి చాలా నీటుగా ప్యాక్ చేసిన ఆహారం పొట్లాన్ని అందించాడు. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకుంటూ సింహం ఆత్రంగా ఆ పాకెట్ విప్పింది. అందులో మూడు నాలుగు అరటి పండ్లు వున్నాయి. అసలే పరాయి దేశం - భాష అర్ధం కాక పొరపడ్డారేమోనని మొదటి రోజు సర్దిచెప్పుకుంది. కానీ రెండో రోజూ, ఆ మరునాడు కూడా పనివాడు అరటి పండ్లే పెట్టడంతో సింహానికి తిక్కరేగింది.
పండ్లు పట్టుకుని వచ్చినవాడిని నిలబెట్టి దులిపేసింది.

ఏం ఇక్కడ మీ అందరికీ నన్ను చూస్తే తమాషాగా వుందా. నేనెవరనుకుంటున్నారు. మొత్తం అడవికే రాజుని. అరటి పండ్లు తినడానికి నేనేమన్నా కోతి ననుకుంటున్నారా?’ అని గాండ్రించింది.

అయితే, సింహం గాండ్రింపులకు బెదిరిపోవడానికి ఆ జూ పనివాడు అడవిలో ఏనుగు కాదు కదా. అందుకే అతగాడు తాపీగా జవాబు చెప్పాడు.

నువ్వు సింహానివన్న విషయం ఇక్కడ పుట్టిన పిల్లులకు కూడా తెలుసు. కాకపోతే నిన్నిక్కడికి కోతి వీసా మీద తీసుకొచ్చిన సంగతే నీకు తెలిసినట్టు లేదు


నీతి: పరాయి దేశంలో కోతిగా వుండడంకన్నా మాతృదేశంలో సింహంగా బతకడం మేలు.


Note: Courtesy Image Owner