22, ఆగస్టు 2013, గురువారం

ఒకనాటి ఇద్దరు మిత్రులు

 సరిగ్గా   ముప్పయేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు అనతికాలంలోనే  వేరైపోతాయని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం అంత త్వరగా ఆవిరి కాగలదని కానీ,  ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు నాయుడు,  కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి.


(ఒకనాటి  మిత్రులు వై.ఎస్., బాబు)  

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టీకి ఆయనే  అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటికి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టీ  అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.
అందుకే - చంద్రబాబు - రాజశేఖరరెడ్డి అదృష్టవంతులయిన రాజకీయ నేతల కోవలోకి చేరిపోయారని చెప్పడం. పార్టీలో - ప్రభుత్వంలో ఎదురులేని స్థితికి చేరుకోవడం - అస్తిత్వానికి ముప్పులేకపోవడం - సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవి అతిగా పెరిగిపోయి – అహంకారానికీ,  మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీయనంతకాలం - ఎలాంటి అనర్థాలకు అవకాశం ఉండదు. రెండోతరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపఠంలో   ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న స్థాయిలో వూహాగానాలు ఊపిరి పోసుకున్నాయి.  ఆయన హయాంలోనే  ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైకెక్కించే పధకాల రచనకు కంప్యుటర్ వేగంతో శ్రీకారం చుట్టారు.


(1996 లో కాలు విరిగి ఆసుపత్రిలో వున్నప్పుడు పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో)

ఆ తర్వాత జరిగింది చరిత్ర - మిత్రపక్షాలు వైరి పక్షాలుగా మారి వీధులకెక్కారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో - వరుస కరువులతో రైతాంగం వెన్ను విరిగింది. విధ్యుత్ కొరత  ప్రజల కడగండ్లని మరింత పెంచింది. ఆర్ధిక  సంస్కరణలు,  ధరల  పెంపుకు దోహదంచేసి - పరిస్థితులు మరింత దిగజారేలా చేశాయి. జరుగుతాయనుకున్న ఎన్నికలు మరింత దూరం జరగడం - తాత్కాలిక సర్కారు పాలనాధికారాలకు  ఎన్నికల కమీషన్ ముక్కుతాడు విధించడం - చంద్రబాబుని మరింత వుక్కిరి బిక్కిరి చేసాయి.  ముందరి కాళ్ళకు బంధాలు వేశాయి. ప్రత్యేక తెలంగాణా పేరుతో వుద్యమం ప్రారంభించి - ఎన్నికల్లో పోటీ చేసిన టీ.ఆర్.ఎస్. నేత చంద్రశేఖర రావుతో - కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చేతులు కలపడంతో - రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనకు చరమగీతం పాడినట్టయింది. కణకణమండే ఎండాకాలంలో రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో జరిపిన సుదీర్ఘ పాదయాత్రతో సాధించిన కాంగ్రెస్ విజయంతో - చంద్రబాబు పాలన - రెండో టరం వ్యవధి పూర్తికాకుండానే ముగిసిపోయింది.


(ముఖ్యమంత్రి వై.ఎస్.తో రచయిత)  

ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.  2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు.  గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే, బహుశా, ఏ  రెండేళ్ళో, మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపోయివుండేవారేమో. కాని ఈసారి, అంటే 2004లో,  సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు  కనుకనే – అయిదేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడమే కాకుండా  పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ ను  సృష్టించారు. అంతే కాకుండా,  ఒకనాటి తన  రాజకీయ మిత్రుడు చంద్రబాబు తరహాలోనే రెండో పర్యాయం కూడా తన పార్టీని వరసగా మరోమారు అధికార పీఠం ఎక్కించగలిగారు. హెలికాప్టర్ దుర్ఘటనలో ఆకస్మిక మరణం చెందకపోయివుంటే ,  సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరిట వున్న రికార్డును అధిగమించే అవకాశం కూడా  ఆయనకు దక్కి వుండేదేమో.

రాజకీయంగా విడిపోయిన ఈ రాజకీయ మిత్రులు ఇద్దరు  చివరికి భౌతికంగా కూడా విడిపోవడం విషాదకర విషయం.


(1982 లో అప్పుడు మంత్రిగా వున్న వై.ఎస్.తో రచయిత)




(ముప్పయ్ అయిదేళ్ళ  క్రితం  వీరిరువురూ, ‘ఒకే మంచం ఒకే కంచం’ చందాన స్నేహితులుగా వున్ననాటి రోజులకు ప్రత్యక్ష సాక్షిగా వున్న అనుభవంతో – భండారు శ్రీనివాసరావు)

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

ఒకనాటి ఇద్దరు మిత్రులు టపా చూసి ముచ్చట పడ్డాము!రాజకీయాలలో శాశ్వత మిత్రులూ శాశ్వత శత్రువులూ ఉండరు!వై.ఎస్ గారు ముఖ్యమంత్రిగా కీర్తి కంటే అపకీర్తినే ఎక్కువగా మూటకట్టుకొని పోయారు!పాదయాత్రతో అధికారంలోకి వచ్చి పేదలకు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి పేరు తెచ్చుకున్నారు!అవినీతికి తలుపులు బార్లా తెరిచి ఆనాటి ఆయన చర్యలకు అప్పటి అధికారులు మంత్రులు జైలుపాలు కావడానికి దోహదం చేశారు!అంతేకాదు వారి ఏకైక కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పైగా జైల్ ఊచలు లెక్కించడానికి ఊతం అందించారు!నారా వారు పిల్లనిచ్చిన మామ గారిని వెన్నుపోటు పొడిచారనే అపకీర్తితో ముఖ్యమంత్రిత్వం అధిష్టించి సైబరాబాద్,హై టెక్ సిటీ నిర్మాణంతో ప్రపంచ స్థాయి కీర్తిని పొందారు!చిరంజీవిగారు పార్టీ పెట్టి రాజకీయాలలోకొచ్చి తెలుగుదేశం వోట్లు చీల్చకపోతే ఇప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగేవారు!మంచి పాలనా దక్షత ప్రదర్శించి ప్రభుత్వోద్యోగులను పూర్తి నియంత్రణలో పెట్టి బాగా పని చేయించారు!తెలంగాణా రాష్ట్ర విభజనలో హైదరాబాద్ సమస్యాత్మకం కావడానికి హైదరాబాద్ మీద దృష్టి కేంద్రీకరించి దానిని కొట్టోచ్చేటట్లు తీర్చిదిద్దడం ఒక కారణం!