14, జూన్ 2014, శనివారం

కృషి వుంటే....


'కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు' అని ఓ సినీ గేయం ఉద్బోధిస్తుంది. బీహార్ కు చెందిన ఆనంద్  కుమార్ ఇదే కోవకు చెందుతాడు.


(శ్రీ ఆనంద్ కుమార్)

అయితే ఇతగాడి గురించి డిస్కవరీ ఛానల్ ఒక గంట  ప్రోగ్రాం ప్రసారం చేసేవరకు, టైం మేగజైన్ ఒక కధనాన్ని ప్రచురించేవరకు, దాన్ని చదివిన అమెరికా అధ్యక్షుడు ఒబామా తన ప్రతినిధిని పాట్నా పంపి వివరాలు ఆరాతీసేవరకు ఈ ఆనంద్ కుమార్ ఎవరో బీహార్ బయటి భారత దేశానికి తెలియదు. అదే చిత్రం.
పేరు ఆనంద్ కానీ అతడి జీవితంలో ఆనందం తక్కువే. నిరుపేద కుటుంబం. బాగా చదువుకోవాలనే ఆరాటం. కానీ చదివించలేని కుటుంబ నేపధ్యం.
గణిత శాస్త్ర మేధావి రామానుజం అతడి రోల్ మోడల్. ఒకరకంగా ఆయనకు ఏకలవ్య శిష్యుడు. రామానుజం మాదిరిగా కేంబ్రిడ్జ్ లో చదువుకోవాలనే కోరిక తీరకపోయినా తనలాగా కలలు కనే కటిక పేద విద్యార్ధుల కలలు మాత్రం తన కృషితో నిజం చేసాడు.
కుటుంబానికి వున్న ఒకేవొక్క ఆధారం తండ్రి. ఆయన  హఠాత్తుగా చని పొవడంతో తల్లితో  కలిసి ఆనంద్ బాద్య్హత నెత్తికెత్తుకున్నాడు. ఇల్లిల్లూ తిరిగి తల్లి చేసిచ్చిన అప్పడాలు అమ్మేవాడు. తీరిక దొరికినప్పుడల్లా ఎవరికీ అర్ధం కాని గణిత శాస్త్ర సమస్యలతో కుస్తీ పట్టేవాడు.  కూలీనాలీ  చేసి పొట్టపోసుకునే వారు, ఆటో డ్రైవర్లు తమ పిల్లల్ని లెక్కలు నేర్చుకోవడానికి ఆనంద్ దగ్గరకి పంపేవారు. వాళ్లు ఉడతాభక్తిగా ఇచ్చే డబ్బులే  కుటుంబ పోషణకు అక్కరకువచ్చాయి. ఈ క్రమంలో నిరుపేద  విద్యార్ధి ఒకడు  అతడి వద్దకు వచ్చాడు. ఐ.ఐ.టీ.లో చేరడం అతడి కల. ఆ స్వప్నం సాకారం చేసే బాధ్యత ఆనంద్ తనపై వేసుకున్నాడు. డబ్బు తీసుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి శిష్యుడికి పాఠాలు బోధించాడు.  చిత్రంగా అతడు ఎంట్రెన్స్ పాసయి ఐ.ఐ.టీ.లో చేరగలిగాడు. అంతే  తన ప్రతిభ ఏమిటో ఆనంద్ కి తెలిసివచ్చింది. అంతే  కాదు తాను చేయాల్సింది ఏమిటో కూడా అర్ధం అయింది. తనలాగా పెద్ద చదువులు చదవాలనే కోరికలు వుండి తీర్చుకోలేని బీదపిల్లలకు  సాయపడాలని నిర్ణయించుకున్నాడు.
అతడి కల నిజమైంది. అతడ్ని నమ్ముకున్నవాళ్ళ కలలు నిజమయ్యాయి. ఏటా ముప్పైమంది అతిపేద విద్యార్ధులను  ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి ఐ.ఐ.టీ. ఎంట్రెన్స్ కి పంపేవాడు. ఆ ముప్పైమందీ సెలక్ట్ అయ్యేవాళ్ళు. ఇది తెలిసి విద్యావ్యాపారులు కొందరు  తమతో చేయి కలిపి లాభాలు గడిద్దాం రమ్మన్నారు. కానీ అతడు సుతరామూ అంగీకరించలేదు. కేవలం పేదరికాన్నే కొలమానంగా తీసుకుని ప్రతియేటా పిల్లలకు శిక్షణ ఇస్తూ అఖండ విజయాలు సాధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సాయం తీసుకుంటే యెం జరుగుతుందో అతడికి తెలుసు. అందుకే దాన్ని మృదువుగా తిరస్కరించాడు. టైమ్ పత్రికలో అతడి గురించి చదివిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఏకంగా తన ప్రతినిధినే ఆనంద్  దగ్గరకు పంపి అవసరమైన సాయం చేస్తాననే సంసిద్ధత  వ్యక్తం చేసాడు. కానీ ఆనంద్  ధ్యేయం వేరు. తనలాటి పేదవారిని మరో  నలుగురిని జీవితంలో పైకి తీసుకురావడం తప్ప నలుగురూ  తన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఏనాడు  తాపత్రయ పడలేదు.
ఏటా ముప్పయిమంది అతిపేద పిల్లల్ని ఐ.ఐ.టీ.లో చేర్చడం ఒక్కటే ఈ ఏకలవ్యుడి లక్ష్యం. ఆ ధ్యేయం ముందు అతడికి మిగిలినవన్నీ అత్యల్ప స్వల్ప విషయాలే!
రామానుజం పేరుతొ ఏర్పాటుచేసుకున్న సంస్థలో చదివే పిల్లలకు తల్లి అన్నం వొండి పెడుతుంది. సోదరుడు ఇతరత్రా అవసరమైన  సాయం చేస్తాడు. ఆనంద్ పాఠాలు చెబుతాడు.
అలా వారి జీవితం సాగిపోతోంది. అతడి నుంచి సభ్యసమాజం, ప్రత్యేకించి చిన్నమెత్తు పనిచేసి పెద్దపెట్టున  ప్రచారం పొందాలని  తాపత్రయపడే  వ్యక్తులు, సంస్థలు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం వున్నాయి.
(ఇంగ్లీష్ లో సమాచారాన్ని పంచుకున్న శ్రీ పీవీవీజీ స్వామి గారికి కృతజ్ఞతలతో )

కామెంట్‌లు లేవు: