20, ఆగస్టు 2013, మంగళవారం

బాబుగారితో ఓ సాయంత్రం


నిన్న సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ భవన్ నుంచి ఆ ఫోను.  అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ  అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/ ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్ పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు  చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
‘రేపు (అంటే ఈ సాయంత్రం) నాలుగు గంటలకు బాబుగారు మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది’
జర్నలిస్టుగా పదవీ విరమణ చేసినప్పటినుంచి మళ్ళీ ఏనాడు ఏపార్టీ గుమ్మం కూడా ఎక్కలేదు.
కానీ కాదనడానికి కూడా కారణం కనిపించలేదు. ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి గారి ఇంట్లో.


ఇంటికి వచ్చి చూస్తే టీవీల్లో స్క్రోలింగులు వస్తున్నాయి,  రాష్ట్ర రాజకీయ పరిస్తితులపై మీడియా విశ్లేషకులతో చంద్రబాబు సమావేశం అంటూ. ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ?  ఇప్పటికే మీడియా  విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, చక్రాంకితాలు కనబడని ఆయా పార్టీల అధికార ప్రతినిధులని.  
ముప్పయ్యేళ్ళ పైచిలుకు విలేకరి జీవితంలో కూడా ఏనాడు ప్రశ్నలు వేసే అలవాటు చేసుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులను, సీనియర్ అధికారులను వేలేకరుల సమావేశాల్లో  కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే  పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో  అన్నారు, ‘ఒక తమాషా చూశారా.  ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి ప్రస్తావన ఏమైనా  వుంటుందేమో గమనించండి.’    
అయితే ఇది ఆయన చేసిన ఒక  సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప  జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి  చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన మరో మాట కూడా చెప్పారు. ‘
‘కొందరు విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే తప్ప ప్రశ్నల జోలికి పోకుండా ‘వినదగునెవ్వరుచెప్పిన’ పాలసీ పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.’
చూసి నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది వింటారా ?
వేచి చూడాలి.
(20-08-2013 – 10 AM)     

               

కామెంట్‌లు లేవు: