18, డిసెంబర్ 2013, బుధవారం

మూడంటే మూడే ప్రశ్నలు


యక్ష ప్రశ్నలు కాదు కాబట్టి  ప్రయత్నించి చూడండి.
సమాధానం మాత్రం వెంటనే చెప్పాలి సుమా. ఆలోచిస్తూ పోతే కుదరదు.
ఇదిగో! ఇదే  మొదటి ప్రశ్న.


మీరో  పరుగు పందెంలో పాల్గొంటున్నారు..
రెండో స్తానంలో వున్న ప్రత్యర్ధిని మీరు దాటిపోయారు.
అప్పుడు పందెంలో  మీరే స్తానంలో వున్నట్టు ?
  
అవును! అదే  అనుకున్నాను.
మొదటి స్తానం చేరుకున్నట్టు జవాబు చెబుతారని.
అయితే ఆ జవాబు పూర్తిగా తప్పు.
పందెంలో రెండో స్తానంలో వున్న వ్యక్తిని దాటిపోయారంటే అతడి స్తానంలో మీరు చేరినట్టు. అంటే ఈ ప్రశ్నకు సరయిన సమాధానం రెండో స్తానం అన్నమాట.

ఇప్పుడిక రెండో ప్రశ్న
ఈ పరుగు పందెంలో మీరు చిట్టచివరవున్న ప్రత్యర్ధిని దాటారనుకుందాం.
అప్పుడు  మీరు ఏ స్తానంలో వున్నట్టు ?
దీనికి మీ సమాధానం పందెంలో చివరివాడికంటే ముందున్నట్టు. అవునా!
అయితే మాత్రం మళ్ళీ పప్పులో కాలేసినట్టే.    
ఎందుకని మీరు అడగక్కరలేదు. నేను చెప్పక్కరలేదు.
వరుసలో ‘చిట్ట చివరివాడి’ని  దాటిపోవడం అన్నది ఎవరికయినా  అసాధ్యం కాబట్టి. 

 
 
పోతే ముచ్చటగా మూడో ప్రశ్న.
కాకపొతే, చాలా చిక్కు ప్రశ్న – నోటితోనే టక్కున జవాబు చెప్పాలి. పెన్నూ కాగితం తీసుకుని లెక్కలు వేసుకుంటూ కూచుంటామంటే  కుదరదు.
ముందు వెయ్యి అంకె తీసుకోండి. దానికి  నలభయ్ కలపండి. మళ్ళీ మరో వెయ్యి కలపండి. ముప్పై, ఇంకో వెయ్యి, ఇరవై,  మరో వెయ్యి,  పదీ ఇలా  కలుపుతూ పోండి. ఇప్పుడు చెప్పండి.  అన్నీ కూడితే ఎంత వచ్చింది?
అయిదువేలా !  కాదు.
ఈ ప్రశ్నకు సరయిన సమాధానం 4100 సుమా! నమ్మకపోతే కాలిక్యులేటర్ తీసుకుని లెక్కవేయండి.    


అయ్యో ఇవ్వాళ ఒక్క ప్రశ్నకు  సరయిన జవాబు తట్టలేదని బాధపడకండి.
బోనసుగా ఇంకో ప్రశ్న.
అదే ఇది.
సీగాన పెసూనాంబ (శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు ముళ్ళపూడి బుడుగు పెట్టిన ముద్దుపేరు)  తండ్రికి అయిదుగురు ఆడపిల్లలు.
అందులో ఒకరి పేరు సుబ్బలక్ష్మి
మరో అమ్మాయి వెంకట లక్ష్మి
ఇంకో అమ్మాయి మహాలక్ష్మి
నాలుగో అమ్మాయి పేరు విజయలక్ష్మి
ఐదో అమ్మాయి పేరేమిటి? ఆదిలక్ష్మి అనుకుంటున్నారా?

కాదు. మన సీగాన పెసూనాంబే!  
Note: Courtesy Image Owner 

2 కామెంట్‌లు:

Geetika B చెప్పారు...

బాగా కన్ఫ్యూజ్ చేసారు..
ప్రశ్న చదవుతూనే ఆవేశంగా పప్పులో కాలేశాం.

థ్యాంక్యూ సర్.. మంచి పోస్ట్‌ వేసినందుకు.

B Geetika

Unknown చెప్పారు...

papulo padakudadanukone padaa thanks sir