9, మే 2011, సోమవారం

ఒసామా – ఒబామా – భండారు శ్రీనివాసరావు

ఒసామా – ఒబామా – భండారు శ్రీనివాసరావు


(08-05-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

ఒసామా – ఒబామా

వీరిద్దరి మధ్యా నామ సారూప్యత మాత్రమే కాదు, భావ సారూప్యత కూడా వుంది.

‘మతం కోసం ఎలాటి మారణహోమానికయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ది.

‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాది.

అయితే, ఆలోచన ఒక్కటే అయినా ఆచరణలో కొద్ది తేడా వుంది.

‘పాముకు పాలుపోసి పెంచుతాను కానీ తనను తప్ప అది ఎవరినయినా కరవ్వచ్చన్న థియరీ’ ఒబామాది.

‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికిరాదనే భావజాలం’ ఒసామాది.

ఒకప్పుడు అమెరికా తన అవసరాలకోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు - పదేళ్లక్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి పాలు పోసిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని, తనకు తానుగా అమెరికా పెంచుకుంటూ వచ్చిన అహంభావాన్ని బిన్ లాడెన్ తనదయిన శైలిలో దెబ్బ తీసినప్పుడుకానీ, ‘పాము-పాలు’ కధ లోని అంతరార్ధం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా, 2001, సెప్టెంబర్ 11 దుర్ఘటన తరవాత గాని ఉగ్రవాదం వల్ల పొంచివున్న ముప్పు ఎలావుంటున్నన్నది ఆ దేశానికి అర్ధం కాలేదు.

న్యూయార్క్ నగరానికి – ఇంకా చెప్పాలంటే – మొత్తం అమెరికాకే మాన్యుమెంట్స్ అనదగ్గ – ప్రపంచ వాణిజ్య సంస్థ – వరల్డ్ ట్రేడ్ సెంటర్ – జంట భవనాలను ఉగ్రవాదులు విమానాలతో పడగొట్టి నేలమట్టం చేసిన రోజది. యావత్ ప్రపంచానికి పెద్దన్న మాదిరిగా వ్యవహరిస్తూ, తమ అధికారానికీ, ఆధిపత్యానికీ ఎదురులేదనీ, తాము నిర్మించుకున్న భద్రతా వ్యవస్తకు తిరుగులేదనీ – ఏళ్ళ తరబడి పెంచి పోషించుకున్న అమెరికన్ల ఆత్మవిశ్వాసానికి తూట్లు పడ్డ దుర్దినం అది. ఆ రోజు నుంచి అమెరికాలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న అభద్రతాభావం అధికారవర్గాలలోనే కాక, సామాన్య జనంలో కూడా పెరిగిపోయింది.



ఆనాటి పరాభవం అగ్రరాజ్యంలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి గత దశాబ్ద కాలంగా అగ్రరాజ్యం అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, మొన్నటికి మొన్న, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్ ను – జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా అగ్రరాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకులేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదం అవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హై టెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలను జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్ లో కూర్చుని పధకం అమలవుతున్న తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ హావభావాలనుబట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్షకులు లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్ధం చేసుకోగలిగారు.





బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది – 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు అమెరికా గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ వోటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. అధ్యక్ష ఎన్నికకు ముందూ, ఆ తరువాతా ‘నేను క్రైస్తవుడినే’ అని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అమెరికా రాజ్యాంగ రీత్యా అవకాశం వున్న కారణంగా వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అభిమతాన్ని ఒబామా ఇటీవల వ్యక్తం చేశారు. కానీ స్వదేశంలో చోటుచేసుకుంటున్న ప్రతికూల పరిస్థితులు ఒబామాకు ప్రజల్లో వున్న ఆదరణకు గండి కొడుతున్నాయి. అందువల్లనో ఏమో కాని, పరిస్తితులను తనకు సానుకూలంగా మలచుకోవడానికి ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేయడం ఒక్కటే ఆయనకు మార్గంగా కనబడిందేమో తెలియదు. అయితే, బిన్ లాడెన్ మృతితో అమెరికాకు ఉగ్రవాద ముప్పు పూర్తిగా తొలగిపోతుందని అనుకోవడం కూడా తెలివితక్కువతనమే అవుతుంది.

ఇక, అమెరికన్ల ప్రతీకారేచ్ఛకు బలయిన ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్ లో కడునిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, యెమెన్ నుంచి ఉదరపోషణార్ధం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టాడు. అక్కడినుంచి అతడు పట్టింది బంగారమయింది. సౌదీ రాజ్య కుటుంబీకులతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలు అతడి స్తితి గతుల్ని పూర్తిగా మార్చివేశాయి. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు.

సౌదీ అరేబియాలో దాదాపు ఎనభయ్ శాతం రహదారులను మహమ్మద్ కంపెనీయే నిర్మించింది. అతడికి అనేకమంది భార్యలు. పదో భార్య సిరియన్ దేశీయురాలు. ఆమెకు జన్మించినవాడే ఒసామా బిన్ లాడెన్. మహమ్మద్ సంతానం 52 మందిలో ఒసామా 17వ వాడు. ఆరడుగులు ఎత్తు. అయినా మనిషి బక్క పలచన. సంపన్న కుటుంబంలో పుట్టి విలాసాలకు అలవాటుపడాల్సిన ఒసామా మనసు మతం వైపు మళ్ళింది. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా తన భూభాగంలో అమెరికా మిలిటరీ స్తావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం అనుమతించడాన్నిఒసామా జీర్ణించుకోలేకపోయాడు. ఆ సందర్భంలో అతడు చేసిన విమర్శలను ప్రభుత్వం తప్పుపట్టింది. ఒసామా పౌర సత్వాన్ని, పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం ఒసామాను తమనుంచి వెలి వేసింది. దరిమిలా అల్ ఖయిదాకు అనేక దేశాల్లో బలమయిన స్తావరాలు ఏర్పాటుచేసే కృషిని కొనసాగించిన ఒసామా మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ఉగ్రవాదిగా గుర్తింపు పొందాడు. అల్ ఖయిదా పేరు చెబితే పాశ్చాత్య దేశాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేసాడు. ’భౌతికంగా నన్ను రూపుమాపగలరేమోకాని నా భావజాలాన్ని, నా లక్ష్యాన్ని ఏనాటికీ, ఎవ్వరూ రూపుమాపలేరు’ అని ఒసామా బిన్ లాడెన్ తరచుగా చెబుతుండేవాడు. ధనరాశుల నడుమ జన్మించి, సంపదలతో వచ్చే సుఖాలనన్నిటినీ కాలదన్నుకుని, కొండలు, గుట్టల్లో జీవనాన్ని ఎన్నుకుని, నిరంతర పోరాటాలతో కాలం గడిపిన ఆయన తీరు ఎంతోమందిని ఆయన వైపు నడిపించింది. చేస్తున్నది తప్పా వొప్పా అన్న విచక్షణ నుంచి వారిని దూరం చేసింది.



‘కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

‘మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోలేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.

పవిత్ర యుద్ధం పేరుతొ సంవత్సరాల తరబడి సాగించిన పోరాటంలో ఒసామా బిన్ లాడెన్ చివరకు తన ప్రాణాలనే తర్పణంగా విడవాల్సివచ్చింది. కళ్లుచెదిరే సంపద కలిగిన కలవారి కుటుంబంలో పుట్టి కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొండకోనల్లో దుర్భర జీవితం గడిపిన అనుభవం ఒసామాది. నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కాగలిగిన అదృష్టం ఒబామాది. తరాలకు పూర్వం మత మూలాలు ఒక్కటే అయినా, వేర్వేరు మతాలకు ప్రతినిధులుగా వీరిద్దరూ పోరుబాటలో పయనించిన తీరు విధి వైపరీత్యానికి పరాకాష్ట.

ఇక పేరులో వీరిద్దరికీ వున్న సాపత్యం గురించి చెప్పుకోవాలంటే - ఒసామా మరణ వార్తను ఒబామా ప్రపంచానికి వెల్లడిస్తున్న సందర్భంలో ప్రపంచ మీడియా సంగతి పక్కన బెట్టండి, అమెరికా లోని అనేక టెలివిజన్ ఛానళ్ళే ఈ వార్తా ప్రసార సమయంలో ఒబామాకు, ఒసామాకు తేడా తెలియని రీతిలో తడబడిన సంగతి గుర్తు తెచ్చుకోవాలి.(05-05-2011)





కామెంట్‌లు లేవు: