31, మార్చి 2013, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన....9



“కాలం కలసివచ్చినప్పుడు మనం చేసే పొరబాట్లను కూడా జనం తేలిగ్గా తీసుకుంటారు. టైం బాలేకపోతే జోకువేసినా అది మేకై కూర్చుంటుంది.”




NOTE : COURTESY IMAGE OWNER

30, మార్చి 2013, శనివారం

వినదగునెవ్వరు చెప్పిన ....... 8




“మీరు  చేయలేని పని ఇతరులు ఎలాచేస్తారు అన్నదానిపై దృష్టి పెట్టడం దండుగ. ఇతరులు చేయలేనిపని  మీరు  యెలా చెయ్యగలరు  అన్నదాని గురించి ఆలోచించిననాడు విజయాలు మీ సొంతం అవుతాయి.”

Courtesy Image Owner

29, మార్చి 2013, శుక్రవారం

వినదగునెవ్వరు చెప్పిన......7



“సమాజంలో మీ స్థాయిని బట్టి, హోదానుబట్టి మిమ్మల్ని మీరు ఎక్కువగా అంచనా వేసుకుని ఇతరులముందు అహం  ప్రదర్శించడం అవివేకం. ఎందుకంటే చదరంగం బల్ల మీద హోదా వెలగబెట్టే రాజూ, అతడి బంట్లూ కలసి చివరికి చేరేది వాటిని భద్రం చేసే పెట్టెలోకే”  
Note: Courtesy image owner. 

28, మార్చి 2013, గురువారం

వినదగునెవ్వరు చెప్పిన ....... 6


కలలు 




“నిద్రపోయేటప్పుడు వచ్చేవి కలలు కావు. నెరవేరేదాకా నిద్రపట్టకుండా చేసేవే నిజమైన కలలు.”



27, మార్చి 2013, బుధవారం

వినదగునెవ్వరు చెప్పిన .......5




“జీవితంలో గెలుపును  నిర్దేశించే అంశాలు రెండు. అవేమిటంటే  మీ దగ్గర డబ్బూ డుబ్బూ ఏమీ లేనప్పుడు యెలా నెట్టుకురాగలిగారు అన్నది మొదటిది. ఇక అన్నీ వున్నప్పుడు, అవసరమయినవి సమస్తం సమకూరినప్పుడు ఇతరులతో  మీ ప్రవర్తన యెలా వుంది అన్నది రెండోది.”



26, మార్చి 2013, మంగళవారం

వినదగునెవ్వరు చెప్పిన .....4




“నవ్వితే యెలా నవ్వాలంటే జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ ఏడవడం తెలియదు అన్నట్టు నవ్వాలి. ఆట ఆడితే ఓటమి తెలియదు అన్నవిధంగా  ఆడాలి. బాధ పెట్టడం అంటే ఏమిటో తెలియనట్టు ప్రేమించగలగాలి . అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రేపన్నది లేదు అనేవిధంగా ఈ రోజును గడపగలగాలి”

వినదగునెవ్వరు చెప్పిన .......3





“మీ  మందహాసం వెనుక దాగున్న విషాదాన్ని చూడగలిగేవాడినీ,  మీ ఆగ్రహం మాటున దాగున్న ప్రేమను గమనించగలిగేవాడినీ, మీ మౌనానికి కారణమయిన హేతువును పట్టుకోగలిగినవాడినీ నమ్ముకుంటే ఇక ఆ నమ్మకం చెక్కుచెదరదు. అతడే మీకు నిజమైన నమ్మదగ్గ స్నేహితుడు.” 

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని


(గమనిక: ఇది రెండేళ్ళ క్రితం రాసింది. పరిస్థితులు ఏవయినా మారాయంటారా?)

శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోయి నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.


మన దేశానికి స్వతంత్రం వచ్చి అరవై నాలుగేళ్ళు నిండాయి. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ అరవై ఏళ్ళ పైచిలుకు కాలంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా – పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే నేనున్నానంటూ దీన జనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.
అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని దీన జనావళి స్తితి రాముని కాలం నాటి కధలోని కప్పను తలపిస్తోంది.
ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయాధీశులే - కంచే చేనుమేసిన చందంగా దొరికిపోయి అభిశంసనలకు గురికావడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం అరవై అయిదేళ్ళ వయస్సులో స్వతంత్ర భారతానికి అంటుకున్న మకిలి. కడిగినా వొదలని మురికి.
ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-
నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు జనాలను నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, వాటివెనుకవున్న వ్యక్తులను చూస్తుంటే – వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి కంటే కూడా - తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా బాధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నాయి. కాకపొతే, దొంగని దొంగే పట్టించిన చందంగా అందరి భాగోతాలు తెర చాటునుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల అంటే ఇదే కాబోలు. ఏదో ఒక రకంగా భవిష్యత్ తరాలకు మేలుచేసేదే కాబట్టి ఆహ్వానించదగ్గ పరిణామమే అనుకోవాలి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. వీరందరూ ఈ గందరగోళ, అవాంఛిత పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే.
అవినీతి అంశంగా ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలు అవినీతిని ఈసడించుకునే పౌరులందరినీ కలత పరుస్తున్నాయి. అక్కడ అన్నా హజారే ఉద్యమం తీసుకున్నా, ఇక్కడ జగన్ ఆస్తులపై సీ.బీ.ఐ. సాగిస్తున్న దర్యాప్తు విషయం తీసుకున్నా, వాటి గురించి మేధావులు, రాజకీయపార్టీల నడుమ సాగుతున్న చర్చలు పక్కదోవపడుతున్నాయి.
ఉభయపక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.
వీరంతా ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున మనం చేయాల్సింది అందరం ఆలోచించాలి కూడా. ఎందుకంటె, మనం కూడా ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలమే. ఈ దుర్దశ దాపురించడంలో మనకూ భాగం వుందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళమే. రాజ్యాంగం ప్రసాదించిన పవిత్రమయిన వోటు హక్కుని సరిగా వాడుకోకుండా, లేదా అసలు వాడుకోకుండా తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో పాలు పంచుకున్నవాళ్లమే.
ఈ సందర్భంలో- కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.
“భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం ప్రాణాలతో మనగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది అది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”
చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముప్పూటలా వాక్రుచ్చే రాజకీయనాయకుల మాటలన్నీ నీటి మూటలని మొత్తం మూటకట్టి మూలన పడేయనక్కరలేదు. ఎందుకంటె ఆ విదేశీ యాత్రీకుడు దేవుడి విషయంలో చెప్పింది ఇక్కడ వర్తిస్తుంది. మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, లంచగొండిపరులయిన ఇంతమంది అధికారులు, భ్రష్టుపట్టిపోయిన ఇంతమంది న్యాయకోవిదులు, సంపాదనే లక్ష్యంగా కలిగిన ఇంతమంది మీడియా వారు – ఇందరు వున్నా కూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా అంతో ఇంతో బతికే వుందంటే ఏదో అదృశ్య శక్తి మాత్రమే దేశాన్ని కాపాడుతున్నదని అనుకోవాలి.
కవికుల తిలకుడు తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు – ‘దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని’.
(26 -08-2011)

25, మార్చి 2013, సోమవారం

వినదగునెవ్వరు చెప్పిన .......2





“మనం చేసే ప్రార్ధన దేవుడు సకాలంలో వినడం లేదనీ, తక్షణం స్పందించడం లేదనీ భగవంతుడి విషయంలో గుర్రుగా వుంటాం. కానీ అది నిజం కాదు. గజేంద్రమోక్షంలో  ‘సిరికింజెప్పడు’ టైపు లోనే భక్తుడిని  ఆదుకోవడానికి  ఆయన ఎప్పుడూ 108 వాహనం మాదిరిగా సిద్ధంగానే వుంటాడు. ఎటొచ్చీ మనమే  అయినదానికీ కానిదానికీ  తొందరపడిపోతూ  దేవుడికి అదేపనిగా  వేడుకోళ్లు చేసుకుంటూవుంటాం. ఆయన పట్టించుకోవడం లేదనీ,  కరుణించడం లేదనీ నిందను ఆ దేవుడిమీదనే  వేస్తుంటాం.” (25-03-2013)

వినదగునెవ్వరు చెప్పిన .......








“రహదారి బాగుంటే గమ్యం గురించి చింత పడవద్దు. గమ్యం గొప్పది అనుకుంటే  మార్గం గురించి ఆలోచించవద్దు.”

పాత యెంత మధురం!



ముందుకు చూస్తూ నడవడం మంచిదే.
కానీ జీవన గమనంలో ఒక్క సారి ఆగి వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ జ్ఞాపకాల దారిలో కానవచ్చే మధుర దృశ్యాలు ఎన్నో. ఎన్నెన్నో.
అలాటిదే ఈ రోజు ఫేస్ బుక్ ధర్మమా అని తారస పడింది.
పెళ్ళిళ్ళు శుభలేఖలు మనకు కొత్తేమీ కాదు. బహుశా ఈ రోజుల్లో శుభలేఖల మీద పెడుతున్న ఖర్చు చూస్తుంటే వెనకటి రోజుల్లో ఆ డబ్బుతో ఒక పెళ్ళే జరిగివుండేదేమో. అంత ఖరీదయిన కార్డులు కూడా రోజులు తిరక్కుండానే డస్ట్ బిన్ లలోకి చేరిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాటి పెళ్లి పత్రిక ఒకటి కళ్ళబడింది. ఇదిగో! అదే ఇది.


ఈ శుభలేఖకు షష్టిపూర్తి దాటిపోయింది. వధూవరులిద్దరూ ఎక్కడో అక్కడ చిరంజీవులుగా పిల్లా పాపలతో క్షేమంగా వుండివుంటారని, వుండాలని భవదీయుడి ఆశ.  అభిలాష.
ఈ పెళ్లి రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగింది. ఆ రోజుల్లో నిత్యావసర వస్తువులకు యెంత కటకటగా వుండేదో ఈ పత్రికలో చేసిన ‘మనవి’ చదివితే బోధపడుతుంది. పెళ్ళికి వచ్చేవారు ఎవరి రేషను బియ్యాన్ని వారే ముందుగా పెళ్ళివారికి పంపాలన్న విజ్ఞప్తి ఇందులోవుంది.
అలాగే నాటి స్వాతంత్ర సమరం స్పూర్తి కూడా ఈ ఆహ్వానపత్రికలో కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ఆహ్వానం మొదట్లో వున్న దేశభక్తి నినాదాలు గమనించండి.
ఈ పెళ్లి పత్రిక 'కాపీని' రామినేని భాస్కరేంద్ర రావు గారు పంపించారని కూడా వారు పేర్కొన్నారు.
'పంచుటలో వున్న హాయి వేరెచ్చట లేనేలేదని' మరోమారు తేటతెల్లం చేసిన  వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. 
(25-03-2013)

24, మార్చి 2013, ఆదివారం

The Headline show :: Daily Programmes :: Telugu News Channel - Sakshitv

The Headline show :: Daily Programmes :: Telugu News Channel - Sakshitv

'ఐ పాడ్' మేజిక్


http://www.youtube.com/watch_popup?v=32bUIa--6GM
మేజిక్కులు చేసేవాళ్ళు, మేజిక్కులు అంటే ఇష్టపడేవాళ్ళు - తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది. గాలిలోనుంచి వస్తువులు సృష్టించినట్టే ఈ జర్మన్ మెజీషియన్ అందుకోసం 'ఐ పాడ్' వాడుకున్న తీరే గొప్పగా వుంది. అయిదున్నర నిమిషాలు మనవి కావనుకుంటే 'జర్మన్ భాష'తెలియనివాళ్ళు కూడా ఆస్వాదించి ఆనందించే  లఘుచిత్రం అని నా మనవి. ఇంకెందుకు ఆలశ్యం. పైన ఇచ్చిన 'లింకు' ఉపయోగించి చూడండి.- భండారు శ్రీనివాసరావు

తప్పులో పెద్ద తప్పు



శాసనమండలి సభ్యులు ఎం.రంగారెడ్డి గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆంతరంగిక వర్గంలో ముఖ్యుడని ప్రతీతి. ఆయన పేరుతొ కట్టిన ఒక బ్యానర్ పై ముఖ్యమంత్రికి ఇచ్చిన కితాబు ఇది. (Honorable Chief Minister కు బదులు  Horible Chief Minister అని అచ్చుతప్పు పడింది.) హతోస్మి! బ్యానర్లు కట్టించేవారు వారిని రాయరు కానీ కట్టించేముందు ఓసారి చూడరా అన్నదే సందేహం.

23, మార్చి 2013, శనివారం

ఇదీ వరస - ఇదే వరస




"విపక్షాల వాయిదా తీర్మానాలకు స్పీకర్ తిరస్కృతి - పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్షాలు. - పదిగంటల వరకు సభ వాయిదా."
తెల్లారి లేస్తే టీవీల్లో ఇవే స్క్రోలింగులు. సభలో చెప్పాలని అనుకున్నవి, చెప్పలేకపోయినవి, చెప్పడానికి వీలు లేనివి అన్నీ అందరూ - పాలకపక్షం విపక్షం అన్న తేడా లేకుండా 'అసెంబ్లీ' మీడియా పాయింటు దగ్గర 'గాలిలో కలిపేస్తారు'. ఇంతమాత్రం దానికి అంత ఖర్చు ఎందుకో. అడిగేవాడు లేడనా?

22, మార్చి 2013, శుక్రవారం

నడక సరే! నడత సంగతేమిటి?






ఉదయం పూట చర్చలకోసం టీవీ చానళ్ళకు వెళ్ళే సమయంలో హైదరాబాదు బ్రహ్మానంద రెడ్డి పార్కు చుట్టూ వందలాది కార్లు పార్కు చేసి కనిపిస్తాయి. కార్లలో వచ్చి ఈ నడకలేమిటని అనిపిస్తుంది. అడ్డదిడ్డంగా కార్లు పార్కు చేసి వెళ్ళేవారిని చూసినప్పుడు 'నడకే' తప్ప 'నడత' తెలియని మనుషులని కూడా అనిపిస్తుంది.
'బెడ్ రూమ్ టు బాత్ రూమ్ మార్నింగ్ వాక్ చేసే మీకు ఆకార్ల  వాకర్ల గోల యెందుకు' అంటుంది నా శ్రీమతి. అయినా నా గొడవ నాదే కదా!   


21, మార్చి 2013, గురువారం

జపాన్ దేశం చూడరబాబూ!



రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురై సర్వనాశనమయిన జపాన్ ఈనాడు సర్వ సంపదలతో తులతూగగలుగుతున్నదంటే దానికి కారణం అక్కడి ప్రభుత్వాలే అయినప్పటికీ మూలకారణం మాత్రం ఆ దేశపు ప్రజలే. వారి దీక్షాదక్షతలే జపాన్ దేశానికి  ప్రపంచదేశాల్లో ప్రముఖస్థానాన్ని కట్టబెట్టాయి. హిరోషిమా మీద అణుబాంబు పడి ఆ ప్రాంతం భస్మీపటలం  అయిన తరువాత అది కేవలం పదేళ్ళ కాలంలో పూర్తిగా తన పూర్వ ఆర్ధిక వైభవాన్ని అందుకోగలిగిందంటే దానికి కారణం ఆ దేశపు ప్రజల్లోని ఆత్మ స్తైర్యం.  
మామూలుగా భూకంపం సంభవిస్తే ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అలాటిది  ఏటా కొన్ని వందల భూకంపాలు ఆ దేశాన్ని కుదిపేస్తుంటాయి. అయినా వాటిని తట్టుకుంటూ మొత్తం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా జపాన్ ఆవిర్భవించగలిగింది. పైగా సహజవనరులు కూడా అంతంతమాత్రమే.
పారిశుధ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ఆ దేశం అత్యంత పరిశుద్ధ దేశంగా విరాజిల్లుతోంది. అక్కడి పారిశుధ్య కార్మికులను గౌరవంగా హెల్త్ ఇంజినీర్ అని పిలుస్తారు. వేతనాలు కూడా ఆ గౌరవానికి తగ్గట్టుగానే వుంటాయి. నెలకు అయిదు వేల నుంచి ఎనిమిది వేల అమెరికన్ డాలర్లు వారికి జీతాలుగా ముట్టచెబుతున్నారంటే మాటలు కాదు.




జపాన్ పిల్లలు తమ పాఠశాలల్లో మరుగు దొడ్లతో సహా మొత్తం స్కూలు పారిశుధ్యాన్ని తామే స్వయంగా చూసుకుంటారు. ఇందుకోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయిస్తారు. పైగా ఈ కార్యక్రమంలో స్కూలు టీచర్లు కూడా పాల్గొంటారు. చిన్నప్పటినుంచి వ్యక్తిగత పరిశుభ్రతకు ఇస్తున్న ఈ ప్రాధాన్యత ముందు ముందు వారి జీవితాల్లో బాగా ఉపయోగపడుతోంది. జపాన్ లో కుక్కలను పెంచేవారు వాటిని వీధుల్లో తిప్పేటప్పుడు విధిగా ఒక చేతి సంచీని దగ్గర వుంచుకుంటారు. దారిలో శునకరాజం కాలకృత్యాలు తీర్చుకుంటే దాన్ని వెంటనే శుభ్రం చేయడానికి ఈ ఏర్పాటు.
ప్రాధమిక తరగతి నుంచే పిల్లలకు పెద్దవారితో, తోటివారితో మంచి యెలా మెలగాలో నేర్పుతారు.
స్కూళ్ళలో మొదటి మూడు తరగతుల వరకు ఎలాటి పరీక్షలు వుండవు. పాఠాలు బట్టే వేయించడం, పరీక్షలు పెట్టి మార్కులు వేయడం ద్వారా విద్యార్ధుల శక్తియుక్తులను నిర్ణయించడం అక్కడి పధ్ధతి కాదు. చిన్నప్పటినుంచే పిల్లలను శీలవంతులుగా తీర్చిదిద్దడం మీదనే వారి విద్యావిధానం ఆధారపడివుంటుంది.
స్కూళ్ళల్లో భోజనం చేసిన తరువాత కూడా విద్యార్ధులు విధిగా దంతధావనం చేయాల్సి వుంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అలాగే తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి వీలుగా అక్కడి పిల్లలు భోజనానికి కనీసం అర్ధ గంట వ్యవధి కేటాయిస్తారు. ఇలా యెందుకు అని ఎవరయినా ప్రశ్నిస్తే పిల్లలే జపాన్ భవిష్యత్తు అని జవాబు వస్తుంది.
అత్యంత ధనిక దేశం అయినప్పటికీ అక్కడ సంపన్నులు సైతం ఇళ్ళల్లో పనివాళ్ళను పెట్టుకోరు. ఇళ్ళల్లో పనిభారం అంతా ఇంటి పెద్దలు, పిల్లలే పంచుకుంటారు.
ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న మొబైల్ ఫోన్లు చాలావరకు తయారుచేసే దేశం జపానే. కాని ఆ దేశంలో ఏఒక్కరూ రైళ్ళలో, రెస్టారెంట్లలో మొబైల్ ఫోన్లు ఉపయోగించరు.
హోటళ్ళలో రెస్టారెంట్లలో ఆహారాన్ని వృధాచేయడం కానరాదు. అక్కడివారు తమకు యెంత కావాలో ఆ మేరకే వడ్డించుకుంటారు.
జపాన్ లో రైళ్ళు వేళ ప్రకారం నడుస్తాయి. అక్కడి రైళ్ళు ఏడాదికి సగటున ఏడు సెకన్లు ఆలశ్యంగా నడుస్తాయంటే సమయపాలన ఏవిధంగా పాటిస్తాయో అర్ధం చేసుకోవచ్చు.
(Courtesy from a net article) 

20, మార్చి 2013, బుధవారం

బల్బు మాడిపోయింది





 
శంకరం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే ఏడేళ్ళ బుడుగు తండ్రిని అడిగాడు.
‘నేను ఇక్కడికి ఎక్కడినుంచి యెలా  వచ్చాను?’
శంకరానికి ముందా ప్రశ్న అర్ధం కాలేదు. అర్ధం అయినతర్వాత దానికి జవాబు ఏం చెప్పాలో ఓ పట్టాన అర్ధం కాలేదు.
తల్లి గర్భంలోనుంచి పిల్లలు యెలా వస్తారో  చెప్పే ఈడు  కాదు పిల్లాడిది. అందుకే సమాధానం చెప్పకుండా దాటవేద్దామనుకున్నాడు. వాడి వయసా చిన్నది. కొన్నేళ్ళు పోతే వాళ్ళకే తెలుస్తుంది అనుకునే సంస్కృతి ఇంటావంటా వొంటబట్టించుకున్న కుటుంబమాయె.
కానీ కాసేపటి తరువాత శంకరం మనసు మార్చుకున్నాడు. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇంకా బూజు పట్టిన పాత సంస్కృతినే పట్టుకుని వేలాడితే యెలా అని కూడా అనుకున్నాడు. అందుకే స్త్రీల  గర్భధారణ గురించీ, నవమాసాలు మోసి బిడ్డను కనే దాకా అతడు ఎక్కడినుంచి భూమిమీదకు యెలా వచ్చాడో అంతా అరటిపండు వొలిచి చెప్పినట్టు పిల్లాడికి చెప్పేసి ‘అమ్మయ్య’ అనుకున్నాడు. తను అందరిలాటి తండ్రిని కాదు కొంత స్పెషల్ అని కూడా అనుకున్నాడు.
మరి కాసేపటికి బుర్రలో బల్బ్ వెలిగింది.
వున్నట్టుండి బుడుగు ఎందుకా ప్రశ్న వేసాడు. అదే అడిగాడు.
బుడుగు జవాబుతో  శంకరం బుర్ర గిర్రున తిరిగింది.
“ఏం లేదు నాన్నా! నిన్న మన పక్క వాటాలో దిగిన సుందరం అంకుల్ పిల్లాడిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అమలాపురం నుంచి అన్నాడు. దాంతో మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలని నిన్నడిగాను. అంతే!”

(నెట్లో కానవచ్చిన ఇంగ్లీష్ ఆర్టికిల్ ఆధారంగా) 

17, మార్చి 2013, ఆదివారం

సవర్త పాట

Please CLICK here to listen  the song సవర్త పాట




ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటా జరిగే పండుగ పాట – ఈ సవర్త పాట.
నలుగురు కలసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆడంగులు నలుగురూ కలసి అక్షరాలా ఎనభై అయిదేళ్ళ సరసక్కయ్యను అడిగి మరీ పాడించుకున్న పాట ఇది. అంతవయస్సులో గుర్తుపెట్టుకుని పాడిన ఈ పాటలో ఏదయినా పొరబాట్లు కనిపిస్తే/వినిపిస్తే, దాని వింటూ తిరిగి రాసుకోవడంలో జరిగిన  ఆ తప్పు అక్షరాలా నాదే కాని ఆమెది కాదు.
సరసక్కయ్య పాడిన సవర్త పాట :
‘సువ్వియనుచు పాడరమ్మా
‘సుందరాంగిని చూడరమ్మా
‘నవ్వే మాట కాదె కొమ్మా
‘నాతి సవర్తలాడెనమ్మా
‘బువ్వదినుట నేరదమ్మా
‘పూబోణి ఎరుగదమ్మా
‘తల్లి చూచి చెప్పగానే
‘తలనువంచి నవ్వేనమ్మా
 ‘విప్రవరుల పిలవరమ్మా
‘విప్పి పంచాంగం చూడగానే
‘యుక్తమైన నక్షత్రమమ్మా
‘సువ్వియనుచు పాడరమ్మా
‘సుందరాంగిని చూడరమ్మా’
    

సాక్షి ది హెడ్ లైన్ షో 16th Mar 2013

సాక్షి ది హెడ్ లైన్ షో 16th Mar 2013

16, మార్చి 2013, శనివారం

అమెరికాలో ఆడవాళ్ళ పండుగ



న్యూ జెర్సీ, మార్చ్, 11, 2013.


అమెరికా తెలుగు ఆసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన న్యూ జెర్సీలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
చట్నీ మనార్ లో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ, పెన్సిల్ వేనియా,న్యూ
యార్క్,దేలావార్, కన్నెకట్ (నోట్ : ఈ నగరాల పేర్లు సరిచూసుకోండి)
నగరాలనుంచి మహిళలు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో డాక్టర్లు,
న్యాయవాదులు,వ్యాపారవేత్తలు,ఐ.టి. వృత్తి నిపుణులు,గృహిణులు, సామాజిక
సేవారంగానికి చెందినవారు వున్నారు.

నాటి ఉత్సవానికి ప్రత్యేకత ఏమిటంటే సమావేశ మందిరం గులాబీ రంగు
సంతరించుకుంది. ప్రేమ, శాంతికి ప్రతీక అయిన గులాబి రంగు వస్త్రాలను
దుస్తులను ధరించడం ప్రపంచ వ్యాప్తంగా స్త్రీవాదులకు అనూచానంగా
వుంటోందన్నది ఇక్కడ గమనార్హం.
అటా - 2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వాహక సంఘం సభ్యురాలు శ్రీమతి
జమున పుస్కూర్ తొలుత స్వాగతం పలికారు.
న్యూ యార్క్ లోని ఇండియన్ కాన్స్యులేట్ లో ఆక్టింగ్ కాన్స్యులేట్ జనరల్
గా పనిచేస్తున్న డాక్టర్ దేవ్ యాని కోబ్రగడే జ్యోతి ప్రజ్వలనతో
కార్యక్రమం మొదలయింది.
సుమారు నాలుగు వందలమంది హాజరయిన నాటి సభను ఉద్దేశించి  ప్రసంగిస్తూ మహిళలు
శక్తివంతంగా తయారు కావాల్సిన అవసరం వుందని ఆమె నొక్కి చెప్పారు. అలాగే,
స్త్రీలు విద్యావంతులై, ఆర్ధిక స్వావలంబన సాధించుకున్ననాడే జగతికి నిజమైన
ప్రగతి అని అన్నారు.
ఏ.ఏ.పి.ఐ. పూర్వ అధ్యక్షురాలు డాక్టర్ సునీత కనుమూరి మహిళలు వ్యాపార
రంగంలో రాణించాల్సిన  అవసరం గురించి ప్రసంగించారు.
మహిళలు తమ  వృత్తినీ, సంసార బాధ్యతలను సమర్ధవంతంగా, సమతూకంగా నిర్వహించుకోవడం గురించి
ఏ.టి. అండ్ టి. సంస్తకు చెందిన మాధవి అరువ  మాట్లాడగా, మహిళలు శాంతి
గురించి బ్రహ్మకుమారీలకు చెందిన  సిస్టర్ సంధ్య వివరించారు.
విశ్వవ్యాప్తంగా తమ ప్రతిభాపాటవాలతో ఖ్యాతి సంపాదించిన మహిళామణులను
గురించి మాధవి అరువ, మైథిలీ రెడ్డి ప్రదర్శించిన పవర్ పాయింట్
ప్రెజెంటేషన్ సభికులను ఆకట్టుకుంది.
సభకు హాజరయిన అటా నాయకులు వచ్చే ఏడాది జులై లో ఫిలడెల్ఫియా లో
నిర్వహించనున్న అటా పదమూడవ మహాసభలను గురించి, యువజన సదస్సు గురించి
వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో అనాధ పిల్లల సంరక్షణ కోసం విశేషమైన సేవలు అందిస్తున్న
హెల్ప్’ (హెచ్.ఇ.ఎల్.పి.) స్వచ్చంద సంస్థ స్థాపకురాలు శ్రీమతి మాధవి
పోలేపల్లిని అటా మహిళా విభాగం వారు సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని  అటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నిర్వాహక సంఘం వారు లాటరీ టిక్కెట్ల విక్రయం ద్వారా సేకరించిన నాలుగు
వందల డాలర్లను న్యూ జెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న మహిళా హక్కుల పరిరక్షణ
సంఘానికి విరాళంగా ఇచ్చారు. అమెరికాలో నివసిస్తున్న దక్షిణాసియా మహిళలపై
జరిగే అన్ని రకాల హింసలను తుదముట్టించే లక్ష్యంతోఈ సంస్థ తన
కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చ్ ఎనిమిది పదో తేదీల
నడుమ జన్మించిన మహిళల పుట్టినరోజులను ఈ సందర్భంగా నిర్వహించారు. తరచుగా
వార్తలలో తారసిల్లే భారతీయ మహిళలను గురించి జమునా పుస్కూర్కల్పనా సువర్ణ
సంయుక్తంగా నిర్వహించిన  క్విజ్ పోటీ అనేకమందిని ఆకర్షించింది. సభ్యులు ఉత్సాహంగా
క్విజ్ లో పాల్గొని సమాధానాలు చెప్పడంలో పోటీలు పడ్డారు.
అలాగే, బిందు మాదిరాజు, భాను మాగంటిఅనూ దాసరి, వరూధినీ మిట్టా కలసి
చీరెలపై నిర్వహించిన  గేమ్ షో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.
స్తీపాత్రలు ప్రధాన భూమిక పోషించిన తెలుగు చలన చిత్రాలకు సంబంధించి
నిర్వహించిన మరో కార్యక్రమం కూడా సభికులను ఆకర్షించింది. పెదాల కదలికను
అర్ధంచేసుకుని సభికులు సినిమాల పేర్లు చెప్పగలగాలి. ఈ కార్యక్రమాన్ని
కల్పనా సువర్ణ, సంగీత ధన్నపునేని, జ్యోతి ముత్యాల జనరంజకంగా
ప్రదర్శించారు.
విజేతలందరికీ తగిన రీతిలో బహుమతులను అందచేసారు.
చక్కటి దుస్తులను ధరించినందుకు ఇచ్చే బహుమతికి అంజలి, నాగమణి
ఎంపికయ్యారు. టి.ఎఫ్.ఏ.ఎస్. అధ్యక్షురాలు మంజు భార్గవ ఈ బహుమతులను వారికి
అందచేసారు.
కార్యక్రమం ఆసాంతం సభ్యులు అనేక విస్మయకర ప్రదర్శనలతో  సభికులను అలరించారు.
లావణ్య  సతీష్ చక్కటి పాటలు పాడి వీనులవిందు చేస్తే, నిర్మల శిష్ట్ల శాస్త్రీయ
నృత్యాలతో కనుపండువ చేసారు.
కవిత తోటకూర బృందం తెలుగు, హిందీ సినిమా పాటలతో ఆడిటోరియాన్ని
హోరెత్తించారు. కరతాళధ్వనులతో సభామందిరం మారుమోగింది.
ఇలాటి సందర్భాలలో ఏర్పాటుచేసే చీరెలు, బంగారు ఆభరణాల స్టాళ్లలో మంచి
సందడి కనిపించింది. చక్కటి వ్యాపారం జరిగినందుకు స్టాళ్ళ నిర్వాహకుల
వదనాల్లో ఆనందం కనిపించింది.
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి  ఐక్యరాజ్యసమితి చక్కటి
నినాదాన్ని రూపొందించింది.
మాటంటే మాటే:  మహిళలపట్ల సాగుతున్న హింసను అరికట్టడానికి సరైన  సమయం ఇదే!
ప్రపంచ  వ్యాప్తంగా మహిళలందరూ  ఈ నినాదాన్ని స్వాగతించారు.
న్యూ జెర్సీలో సమావేశం అయిన అటా మహిళలు స్త్రీలపట్ల జరుగుతున్న
అత్యాచారాలను  ముక్తకంఠంతో ఖండించారు. స్త్రీలపట్ల యేరూపంలో హింస
జరిగినా సహించరాదన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ సమావేశం వల్ల జరిగిన
శుభ పరిణాం ఏమిటంటే , తమ ఆదాయంలో కొంత భాగాన్ని హింసలకు గురిఅవుతున్న
మహిళలకు విరాళంగా ఇవ్వడానికి సైతం నిర్ణయించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ అటా
నిర్వాహక సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని ఫోటోల్లో భద్రపరచిన
సురేష్ జిల్లాకు, డిస్క్ జాకీ గా వ్యవహరించిన అనిల్ అకులకు నిర్వాహకులు
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.
అటా ప్రాంతీయ సమన్వయకర్తలు రఘువీర్ రెడ్డి,భగవాన్ పింగ్లీ ప్రదర్శించిన
సమన్వయ పాటవం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో దోహద పడింది.
అలాగే, జమున పుస్కూర్,రమేష్ మాగంటి, 2004 అటా సదస్సు కన్వీనర్ పరమేష్
భీంరెడ్డి కృషి మొత్తం కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రధాన భూమిక
పోషించింది. న్యూ జెర్సీ స్థానిక అటా నాయకులు చక్కటి మద్దతు ఇచ్చారు.
(NOTE: Please correct the names-
దయచేసి పేర్లు సరి చూసుకోండి)
16-03-2013