24, ఏప్రిల్ 2013, బుధవారం

ముఖ్యమంత్రి చెప్పిన జోకు



ముఖ్యమంత్రులు జోకులు కూడా చెబుతారా అని సందేహించకండి. మన ముఖ్యమంత్రి నోరు తెరిచి నవ్వనే నవ్వరు ఇక జోకులేసి ఎవర్ని నవ్విస్తారని అనుకోకండి.  ఈ జోకు చెప్పింది మన ముఖ్యమంత్రి కాదు. గోవా సీఎం. శ్రీ మనోహర్ పర్రీకర్. పుణేలో ఈ మధ్య  జరిగిన  ఒక సదస్సులో మాట్లాడుతూ మాట్లాడుతూ  మాటల మధ్యలో  ఓ జోకు పేల్చారు. దాన్ని  సభికులందరూ ఆసక్తిగా వినడమే కాదు, విని  కడుపుబ్బా నవ్వుకున్నారట కూడా.
ఆ జోకేమిటంటే....
ఆయన మాటల్లోనే విందాం.



“జూ నుంచి రెండు సింహాలు తప్పించుకున్నాయి. వాటిల్లో ఒకటి అడవి సింహం. అడవిలో  పట్టుబడి పట్నంలో వున్న  జూకి వచ్చింది. తప్పించుకోవడమే తడవు  అది మళ్ళీ అడవిలోకి పారిపోయింది.
“పోతే రెండో సింహం అడవిలో దొరికింది కాదు. అది జూలోనే పుట్టి  జూలోనే పెరిగిన సింహం. దాంతో దానికి అన్నీ బస్తీ అలవాట్లే అలవడ్డాయి. అడవీ, వేటా ఇవన్నీ దాని వంటికి పడవు.
“మూడు రోజులు గడిచాయో లేదో, పారిపోయిన అడవి సింహం జూ సిబ్బందికి  దొరికిపోయింది.  దాన్ని తీసుకువచ్చి మళ్ళీ జూలో బోనులో బంధించారు. కానీ బస్తీ సింహం ఆచూకీ పట్టుకోలేకపోయారు.
‘నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. మూడో నెల నడుస్తున్నా బస్తీ సింహం ఎటు పోయిందన్న సమాచారం లేదు.    
“చివరికి ఎట్లాగయితేనేం బస్తీ సింహం ఆచూకీ ఆరుమాసాల తరువాత దొరికింది. దాన్ని పట్టి బంధించి మళ్ళీ జూకే తీసుకువచ్చారు.
“పాత నేస్తాన్ని చూడగానే అడవి సింహం మొహం వికసించింది.
వాటి నడుమ సంభాషణ ఇలా సాగింది.
“ఏం మిత్రమా! ఈ మానవ మృగాల కంట బడకుండా ఈ ఆరు నెలలు ఎక్కడ దాక్కున్నావు? యెలా దాక్కున్నావు?  ఈ రక్కసి  మనుషుల నుంచి  తప్పించుకుని ఏవిధంగా  తిరగగలిగావు? ముందు  ఆ సంగతి చెప్పు”
“ఏం లేదు మిత్రమా! నువ్వేమో అలా అడవిలోకి వెళ్లావు. ఇక నాకు ఆ  అడవీ, దాని  ఆనుపానులు అసలే తెలియవాయె. ఏం చెయ్యాలి ఎక్కడ దాక్కోవాలి అని ఆలోచిస్తుంటే  దారిలో సచివాలయం కనిపించింది. వెంటనే దాంట్లోకి దూరిపోయాను. నా సామిరంగా! యే గదిలో చూసినా ఎక్కడ చూసినా అన్నీ ఫైళ్ళే. దుమ్ముకొట్టుకుపోయి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయివున్నాయి.  హాయిగా వెళ్ళి వాటి మాటున దాక్కున్నాను.”
“భలే భలే. మరి తిండీ తిప్పలమాటేమిటి”
“నిజానికి తిండికి వెతుక్కోవాల్సిన పనే లేదనుకో! ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఎటు చూసినా సిబ్బందే. హాయిగా రోజుకొకడ్ని నంజుకు తిన్నా అడిగేవాడులేదు. ఎందుకంటే ఒకడు కనిపించకపోయినా అక్కడ అయిపూ అజా కనుక్కునేవాడే లేడు. ఒకడు రాకపోయినా, పత్తా లేకుండా పోయినా  వాడి స్థానంలో ఇంకోడ్ని టెంపరరీగా వేసుకుంటారు కానీ,  అసలు వాడు ఎటు పోయాడు అని ఆరా తీసే వాడేలేడనుకో. అసలక్కడ పనిచేసేవాడంటూ వుంటే కద.  అందువల్ల నేను ఎంతమందిని  కొరుక్కుతిన్నా లెక్కతెలిసే అవకాశమేలేదు. అంచేత నాకు ప్రతిరోజూ మృష్టాన్న భోజనమే”  
“మరి ఇంత హాయిగా రోజులు గడిచిపోతూ వుంటే మళ్ళీ వీళ్ళ  చేతికి యెలా చిక్కావ్”
“అదే ఖర్మ అంటే. హాయిగా రోజుకో ప్రభుత్వ ఉద్యోగిని తింటూ పోతే నన్ను ఎవడూ పట్టుకునే వాడు కాదు. బుద్ధి తక్కువై  ఓ రోజు,  వాళ్లకు రోజూ  టీ పట్టుకువచ్చేవాడు దొరికితే, ముందూ వెనకా చూడకుండా  వాడిని పొట్టనబెట్టుకున్నాను. అదే నా పొట్టమీద కొట్టింది. రోజూ టీ ఇచ్చేవాడు కనబడకపోవడంతో అప్పుడు వారికి మన వ్యవహారం అర్ధం అయినట్టుంది.  అంతా కలసి మాటువేసి  నన్ను  పట్టేసుకున్నారు. అదీ మిత్రమా నా విషాద గాధ”
(24-04-2013)

3 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

:))))))))))))

G.P.V.Prasad చెప్పారు...

స్వానుభవం అయ్యుంటుంది, స్వతంత్రం నుంచీ ఉన్నవాటిని సర్దుతున్నారనుకుంట

hari.S.babu చెప్పారు...

నిజంగా సచివాలయాల పరిస్థితి అలాగే అఘోరించింది మరి.