5, మార్చి 2014, బుధవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 13


బస్సులో బంధువులు 






ఆ వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.
నిజానికి అది మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు ముక్క వచ్చింది. నిజానికి రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే  హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి  తరవాత  కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్ బాగ్ లో' వారానికోసారి మాస్కోకు విమానంలో పంపుతారు.



 మన ఎంబసికి చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే  ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.   మేము జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్  ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి  ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి. వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది.



.మన రాష్ట్రం సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్ గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.


(ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీ రాజేంద్ర ప్రసాద్, కుడి నుంచి రెండోవారు)   

 తరువాతి రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్ర జ్యోతి ఎడిటర్ -  ఐ. వెంకట్రావు గారు  తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగువాళ్ళు పడుతున్న  ఆరాటాన్ని గమనించి- హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఎంబసీ ద్వారా ఆంద్ర జ్యోతి దినపత్రికను పంపడం ప్రారంభించారు.


(శ్రీ  ఐ. వెంకట్రావు)


మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం చేసింది కూడా. ఇక కార్డు విషయానికి వస్తే-

కార్డు కదా! కొంత విరామం తీసుకుందాం. ఏమంటారు?



NOTE: All the images in this blog are copy righted to their respective owners.

కామెంట్‌లు లేవు: