25, జనవరి 2011, మంగళవారం

ఫోన్ మారినా నెంబర్ అదే! – భండారు శ్రీనివాసరావు


ఫోన్  మారినా నెంబర్ అదే! – భండారు శ్రీనివాసరావు

సెల్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది ఫోన్ కనెక్షన్ తీసుకునే సందర్భం లో ధర విషయం మినహా మిగిలిన అంశాలు సాధారణంగా పట్టించుకోరు. ఆతరవాత కానీ, క్రమంగా సర్వీసుకు సంబంధించిన సమస్యలు అనుభవం లోకి రావు. అలాగే, ఎంపిక చేసుకున్న మొబైల్ ఆపరేటర్ తో ఎదురయ్యే ఇబ్బందులు కూడా అర్ధం కావు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వున్నట్టుండి లైన్ కట్ కావడం, అవతలనుంచి మాట సరిగా వినపడక పోవడం, ఎప్పుడు ఫోన్ చేసినా అవతల వారి ఫోన్ దొరక్కపోవడం, దొరికినా ‘ప్రస్తుతం స్పందించుట లేదు’ అనే షరా మామూలు సమాధానం రావడం – ఇవన్నీ మొబైల్ వినియోగదారులు అనునిత్యం ఎదుర్కునే సమస్యలే. ఒక్కసారి ఓ కంపెనీ ఫోన్ తీసుకున్నాక వినియోగదారుడు ఎదుర్కునే సమస్యల గురించి పట్టిచుకునే నాధుడు వుండడు. కష్టమర్ సర్వీసులు పేరుకు మాత్రమె కాని వాటివల్ల వినియోగదారులకు కొత్త తల నొప్పులే కానీ సమస్యలు త్వరరగా త్వరత్వరగా పరిష్కారం అవుతున్న దాఖలాలు లేవు. అందువల్ల, చాలామంది, ఫోన్ కానీ, ప్రొవైడర్ ను కానీ మార్చుకోవడానికి ఆలోచన చేసినా వారికి ప్రధాన అడ్డంకి వాళ్ళు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్. ఈ నెంబర్ ను తరచూ మార్చుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడరు. తమకూ, తమకు తెలిసిన వారికీ బాగా అలవాటయిన నెంబర్ ను చూస్తూ చూస్తూ వొదిలిపెట్టలేరు. అల్లా అని ఫోన్ ప్రొవైడర్లతో ఎదురయ్యే సమస్యలను గాలికి వొదిలెయ్యలేరు.

ఈ విషయాలనన్నీ బాగా అధ్యనం చేసిన పిమ్మట, భారత ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించే ఒక ప్రధాన విధాన నిర్ణయం తీసుకుంది.

వినియోగదారులకు తమ మొబైల్ కంపెనీ ఆపరేటర్ అందించే స్కీములు, సర్వీసులు, నచ్చకపోతే ఈ జన్మకు ఇంతే అని సరిపెట్టుకోవాల్సిన అవసరం ఇక లేదు. పాత నెంబర్ ను అట్టి పెట్టు కుంటూనే, మరో పక్క ఇష్టం లేని ఆ ఆపరేటర్ ని ఇట్టే మార్చేసుకుని తమకు నచ్చిన మరో ఆపరేటర్ ని ఎంపిక చేసుకొని ఆ కంపెనీకి మారిపోవచ్చు. ఈ సౌకర్యం మన దేశంలో ఈ జనవరి ఇరవై నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో ఈ సదుపాయాన్ని హర్యానాలో నిరుడు నవంబర్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అది వినియోగదారులను ఆకట్టుకోవడం తో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎం ఎన్ పీ) అని సాంకేతిక నామం కలిగిన ఈ సదుపాయం వల్ల సామాన్య వినియోగదారుడుకి ఏమిటి ప్రయోజనం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము.

మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లో ఈ ఎం ఎన్ పీ అనేది కొత్తగా అందుబాటులోకి వచ్చిన నూతన ప్రక్రియ.

మన దేశంలో ఈనాడు మొబైల్ ఫోన్ లు వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం మన దేశంలో డెబ్బయి కోట్లమంది సెల్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద మార్కెట్ వుండడం వల్ల అనేక మొబైల్ కంపెనీలు ఈ రంగం లో అడుగుపెట్టి అనేక రకాల స్కీములతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రాయితీలతో ఎప్పటికప్పుడు కొత్త పధకాలకు రూపకల్పన చేస్తున్నాయి. మొబైల్ ఆపరేటర్ల నడుమ సాగుతున్న ఈ తీవ్రమయిన పోటీ కొంతవరకు వినియోగదారుడుకి కలసివచ్చే అంశం అయినప్పటికీ, మరో కంపెనీకి మారాలనుకున్నప్పుడు, అలవాటయిన నెంబర్ ను మార్చుకోవాల్సి రావడం వల్ల, ఇష్టం వున్నాలేకపోయినా ముందు ఎంపిక చేసుకున్న కంపెనీ సర్వీసులను వొదిలిపెట్టలేని పరిస్తితి అతడిది. కనెక్టివిటీ బాగా లేకపోయినా, ఇతర కంపెనీలు మరింత ఆకర్షణీయమయిన పధకాలు ప్రవేశ పెట్టినా, వాటికి మారిపోవడానికి తటపటాయించాల్సివస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం తో ఈ ఇబ్బంది తొలగిపోయింది. పాత నెంబర్ ను కొనసాగిస్తూనే కొత్త కంపెనీకి మారిపోయే అవకాశం వినియోగదారుడుకి లభించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగదారులందరికీ ఈ సదుపాయం వర్తిస్తుంది.

ఎలా మారవచ్చు?

ఈ సర్వీసుని ఉపయోగించుకుని ఆపరేటర్ ను మార్చుకోవాలనుకునే వారు ముందుగా తన మొబైల్ నుంచి 1900 కు ఒక ఎస్ ఎం ఎస్ పంపుకోవాల్సి వుంటుంది. ఎస్ ఎం ఎస్ పంపగానే, ప్రస్తుతం అతడు ఉపయోగిస్తున్న మొబైల్ ఆపరేటర్ నుంచి ఒక ప్రత్యేకమయిన ‘పోర్టింగ్ కోడ్’ అందుతుంది. అప్పుడు ఒక నిర్దిష్టమయిన దరఖాస్తు పత్రం పూర్తిచేసి, ‘పోర్టింగ్ కోడ్’ తో సహా తను మారాలనుకుంటున్న ఆపరేటర్ ను పేర్కొంటూ ఆ పత్రాన్ని తాను ప్రస్తుతం వాడుతున్న ఆపరేటర్ కు పంపాలి. ఆ తరువాత కొత్త సర్వీసు ప్రొ వైడర్ – ప్రస్తుత ప్రొ వైడర్ నుంచి కస్టమర్ కు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. వారం రోజుల్లో కొత్త మొబైల్ ఆపరేటర్ నెట్ వర్క్ కు ఈ నెంబర్ ను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇందుకోసం వినియోగ దారుడు కేవలం పందొమ్మిది రూపాయలు మాత్రమె కొత్త ఆపరేటర్ కు చెల్లించాల్సివుంటుంది. కాకపొతే, జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో ఇందుకు పట్టె వ్యవధి పదిహేను రోజులు.
అయితే ఈ నెంబర్ మార్పిడికి కొన్ని పరిమితులు వున్నాయి. వినియోగదారుడు నివసించే ప్రాంతంలోని ఆపరేటింగ్ ఏరియాకి మాత్రమే ఈ మార్పిడిని అనుమతిస్తారు. ఉదాహరణకు హైదరాబాదులో ఉపయోగిస్తున్న నెంబర్ ని బెంగళూరుకో, ముంబై కో మార్చుకోవాలంటే కుదరదు.

ఈ కొత్త విధానం వల్ల వినియోగదారుడుకి మంచి వెసులుబాటు లభించినప్పటికీ, సర్వీసు ప్రొవైడర్లకు మాత్రం కొంత ఇబ్బందే. నెంబర్ తో ఇబ్బంది లేదు కాబట్టి కష్టమర్లు మంచి సర్వీసు ఇచ్చే కంపెనీలకు మారిపోయే అవకాశం వుంటుంది. అలాగే కనెక్టివిటీ బాగావుండే ప్రొవైడర్లపట్ల ఆసక్తి చూపే వీలుంది. కష్టమర్లను ఆకర్షించే క్రమంలో తమ లాభాల మార్జిన్లను తగ్గించుకుని అయినా కొన్ని కంపెనీలు చార్జీలు తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

కష్టమర్లు అటూ ఇటూ మారడం, వారిని ఆకట్టుకునే ఎత్తుగడలు పెరగడం, మొబైల్ ఫోన్ ఒక్కింటికీ సగటు ఆదాయాలు తగ్గిపోవడం – ఇవన్నీ కంపెనీలకు ఇబ్బంది కలిగించే అంశాలే అని నిపుణులు అంటున్నారు.

పోతే, సర్వీసు నాణ్యతను పెంచుకోవడం ద్వారా మాత్రమే కంపెనీలకు కొత్త కష్టమర్లు లభించే అవకాశం వున్నందువల్ల ఈ అంశంపై అవి దృష్టి సారించక తప్పదు. అలాగే త్రీ జీ వంటి అత్యాధునిక అంశాలను జోడించడం ద్వారా కూడా కష్టమర్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

అయితే, మొబైల్ వినియోగదారులకు నిపుణులు మరో సలహా కూడా ఇస్తున్నారు. ఏదో వీలు దొరికింది కదా అని వేరే ఆపరేటర్ కు మారిపోవడం వల్ల పెద్దగా కలిసొచ్చేది కూడా వుండకపోవచ్చు. రాయితీలు ఎక్కువ అనే వుద్దేశ్యం తో కాకుండా నెట్ వర్క్ మొదలయిన ఇతర అంశాలకు సయితం ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని వారి సలహా. (25-01-2011)

కామెంట్‌లు లేవు: