22, డిసెంబర్ 2011, గురువారం

ఎన్టీఆర్ కి ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


ఎన్టీఆర్ కి  ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను అనే పుస్తకం నుంచి)
 
స్పెషల్ టీ పట్రా !

“ఎన్టీఆర్ ఆఫీసు ఫైళ్ళు చూస్తున్నారంటే అదొక అష్టావధానమే. రాఘవేంద్రరావు టూకీగా విషయం చెప్పి ఫైల్ ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన సంతకం పెట్టేవారు. ఇంతలో నేనో, మరొకరో వచ్చేవారు. ఆయన ‘ఈ పూటకి ఫైల్స్ చాలండీ!’ అంటూ వంటవాడిని పిలిచి ‘స్పెషల్ గా టీ చేసి పట్రా!’  అని పురమాయించేవారు. అంతే! ఫైళ్ళు చూసే 
కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయేది. అసలు విషయం ఫైల్స్ చూడడం అంత ఇష్టం వుండేది కాదు....

“....బెజవాడలో టీడీపీ మహానాడు జరిగిన ప్రదేశంలోనే ‘కాపు నాడు’ నిర్వహించాలని కాపు సంఘం నేతలు నిర్ణయించారు. కాపునాడు జరిగే ప్రదేశానికి నేను ఒక సాధారణ పౌరుడిగా వెళ్లాను. జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. వంగవీటి రంగా జైల్లో వున్నందున రాలేదు. ఆయన భార్య రత్నకుమారి వచ్చారు. కాపునాడు విశేషాలను, నాయకులు చేసిన హెచ్చరికలను హైదరాబాదు రాగానే ముఖ్యమంత్రికి వివరించాను....

.
“.....ఆ రోజుల్లో బెజవాడలో కమ్యూనిష్టుల ప్రాబల్యం ఎక్కువగా వుండేది. విశాలాంధ్ర పేపర్ కూడా ఇక్కడే, కమ్యూనిష్టులు చెప్పిందే ఇక్కడ వేదం. కమ్యూనిష్టుల్ని ఎదుర్కోవాలంటే బలమయిన ఓ ప్రత్యామ్నాయం కావాలి. అలా ఆలోచించేవారు వన్ టౌన్ వ్యాపారులు.....

“.....వంగవీటి మోహన రంగా అన్న రాధాకృష్ణ 
టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ లో వుండేవాడు. విజయవాడ నుంచి నలుగురయిదుగురు పాసింజర్లను ఎక్కించుకుని టాక్సీలు హైదరాబాదు పోతుండేవి. చొరవగలవాడు కావడంవల్ల త్వరలోనే అతను టాక్సీ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కాగలిగాడు. నెహ్రూ అన్న గాంధీ కూడా అప్పట్లో రాదా దగ్గర పనిచేసేవాడు. యూనియన్ వ్యవహారాలే తప్ప కులాల గొడవలు లేవు.......

“.......’ రాధ ఒకసారి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావును కలుసుకుని రాజకీయాల్లో ఎంట్రీ ఇప్పించమని  అడిగాడు. విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గట్టిగా వ్యతిరేకించారు. సంఘ వ్యతిరేక శక్తుల్ని రాజకీయాల్లోకి రప్పిస్తే వాటిని కూడా కలుషితం చేస్తారని స్తానిక నాయకులను కోపడ్డారు.....

“ విజయవాడలో నిరాహార దీక్షలో వున్న వంగవీటి రంగా హత్యానంతరం కోస్తాలోని  చాలా  జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. అనేక  పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. బాధితులను ఓదార్చేందుకు ఎన్టీఆర్ విజయవాడ పయనమయ్యారు. రంగా భార్య రత్నకుమారిని కలిసి పరామర్శించడానికి వెళ్లారు.  ఇంటి ముందు కారు ఆగింది.  రంగా అభిమానులు అడ్డుకున్నారు. ఇక లాభం  లేదనుకున్న ఎన్టీఆర్ కిందకు దిగి రంగా ఇంటి వైపు చూస్తూ నమస్కరింఛి తిరిగి వచ్చేశారు.........

1989,  ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. బడ్జెట్ లీక్ అయిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రులందరూ రాజీనామా చేయాలని ఎన్టీఆర్ బాంబు లాంటి ప్రకటన చేశారు. రాజీనామాలు స్వీకరించడం గవర్నర్ ఆమోదించడం జరిగిపోయాయి. అదే రోజు డీజీపీ పీ.ఎస్. రామ్మోహన్ రావును ఆ స్తానం నుంచి మార్చారు. ఈ పరిస్తితి ఎదురు కాకూడదనే ఆయన ముందుగానే సెలవులో వెళ్ళిపోయారు.....

“అంతా కొత్తవారితో ఆ తరువాత కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వారెవరన్నది చివరి దాకా సస్పెన్స్. చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రెండవ స్తానంలో వున్న చంద్రబాబు నాయుడు దగ్గర కూడా విషయం దాచారు.
“.....ఎమ్మెల్యేలంతా విస్తు పోయారు. పార్టీ శ్రేణులన్నీ కలవరపడ్డాయి. (అయినా ఎన్టీఆర్ తొణకలేదు. ఎందుకంటె) ఆత్మ విశ్వాసానికి ప్రతీక ఎన్టీఆర్. తనపై రాళ్ళ వర్షం కురుస్తున్నా ఏరుకుని వాటితో దుర్గం నిర్మించుకోగల ధీశాలి ఆయన......
 (22-12-2011)

కామెంట్‌లు లేవు: