23, సెప్టెంబర్ 2010, గురువారం

విన్నంతలో కన్నంతలో అమెరికా - 10 - భండారు శ్రీనివాసరావు

అమెరికన్ ఆతిధ్యం

మిసెస్ సూజన్ విల్సన్ బెల్ వ్యూ లోని ఒక పాఠశాలలో టీచరు. ఆవిడ భర్త మిస్టర్ గోర్డన్ - రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు. ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే ‘మరింబా’ అనే మరో సంగీత వాయిద్యం.

మరింబా వాయిస్తున్న  మిస్టర్ గోర్డన్ 

 శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఆ ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు. అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో కృత్రిమత్వం ఏమీ కనిపించలేదు. పైగా ఆ సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. ఇండియానుంచి, అదీ దక్షిణ భారతం నుంచి వచ్చిన శాకాహారులమని తెలిసి వంటకాలను తయారుచేసినట్టున్నారు. అందరం కలసి భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. అంతకు ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.

“ ఓ! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.”

మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.

అమెరికన్లు అనగానే విందుతో పాటు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.

అక్కడ గడిపిన కొద్ది గంటల సమయంలో ఒక విషయం గమనించాము. ఎక్కడా ఏ గదిలో టీవీ కనిపించలేదు. అడగడం బాగుండదని ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, నేను రేడియోలో పనిచేశానని తెలుసుకున్నప్పుడు, మాటల సందర్భంలో చెప్పినట్టుగా తమ ఇంట్లో టీవీ వుండదని చెప్పారు. ‘టీవీ అనేది వినోదాత్మకంగా వుండాలి. వార్తల జోలికి పోకూడదు’ అని అభిప్రాయపడ్డారు. వార్తలకోసం తాము పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ రేడియో వింటామనీ, సంగీతంతోనే పొద్దుపుచ్చుతామనీ చెప్పారు. “మీడియా అంతా ఇప్పుడు ముక్కచెక్కలయింది. వాళ్లు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ల సొంత అభిప్రాయాలు చెబుతున్నారు” అన్నారాయన. రెండు కార్లు వున్నప్పటికీ, రోజూ ఆఫీసుకు ఏడున్నర మైళ్ళు సైకిల్ పైనే వెడతానని మిస్టర్ గోర్డన్ చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.

చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ – మన వైపు జనసామాన్యంలో వున్న అభిప్రాయంలో అంత వాస్తవం లేదని గోర్డన్ కుటుంబాన్ని చూసిన తరవాత అనిపించింది.

వెనక మేము మాస్కో వెళ్లి నప్పుడు – స్కూల్లో మా వాడిని వాళ్ల క్లాస్ మేట్ అడిగాడట – ‘మీ ఇంట్లో ఎన్ని ఏనుగులున్నాయ’ని. ఇండియాలో పులులు వీధుల్లో తిరుగుతుంటాయని, ఏనుగుల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారనీ, పిల్లలు పాములతో ఆడుకుంటారనీ - ఇవీ ఆ దేశంలో మన దేశం పట్ల వున్న అభిప్రాయాలు. (22-09-2010)
 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

@చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ..................... @వాళ్ళు ఏమో గానీ౦డి...మన వాళ్ళు మాత్ర౦ స౦సారాలు పాడు చేసుకొవడ౦ లో ప్రస్తుత౦ న౦బర్ వన్ అని చెప్పవచ్చు...వాళ్ళను అనే౦త గొప్పగా మనవాళ్ళు ఏమీ లేరు...

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks KVSV garu for your observation on my post written some months back - bhandaru srinivasrao