24, జులై 2013, బుధవారం

భండారు వంశం కధాకమామిషు (మొదటి భాగం)


భండారు వంశం ఎప్పుడు మొదలయిందో   ఇదమిద్ధంగా చెప్పడం కష్టం. దీనిని గురించి కొంత పరిశోధన చేసిన శ్రీ భండారు చంద్రమౌళీశ్వరరావు గారు  న్యాయవాది, రచయిత కూడా. వీరిది వరంగల్లు. ఈ విషయంలో వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడదు.  
పోతే, నిజాం షుగర్స్ లో పనిచేసిన కీర్తిశేషులు   శ్రీ భండారు నాగభూషణ రావు గారి  స్వగ్రామం వేములపల్లి. ఆయన చెప్పినదాన్నిబట్టి బసవేశ్వరుడు ఈ వంశానికి ఆదిపురుషుడని తెలుస్తోంది. కొందరు అక్కన్న కూడా ఈ వంశం వాడేనని  అంటున్నారు.
వంశనామాలలో చాలా భాగం వూరి పేర్లు కనిపిస్తాయి. కొడవటిగంటి (కొడవటిగల్లు) మాగంటి (మాగల్లు), వేములపల్లి, తుర్లపాడు మొదలయినవి ఇందుకు ఉదాహరణ. అయితే ‘భండారు’ అనే పేరు తెలుగునాట ఏ ఊరికీ లేదు. మహారాష్ట్రలో ‘భండారి’ అనే ఓ బస్తీ వుంది. ఛత్రపతి శివాజీ దండయాత్రల సమయంలో అక్కడినుంచి కొందరు బ్రాహ్మణులు ఆయనతో పాటు ఆంధ్రదేశం వచ్చి అక్కడక్కడా స్థిరపడినట్టు తెలుస్తోంది. వారిని, భండారి వారని, భండారు  వారని పిలిచే అవకాశం లేకపోలేదు. మా చిన తాతగారు భండారు లక్ష్మీనారాయణ గారు దాచివుంచిన 1878 వ సంవత్సరం నాటి కోర్టు తీర్పు ప్రతిలో వారి తండ్రి, పినతండ్రి- రామయ్య, లక్ష్మయ్యగార్ల  పేర్లను ‘రామయ్య కులకర్ణి, లక్ష్మయ్య కులకర్ణి’ అని ఉదహరించడం కనిపించింది.


లక్ష్మయ్య తాతయ్యగారి కుటుంబం 



భండారు వంశీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా అనే అనుమానానికి దీనివలన కొంత ఆస్కారం చేకూరుతోంది. ‘కులకర్ణి’ అనేది ఆరోజుల్లో గ్రామాధికారి పదవి. అయినా, అది మహారాష్ట్ర నుంచి వచ్చిందే. దేశముఖ్, దేశపాండేలవలె గ్రామాల్లో శిస్తు వసూలుచేసి పెట్టె అధికారం వారికి వుండేది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో కులకర్ణి వ్యవస్థ కనిపిస్తోంది. (మరో భాగం మరోసారి)

(మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు సేకరించి రాసి వుంచిన  వివరాల ఆధారంగా ) 

కామెంట్‌లు లేవు: