30, జులై 2013, మంగళవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)



చెల్లమ్మ గారు, మా బామ్మ రుక్మిణమ్మ గారు మహమ్మదీయ మతం పుచ్చుకున్నారు. డానికి మా పెద్ద మేనత్త రంగనాయకి గారి ప్రోద్బలం కారణం. రంగనాయకి గారి  భర్త కొలిపాక లక్ష్మీ నరసింహారావు గారు. నరసింహారావుగారి అన్నగారు కొలిపాక శ్రీరాం రావు గారు వరంగల్లులో పెద్ద వకీలు. ఈయన గారి ప్రోద్బలంతో తమ్ముడు లక్ష్మీ నరసింహారావు, ఆయన భార్య రంగనాయకి మతం మార్చుకున్నారు. శ్రీరాం రావు గారు పెద్దపల్లి రాజాగారి ప్రోద్బలంతో ముస్లిం మతం పుచ్చుకున్నారు. పెద్దపల్లి రాజాగారికి నిజాం నవాబు, అక్కడి వాక్ఫ్ ఆస్తుల ఆజమాయిషీ అప్పగించారుట. అయితే ముస్లిం కానివాడు వాక్ఫ్ ఆజమాయిషీ చేయడంపై ఆక్షేపణ వచ్చింది. ఆ తరువాత కారణం ఏదయితేనేం, ఆయన ఇస్లాం ఉపదేశం తీసుకున్నారు. ఆ విధంగా ఈ కుటుంబాల్లో అన్నీ హిందూ పద్ధతిలో సాగిపోయినా, మతం స్వీకరించిన  కొందరు మాత్రం రోజూ క్రమం తప్పకుండా ఆరు సార్లు నమాజు చేసేవారు. రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) వుండేవారు. దాదాపు  తొంభై ఏళ్ళ వయస్సులో కూడా చెల్లమ్మగారు, మా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు. మళ్ళీ భారత భాగవతాలు చదవడం, యాత్రలు చేయడం అన్నీ ఉండేవి.  మా బామ్మ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. ఎప్పుడూ కంభంపాడులోనే తావళం తిప్పుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ, పిల్లలకు భారత, భాగవతాల్లోని పద్యాలు, కధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది. పొద్దుగూకేవేళకు  పిల్లలందరూ  ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు భండారు వంశంలో చాలామందికి పురాణాల మీద పట్టు చిక్కడానికి, సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి చెల్లమ్మగారి  ప్రవచనాలే కారణం. వరంగల్లులో శ్రీ రాం రావుగారు మరణించినప్పుడు ఆయనను ముస్లిం మతం ప్రకారం ఖననం చేయాలని ఆ మతం వారు, కాదు దహనం చేయాలని హిందువులు పట్టుబట్టారు. అప్పుడు, ఆయన  స్వగ్రామం అయిన రెబ్బవరంలో  అంత్యక్రియలు చేస్తామని చెప్పి మృత దేహాన్ని  రహస్యంగా హైదరాబాదు తీసుకువెళ్ళి బారకాస్ లో సమాధి చేసారు. అయితే చెల్లమ్మగారు చనిపోయినప్పుడు మా వూళ్ళో ఏమీ గొడవలు కాలేదు. వూళ్ళో అప్పుడు పాతిక, ముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి. మా చిన తాతగార్లు ఇద్దరు సనాతన సంప్రదాయవాదులు. అయినా ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు. ఆ రోజుల్లో వైదికులు  చనిపోతే  వైదికులే మోయడం, నియోగులు పోతే నియోగులే మోయడం వుండేది. సామాన్యంగా ఒకరికొకరు శవవాహకులుగా వుండేవారు కాదు. అలాటిది చెల్లమ్మగారు పోయినప్పుడు వైదీకులు అయిన ఇంగువ వెంకటప్పయ్యగారు కూడా ముందుకు వచ్చి మోశారు. స్మశానం దాకా హిందూ పధ్ధతి అంటే – స్నానం చేయించడం, విభూతి రాయడం, పాడెకట్టి మోసుకుని పోవడం జరిగింది. అప్పటికి మా నాన్నగారు పోయారు కాబట్టి నేనే (భండారు పర్వతాలరావు) అంత్యక్రియలు చేశాను. స్మశానం వరకు పాడెముందు నిప్పులేని కుండ పట్టుకుని నడిచాను. అక్కడ శవాన్ని పాతిపెట్టడం జరిగింది. తరువాత ఏం చేయాలో తెలియదు. నేను ఖమ్మం వెళ్లి మా మేనత్త పెనిమిటి (భర్త) లక్ష్మీ నరసింహారావుగారిని కలిసి జరిగిన వైనం చెప్పాను. ఆయన సంతోషించినట్టు కనబడ్డారు.  ‘ఇక చేయాల్సింది ఏమీలేదు. మామూలుగా హిందూ పధ్ధతి ప్రకారం కర్మ చేయి’ అన్నారు. కర్మ మామూలుగా చేసాము. దర్భ పుల్లకు శవ దహన సంస్కారం చేసి, ఆ తరువాత కర్మ పూర్తిచేయించారు.  పదో రోజున పేలాలు తీసుకువెళ్ళి ఖననం జరిగిన ప్రదేశంలో చల్లి వచ్చామని గుర్తు. ‘ఆమె ఎంతో పుణ్యాత్మురాలు. ఆమెకు ఏం చేసినా, ఏం చేయకపోయినా ఒకటే. పరమ భాగవతోత్తమురాలు. సతతం రామనామ స్మరణలోనే జీవితం వెళ్ళతీసింది. ‘ఇదంతా మన తృప్తికే కాని ఆమె తరించడానికి అక్కరలేదు’ అని వెంకటప్పయ్య గారు అనేవారు. దురదృష్టం ఏమిటంటే ఆమెను ఖననం  చేసిన ప్రదేశాన్ని గుర్తు పెట్టుకుని సమాధి నిర్మించడం లాంటిది జరగలేదు. మా బామ్మ విషయంలోనూ అలాటి అలసత్వమే జరిగింది. (మరో భాగం మరో సారి)

కామెంట్‌లు లేవు: