5, జులై 2013, శుక్రవారం

క్విడ్ ప్రోఖోలు ఇక కుదరవంటున్న సుప్రీం కోర్టు


“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు  వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్  ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు – ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న  మేనిఫెస్టోలకు ఇక కాలం చెల్లిందని అనుకోవాలేమో. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు సుప్రీం కోర్టు లక్ష్మణ రేఖలు గీసింది.
వాగ్దానకర్ణుల మాదిరిగా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు. ఎన్నికల కోయిల ఇంకా కూయకముందే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే అసలు మేనిఫెస్టోలో ఇంకెన్ని ఉంటాయో అన్న భేతాళ ప్రశ్నకు సుప్రీం కోర్టు సమాధానం చెప్పింది.
అర్ధం పర్ధం లేకుండా చేసే హామీలు ఇక కుదరవు కాక కుదరవు అని తేల్చి చెప్పింది.
చూడాలి ఇప్పుడు ఎవరు ఏం చేస్తారన్నది? (05-07-2013)

కామెంట్‌లు లేవు: