15, నవంబర్ 2013, శుక్రవారం

ఎవరీ అంకుల్ టామ్ ?


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.


(శ్రీ తోట భావనారాయణ)

పత్రికల ప్రజాదరణ లెక్కించడానికి అవి అమ్ముడుపోయే ప్రతుల సంఖ్యను ఆధారంగా తీసుకుంటారు ఆడిట్ బ్యూర్ ఆఫ్ సర్క్యులేషన్ ( ABC ) సంస్థ ప్రతి ఆరునెలలకొకసారి లెక్కలు వేసి ఈ సంఖ్యలను నిర్ధారిస్తుంది. స్థూలంగా ఈ సమాచారం ఆధారంగా పత్రికలకు ప్రకటనలిచ్చే వారు నిర్ణయం తీసుకుంటారు. అదే విధంగా ఒక్కో పత్రిక ఎంత మంది చదువుతున్నారో అంచనా వేసేందుకు నేషనల్ రీడర్ షిప్ సర్వే( NRS ) పేరిట మరో అధ్యయనం కూడా జరుగుతుంది.
అయితే టెలివిజన్ ఛానల్స్ కార్యక్రమాల విషయంలో మాత్రం  ప్రత్యేకమయిన లెక్కింపు విధానాన్ని అనుసరించాల్సి వస్తుంది.  సర్వే పద్ధతిలో కొన్ని ఎంపిక చేసిన శాంపిల్స్ ఆధారంగా వివిధ ఛానల్స్ లో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల ఆదరణ అంచనా వేస్తారు. దీన్ని నిర్వహించే TAM India  సంస్థ ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా ప్రకటన కర్తలు ఆయా ఛానల్స్ లో ఆయా కార్యక్రమాల సమయంలో ఆ సంస్థలు నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రకటనలు ఇవ్వటానికి సిద్ధపడతారు.
ఒక నిర్ధిష్ట సమయంలో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరిలో ఆ కార్యక్రమం చూస్తున్న వారి శాతమే స్థూలంగా రేటింగ్ అని చెప్పవచ్చు. ఒక నిర్దిష్టమైన సమయంలో ఉన్న ప్రేక్షకుల మొత్తం సంఖ్యను శాంపిల్స్ ను దృష్టిలో ఉంచుకుని రేటింగ్స్ నిర్ణయిస్తారు. ఒక ఛానల్ లో వారం మొత్తంలో సంపాదించిన రేటింగ్స్ మొత్తమే స్థూల రేటింగ్ పాయింట్లు (Gross Rating Points – GRPs ) అంటారు. ఉదాహరణకు ఒక వారంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రసారమయ్యే అన్ని ఛానల్స్  జిఆర్ పిలలో ఒక నిర్ధిష్టమైన ఛానల్ సంపాదించిన జిఆర్ పిల మొత్తాన్ని మార్కెట్ వాటాగా చెబుతారు. ప్రకటనలిచ్చే వాళ్లకు సౌకర్యంగా ఉండటానికి వీలుగా స్త్రీ పురుషులను వివిధ వయో వర్గాలుగా  విభజించి రేటింగ్స్ తీస్తారు. అందువలన ఒక కార్యక్రమానికి మహిళల నుంచి లేదా పురుషుల నుంచి లేదా పిల్లల నుంచి ప్రత్యేకమైన ఆదరణ ఉంటే రేటింగ్స్ లో ఆ విషయం స్పష్టమవుతుంది. (ఇంకా వుంది)
(15-11-2013)

Telugu TV

కామెంట్‌లు లేవు: