21, మే 2011, శనివారం

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు


(21-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ హైదరాబాద్ రానున్నారని వార్తలు వచ్చినప్పుడు ఆయన ఎజెండాలో ‘జగన్- తెలంగాణా’ అనే రెండే రెండు అంశాలు వున్నాయని అంతా అనుకున్నారు.



అయితే, రాష్ట్ర రాజధానిలో రెండు రోజులు మకాం వేసిన ఆజాద్ - చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కాంగ్రెస్ నాయకులను విడివిడిగా కలివిడిగా కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడే స్తానిక మీడియా ఆయన ఎజెండాలో ‘ముఖ్యమంత్రి మార్పు’ అనే మరో విషయాన్ని తనకు తానుగా చేర్చింది. ఆజాద్ ని కలిసి వచ్చిన వాళ్ళలో అనేకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందినవాళ్ళే మీడియా ముందు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై ఆజాద్ కు ఫిర్యాదు చేసినట్టు బహిరంగంగా చెప్పడం ఈ ఊహాగానాలకు మరింత ఊపిరి పోసింది.

ఆజాద్ హైదరాబాదులో వున్న సమయంలోనే, పార్టీ నాయకులతో, సహచర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరు గురించి, కడప ఉప ఎన్నికల్లో రాష్ట్ర అధినాయకత్వం వైఫల్యం గురించి ఢిల్లీ నాయకులకు పెద్దయెత్తున ఫిర్యాదులు అందినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కార్యకర్తలు కోరుతున్నది సీ ఎం మార్పా లేక సీ ఎం లో మార్పా అని ఆజాద్ వాకబు చేసినట్టు కూడా సమాచారం. బహుశా దీన్ని దృష్టిలో వుంచుకునే కాబోలు ఆజాద్ వెంట హైదరాబాదు వచ్చిన మరో ఏ ఐ సీ సీ ప్రతినిధి కృష్ణమూర్తి ఢిల్లీ తిరిగి వెడుతూనే ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వార్తలను ఖండించారు. కిరణ్ కుమార్ రెడ్డి పై ఎలాటి ఫిర్యాదులు రాలేదని, తమను కలుసుకున్న రాష్ట్ర నాయకుల్లో ముఖ్యమంత్రిని ప్రశంసించిన వారే ఎక్కువనీ వివరణ ఇచ్చుకున్నారు.

నిజానికి ముఖ్యమంత్రి మార్పు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నష్ట నివారణకు దోహదం చేస్తుందని అనుకోవడానికి లేదు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల మార్పు పార్టీకి ఎంత చేటు తెచ్చిందో అందరికీ తెలుసు. అయినా అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకునే సంస్కృతి ఆ పార్టీలో లేదు. అందువల్లనే మళ్ళీ అదే పొరబాటు మళ్ళీ చేసి 1989 లో ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని తదుపరి ఎన్నికల్లో బంగారు పళ్ళెంలో పెట్టి తెలుగుదేశానికి అందించిన ఘనమయిన గతం కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం.

అయితే, ఆజాద్ పర్యటన లక్ష్యం ముఖ్యమంత్రి మార్పు కాదన్నది ఆయన మాటల్లోనే తేలిపోయింది. అలాగని మూడేళ్లలో ఎదురయ్యే ఎన్నికలను ప్రస్తుత ముఖ్యమంత్రి నేతృత్వం లోనే నిర్వహిస్తారా అంటే అనుమానమే. ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి? ఎవరిని ఎప్పుడు విసిరి కొట్టాలి? అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి వెన్నతో పెట్టిన విద్య.



మొత్తం పదిహేడు గంటల్లో రెండువేలమందిని కలుసుకున్నానని గులాం నబీ ఆజాదే పర్యటన ముగింపులో మీడియాతో చెప్పారు. అంటే తనను కలుసుకున్నవాళ్ళల్లో ఒక్కొక్కరికీ ఆయన ఇచ్చిన సమయం యాభయ్ సెకన్లకు మించదు. అయినా చాలామంది బయట మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ దూతలకు తమ మనసులోని భావాలను పూసగుచ్చి చెప్పుకోగలిగామన్న సంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ రకమయిన భేషజాలు అతి సహజమే. మహిళా కాంగ్రెస్ నేత గంగాభవాని ఒక అడుగు ముందుకు వేసి – మరో మూడేళ్లపాటు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆజాద్ తనకు హామీ ఇచ్చినట్టు మీడియాతో చెప్పడం ఈ భేషజాలకు పరాకాష్టగా భావించాలి లేదా ఆవిడ స్వామి భక్తికి దీన్నొక మచ్చుతునకగా పరిగణించి వొదిలివేయాలి.

ఒక పక్క గుంటూరులో వేలసంఖ్యలో జనం పాల్గొన్న జగన్ రైతు దీక్ష ముగింపు సభకు జగన్ అనుకూల కాంగ్రెస్ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అనేకమంది హాజరవుతున్న సమయంలోనే మరోపక్క హైదరాబాదులో గులాం నబీ ఆజాద్ ని కలవడానికి తిరునాళ్ళ మాదిరిగా కాంగ్రెస్ శ్రేణులు కదిలివచ్చాయి. వినదగునెవ్వరు చెప్పిన తరహాలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆజాద్ కొనసాగిస్తూనే తన అజెండాలోని అంశాలు అంటే – జగన్ గురించీ, తెలంగాణా గురించీ ఆరా తీసారని బుల్లితెరలపై స్క్రోలింగులు పరుగులు తీసాయి. ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్ళు కూడా తమ మనసులోని అజెండాని మరిచిపోయినట్టులేదు. గాడితప్పిందని అనుకుంటున్న రాష్ట్ర పార్టీ పరిస్తితులను చక్కదిద్దేందుకు అధిష్టానం పనుపున వచ్చిన ఆజాద్ ని దాదాపు అందరూ కోరిన ఒకే విషయం పదవుల పంపిణీ వ్యవహారం. పార్టీ పదవులు, నామినేటేడ్ పదవులు గురించి వేచి చూస్తూనే విలువయిన రెండేళ్ళ కాలం ఇట్టే గడిచిపోయిందని, ఇంకా ఇలానే రోజులువెళ్ళదీస్తే వచ్చేఎన్నికలనాటికి పార్టీ తరపున నిలబడే కార్యకర్తలను కూడా వెతుక్కోవాల్సివుంటుందని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ రకమయిన నాన్చుడు ధోరణి వల్ల నిస్పృహ చెందే పార్టీ శ్రేణులు అందుబాటులోకి వచ్చిన ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించే అవకాశం వుంది కాబట్టి వెంటనే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు.



ఆజాద్ తో భేటీని రవ్వంత బాగానే ఉపయోగించుకున్నామన్న సంకేతాలను మీడియాలోకి వొదలడంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సఫలమయ్యారనే చెప్పాలి. వారికి తీసిపోని రీతిలో సీమాంధ్ర ఎంపీలు సయితం తమ వాణిని, వాదాన్ని బలంగానే వినిపించారు. మధ్యే మార్గంగా అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ - హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చేసి తెలంగాణా ఇచ్చినా సమ్మతమేనన్న ధోరణిలో ఏకంగా ఒక లిఖితపూర్వక మెమోరాండాన్నే ఆజాద్ కు అందచేసినట్టు భోగట్టా. ఇక ఈసారి తెలంగాణా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, గతంలో డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన అనంతరం సీమాంధ్ర సహచరులు తమకు కొట్టిన గండిని గుర్తుపెట్టుకుని కాస్తంత గొంతు పెంచి మరీ తమ వాదాన్ని వినిపించారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు మినహా తమకు ఏదీ సమ్మతం కాదన్న హెచ్చరికను ఆజాద్ కోర్టులో వుంచారు. తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం అతి తొందరగా ప్రకటన చేయని పక్షంలో అసలు సిసలు అస్త్రం తమ జేబులోనే వుందని పీ సీ సీ మాజీ నేత కేశవరావు కుండ బద్దలు కొట్టారు. తన అజెండాలో తెలంగాణా అంశం వుండడంవల్లనో ఏమో ఆజాద్ కూడా ఇరుపక్షాల వాదనను శ్రద్ధగా విన్నారు.

కడప ఉప ఎన్నికల ప్రభావం పార్టీపై , ప్రభుత్వంపై ఏమాత్రం వుండదంటూ చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా వైఎస్సార్ పార్టీ గురించి పైకి పట్టనట్టు కనిపించినా, ఢిల్లీ నాయకులు మాత్రం పార్టీ శ్రేణులనుంచి తగిన సమాచారాన్నే రాబట్టినట్టు భోగట్టా.

జగన్ మోహన్ రెడ్డిని ఆదినుంచి వ్యతిరేకిస్తున్నవారు ఆజాద్ తో జరిపిన భేటీలో తమ పాత పల్లవినే మరోమారు వినిపించారు. సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు దిద్దుబాటుకు కూడా వీలులేకుండా పార్టీ దెబ్బతినిపోతుందని అధిష్టానాన్ని హెచ్చరించారు. పార్టీలో వున్న జగన్ కోవర్టులపై వెంటనే వేటు వేయాలని,

ప్రభుత్వం వద్ద వున్న అధికారాలతో విచారణలు ప్రారంభించి జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలని కూడా సలహా ఇచ్చారు.

మంత్రివర్గంలోనే జగన్ కోవర్టులు వున్నారంటూ మరో కలకలం చెలరేగింది. నలుగురు మంత్రులు జగన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే గులాం నబీ ఆజాద్ ని కోరినట్టు పత్రికల్లో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఎంపీ మధు యాష్కీ, మంత్రి శంకర్ రావు, మాజీ మంత్రి జే సీ దివాకర్ రెడ్డి బాహాటంగా చేసిన ఆరోపణలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కొందరు మంత్రులు లోపాయికారీగా జగన్ కు సహకరిస్తున్నారన్నది వారి ఆరోపణల సారాంశం.



రెండు రోజులపాటు హైదరాబాదులో మకాం వేసి గులాం నబీ ఆజాద్ పార్టీ పరిస్తితి గురించి కొత్తగా తెలుసుకున్న విషయాలేమిటి అన్నది ఎవ్వరికీ అర్ధం కాని సంగతి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలూ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలీ ఆయనకు కొత్తేమీ కాదు. అలాగే, ఆజాద్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కొత్త కాదు. గతంలో సైతం ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ఇప్పటి పాత్రనే పోషించి – రాజకీయ జాదూ అన్న కీర్తిని మూటగట్టుకున్నారు. కాకపొతే, రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ఏర్పడిన నూతన రాజకీయ వాతావరణానికి మాత్రం ఆజాద్ కొత్తే అని చెప్పాలి. అలాగే, వై ఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టి, ఇటీవలి కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ భవిష్యత్ పై ముసురుకుంటున్న నీలి నీడల నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న నూతన రాజకీయ చిత్రం మాత్రం ఆయనకు మరీ కొత్త అని చెప్పుకోవాలి.

అందుకే ఆయన అవసరం అయినదానికన్నా ఎక్కువ సమయమే పార్టీ వారికి కేటాయించారని అనుకోవాలి. పరిమితులు తెలిసిన అనుభవశాలి కనుక పార్టీ శ్రేణులు చెప్పిన విషయాలను ఓపిగ్గా వినడం ద్వారా వారి మనస్సులో గూడుకట్టుకుని వున్న ఆందోళనలు సమసిపోవడానికి ఒక వెంటిలేటర్ మాదిరిగా సాయపడ్డారనుకోవాలి. సమస్య తీర్చడం సాధ్యం కానప్పుడు సమస్యను వినడం ద్వారా దాని తీవ్రతను తగ్గించ వచ్చన్న సూత్రాన్ని ఆజాద్ తన హైదరాబాద్ పర్యటనలో బాగా ఉపయోగించుకున్నారు. ఆయన్ని కలిసిన ఏ ఒక్కరిని ఆయన నిరుత్సాహ పరచకపోవడమే ఇందుకు నిదర్శనం.

మొత్తం మీద ఆజాద్ హైదరాబాద్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని కొందరు రాష్ట్ర నాయకులు సంతృప్తి పడుతున్నారు. విషయాలన్నీ అర్ధం చేసుకున్న ఢిల్లీ పెద్దలు తమ పీఠాలను ఎప్పుడు కదిలిస్తారో అని మరికొందరు కలత పడుతున్నారు.

కానీ ఒక విషయం.

వచ్చారు – విన్నారు – వెళ్లారు అనికాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆయన దిశా నిర్దేశం ఇచ్చినట్టయితే బాగుండేదని పార్టీ అభిమానులే పెదవి విరుస్తున్నారు. రైతు సమస్యలతో విపక్షాలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ పర్యటనలో పార్టీ సమస్యలు తప్ప ప్రజల సమస్యలు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను వాళ్లు ఉదహరిస్తున్నారు.

ఇక నుంచయినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ‘జగన్నామ స్మరణ’కు స్వస్తిచెప్పి జనాలను పట్టించుకునేలా చేయగలిగితే ఆజాద్ హైదరాబాద్ పర్యటన ఫలవంతమైనదని సంతోషించవచ్చు. (21-05-2011)



కామెంట్‌లు లేవు: