26, అక్టోబర్ 2012, శుక్రవారం

కాలాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు


కాలాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ భండారు శ్రీనివాసరావు
ఎన్నికల కోయిల ముందే కూయొచ్చన్న సంకేతాలు ఏకంగా యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ నుంచే వెలువడిన నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ శ్రేణులను తుది సమరానికి సంసిద్ధులను చేయడంలో నిమగ్నమయ్యాయి. చివరి పోరు  అనడానికి కారణం వుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు దఫాలుగా అధికారానికి దూరంగా వుంది. మూడోసారి కూడా అందలాన్ని అందుకోలేకపోతే మరో అయిదేళ్లపాటు పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయడం ఒక ప్రాంతీయ పార్టీకి అలవికి మించిన పని అవుతుంది. పోతే, పాలక పక్షం కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే వరసగా మూడో పర్యాయం కూడా ప్రజలు పట్టం కలిగేంత గొప్ప పాలనను అందిస్తున్న దాఖలా అటు కేంద్రంలో కాని ఇటు రాష్ట్రంలో కానీ కానరాని స్తితి.  మరో జాతీయ పార్టీ బీజేపీ పరిస్తితి కూడా ఇలాగే వుంది. కాంగ్రెస్ తప్పిదాలను ఇక ఎంతమాత్రం జీర్ణించుకోలేని వోటర్లు కూడా ఆ పార్టీ పట్ల మొగ్గుచూపడానికి సిద్ధంగా వున్నారని చెప్పడానికి వీలు లేకుండా ఆ పార్టీ ప్రతిష్ట  నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ ఉదంతం దీనికి తాజా ఉదాహరణ. పోతే, రాష్ట్రంలో మిగిలిన పార్టీల పరిస్తితి కూడా ఆశాజనకంగా లేదు.  ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న వై.ఎస్.ఆర్. పార్టీ అధినాయకుడు జగన్ మోహనరెడ్డి  జైలు నాలుగు గోడల నడుమనే  వుండిపోవడంతో ఆ పార్టీ సైతం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. షర్మిల రూపంలో ఎదిగివచ్చిన ప్రత్యామ్నాయం కూడా పాదయాత్రల వరకు పనికిరావొచ్చేమో కాని,  ఎన్నికల సమరంలో  పార్టీని విజయపధంలో నడిపించే దక్షత ఒక్క జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే వుందని నమ్మేవారు ఆ పార్టీలోనే  చాలామంది వున్నారు. దర్యాప్తులు, విచారణల పేరుతొ ఒక పక్క సీబీఐ, మరోపక్క ఈడీ,   ఆ పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనేక సమస్యల నడుమ చేస్తున్న వొంటరిపోరాటం మరెంతో కాలం కొనసాగించడం అసాధ్యమని, ఫలితంగా కార్యకర్తలు నిరుత్సాహానికి గురయి అయోమయంలో పడే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం వినబడుతోంది. కాలం గడిచేకొద్దీ, అనేక కొత్త సమస్యలు ఆ కొత్త పార్టీని పట్టి పీడించే అవకాశాలు లేకపోలేదు. వీటి ప్రభావం ఆ పార్టీ విజయావకాశాలను ఏదో ఒక మేరకు దెబ్బతీసే ప్రమాదం కూడా వుంది. ప్రస్తుత పాలకపక్షం కాంగ్రెస్ నిష్క్రియాపరత్వం, దాన్ని సరిగ్గా  అంది పుచ్చుకుని రాజకీయ లబ్ధిని పొందడంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వైఫల్యం, వామపక్షాలతో సహా అన్ని పార్టీలు ప్రజాసమస్యల పట్ల అంటీముట్టనట్టు వుండడం ఇవన్నీ పాలకపక్షానికి  కలసివచ్చే అంశాలే. అయినా కానీ,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలదన్న పద్ధతిలో కాలం గడుపుతోంది. ప్రతి రోజూ పత్రికల్లో ఆ పార్టీలో పెచ్చరిల్లుతున్న లులుకల గురించిన  కధనాలే. నాయకుల నడుమ పెరిగిపోతున్న పొరపొచ్చాలు గురించిన వూహాగానాలే.  ముఖ్యమంత్రికీ, మంత్రులకు పడదు. మంత్రులకూ  మంత్రులకు పొసగదు. ముఖ్యమంత్రికీ, ఉపముఖ్యమంత్రికి కుదరదు. పీసీసీ అధ్యక్షుడి సంగతి సరేసరి. ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట ప్రోగ్రాం పెట్టుకుని పోదామనుకుంటే, అదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి రానని మొరాయింపు. ముఖ్యమంత్రే స్వయంగా ఫోను చేసినా డిప్యూటీ సీ.ఎం. ఏమాత్రం  స్పందించలేదని మీడియా కోడై కూయడం ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపు. కాగా, నాయకుల నడుమ సఖ్యత, సమన్వయం  సాధించడం కోసం పీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి వందమంది నాయకులను ఆహ్వానిస్తే దాదాపు మూడోవంతు మంది గైరు హాజరు. పదిహేనుమంది  మంత్రులు మొహం చాటేశారని సమాచారం. ఇక పార్టీకిచెందిన అనేకమంది పార్లమెంటు సభ్యుల జాడలేదు. ఉప ముఖ్యమంత్రి  కూడా బలవంతపెట్టగా వచ్చివెళ్లినట్టు భోగట్టా.
పార్టీలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు, కానీ ఏదో జరిగిపోతున్నట్టు వార్తలు. వూహాగానాల్ని ఖండించే  నాధుడు వుండకపోగా  పైగా వాటిని ప్రోత్సహించే సంప్రదాయం. జనం నోళ్ళల్లో సదా నలగడానికి, ఇతర విషయాలను ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి  ఆ పార్టీ ఎంచుకున్న వ్యూహమేమో  తెలియదు.  
సాధారణంగా ఎన్నికల వేళ దగ్గరపడుతుంటే పాలకపక్షాలు కొన్ని ప్రజారంజక నిర్ణయాలు ఇష్టం వున్నా లేకపోయినా, భరించగలిగే స్తోమత వున్నాలేకపోయినా తీసుకోవడం కద్దు. కానీ, అదేమీ చిత్రమో రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. గ్యాస్ సిలిండర్ల సంగతే ఇందుకు చక్కని దృష్ట్యాంతం. సరఫరా చేసే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే ప్రభుత్వం. ప్రజలనుంచి ఎదురయ్యే నిరసన గురించి అంచనా వేసుకున్న దరిమిలా  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరో మూడు సిలిండర్లు అదనంగా  సబ్సిడీ ధరపై  ఇవ్వాలని ఆదేశించారు.  ఈ అవకాశాన్ని రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం యెగిరి గంతేసి అందిపుచ్చుకోవాలి. కానీ, కిరణ్ సర్కార్ ససేమిరా అంది. దీపం పధకం లబ్దిదారులవరకే ఆ రాయితీని పరిమితంచేసి మిగిలిన వారికి మొండి చేయి చూపింది. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రినే నిలదీసినట్టు వార్తలు. కానీ చివరికి ఏమయింది. సాధ్యం కాని పని అని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినట్టు ఆ వార్తలకు ముక్తాయింపు. పెట్రో ధరలు, ఫీజు రీయింబర్స్ మెంటు, రేషన్ కార్డుల కుదింపు ఇలా ఏది తీసుకున్నా కిరణ్ సర్కారు వైఖరి  వోటర్లను  ఆకట్టుకునేదిగా లేదు. ఒకరకంగా ఇది అభిలషణీయం.  ఎన్నికలను, వోటు బ్యాంకులను లెక్కచేయకుండా మొత్తం రాష్ట్ర ప్రగతిని దృష్టిలో వుంచుకుని నిర్ణయాలను తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. గాడితప్పిన రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దడానికి ఇలా వ్యవహరిస్తే తప్పుపట్టాల్సింది ఏమీ వుండదు. కానీ, నిజంగా ఇంతటి సదుద్దేశ్యంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్నది అని అనుకోవడం అంత నమ్మదగినదిగా లేదు.
రాజకీయాల్లో రెండు తరహాల వాళ్లు వుంటారు. ఈ రకమయిన తెగింపు నిర్ణయాలను వారు  మాత్రమే తీసుకోగలుగుతారు. ఒకరు రాజకీయవేత్తలు. వీరికి రేపటితో నిమిత్తం లేదు. తిమ్మిని బమ్మిచేసయినా సరే, ఆచరణ  సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టయినా సరే ఏదోఒక విధంగా  అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూసేవారు. అయితే, ఇక ఏం చేసినా ప్రజలు నమ్మి తమకు అధికారం అప్పగించడం కల్ల అని నిర్ధారణకు వచ్చినప్పుడు  ఈ రకమయిన గట్టినిర్ణయాలు తీసుకోవాడానికి కూడా  సంకోచించరు. రెండో వారు రాజనీతిజ్ఞులు.  తక్షణ రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి, భవిష్యత్తు గురించి, భావితరాలను గురించి ఆలోచించే దూరదృష్టి కలిగినవారు.   కానీ ప్రస్తుతం ఈ రకం  రాజకీయ నాయకులు అంతరించిపోతున్న జాతుల జాబితాలో వున్నారు.
కాకపొతే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని బలంగా బలపరుస్తున్న కొందరు చెప్పేది వేరేగా వుంది. వీరు కాలాన్ని, కాలం తెచ్చే  మార్పుల్ని నమ్ముకుని రోజుల్ని ఏమారుస్తున్నవారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మధ్యంతరం వచ్చిపడితే తప్ప అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా ఏన్నర్ధం పైచిలుకు వ్యవధానం వుంది. పాదయాత్రల పేరుతొ జనాలకు వెడుతున్న రెండు ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కంటే, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తూ వుండడం పాలక పక్షానికి వూరట కలిస్తోంది. ఈ నేపధ్యంలో   ప్రతిపక్షాల వోట్లు చీలక తప్పవన్న భరోసా కాంగ్రెస్ వారిది.  కోర్టులు, కేసులతో  జగన్  పార్టీని  బలహీనపరచగలిగితే, ఇప్పటికే ప్రాంతీయ ఉద్యమవేడితో ఒక ప్రాంతంలో బలహీనపడివున్న మరో  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని మరింత బలహీన పరచడం చేతిలో పని. అధికారం చేతిలో వుంది. అధికారులు కనుసన్నల్లో వుంటారు. పార్టీ శ్రేణులను కట్టడి చేయడానికీ, వోటర్లను ఎంతో కొంత ఆకట్టుకోవడానికీ పనికొచ్చే ఈ రెండు ఆయుధాలుతమ చేతిలోనే వున్నాయి. సమస్య పరిష్కారాన్ని కాలానికే వొదిలేసి నానబెట్టడం ద్వారా ప్రాంతీయ సమస్యను ఓ మేరకు అదుపుచేయగలిగామని నమ్మే నాయకులకు కాంగ్రెస్ లో కొదవ లేదు. బహుశా ఇలాటి ధీమాతోనే కాంగ్రెస్ తన సమస్యలను అన్నింటినీ కాలానికేవొదిలేసి నిశ్చింతగా కాలక్షేపం చేస్తోందని అనుకోవాలి. (26-10-2012)

17, అక్టోబర్ 2012, బుధవారం

జగన్ లేని జగన్ పార్టీ


జగన్ లేని జగన్ పార్టీ
వై.ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం  ఇప్పట్లో  లేదని తేలిపోయింది. అంతేకాదు,  ఇంకెంతకాలం జెయిల్లో వుండాల్సి వస్తుందో ఇతమిద్ధంగా చెప్పలేని పరిస్తితి కూడా ప్రస్తుతం ఏర్పడింది. ఈ పరిణామాల నేపధ్యంలో ఆ పార్టీ అధ్యతన భవిష్యత్తు గురించి ఆ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇతర ప్రత్యర్ధి పార్టీల్లో కూడా చర్చ మొదలయింది.
జాతీయ పార్టీల సంగతి వేరు కాని ప్రాంతీయ పార్టీలకు నాయకుడి అవసరం ఎక్కువ. పార్టీని నమ్ముకున్నవారికి పార్టీ అధినాయకుడు అందుబాటులో వుండడం అన్నది ఆ పార్టీకి కలసి వచ్చే అంశం. పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి  జైల్లో  వుంటున్నప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ ప్రబలడం సహజం. నిరాశ నిరాసక్తతగా మారి  నిస్పృహగా పరిణమించితే అది పార్టీ బలహీన పడడానికి దోహదం చేస్తుంది. ఇటీవలికాలంలో తారాజువ్వలా ఎదిగివచ్చిన వై.ఎస్.ఆర్. పార్టీని అడ్డుకోవడం,  అదుపుచేయడం ఎలాగో  చేతకాక తలలు పట్టుకుంటున్న మిగిలిన పార్టీలకు జగన్  మరికొంతకాలం, అదికూడా  ఎంతకాలం అన్నది తెలియనంతకాలం జైలు నాలుగు గోడల  నడుమే  వుండిపోవడం  కొంతవరకు  కలసివచ్చే విషయం. మరో ఆరుమాసాలపాటు జగన్ కు జైలు జీవితం తప్పదన్న సుప్రీం కోర్టు సంకేతాల దరిమిలా దొరికిన రాజకీయ ‘అవకాశాన్ని’ పూర్తిగా వాడుకోవడానికే ఇటు కాంగ్రెస్ అటు తెలుగుదేశం సంసిద్ధం అయినట్టే  కనబడుతోంది. జగన్ పై  ఎక్కుబెట్టిన అవినీతి ఆరోపణలను జనం యెందుకు పట్టించుకోవడం లేదని మధన పడుతున్న ఆ పార్టీలకు జగన్ జైల్లో వున్నప్పుడే పరిస్తితులను తమకు అనుకూలంగా చక్కదిద్దుకోవడం  ఒక తప్పనిసరి రాజకీయ అవసరంగా మారింది.  జనం ముందు నమ్మకపోయినా కాలం గడుస్తున్నకొద్దీ, అతడిపై పెట్టిన అవినీతి ఆరోపణల కేసు వివరాలు ఒక్కొక్కటిగా బయటపడేకొద్దీ ప్రజలు కొంతమేరకయినా మనసు మార్చుకునే  అవకాశం వుంటుందన్నది  కాంగ్రెస్ వ్యూహకర్తల్లో కొందరి ఉద్దేశ్యం. ఈ లోగా జారిన కాలును కూడదీసుకుని రకరకాల ఆకర్షక పధకాల ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేయవచ్చన్నది కూడా వారి వ్యూహంలో భాగంగా తోస్తోంది. పార్టీ శ్రేణులను కట్టడి చేయడానికి, ప్రజలను ఆకట్టుకోవడానికీ ఇతర పార్టీల వద్ద లేనిదీ, తమవద్ద మాత్రమే వున్నదీ ఏమిటో వారికి తెలియనిది కాదు. ‘అధికారం’ అనే ఒకే ఒక బ్రహ్మాస్త్రంతో అటు పార్టీ కార్యకర్తలను, ఇటు జనాలను దగ్గర చేసుకోవచ్చని, వారికి మళ్ళీ దగ్గర కావచ్చనీ వారి వ్యూహంగా తోస్తోంది. చేతిలో అధికారం లేకుండా వుత్త చేతులతో  ఎవరు జనాలదగ్గరకు పోయి ఏవి చెప్పినా అవి కల్లబొల్లి మాటలే అని, ఏదేదో  చేస్తామని ఎవరు ఏదయినా  మాట ఇచ్చినా అది నెరవేర్చలేని  శుష్క వాగ్దానమే అనీ,   అధికారం చేతిలో వున్న తమ పార్టీ మాత్రమే ఏం చెప్పినా వెంటనే చేయగలుగుతుందని  అంటూ వెడితే ప్రజలు తమని మాత్రమే నమ్ముతారని వారి నమ్మకం, . ఒక రకంగా ఇది నిజం కూడా. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తమ విమర్శలతో ఎండగట్టగలవు కానీ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపలేవు. అలాగే పార్టీ కార్యకర్తలను, కింది స్తాయి నాయకులను కట్టడి చేయడానికీ, ఆకట్టుకోవడానికీ  పాలక పక్షానికి వున్న వెసులుబాటు, వనరులు  ప్రతిపక్షాలవద్ద వుండవు.
కాంగ్రెస్ వ్యూహకర్తల ఎత్తుగడలు ఇలావుంటే  పార్టీలో  నాయకుల కీచులాటలు ముదిరి పాకాన పడుతూ వుండడం ఆ పార్టీ కి వున్న పెద్ద మైనస్ పాయింటు. పార్టీ అధికారంలో వుండాలని, మరో మాటు  అధికారంలోకి రావాలని   అంతా  కోరుకుంటారు కాని ఎటొచ్చీ ఆ అధికారం తమ చేతిలోమాత్రమే  వుండాలని  కాంగ్రెస్ లో  ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటాడు. తమకు దక్కని అధికారం పార్టీలో తమ ప్రత్యర్ధికి కూడా అందకూడదని అనుకోవడం కూడా ఆ పార్టీలో  పరిపాటే. మూడోసారి వరసగా  ప్రభుత్వంలోకి రావడం  అంత సులభం కాదని కూడా తెలుసు కాబట్టి  ఎన్నికల్లో  తమ వ్యక్తిగత  గెలుపుకోసం ఏమయినా  కష్టపడతారేమో  కాని మొత్తం పార్టీని గట్టెక్కించడానికి తమకున్న స్తోమతను, సంపదను  ఖర్చు చేసే నాయకులు  కాంగ్రెస్ లో తక్కువమంది వుంటారు. ఒకవేళ  పార్టీ గెలిచినా అధికార  పగ్గాలు తమ చేతికే వస్తాయన్న నమ్మకం కాంగ్రెస్ లో ఏ ఒక్క నాయకుడికీ లేకపోవడమే ఈ నిర్లిప్తతకు కారణం.  మొత్తం పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను భుజాలకెత్తుకోవడానికి సిద్ధంగా వుండరు. ఎందుకొచ్చిన  కంచి గరుడ సేవ అని మిన్నకుండిపోతారు. అయితే గియితే, ఎదోరకంగా పార్టీ  గెలిస్తే అప్పుడు ఢిల్లీ వెళ్లి తేల్చుకోవచ్చు అంతే  కాని ఇప్పటినుంచి అనవసర లాయలాస ఎందుకనే తత్వం వారిది. ఈ నేపధ్యం వల్లనే, సరయిన నాయకత్వం కొరత కారణంగానే,  వరసగా రెండోసారి గెలిపించినా  తమకు దూరం కావడం మినహా దగ్గరయ్యే కనీస ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయడం లేదన్న అభిప్రాయం జనాల్లో వుంది. ఈ ప్రభుత్వ  వ్యతిరేక వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ, వై.ఎస్.ఆర్. పార్టీలు ఓ పక్క పోటీ పడుతూనే మరో పక్క ఒకరిపై ఒకరు  కత్తులు దూసుకుంటున్నారు. ఇది కూడా  ఒక రకంగా కాంగ్రెస్ కు కలసి వచ్చే అంశమే. కానీ, దాన్ని వాడుకునే తీరిక, ఓపిక ఆ పార్టీ నాయకులకు లేవు. తమలో తాము కుమ్ములాడుకుంటూ అసలే  బలహీనంగా వున్న పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చే పనితోనే వారికి సరిపోతోంది.             

పోతే, తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరోరకం. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొనివున్న పరిస్థితుల్లో  టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చున్నా గెలిచి తీరాలి. వాతావరణం అంత అనుకూలంగా వుంది.  పాలక పక్షంపై నానాటికీ పెరిగిపోతున్న వ్యతిరేకతను అడ్డం  పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గి , తిరిగి  అధికారంలోకి రావడం అనేది తెలుగుదేశం పార్టీకి నల్లేరు మీది నడక కావాల్సిన పరిస్తితి.  కానీ, దురదృష్టం ఏమిటంటే టీడీపీకి దక్కాల్సిన ఈ బంగారు అవకాశాన్ని  కాస్తా కొత్తగా పుట్టుకొచ్చిన వై.ఎస్.ఆర్. పార్టీ ఎగరేసుకుని పోతుంటే నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాల్సిన దుస్తితిలో కూరుకుపోతోంది.   2009  అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కూడా తెలుగుదేశం పార్టీది ఇదే అనుభవం.  అప్పటి ఎన్నికల్లో ‘విజయం ఖాయం, అడుగు దూరంలో అధికారం’ అని   టీడీపీ పెంచుకున్న ఆశలపై  ఆ రోజుల్లో కొత్తగా పుట్టుకొచ్చిన  ప్రజారాజ్యం పార్టీ  నీళ్ళు చల్లింది.  తను గెలవకపోగా తమ గెలుపుకు ఆ పార్టీ గండి కొట్టిందన్న అభిప్రాయంతో వున్న  తెలుగు దేశం పార్టీకి, ఇప్పుడు మళ్ళీ  జగన్ రూపంలో అదే పరిస్తితి ఎదురవుతోంది. ఈ నిజం జీర్ణించుకున్నారు  కాబట్టే టీడీపీ నాయకులకు ఇప్పుడు జగనే  ప్రధాన ప్రత్యర్ధిగా కనిపిస్తున్నాడు.
2014 అసెంబ్లీ  ఎన్నికలకు ఏడాది పైచిలుకు వ్యవధానం మాత్రమే మిగిలి వుంది. మీనమేషాలు లెక్కించే వీలుసాళ్లు  ఇప్పుడు ఏపార్టీకి లేవు. అందరికీ ఎన్నికల పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కొందరు రాజకీయ పండితులు వూహించేదే నిజమయితే ఎన్నికల ఘంటారావం అనుకున్నదానికన్నా  ముందే వినబడే అవకాశం వుంది. అంటే ఎలాచూసినా అన్ని పార్టీలకి గడువు దగ్గర పడిందనే చెప్పాలి. అందుకే యాత్రల  పేరుతొ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసాయి. ఈ విషయంలో టీడీపీ కొంత ముందుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం  చుట్టేసి ప్రజల మధ్యనే నడుస్తూ తిరుగుతున్నాడు. జనం మధ్యనే వుండడానికి  అలవాటుపడిన జగన్ మోహన రెడ్డికి  జైలు నుంచి బయటపడే సావకాశం ఇప్పట్లో లేదని తేలిపోవడంతో వై.ఎస్.ఆర్. పార్టీ నేతలు కూడా వై.ఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిలను  ఈనెల 18 నుంచి  పాదయాత్రకు రంగంలో దింపుతున్నారు.
ఈ రెండు యాత్రలూ సుదీర్ఘంగా సాగేవే కావడం గమనార్హం. చంద్రబాబు నాయుడు తన వయసుకు పొసగని  భారమయిన  బాధ్యతను మీదికెత్తుకుంటే, వై.ఎస్.ఆర్. పార్టీ తరపున ఆ పార్టీలో ఎటువంటి వ్యవస్తాగతమయిన హోదాలేని షర్మిల తలకు మించిన భారాన్ని తలకెత్తుకుంది. ఈ యాత్రల్లో ఓ రెండువారాలు ముందున్న చంద్రబాబునాయుడు దానికి తగ్గట్టుగానే కొంత మైలేజీ  సంపాదించుకున్నారు. యాత్రకు ముందు తలెత్తిన  సందేహాలను పటాపంచలు చేస్తూ బాబు పాద యాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తున్నందుకు ఆ పార్టీ వర్గాలు వూపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే షర్మిల పాదయాత్ర గురించి ప్రకటన వెలువడింది.  అప్పటినుంచి ఈ రెండు యాత్రలను పోలుస్తూ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. యాత్రల పట్ల ప్రజల స్పందన ఏ తీరుగా వుండబోతున్నది అన్న విషయంపై కూడా వూహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలను  ఒకదానికొకటి పోటీగా పరిగణించడం అంత మంచి పద్దతి అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ఈ రకమయిన పోటీ ప్రచార యాత్రలు తప్పనిసరి. పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికీ, నాయకులు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికీ కొన్ని సందర్భాల్లో పాదయాత్రలకు పూనుకుంటూ వుంటారు. పనిలో పనిగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికీ, గ్రామస్థాయి నుంచి పార్టీ పునాదులను గట్టిపరచుకోవడానికీ ఈ పాదయాత్రలు బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రజల నడుమ హమేషా తిరుగుతూ వారి విశ్వాసాన్ని పొందడానికి నాయకులకు పాదయాత్రలకు మించిన మార్గం లేదు.  స్వామి కార్యం, స్వకార్యం అన్నట్టు అనుదినం మీడియాలో కనబడే అవకాశం కూడా వుంటుంది. రాజకీయ నాయకులను కూడా దగ్గరగా చూస్తూ వారు చెబుతున్న మాటల్లో తాలెంతో,బోలెంతో అంచనావేసుకునే వీలు ప్రజలకు చిక్కుతుంది. (17-10-2012)

12, అక్టోబర్ 2012, శుక్రవారం

ఒరులేయవి యొనరించిన


ఒరులేయవి యొనరించిన  
1997 లో 28  ఏళ్ళ ఓ యువకుడిని సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ప్రేమించి పెళ్ళాడినప్పుడు ఆ కుటుంబం సంగతి యేమో కాని దేశం యావత్తు నివ్వెరపోయింది. అంతకు 52 ఏళ్ళ క్రితమే  1942 లో జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని తండ్రి  అభీష్టానికి వ్యతిరేకంగా  పార్శీ కుటుంబానికి చెందిన   ఫిరోజ్  గాంధీని (వాస్తవానికి జాతిపిత మహాత్మా గాంధీకి ఈ ఫిరోజ్ గాంధీకి ఎలాటి బంధుత్వం లేదు) పరిణయం ఆడిన దగ్గరనుంచి ఇలాటి వివాహాలకు ఆ కుటుంబం బాగా అలవాటు పడిపోయిందనే చెప్పాలి. తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ ఇటలీ వనిత సోనియాను, అతడి తమ్ముడు సంజయ్ గాంధీ,  మేనకా (మనేకా) గాంధీని పెళ్ళిచేసుకుని తమ తలిదండ్రుల సంప్రదాయాన్ని కొనసాగిస్తే, సోనియా గారాలపట్టి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా ను పెళ్ళాడి  మూడో తరంలో కూడా ప్రేమ వివాహాల వొరవడిని మరింత  ముందుకు తీసుకువెళ్ళింది. ఆమె తమ్ముడు రాహుల్ గాంధీ మాత్రం ప్రేమ వివాహం మాట సరే  అసలు పెళ్ళిమాటే తలపెట్టడంలేదు.


రాబర్ట్ వాద్రా

ఇక ప్రస్తుతానికి వస్తే, రాబర్ట్ వొధేరా అనాలో రాబర్ట్ వాద్రా అని పలకాలో ప్రియాంకాతో పెళ్లినాటికి  ఎవరికీ  అంతుపట్టని ఆ  వ్యక్తి ఈనాడు మీడియా దృష్టిని  ప్రముఖంగా ఆకర్షిస్తున్నాడు.  నిజానికి అతడీనాడు అంత అనామకుడేమీ కాదు. దేశ రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి, యూపీయే అధినాయకురాలు అయిన సోనియా గాంధీకి స్వయానా ఇంటల్లుడు కావడం, భావిభారత ప్రధాన మంత్రిగా చూడాలని  కాంగ్రెస్ పార్టీ  శ్రేణులన్నీ కోరుకుంటున్న  రాహుల్ గాంధీ అనుంగు సోదరి ప్రియాంక గాంధీని మనువాడడం కూడా అతడికింత ప్రచారం రావడానికి  కారణాలు కావచ్చు.  అయితే,  హమేషా మీడియా దృష్టి పడే కుటుంబానికి చెందినవాడే కాని మీడియా దృష్టిపెట్టాల్సినంత మనిషి కాదు రాబర్ట్ వాద్రా.  అయినా కానీ,  ఈనాడు  అందరి దృష్టీ అతడిపైనే వుంది. దీనికి కారకుడు ఎవరయ్యా అంటే,  ఇంకా  పేరు పెట్టని ఓ రాజకీయ పార్టీని కొత్తగా పెట్టిన కేజ్రీవాల్. అవినీతి వ్యతిరేక ఉద్యమనేత  అన్నా హజారే బృందంలో వుంటూ, ఇటీవలే  రాజకీయ అరంగేట్రం చేసిన కేజ్రీవాల్  ఆ  వెనువెంటనే ప్రయోగించిన తన తొలి ఆరోపణాస్త్రాన్ని  నేరుగా  రాబర్ట్ వాద్రా  మీదికే సంధించడంవల్లనే  ఇప్పుడు  వాద్రా  పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
1969 లో జన్మించిన రాబర్ట్ వాద్రా పెద్ద  శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినవాడేమీ కాదు. తండ్రి రాజేంద్ర వాద్రా ఒక సాధారణ వ్యాపారి. కొయ్యతో, ఇత్తడితో చేసిన బొమ్మలను, వస్తువులను విక్రయించే వ్యాపారం. తల్లి మౌరీన్ స్కాటిష్ జాతీయురాలు. ప్రియాంకాతో పెళ్ళయిన తరువాత రాబర్ట్ కు తండ్రితో పొసగలేదు. ఒక దశలో తండ్రికీ తనకూ సంబంధం లేదని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు.
ఇక ఈ వివాదంలో చిక్కుకున్న మరో వ్యక్తి  కుశ్ పాల్ సింగ్. తన  మామగారినుంచి దక్కిన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించాడు. మామ రఘువేంద్ర సింగ్ స్తాపించిన డీ.ఎల్.ఎఫ్. సంస్థ నస్తాల వూబిలో కూరుకుపోయివున్న ఒక  దశలో కుశ్ పాల్ సింగ్ అందులో  తన వాటాలను అమ్ముకోవాలని కూడా అనుకున్నారు. కానీ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్  గాంధీతో యాదృచ్చికంగా జరిగిన పరిచయం  కుశ్ పాల్ సింగ్ జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. సింగ్ వ్యాపారాన్ని ఆకాశం అంచులకు తాకించింది. ఫలితంగా ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో ఆయన పేరు చేరింది. రాజకీయ ప్రాపకం వుంటే ఏదయినా సాధ్యం అని  కుశ్ పాల్ సింగ్ నిరూపించాడు. అత్యంత సంపన్నుడయిన సింగ్,  అత్యంత రాజకీయ ప్రాపకం వున్న రాబర్ట్ నడుమ వ్యాపార సంబంధాలు బలపడడంలో ఆశ్చర్యం లేదు. వారిరువురి  మధ్యా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో  సాగిన ఆర్ధిక లావాదేవీలనే  కేజ్రీవాల్ బయటపెట్టి సంచలనం సృష్టించారు. 
      
ఇంతకీ కేజ్రీవాల్, రాబర్ట్  వాద్రాపై ఎక్కుబెట్టిన బాణంలో పదునెంత? అది కలిగించే ప్రభావం యెంత? అనే విషయంపై మీడియాలో ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. వాద్రా సోనియా కుటుంబానికి చెందిన వ్యక్తి కాక పోతే కేజ్రీవాల్ చేసిన  ఆరోపణలకు ఇంతటి  ప్రచారం లభించి వుండేది కాదని భావించేవారు కూడా లేకపోలేదు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో డి.ఎల్.ఎఫ్  అనే ఓ  బడా  సంస్థకు  లాభం లేదా మేలు జరిగేలా సోనియా అల్లుడిగా రాబర్ట్ వాద్రా పలుకుబడి ఉపయోగపడిందని, దానికి ప్రతిఫలంగా వాద్రాకు డి.ఎల్.ఎఫ్. కొన్ని కోట్లు విలువచేసే  ఆస్తులను కట్టబెట్టిందని  కేజ్రీవాల్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వున్న డి.ఎల్.ఎఫ్. సంస్థ, అరవై ఐదుకోట్ల రూపాయల  వడ్డీలేని, పూచీకత్తు అవసరం లేని రుణాన్ని  రాబర్ట్ వాద్రాకు ఇచ్చిందన్నది కేజ్రీవాల్ సంధించిన మొదటి అస్త్రం. వ్యాపార లావాదేవీల్లో  డబ్బు సర్దుబాట్లు చేసుకోవడం నేరం కాకపోవచ్చు. కానీ, ఇంతపెద్ద మొత్తాలు చేతులు మారుతున్నప్పుడు ఆ విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా జరగడానికి అవకాశం వుండదు. అయినా ఆ శాఖ మిన్నకుండా వున్నదంటే కచ్చితంగా రాబర్ట్ వాద్రా సోనియా కుటుంబంలో సభ్యుడు కావడమే కారణమని కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారు.
ఆయన అంతటితో ఆగలేదు. మరికొన్ని ఆధారాలతో కూడిన కొత్త ఆరోపణలు చేశారు. నేను నీకీ పని చేసిపెడతాను. ప్రతిఫలంగా నువ్వు నాకు ఇది చేసిపెట్టు అనే పద్ధతిలో (ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని క్విడ్ ప్రోకొ  అని సంక్షిప్తంగా పేర్కొంటున్నారు) డీ.ఎల్.ఎఫ్.,  వాద్రాల  నడుమ అనేక రకాల  లావాదేవీలు సాగాయని కేజ్రీవాల్ వాదన.
అవినీతిని నిర్మూలించే  విషయంలో స్వపర భేదాలు లేకుండా సొంత పార్టీవారిని సైతం జైలు వూచలు లెక్కబెట్టిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలకు ఈ వివాదం కొరుకుడు పడడం లేదు. సాక్షాత్తు పార్టీ అధినేత్రి అల్లుడిపై గురిపెట్టిన ఈ కొత్త సంకటం నుంచి యెలా బయటపడాలన్నది వారికి సవాలుగా మారింది. అయితే నూటపాతికేళ్ల ఘన చరిత్ర వున్న పార్టీ కాబట్టి తొందరగానే తేరుకుని ఎదురు దాడి మొదలు పెట్టింది. తమ అధినాయకురాలిపై  ఈగ వాలితేనే  సహించలేని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు ఒక్కుమ్మడిగా లేచి,  రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. ఆధారరహిత ఆరోపణలుగా కొట్టివేస్తూ కేజ్రీవాల్ వెనుక బీజేపీ ప్రచ్ఛన్న హస్తం వుందని ప్రత్యారోపణ చేస్తున్నాయి. ఈ ఎదురుదాడి బృందంలోని  కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో కర్నాటక గవర్నర్ గా వుంటున్న   హెచ్.కె. భరద్వాజ్ సైతం   స్వరం కలపడం విచిత్రంగా వుంది.
కేజ్రీవాల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి చిదంబరం స్పందన మరింత విడ్డూరంగా వుంది.
ప్రైవేటు లావాదేవీలపై కేంద్రం దర్యాప్తు చేయబోదని ఆయన చెబుతున్నారు. తనదాకా వస్తే కాని నొప్పి తెలియదన్నట్టు,  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ విషయంలో క్విడ్ ప్రోకో  అంటూ విచారణ జరుపుతున్న సంగతిని మర్చిపోయి చిదంబరం మాట్లాడుతుండడం విశేషం. జగన్ కేసు విషయంలో ఒకరకంగాను, వాద్రా కేసులో మరో రకంగాను వ్యవహరించడాన్ని జనం గమనించరని అనుకుంటే పొరపాటు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చక్కని అవకాశం. రాజకీయ ప్రత్యర్ధులను తొక్కిపట్టివుంచడానికి,  ఎగర్తించేవారిని మెడలు వంచి  కాడి కిందికి తేవడానికి కేంద్రంలోని యూ.పీ.ఐ. ప్రభుత్వం    సీ.బీ.ఐ. ని ఒక పనిముట్టుగా  వాడుకుంటోదన్న అపవాదును తిప్పికొట్టడానికి ఇది ఒక మహత్తర అవకాశం. ఎంతవారలయినా చట్టం ముందు సమానులే అని వల్లిస్తున్న చిలక పలుకుల్లో ఎలాటి డొల్లతనం లేదని నిరూపించుకోవడానికి ఇదే మంచి తరుణం.  భవిష్యత్తులో, ఏ ఒక్కరూ, రాజకీయ అధికారాన్నికాని, అధికార కేంద్రంతో తమకున్న  సంబంధాలను కానీ అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని, ప్రజల సంపదను నిర్లజ్జగా కొల్లగొట్టే  సాహసం చేయకుండా వుండాలంటే రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలను రాగద్వేషాలకు అతీతంగా విచారించి నిగ్గుతేల్చడం కాంగ్రెస్ పార్టీకి ఒక చారిత్రిక అవసరం. 
నన్నయ మహాభారతంలో ఒక పద్యం వుంది.
‘ఒరులేయవి యొనరించిన  
నరవరయప్రియము తన మనంబునకగుదా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపధములకెల్లన్’ -    
‘ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు’ అన్నది దాని తాత్పర్యం.
దీన్ని కొద్దిగా మార్చితే ప్రస్తుత రాజకీయ నాయకులకు అన్వయిస్తుంది. చట్టాన్ని అమలుచేయడంలో సమ్యక్ దృష్టి వుండాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని తేలిగ్గా చెప్పడం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులపై వుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.(12-10-2012)

9, అక్టోబర్ 2012, మంగళవారం

మిసిమి వ్యాసాల ఇన్నయ్య పుస్తకం


మిసిమి వ్యాసాల ఇన్నయ్య పుస్తకం
కొందరు జంతువుల్ని ప్రేమిస్తారు. మరికొందరు మొక్కల్ని ప్రేమిస్తారు. నాకు తెలిసి పుస్తకాల్ని ప్రేమించే వ్యక్తి ఒకరు వున్నారు. పుస్తకాలను అందరూ చదువుతారు. మంచి పుస్తకాలను కొందరే ఎంపిక చేసుకుని చదువుతారు. పుస్తక ప్రేమికుడయిన ఈ వ్యక్తి తను పుస్తకాన్ని ‘కొని’ చదవడమే కాదు పుస్తకాల్ని ప్రేమించే గుణం వున్న మరికొందరికి ఆ పుస్తకాల్ని కొని, పోస్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపి చదివిస్తారు. ఏదయినా పుస్తకం బాగా నచ్చితే వందల సంఖ్యలో వాటిని కొని బంధుమిత్రుల ప్రత్యేక వేడుకలకు ‘కానుక’గా పంపుతారు. అరుదయిన ఈ వ్యక్తిత్వం కలిగిన ఈ వ్యక్తి పేరు దేవినేని మధుసూదనరావు. వీరిలో పేర్కొన దాగిన  విశిష్ట లక్షణాలు మరికొన్నివున్నాయి. వాటిని మరో సందర్భంలో ప్రస్తావించుకుంటాను.


వీరిని తలచుకునే సందర్భం ఈ రోజు తటస్థ పడింది. హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో నరిసెట్టి ఇన్నయ్య రాసిన మిసిమి వ్యాసాల సంకలన గ్రంధాన్ని హెచ్.ఎం.టీ.వీ.  సీ.యీ.వో., కే. రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. ఒక చక్కటి ఆశయంతో, అంకితభావంతో రెండు దశాబ్దాల క్రితం ‘మిసిమి’ పత్రికను ప్రారంభించినప్పటినుంచి ఇన్నయ్య తనదయిన శైలిలో ఈ వ్యాసాలను రాస్తూ వచ్చారు. ఎన్నుకున్న అంశాల పరిధి అతి విస్తృతం. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయితల రచనలతో పాటు, వారి వ్యక్తిత్వాలను పరిచయంచేసే సరికొత్త ప్రక్రియను నెత్తికెత్తుకోవడం ఒక్క మిసిమి వంటి పత్రికకే సాధ్యం.
ఇన్నయ్య కేవలం  రచయిత మాత్రమే అయితే ఈ రచనల తరహా మరోరకంగా సాగివుండేది. ఆయన గొప్ప  మానవతావాది. పైగా  కరుడుగట్టిన హేతువాది. తను నమ్మిన సిద్ధాంతాలను తాను మొండిగా నమ్మడమే కాదు ఇతరులను కూడా నమ్మించాలని శక్తివంచన లేకుండా శ్రమిస్తుండడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం. ఈ స్వభావం ఆయనకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దానితో పాటు అభిమానులను అదే సంఖ్యలో విమర్శకులను సంపాదించిపెట్టింది.
ఇన్నయ్య దేవుడిని నమ్మరు. నమ్మని వాళ్లు చాలామంది వుంటారు. కానీ ఇన్నయ్య అంతటితో దేవుడిని వదలరు. వెంటబడి మరీ దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. అది అంత అవసరమా అని అడిగే మిత్రులం కొంతమందిమి ఆ దేవుడి దయవల్ల ఇప్పటివరకూ ఆయనతో స్నేహాన్ని కొనసాగించగలుగుతున్నాము. (‘నీవు దేముడితో మాట్లాడితే ప్రార్ధన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు’ అనే థామస్ సాజ్  ధర్మసూక్ష్మాన్ని ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.)
జీవన ప్రమాణాలకు శాస్త్రీయ విజ్ఞానం తోడ్పడాలని ఆయన కోరుకుంటారు. మానవీయ విలువలను మూఢ నమ్మకాలతో అణగదొక్కరాదు అన్నది ఆయన సిద్ధాంతం.
ఇక పుస్తకం విషయానికి వస్తే – ఇది ఆషామాషీగా చదివిపక్కన పడేసే పుస్తకం కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులయిన అనేకమంది రచయితల జీవన రేఖలను ఆయన ఇందులో స్పృశించారు. అలాగే, అనామకులని  అనలేం కాని,సాధారణ  జనాలకు అంతగా పరిచయంలేని రచయితల గురించి, వారి రచనలు గురించీ ఇన్నయ్య రాసిన విమర్శనాత్మక వ్యాసాలూ ఇందులో వున్నాయి.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన పదిమంది మేధావులను ఎడ్వర్డ్ షిల్జ్ అనే సోషియాలజిస్ట్ ఎంపికచేసి రాసిన వ్యాసాలను ఆయన మరణానంతరం ప్రచురించారు. రేమండ్ ఆరన్, సిడ్నీ హుక్, రాబర్ట్ మేనార్క్ హచిన్స్, లె పోల్ద్ లబెజ్, హరాల్డ్ లా స్కీ, కార్ల్ మన్ హమ్, ఆర్నాల్దో డాంటెమొమిగ్లయానో, జాన్ యు నెఫ్, లియోజీ లార్డ్ ల వ్యక్తిత్వ విశేషాలను ఇన్నయ్య తేటతెలుగులో తెలియచేసారు. షిల్జ్ మహాశయులవారు ఉదహరించిన ఆ పదిమంది మేధా వులలో మన దేశానికి చెందిన నిరాద్ సి. చౌదరి వుండడం విశేషం.
అందరికీ తెలియని విషయాలు కూడా  కొన్ని ఇందులో వున్నాయి. ఉదాహరణకు సుభాష్ చంద్ర బోస్ బెర్లిన్ లో వున్నప్పుడు ‘సినార్ మజహే’ అనే గుప్తనామంతో చలామణి అయ్యేవారట. ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది ఎం ఎన్ రాయ్ అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య అనీ, ఆయన భార్య ఎవిలిన్ ట్రెంట్ ఆయనతో విడిపోవడానికి ముందు - ఇండియాలో ఒక్కమారుకూడా అడుగుపెట్టకుండానే అనేక సంవత్సరాలపాటు భారత స్వాతంత్ర్య విప్లవ పోరాటానికి దోహదం చేశారనీ ఇన్నయ్య రాశారు.
చక్కటి రచనలు అతి చక్కగా అచ్చు వేసిన ఖ్యాతి ప్రచురణకర్తలది. కాకపొతే, అక్కడక్కడా ముద్రారాక్షసాలు పంటికింద రాయిలా పుస్తక పఠనానికి అడ్డుతగులుతున్నాయి. (పేజీ 33 – ఒకయాన –ఒకాయన) ఇలాగే మరికొన్ని. కాకపొతే ఇంతటి బృహత్తర ప్రయత్నం ముందు అవి ఎన్నదగ్గవి కాదు. - భండారు శ్రీనివాసరావు
(09-10-2012)

7, అక్టోబర్ 2012, ఆదివారం

అద్దంలో చందమామ ‘తెలంగాణ’



అద్దంలో చందమామ ‘తెలంగాణ’ భండారు శ్రీనివాసరావు 

“నెలాఖరులోగా తెలంగాణా వస్తుందనే మాటల్ని ఎనిమిదేళ్ళుగా వింటున్నా”  ఈ మాటలు అన్నది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సమైక్యవాద నాయకుడు కాదు. పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెడితే మరో మాట లేకుండా సమర్దిస్తామని మాట ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పూర్వాధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు.
‘దసరా పండుగ లోపే తెలంగాణా ఏర్పాటుపై ఖచ్చితమయిన ప్రకటన వస్తుంద’ని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖరరావు తనను కలుసుకున్న ఆ ప్రాంతపు ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులతో చెప్పారని భోగట్టా. విజయదశమి నాటికి విజయోత్సవాలకు అంతా సిద్ధంగా వుండాలని ఆయన పిలుపు ఇచ్చినట్టుకూడా సమాచారం. ‘ఈ నెల ముప్పయ్యో తేదీలోగా ప్రకటన రాకపోతే యుద్ధం ప్రకటిద్దామని, ఇందుకోసం అన్ని రకాలుగా సంసిద్ధమవుదామని కూడా ఆయనే అన్నట్టు  ఆ నాయకులే చెబుతున్నారు. ఇంత సందిగ్ధత వున్నప్పుడు దాన్ని మరింత పెంచేవిధంగా గులాబీ పార్టీ అధినేత ఇలాటి పరస్పర విరుద్ధ ప్రకటనలు యెందుకు చేస్తున్నట్టో తెలియక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
‘అనైక్యతతోనే తెలంగాణా ఆలశ్యం అవుతోంద’ని ప్రజాసంఘాలాల జేయేసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఈనెల పదహారున హైదరాబాదు వస్తున్న ప్రధాని మన్మోహన్  సింగుకు ‘తెలంగాణా రుచి’ చూపిస్తామని, తెలంగాణా మార్చ్ జోషులో వున్న  జేయేసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. తనకూ కేసీఆర్ కూ నడుమ విభేదాలు ఏమీ లేవని  ఆయన స్పష్టం చేస్తూనే,  గోరంతను కొండంత చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అంటే ఎంతో కొంత వున్నట్టే కదా అని విమర్శకులు భాష్యం చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తాము తెలంగాణాపై అధ్యయనం జరిపి నివేదిక ఇచ్చామని జస్టిస్ శ్రీకృష్ణ హఠాత్తుగా తెరపైకి వచ్చి చెప్పారు. రాజకీయ కారణాలవల్లే తెలంగాణా ఏర్పాటు సాధ్యం కావడం లేదని ఆయన చెప్పడాన్నిబట్టి చూస్తే సీమాంధ్ర నేతల లాబీయింగ్ వల్లే ‘వేర్పాటు’ ప్రతిపాదన  వెనక్కుపోతోందన్న అభిప్రాయం కలుగుతోంది. కుండబద్దలు కొట్టినట్టున్న జస్టిస్  శ్రీకృష్ణ  అభిప్రాయం తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు.
హైదరాబాదు లేని తెలంగాణాకయినా ‘సరే’  అని కేసీఆర్ అన్నట్టు వచ్చిన వార్త  టీఆర్ఎస్ శ్రేణులకు, ముఖ్యంగా  రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణాను మనసారా కోరుకుంటున్నవారికి ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం అని కేసీఆర్ మద్దతుదారులు అంటున్నారు.
ముఖ్యమంత్రిపై, అదీ తమ  సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రిపై ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు  లోకసభ స్పీకర్ కు హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం ఈ మొత్తం వ్యవహారంలో కీలక మలుపు. ఇలాటి పరిణామాలు  ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. తెలంగాణా మార్చ్ సందర్భంగా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు తమను అడ్డుకుని తమ హక్కులకు భంగం కలిగించారన్నది వారి అభియోగం.        
ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఎంపీల చిత్తశుద్ధి పట్ల తమకు నమ్మకం వుందని టీజేయేసీ, ప్రజాసంఘాల  నేతలు అనడం వారికి కొంత వూరట కలిగించే విషయం.  అయితే ప్రజల్లోనే  విశ్వాసం కలిగించలేకపోతున్నామని ఆ నేతలు పేర్కొనడం వింత కొస మెరుపు.
కాగా, పులి మీది పుట్ర మాదిరిగా, కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ అధినాయకుడు హైదరాబాదు వచ్చి చేసిన ప్రకటన తెలంగాణా వాదులను మరింత ఆందోళనకు గురిచేసింది. రాష్ట్ర విభజనకు ఓ పక్క మద్దతు ఇస్తూనే తెలంగాణాపై నిర్ణీత సమయంలో ప్రకటన వస్తుందని చెప్పడం కష్టమని టీ కాంగ్రెస్ నేతలతో అల్పాహార విందులో పాల్గొన్న అనంతరం విలేకరులతో చెప్పారు. పనిలో పనిగా తెలంగాణా రాష్ట్రీయ లోక్ దళ్ శాఖను ప్రారంభించారు. టీ.ఆర్.ఎస్. నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్న  ఎమ్మెల్సీ దిలీప్ పూనికపై ఈ శాఖ ఏర్పాటయింది. సాధారణంగా ఇలాటి రాష్ట్ర విభాగాలను ఏర్పాటుచేసినప్పుడు వాటిని పలానా పార్టీ రాష్ట్ర శాఖ అని వ్యవహరించడం కద్దు. కానీ ఆర్.ఎల్.డీ. రాష్ట్ర శాఖకు ముందు ‘తెలంగాణా’ పదాన్ని జత చేశారు. జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలకు ఆయా రాష్ట్రాల లేదా ప్రాంతాల పేర్లను జోడించడం జరగదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ యూపీలో అయినా ఏపీలో అయినా కాంగ్రెస్ పార్టీ అనే పిలుస్తారు. యూపీ కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ అని వ్యవహరించరు.  మరిలా యెందుకు చేసారన్న దానికి స్పష్టత లేదు. ఒకవేళ ఆర్.ఎల్.డీ. కి టీ.ఆర్.ఎల్.డీ. రాష్ట్ర శాఖ అయిన పక్షంలో, జాతీయ పార్టీ గుర్తింపుకోసం అవసరమయ్యే వోట్లను రాబట్టుకోవడం మినహా ఆర్.ఎల్.డీ. కి తక్షణం రాజకీయంగా వొనగూడే ప్రయోజనం శూన్యం. ఈ పార్టీ వల్ల   తెలంగాణా వాదానికి అదనపు బలం చేకూరదు. పైగా కొత్త పార్టీ ఆవిర్భావం వల్ల వాదం కొంత బలహీనమయ్యే ప్రమాదం వుంటుంది. ఇప్పటికీ తెలంగాణా ఏర్పాటును బలంగా కోరుకుంటున్న పార్టీలకు కొదవ లేదు. తెలంగాణా వాదుల ఐక్యతకు భంగకరంగా పలురకాల వ్యాఖ్యానాలతో ఈ పార్టీల నాయకులు అయోమయాన్ని సృష్టిస్తూ వుండడం మినహా వీళ్ళు వాదానికి అనుకూలంగా వొరగబెడుతున్నది ఏమీ లేదు.        
తెలంగాణా విషయంలో  కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు  పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు కేసీఆర్  కొన్నిసార్లు ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలలో పరోక్షంగా బయటకు వొదులుతున్న సంకేతాలను బట్టి ఓ మేరకు అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి ఢిల్లీ పెద్దలకు రాష్ట్రంలో వున్న పరిస్థితుల పట్ల అవగాహన లేదని అనుకోలేము. తెలంగాణాకు సంబంధించి సమస్త వివరాలతో శ్రీ కృష్ణ కమిటీ నివేదికే వారివద్ద  సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను  గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా.తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులతోనూ,  సీమాంధ్ర నాయకులతోను  ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకులు  అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. అలాగే కేసీఆర్ తన లాబీయింగులో భాగంగా ఇటీవల ఢిల్లీలో అనేకరోజులపాటు మకాం వేసి అనేకమంది కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టు ఆయనే చెప్పారు. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది  సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారి లెక్కలు,డొక్కలు వేరే.  వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం  ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు.
ఢిల్లీలో అధినాయక ప్రతినిధులతో జరిగిన మంతనాల్లో చురుగ్గా పాల్గొన్న ఓ కాంగ్రెస్ నాయకుడు చెబుతున్న విషయాలు వినడానికి ఇంపుగా లేకపోయినా అక్కడ ఏం జరుగుతున్నదో ఓ అంచనాకు రావడానికి వీలుగావున్నాయి. తెలంగాణా నాయకులను వారు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. ఇప్పటికిప్పుడు తెలంగాణా ప్రకటిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు లభించే అవకాశం వుందా? టీ.ఆర్.ఎస్. ని కాంగ్రెస్ లో  విలీనం చేసుకుని తెలంగాణా ప్రకటన చేస్తే  ఆ లబ్దితో బలపడే కేసీఆర్ మరో మమతా బెనర్జీగా మాదిరిగా మారి అధిష్టానానికి కంటిలో నలుసుగా తయారయ్యే అవకాశం యెంత అన్నది వారి మదిలో మెదులుతున్న మరో సందేహం.
నిజమే.  తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని  కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా  ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను  లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహకర్తల ఆలోచన కావచ్చు.
(07-10-2012)



4, అక్టోబర్ 2012, గురువారం

చంద్రబాబు పాదయాత్ర



చంద్రబాబు పాదయాత్ర 

సరిగ్గా 35 సంవత్సరాల క్రితం స్థానికులకు ఏమాత్రం పరిచయం లేని ఓ యువకుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించాడు. గడప గడప తొక్కాడు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాడు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించాడు. ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.

ఆనాడు   

రచ్చబండ్లమీద,  ఇళ్ళ అరుగుల మీద  సేద తీరాడు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల  వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు..ఇంతకూ మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగాడు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని   ఎన్నికల్లో గెలిచాడు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టాడు.


ఈనాడు 


ప్పటికింకా  నిండా  మూడుపదులు నిండని ఆ యువకుడే మళ్ళీ ఈనాడు ఆరుపదులు పైబడిన  వయస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకను ఎంచుకుని ‘వస్తున్నా మీకోసం’ అంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నాడు. కాకపొతే, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో తేడాలు కొట్టవచ్చినట్టు కానవస్తాయి. అప్పుడు జత దుస్తులు, చెప్పులతో, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో  కార్యకర్తలను వెంటేసుకుని,  మందీ మార్భలం, హంగూ ఆర్భాటం  లేకుండా తిరిగిన చంద్రబాబు,  ఈనాడు విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న డ్యూమాక్స్ స్పోర్ట్స్ షూ ధరించి, కుడియెడమల పార్టీ  నాయకులు, కార్యకర్తలు వెంట నడుస్తుండగా ,  ప్రత్యేకంగా రూపొందించి రికార్డు చేసిన పాదయాత్రా గీతాలు హోరెత్తిస్తుండగా, ‘రాజువెడలె రవితేజములడరగ’  అన్నట్టు పాదయాత్రకు నడుం కట్టారు. ఈనాటి పరిస్థితుల్లో ఇవన్నీ తప్పనిసరి ఆర్భాటాలు. పైగా తొమ్మిదేళ్ళ పైచిలుకు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. రెండు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో వోడించి సమర్ధుడైన  ముఖ్యమంత్రిగా దేశవిదేశాల్లో మన్ననలందుకున్న రాజకీయ నాయకుడు. ప్రచారం ద్వారా రాజకీయ లబ్ది పొందే విషయంలో ఆయువుపట్లన్నీ  తెలిసిన వాడు.  తెలుగుదేశం పార్టీకి  పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలలో  ఏఒక్క చిన్న అంశాన్ని కూడా విస్మరించినా అది కూడదీసుకోలేని  తప్పిదం కాగలదన్న ఎరుక గలిగిన రాజకీయ దురంధరుడు. అందుకే, ఈ యాత్రకు పేరు పెట్టడం దగ్గరనుంచి, యాత్రసాగే మార్గం నిర్ణయించే వరకు ఆయన  అనేక రోజులపాటు సహచరులతో మంతనాలు జరిపారు. పార్టీకి  చెందని నిపుణులను  కూడా విశ్వాసంలోకి తీసుకుని, యాత్ర సందర్భంగా చేసే ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకునే హావభావాలు వంటివాటిల్లో గట్టి కసరత్తు చేసారని వినికిడి. అలాగే ఈ విధమయిన సుదీర్ఘ  పాదయాత్రల్లో  ఎదురయ్యే సాధకబాధకాలు, శారీరక ఇబ్బందులు  అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిమ్మటనే ఆయన ఈ సాహస నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న క్లిష్ట పరిస్తితిని దృష్టిలో వుంచుకుని ఆలోచిస్తే,  తెలుగు దేశాన్ని  వొడ్డున పడేయడానికి ఇంతకంటే మరో దారి కనిపించని స్తితిలోనే,   ఆయన ఇంతటి ధైర్యం చేసినట్టు తోస్తోంది. ఉప ఎన్నికల్లో వరస పరాజయాలు, కట్టుతప్పుతున్న పార్టీ శ్రేణులు, నాయకత్వ పటిమపట్ల  తలెత్తుతున్న సందేహాలు, ప్రాంతాల పరంగా  నాయకుల్లో  రగులుతున్న విద్వేషాలు, రాజకీయ వారసత్వం గురించి కుటుంబ సభ్యుల్లో పొటమరిస్తున్న విభేదాలు  ఇలా వొకటి కాదు రెండు కాదు అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం  కనిపించకనే అలవికి మించిన ఈ భారాన్ని తలకెత్తుకున్నారనిపిస్తుంది.
రాజకీయ రణ క్షేత్రం లో వున్నవారు కొన్ని కఠిన వాస్తవాలను గమనం లోకి తీసుకోకతప్పదు. తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీ వరసగా రెండు పర్యాయాలు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితుల్లోవుండిపోయి,  మూడోసారి కూడా  అధికార పీఠాన్ని అందుకోలేకపోతే, పార్టీ శ్రేణులు  కట్టుతప్పిపోకుండా  నిభాయించగలగడం అన్నది  ఎంతటి  సమర్ధుడైన నాయకుడికి కూడా అలవికి మించిన వ్యవహారమే.  అందుకే,  రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు టీసుకోక తప్పని స్తితి. ఈ క్రమంలోనే,  వివిధ సామాజిక  వర్గాలను ఆకర్షించేవిధంగా వరుస వెంట విడుదల చేస్తున్న డిక్లరేషన్లు ఈ క్రమంలో పురుడుపోసుకున్నవే.’ ఇప్పుడు కాకపొతే ఎప్పటికీ సాధ్యం  కాదు’ అనే నిర్ధారణకు వచ్చిన తరువాతనే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈ పాదయాత్ర భారాన్ని  తన భుజస్కందాలమీద వేసుకున్నారు.
ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ  కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో  వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. టీడీపీ కి చెందిన ఒక నాయకుడి అంచనా ప్రకారం రోజుకు కనీసం ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఈ లెక్కన నూట పదిహేడు రోజుల యాత్రకు యెంత పెద్ద  మొత్తం కావలసివస్తుందో వూహించుకోవచ్చు. యాత్ర రెండో రోజున కాలి  కండరాలు పట్టేసాయని  చంద్రబాబే స్వయంగా చెప్పారు. షష్టిపూర్తి దాటిన  వయస్సులో ఇంతంత దూరాలు నడవడం ఆషామాషీ కాదు. కాకపొతే, వ్యక్తిగత క్రమశిక్షణకు, దినవారీ వ్యాయామాలకు, యోగాభ్యాసాలకు   మారుపేరు చంద్రబాబు అన్న పేరు తెచ్చుకున్న మనిషి కాబట్టి  కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను కొంతమేరకు తట్టుకోగలరేమో చూడాలి.
ఈ పాదయాత్ర వల్ల వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలాంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ  వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ  గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. పైపెచ్చు  ఇటు రాష్ట్రంలో, అటు జాతీయ స్థాయిలో కూడా పాలక పక్షం అయిన కాంగ్రెస్ పరిస్తితి నానాటికీ దిగజారుతోంది. యెంత ప్రయత్నం చేసినా వరసగా మూడోసారి అధికారం లోకి రావడం వుత్తమాట అని అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతొ ఆ పార్టీ నాయకులే ప్రైవేటు సంభాషణల్లో పబ్లిగ్గా చెబుతుంటారు.  సీమాంధ్ర ప్రాంతంలో పక్కలో బల్లెంగా తయారయిన మరో కొత్త పార్టీ నాయకుడు ప్రస్తుతం జైల్లో వున్నందున ప్రజల్లోకి చొచ్చుకు పోవడానికి తెలుగుదేశం పార్టీకి  ఇది సరయిన తరుణం. కాకపోతే, యాత్ర సందర్భంలో ప్రజల సమస్యలు ప్రస్తావనకు తెచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది.  తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  ఏం చేసారన్న ప్రశ్న సహజంగా జనం నుంచి ఎదురయ్యే అవకాశం వుంటుంది. రాజశేఖరరెడ్డికి ఈ సమస్య ఎదురు కాలేదు. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు పాలనాపగ్గాలు చేతిలో పట్టుకోలేదు.  అందుకే ఆయన యధేచ్చగా ఆనాటి  ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ ప్రజలను ఆకట్టుకోగలిగారు. ప్రజల ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ యాత్ర వల్ల చంద్రబాబుకు లభిస్తుంది. ఒకేమాదిరి వూకదంపుడు వుపన్యాసాలతో విసిగించకుండా, ప్రజలతో  మమేకం కాగలిగితే  తెలుగుదేశం అధినేతకు యాత్రా ఫలసిద్ధి  ప్రాప్తిస్తుంది. పనిలో పనిగా కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు  ఏర్పాటుచేసుకుని, నేరుగా వారిని విశ్వాసంలోకి తీసుకుని, పార్టీని పునాదులనుంచి  పటిష్టం చేసుకోగల అవకాశాన్ని కూడా ఆయన వాడుకోగల గాలి. అప్పుడే ఈ యాత్ర ఉభయతారకంగా వుంటుంది. 

వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం    
                
            చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ యాత్ర సక్రమంగా ఎలాటి ఆటంకాలు,అవాంతరాలు లేకుండా జయప్రదంగా పూర్తి అయిన పక్షంలో రాజకీయ పాదయాత్రల్లో  ఒక రికార్డుగా మిగిలిపోతుంది. 2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఇప్పుడు చంద్రబాబు  ‘వస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్  నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340  కిలోమీటర్లు సాగి వచ్చే ఏడాది జనవరి 26 వ తేదీ ‘రిపబ్లిక్ దినోత్సవం’ నాడు శ్ర్రీకాకుళంజిల్లా ‘ఇచ్చాపురం’లోనే ముగుస్తుంది. మనోవాంఛాఫల సిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ‘ఇచ్చా’పురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డికి కోరిక నెరవేరింది. చంద్రబాబు సంగతే వేచి చూడాలి. (04-10-2012)