25, జూన్ 2014, బుధవారం

హాస్య నటుడు చెప్పిన చేదు నిజాలు


జార్జి  కార్లిన్ (1937 - 2008) పాత తరానికి చెందిన గొప్ప హాలీవుడ్  హాస్య నటుడు. నవ్వించేవారి వెనుక కాచి వడ బోసిన జీవితం వుంటుంది. ఆ అనుభవాల నుంచే ఆణిముత్యాల లాంటి జీవిత సత్యాలు వెలుగులోకి వస్తాయి. 


అవి ఆయన మాటల్లో:
'ఎత్తయిన భవనాలు నిర్మించుకుంటున్నాం. కానీ వాటిల్లో నివసించే మన మనసులు మాత్రం కుంచించుకు పోతున్నాయి.
'బాగా తింటున్నాము. బాగా తాగుతున్నాము. కానీ ఎప్పుడో ఒకప్పుడయినా మనసారా నవ్వుకోగలుగుతున్నామా? అనుమానమే!
'బతకడం ఎలాగో బాగానే నేర్చుకున్నాం. కాని, జీవించడం యెలా అన్నదే పూర్తిగా మరచిపోయాం.
'చంద్ర గ్రహంపై కాలుమోపి తిరిగి రాగలిగాం, కానీ నాలుగడుగులు వేసి వీధి దాటివెళ్ళి పొరుగువాడిని పలరించి రావడం చేయగలుగుతున్నామా?
'రోదసిని జయించామని జబ్బలు చరుచుకుంటున్నాం. కానీ మన మనసు చెప్పే మంచి మాటను మాత్రం  పెడచెవిన పెడుతున్నాము  
'ఆత్రుత  పడడం తెలుసుకున్నాం కాని ఓపిగ్గా వేచి వుండే తత్వాన్ని పోగొట్టుకున్నాం
'జీవితాన్ని  పరుగుల వరదలా మార్చుకున్నాం. తినడానికి టైం లేదు. నిద్రపోవడానికి సమయం వుండదు. భార్యా పిల్లలతో ముచ్చట్లకు వ్యవధి వుండదు. జీవితంవెంట పరుగులు పెట్టడమే సరిపోతోంది. ఆలుమగలు ఇద్దరికీ  ఉద్యోగాలు. ఒక్క జీవితం  రెండు జీతాలు అని మురిసి పోతున్నాం. ఆదాయాలు పెరగడం ఒక్కటే చూసుకుంటున్నారు.  మనసులు విరిగిపోతున్న సంగతీ,  విడాకుల సంఖ్య పెరుగుతున్న సంగతీ గమనించడం లేదు.
'అందుకే.....

'మనవారు అనుకున్నవారితో నాలుగు మాటలు చెప్పుకోవడానికి సమయం కేటాయించండి. మీ మనసులోని మాటల్ని పంచుకోవడానికీ, వారు చెప్పింది కాస్త వినడానికీ కాస్త  వీలు చేసుకోండి. నిజానికి వీరే మీకు తోడూ నీడా. కాని వారు మీ వెంట వుండేది, వారి వెంట మీరు వుండేది  కూడా తాత్కాలికమే. ఈ నిజాన్ని తెలుసుకుంటే మరింత సమయం వారితో గడపడం యెల్లా అన్న ప్రశ్న తలెత్తదు'
Photo Courtesy Image Owner 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మంచి మాటలు చెప్పిన మంచి కమెడియన్ గురించి మంచి పోస్ట్ వ్రాశారు.

జార్జ్ కార్లిన్ వి చాలా ప్రసంగాలు ఉన్నాయి. వాటిల్లో "Euphemisms" అనేది నాకు బాగా నచ్చిన వాటిల్లో ఒకటి. దాని విడియో లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. సూటిగా సింపుల్ గా చెప్పే పదాల బదులు
ఆడంబరపు పదాల వాడకం ఇంగ్లీష్ భాషలో ఎలా ఎక్కువవుతున్నదో ఉదాహరణలతో చెప్తాడు కార్లిన్ ఈ విడియోలో.

http://www.youtube.com/watch?v=vuEQixrBKCc